కొడవటిగంటి సైన్స్ రచనా ప్రణాళిక


కొడవటిగంటి కుటుంబరావు అనగానే మనకు కథ గుర్తుకు వస్తుంది. కానీ అదే రీతిలో ఆయన పేరు చెప్పగానే ఆయన చేసిన సినిమా సమీక్షలు గుర్తుకు రాకపోవచ్చు. ఆయన నెరపిన సంపాదకత్వం మన మదిలో మెదలకపోవచ్చు. సృజించిన బాలసాహిత్యం స్ఫురించక పోవచ్చు. సైన్స్ వ్యాసాలు రాసిన కుటుంబరావు తర్వాత ఆ స్థాయిలో సినిమా గురించి వేరెవరూ రాయలేదంటే ఆశ్చర్యం లేదు. సచిత్ర వారపత్రికలకు ఆయన డెబ్భైయ్యేళ్ళ క్రిందట ఏర్పరచిన చట్రం స్థూలంగా నేటికీ ఉందంటే అవాస్తవం కాబోదు. మూడు దశాబ్దాలపాటు బాల సాహిత్యానికి ఆయన చేసిన కృషి గణించడం దాదాపు సాధ్యం కాదు. తెలుగులో సైన్స్ రచన విషయంలో కుటుంబరావు అంతటి సమగ్రమైన రచయిత అంతకుముందు లేరు. తర్వాత అసలే లేరన్నా అతిశయోక్తి కాదు. కొడవటిగంటి రచనా వర్ణపటంలో సాహిత్యం, సినిమా, సామాజికం, రాజకీయం, బాలసాహిత్యం, సైన్స్, చరిత్ర ఇలా అన్నీ ఉన్నాయి. ఆయన దేనికీ లోటు చేయలేదు కవిత్వం తప్ప. కొ.కు. మొత్తం సాహిత్యాన్ని ఒక ట్యాంకుతో పోలిస్తే ఆయన చేపట్టిన పక్రియలు కథ, నవల, వ్యాసం, గల్పిక వంటివి వివిధ కుళాయిల్లాగా పరిగణించాలి. నిజానికి ఆ ట్యాంకును సైన్స్ ట్యాంక్‍గానే పరిగణించాలి. స్థూలంగా, సూక్ష్మంగా సైన్సుకు ఆధారభూతమైన వాస్తవికత, హేతువు, పరిష్కారాల దృష్టితోనే ఆయన రచనా ప్రస్థానం సాగుతుంది. అయితే కొన్ని అంశాలు ప్రాచుర్యంలోకి రాకపోవటానికి ఆయన బాధ్యత లేదు. అది తెలుగు వారి పరిమితమైన ఆసక్తి కావచ్చు లేదా వారి పరిణతి చెందని జ్ఞానం కావచ్చు.


కుటుంబరావు గారి కంటే ముందు కాళీపట్నం కొండయ్య, వసంతరావు వెంకటరావు వంటి కొంతమంది జనరంజక విజ్ఞాన శాస్త్ర రచన చేశారు. అయితే ఆయన రచనా కాలం దృష్ట్యా విజ్ఞానశాస్త్ర రచన మీద దృష్టి పెట్టక తప్పని పరిస్థితి ఉంది. ఒకటవ, రెండవ ప్రపంచ యుద్ధాల మధ్య సాంకేతిక పురోభివృద్ధి ఉంది. లేదా ఆ మధ్య వ్యవధిలో తయారైన ఆటంబాంబు ప్రపంచ యుద్ధాన్ని త్వరపెట్టి ఉండవచ్చు – ‘‘శాస్త్ర పరిశోధనలు సమాజాన్ని మార్చడమే గాక, సామాజిక పరిణామాన్ని వేగిరించాయి’’ అని కుటుంబరావే 1962లో వ్యాఖ్యానించి నట్టు. 1934లో కొ.కు. వ్యాసరచయితగా జన్మించారని అంచనా! తర్వాత సంభవించిన రెండవ ప్రపంచయుద్ధం (1939-45)లో వాడిన అణుసామగ్రి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన రీతిలో సైన్స్పట్ల ఆసక్తిని రేకెత్తించింది. మొదటి ప్రపంచయుద్ధం తర్వాతనే జర్నలిజం ఒక ప్రత్యేక అధ్యయన అంశంగా విప్పారిందని ఒక అంచనా. అటువంటి సంబంధమే రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రపంచ స్థాయిలో సైన్స్ రచనా వృద్ధికీ సంబంధం వుందని మరో పరిశీలన! అప్పటికి కుటుంబరావులోని వ్యాస రచయితకు పుష్కరం వయసుంది. దాంతో ఆయన చేతిలో సైన్స్ రచన సర్వ సమగ్రంగా, అత్యంత వాస్తవికమైన రీతిలో రూపొందింది.


సాహిత్యం, సామాజిక, రాజకీయ, సినిమా, సైన్స్ వ్యాసాలు మొత్తం దాదాపు వెయ్యి దాకా వుంటాయని విప్లవ రచయితల సంఘం కుటుంబరావు రచనలు సంకలనం చేస్తూ పేర్కొంది. కుటుంబరావు వ్యాసరచయితగా ఐదు అంశాలు స్పృశించారనుకోవచ్చు. అయితే ‘‘సైన్స్ వ్యాసాలు’’ అంటూ విరసం వెలువరించిన సంకలనంలో సుమారు 150 ఉన్నాయి. అందులో లేని హోమియోవైద్యం వ్యాసాలు, వాటితో పాటు బుద్ధికొలత వ్యాసాలను సైన్స్గా పరిగణించకపోయినా ఇతరత్రా సంకలనాలలో ఉండే ‘‘సైన్స్ స్పృహ గల’’ ఇతర అంశాల వ్యాసాలు కలుపుకుంటే కుటుంబరావు సైన్స్ వ్యాసాలు ఆయన మొత్తం వ్యాసాలలో ఆరో వంతు నుంచి ఐదో వంతుదాకా ఉంటాయి. ఇక్కడ సైన్స్ అంటే సైన్స్ అని ప్రత్యేకంగా పిలవబడే అంశాలతో పాటు, టెక్నాలజీ, ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం – ఇలా చాలా అంశాలు ‘సమగ్రం’ అనే రీతిలో మనకు దర్శనమిస్తాయి.


అన్నింటినీ తాత్విక భూమికతో స్వీకరించి, చారిత్రాత్మక కోణంతో పరిశీలించి, సామాజిక స్పృహతో వర్తమాన సమాజానికి అనువర్తింప జేయడం కుటుంబరావు శైలి. దాంతో ప్రకృతి, దేవుడు, మతం, భయం, నాగరికత, అభివృద్ధి, కళలు, మూఢవిశ్వాసం, సోషలిజం, రాజకీయాలు, వాణిజ్యం – ఇలా చాలా పార్శ్వాలు వాటికి తెలియకుండా సైన్స్ రచనలో అంతర్భాగాలైపోతాయి. హిట్లర్‍, ఆటంబాంబుల విధ్వంసం అని కేవలం భౌతిక శాస్త్రాంశాల సాంకేతిక అనువర్తనలకే కుటుంబరావు పరిమితం కాకపోవడం అనేది సైన్స్ రచయితగా ఆయన చూపిన దార్శనికత. అప్పటికి డి.ఎన్‍.ఎ స్థాయి ఆవిష్కరణలతో జీవశాస్త్రం అంటే ఆసక్తికరంగా లేదనేది ఒక వాస్తవం. ఆయన భౌతికశాస్త్రం అభ్యసించినా – ఇతర అంశాల మీద మక్కువ చూపించడం ఆయన పరిశీలనకున్న సమగ్రత. అందుకే కుటుంబరావు సైన్స్రచన కన్నా కుటుంబరావు సైన్స్ రచనాప్రణాళిక గొప్పది.


సైన్స్ అంటూ గందరగోళ పెట్టలేదు. సరళమైన, చక్కనైన తెలుగు పదాలతో ఆయన సైన్స్లాగా అనిపించకుండా సైన్స్ చెప్పారు. ఈ మాటలు చూడండి- పరమాణువుల స్వభావం, (2 ఆగస్టు, 1959) అనే వ్యాసంలో ‘సృష్టిలో కనిపించే అనేకత్వంలో ఏకత్వాన్ని తెలుసు కోవడమే శాస్త్ర విజ్ఞానం లక్ష్యం’ – అని నిర్వచించిన కుటుంబరావు దాన్ని మరింత సరళీకరణం, సామాజీకరణం చేసి శాస్త్ర జ్ఞానావశ్యకత (17 ఫిబ్రవరి, 1963) అనే వ్యాసంలో ఇలా నిర్వచిస్తారు – ‘‘శాస్త్ర జ్ఞానం యొక్క పరమార్థం నిజానికి, అబద్ధానికి తేడా కనిపెట్టడం’’, దీనికి ఉన్న సామాజిక పార్శ్వాన్ని ఇలా వివరిస్తారు.

  • దారిద్య్రం, దోపిడి అనే భయంకర సాంఘిక వ్యాధుల మూలంగా, ఉన్న శాస్త్రజ్ఞానం ఉపయోగానికి రాకుండా పోతున్నది. (అంటువ్యాధులు- ఇమ్యూనిటీ, 1 జూలై,1956).
  • నాగరికతను పెంపొందించే విజ్ఞానమంతటికీ సర్వోత్తమమైనది. ఆరోగ్యాన్ని కాపాడి పెంపొందించేది విజ్ఞానమే. (ఆరోగ్యమూ- శాస్త్ర జ్ఞానమూ, 15 జూలై 1956).


ఈ స్థాయిలో సైన్స్కు ఉండే సామాజిక కోణాలను గమనించిన రచయిత కుటుంబరావు ఒక్కరే అని నిర్ద్వందంగా మనం పేర్కోవచ్చు. ఈ మార్గంలోనే ఆయన రచనా ప్రణాళిక గొప్పది అని మనం వ్యాఖ్యానించడం.
‘పశుసంపదా, వాణిజ్యమూ వచ్చి బానిస జాతిని సృష్టించాయి. ఇనుము, బొగ్గు, పెట్రోలియం మొదలైనవి వచ్చి ఒక ధనిక వర్గాన్ని కొత్తగా సృష్టించి మిగిలిన వర్గాలను దానికి కనబడని బానిసలుగా చేశాయి’ – అని కుటుంబరావు ‘మానవ వంశ వృక్షం’ (1955)లో వివరిస్తారు. ఇది మనం తరచు ఆలోచించే విషయమే! దీనికి సైన్స్ అనేది ఒక ఆయుధంగా ఎవరి చేతిలో ఉందో గమనించాలి. శాస్త్ర విజ్ఞానం అనేది సామాజిక అంతరాలు- ఇటీవల కాలంలో సరికొత్త భాషలో ‘డిజిటల్‍ డివైడ్‍’ లా కల్గించకూడదు. సైన్స్ కోణంలో కుటుంబరావు సోషలిజాన్ని ఇలా వివరిస్తారు. – ‘సోషలిస్టు వ్యవస్థ అంటే.. సమస్త నాగరికతకూ ఆధారభూతమైన శాస్త్రజ్ఞానం ప్రజలపరం చెయ్యటం’ (జ్ఞానం-పరిణామం, 6మే, 1955)-అని. ఈ స్పృహతో చూసినపుడు సైన్స్ మానవ జీవితంలో ఎంత అవిభాజ్యమో సులువుగా బోధపడుతుంది. అపుడు మీరు కూడా కుటుంబరావు లాగా ‘శాస్త్ర విజ్ఞానం సాంఘిక స్వరూపంలో అడుగడుగునా విప్లవకరమైన మార్పులు తెస్తూ వచ్చింది’ అని మరోసారి నొక్కి చెబుతారు.


ఇప్పుడు పాపులర్‍ సైన్స్గా ప్రచారంలో ఉన్న పుస్తకాలను పరిశీలించండి. అందులో కేవలం సమాచారం ఉంటుంది. ఎలా వినియోగించుకోవాలో – యూసర్‍ మాన్యువల్‍ లాగా ఉంటాయి. వాడే మొబైల్‍ ఫోన్‍ దేనితో తయారుచేస్తారో మనకు తెలియదు, వాడి పారేసిన కంప్యూటర్‍ సామగ్రి ఎంత కాలుష్యం సృష్టిస్తుందో బోధపడదు. కంప్యూటర్‍ మన పని సులువు చేసిందని కూడా గమనించని మనం సామాజికంగా సాంకేతిక విజ్ఞానం ప్రభావం గురించి ఎందుకు పరికిస్తాం? ఆనాడే ఇటువంటి అవగాహన కోసమే కుటుంబరావు సైన్స్ కలం పట్టారు.


మన జాతికీనాడు సినిమాల కన్నా, కల్పనా సాహిత్యం కన్నా కూడా విజ్ఞానం, ప్రకృతి శక్తులను గురించి, ప్రకృతిని గురించి జ్ఞానం చాలా అవసరమని నండూరి రామమోహనరావు ‘విశ్వరూపం’ పుస్తకానికి రాసిన ముందుమాటలో చాలా స్పష్టంగా చెబుతారు. ‘శాస్త్ర విజ్ఞానానికి సామాజిక స్వరూపమున్న’ దని ఒక చోటా, ‘ఇది స్వతస్సిద్ధంగా సోషలిస్టు తత్వంగల’దని మరోచోటా, ‘శాస్త్ర పరిశోధన అంతర్జాతీయ స్వభావం గలది కూడానూ’ అని ఇంకోచోటా అంటారు. మరి ఈ సిసలైన సైన్స్ స్ఫూర్తిని పట్టుకుని తర్వాత వెలువడిన సైన్స్ రచనలు ఎన్ని? అనే ప్రశ్నకు ఎదురయ్యే సమాధానం తీవ్ర నిరాశను కల్గిస్తుంది. నిజానికి కుటుంబరావు సైన్స్ రచనలు- అర్థ శతాబ్దం తర్వాత – నేడు మరింత అవసరమనిపిస్తోంది. టెక్నాలజీ అనేది వ్యవసాయం, వైద్యం వంటి వాటిలో కూడా ప్రవేశించి వాణిజ్యంగా రూపు ధరించింది. మరి వాణిజ్య పాచిక అయిన టెక్నాలజీ నేడు ఎవరి చేతిలో పాచిక! దీన్ని వివరించే టపుడు వారి చేతిలో ఉండే ఆయుధం ఎంత స్థాయిలో ఉందని తెలుసుకోవాల్సిన అవసరం రచయితలకు లేదా? దాన్ని కేవలం సైన్స్ రచయితలకే వదిలివేయడం ఎందుకు? తాము మాత్రం దానిని ఎందుకు స్వీకరించాలని వారూ భావించినట్టున్నారు. అందుకే ప్రస్తుతం పత్రికల్లో శాస్త్ర విజ్ఞానం అస్పృశ్యమైంది, అదృశ్యమైంది!


కుటుంబరావు దృష్టి వాస్తవికంగా ఉంటుంది. ‘మనం స్వతంత్రులమైనామని చంకలు గుద్దుకొని లాభం లేదు. బెదరు గొడ్లల్లే బతకకుండా అనివార్య మైన వాటిని తోసుకు తిరగడమో, అనివార్యం కాని వాటి నిర్మూలన కోసం పోరాడడమో నేర్చుకుని నిజమైన మనుషులల్లే బతకడం నేర్చుకో’వాలని – భయంతో బతకరాదు అనే వ్యాసంలో వ్యాఖ్యానిస్తారు. దేన్ని నిర్మూలించాలో, దేన్ని తోసుకు తిరగాలో మనకు స్పష్టత ఉండాలి. అంతేకాని పిరికిపందల్లా ఉండనక్కర లేదు. స్వార్థం జ్ఞానానికి ప్రబల శత్రువు అని చెప్పడమే కాక, శాస్త్ర జ్ఞానాభివృద్ధిని సాంఘిక స్వార్థం నిరోధించినట్టుగా మరేదీ నిరోధించలేదని కూడా స్పష్టం చేస్తారు. మరి ప్రస్తుతం రచయితలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ సాహిత్యాన్ని సృజించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సమస్య ఎంతో క్లిష్టమైంది కనుక.
కుటుంబరావు దృష్టి సైన్సు సామర్థ్యాన్ని అంచనా కట్టడంలో ఎంత వాస్తవికంగా ఉందో, దాని స్థానమూ, పరిమితులు గుర్తించడంలో మరింత వాస్తవికంగా ఉంది. ఈ పరిశీలనలు చూడండి-

  • ప్రాణి సంబంధమైన పదార్థాల విషయంలో ‘జడ’ పదార్థాలతో పోలిస్తే ‘ప్రాణి’ పదార్థాల ఉత్పత్తి చాలా క్లిష్టంగా కన్పించింది. (సృష్టి- ప్రతిసృష్టి. 2 జూన్‍, 1956).
  • మనిషి కేవలం శాస్త్రవిజ్ఞానంతోనే కాలక్షేపం చేయలేదు. (జ్ఞాన పరిణామం, 6 మే, 1955)
  • శాస్త్ర జ్ఞానం మతానికీ, ఆధ్యాత్మిక చింతనకు శత్రువు కాదు. స్వార్థం జ్ఞానానికి ప్రబల శత్రువు. (శాస్త్ర జ్ఞానావశ్యకత, 17 ఫిబ్రవరి, 1963).
  • ఆధునిక నాగరికతకు ఆయువుపట్టులుగా ఉన్నవి మూడింటిని చెప్పుకోవచ్చు. కళలూ, మతమూ, శాస్త్రజ్ఞానమూ (శాస్త్ర ప్రయోజనం 15 అక్టోబర్‍, 1960).
  • ‘మీరు జ్ఞాన శాస్త్రం సంపాదించండి’ అని ఉద్బోధించినంత మాత్రాన ప్రజల మనస్సు లగ్నం కాదు… అసలు కీలకం శాస్త్రాన్ని ప్రజల జీవితంలో ప్రతిష్టాపన చెయ్యటంలో ఉంది. అది సోషలిస్టు వ్యవస్థలో సాధ్యపడినట్లు వర్గ వ్యవస్థలో సాధ్యపడదు’ (సోషలిస్టు వ్యవస్థ-1 అక్టోబర్‍, 1961).


కుటుంబరావు సైన్స్ రచనల ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఏ మాత్రం అవకాశమున్నా సైన్స్ రచనలు చేశారని గమనించవచ్చు. 1955-56 ప్రాంతంలో ఆయన సైన్స్ రచన శిఖరస్థాయిలో ఉంది. విశాలాంధ్ర, యువజన పత్రికలు వేదికలుగా మారాయి. చిన్న పత్రిక, పెద్ద పత్రిక అనకుండా రాశారు. అలాగే పిల్లలకూ, యువతకూ, అందరికీ అని కూడా ప్రయత్నం చేశారు. వ్యాసాలను నిడివిలో, శైలిలో తేడాలు గుర్తించ వచ్చు. తెలుగుతల్లి పత్రిక (మే-జూన్‍, 1945)లో ప్రచురింపబడిన ‘పరమాణువులు’ అనే రచన చిన్న పరమాణువు, పెద్ద పరమాణువు మధ్య సంభాషణగా చాలాభాగం సాగుతుంది. అవసరమైన చోట పదాలు రూపొందించుకుంటూ సైన్స్ రచన సాగిస్తారు. ఇది ఆయన సాహిత్య శైలికి విభిన్నం కాదు. వైజ్ఞానిక భావాలు సినిమా సంభాషణల ధోరణిలో, ప్రేమకథల ధోరణిలో ఉండవని చెబుతారు కూడా! అయితే సరళంగా, హృద్యంగా మాతృభాషలో సైన్స్ రచన ఉండాలంటారు కుటుంబరావు.
అందుకే ‘జన సామాన్యానికి వైజ్ఞానిక విషయాలు అందించేటప్పుడు రచన విస్తృతంగా నడవాలిగానీ, లోతులకు పోయి ప్రయోజనం లేదు. పారిభాషిక పదాలూ, సాంకేతిక విలువలు ఎంత తక్కువగా ఉంటే పాఠకుడికి అంత సౌకర్యంగా ఉంటుంది’ అని ‘ప్రాణులూ – ప్రపంచం’ అనే తన పుస్తకం ముందుమాటలో అంటారు. తన గురించి వివరిస్తూ ‘పాఠకుల కొరకు రచించే వైజ్ఞానిక గ్రంథాలను చాలాకాలంగా చదువుతూ ఉండిన’ వాడిగా, ‘తాను తెలుసుకున్న విషయాలను తోటివారికి అందించడమే’ ఆశయంగా సాగేవాడినని చెప్పుకుంటారు.


కొత్త విషయాలు వచ్చి చేరగానే అంతవరకు ఉన్న సమాచారం సమగ్రంకాదనో లేదా సరికాదనో తేటతెల్లమవ్వవచ్చు. అదే సైన్స్ విషయంలో మరింత వాస్తవం. ఎందుకంటే సైన్స్రంగంలో వచ్చిపడే పరిశోధనల వేగం చాలా ఎక్కువ. అందువల్లనే సైన్స్ విషయాలు చాలా త్వరగా పాతబడతాయి లేదా పాత విషయాలను పూర్తిగా మార్చవలసి ఉంటుంది. కుటుంబరావుగారు సైన్స్ రచన ప్రారంభించే సమయంలో ప్రపంచవ్యాప్తంగా భౌతికశాస్త్ర సంబంధమైన, రసాయన శాస్త్ర సంబంధమైన విషయాలు చాలా విరివిగా జరగడమే కాక, విపరీతమైన ఆసక్తి కలిగించే స్థాయిలో ఉన్నాయి. అందువల్లనే కొన్ని పాదార్థిక అంశాలను వివరించే కుటుంబరావు వ్యాసాలు ప్రస్తుతం పాతబడినట్టు అనిపిస్తుంది. అది ఏ సైన్స్ రచయితకైనా తప్పని పరిస్థితి.


కుటుంబరావుగారి సైన్స్ రచనల గురించి పెద్దగా పరిశీలన జరిగినట్టు కనబడదు. అయితే 1982లో వెలువడిన ‘భావవిప్లవకారుడు కొడవటిగంటి’ అనే సంకలనంలో జె.మనోహరరావుగారు సామాజిక నేపథ్యంతో పరిచయం చేసిన విజ్ఞాన శాస్త్రం అనే వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో ఆయన రాసిన ఈ విషయాలు పరిశీలిద్ధాం.
‘‘…. శాస్త్రజ్ఞాన పరిశోధనా ఫలితాల క్రోడీకరణలూ, వాటిపై వేసే అంచనాలూ మన మూల్యాత్మకమైన తీర్పులను (వాల్యూ జడ్జిమెంట్స్) కాకుండా వాస్తవ పరిస్థితిని, సామాజిక ఉత్పత్తి సంబంధాలను, వర్గ సంబంధాలను ప్రతిబింబించేవిగా ఉండాలి. అలా జరగనప్పుడు అది గతి తర్కానికి అతీతంగానూ, ఆది భౌతికానికి సమీపంగానూ కన్పిస్తుంది. అట్టి పొరపాటు కుటుంబరావు కూడా చేశాడు. అమెరికా, రష్యాలు 1960 ప్రాంతంలో జరుపుతుండిన అంతరిక్ష ప్రయోగాలను బేరీజు వేస్తూ – అమెరికా, రష్యాను అందుకోవడానికి అనేక సంవత్సరాలు పట్టవచ్చునని, రష్యా కన్నా ముందుగా అమెరికన్లు చంద్రమండలం మీద దిగే అవకాశాలు లేవని, అమెరికా వారు ఒప్పుకుంటున్నారు. – అని అంటాడు ఒక చోట. కానీ అట్లా జరగలేదు. ఒకవేళ అట్లా జరిగినా అదంత ముఖ్యమైన విషయం కాకపోవును. ఎందుకంటే శాస్త్ర విజ్ఞానంలో ఒక దేశానికి గల అధిక్యత రుజువయ్యేది ఈ విధంగా కాదు. గతి తార్కిక దృష్టితో చూసినప్పుడు కేవలం పరిశోధనల్లో ఎవరు ముందున్నారు అన్న దానికన్నా అవి ఏ వ్యవస్థలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అన్న దానికి ప్రాముఖ్యతని ఇస్తాం. ఏ సమాజంలో అయినా శాస్త్రవిజ్ఞాన దశను, దిశను నిర్ణయించేది ఆ సమాజంలోని సామాజిక ఉత్పత్తి సంబంధాలే. అందుకే శాస్త్ర విజ్ఞానానికి వర్గ స్వభావం ఉన్నదా అన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానాన్ని తరచిచూడవలసి ఉన్నది.


శాస్త్ర విజ్ఞానమంటే ప్రకృతి రహస్యాలను కనుగొని స్వార్థరహితమైన రీతిలో సమాజపరం చేయటమే కనుక ఇది తటస్థమైనదని పలువురి నమ్మకం. అందులో కొంతమంది మార్క్సిస్టులు కూడా లేకపోలేదు. శాస్త్ర విజ్ఞానానికి వర్గ స్వభావం ఉంటుందన్న విషయం కుటుంబరావుకు తెలియదనుకోవడం కష్టం…’’
ఇంతకుముందే అనుకున్నట్టు ఇంతవరకు కుటుంబరావుగారి సైన్స్ వ్యాసాల గురించి సరైన పరిశోధన లేదు కనుక ఇప్పుడైనా ఆ దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది.
ఏది ఏమైనా కుటుంబరావుగారు రాసిన సైన్స్ వ్యాసాల్లో సమాజం, కళలు, మతం, దైవం, విశ్వాసం, ప్రగతి, తాత్విక భూమిక వంటి కోణాలను స్ప•శిస్తూ, వివరించిన వాటిని విడిగా తీసి ప్రచురించాల్సిన అగత్యం ప్రస్తుతం చాలా ఉంది. ఇటువంటి వ్యాసాలు విరసం ప్రచురించిన సైన్స్ వ్యాసాల్లోనే కాక సంస్క •తి, చరిత్రవంటి ఇతర సంపుటాల్లో కూడా మనకు కనబడతాయి. ప్రస్తుత సమాజంలో టెక్నాలజీని వాణిజ్యానికి, వస్తులోలతకు, కాలుష్యానికి వినియోగిస్తున్నాం. అయితే ఈ కోణాలేవీ తెలియకుండా మనం సైన్స్ టెక్నాలజీని పరిగణిస్తున్నాం. కుటుంబరావు తర్వాత ఏ సైన్స్ రచయిత కూడా ఈ దిశలో కృషి చేయలేదు కనుక- ఆయన సైన్స్ దృక్పథం నేడు చాలా అవసరం.


ఈ నేపథ్యంలో హేతువు, ప్రశ్న, ఫలితం, సమాజం అని ఆలోచించే కుటుంబరావు, గోపీచంద్‍, శ్రీశ్రీల వంటి సాహితీవేత్తల సాహిత్యంలోని సైన్స్ పార్శ్వం మరింతగా- నేటి అవసరాలకు తగ్గట్టుగా ప్రాచుర్యంలోకి రావాలి.

-డా. నాగసూరి వేణుగోపాల్‍
ఎ : 9440732392

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *