అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-13 మహేశ్వరభటారల ప్రాగటూరు తెలుగు శాసనం (క్రీ.శ.859)


ఈసారి ప్రాగటూరులో నేను 1978 జులై 3వ తేదీన చూచిన శివాలయం ముందు నంది మండపం ఒక స్థంభంపైన గల శాసనంపైన రాయాలను కొన్నాను. ఎందుకంటే నేను, మొట్ట మొదటిసారిగా, ఒక శాసనాన్ని దగ్గర్నించి చూచింది ఆ శాసనమే. అక్షరాలు కనిపిస్తున్నాయి గానీ, ఇప్పటి తెలుగు కాదు గాబట్టి, కన్నడ శాసన మనుకొన్నాను. శాసనంలోని ఒక్కో పంక్తిని, పంక్తిలోని ప్రతి అక్షరాన్నీ చేతితో తడిమినపుడు ఏదో తెలియని వింత అనుభూతిని పొందాను. మళ్లీ నలభై మూడేళ్ళ తరువాత, ఆ శాసనానికి సంబంధించిన గతం, స్వగతం గుర్తుకొచ్చాయి.


ప్రాగటూరు. అప్పటి అలంపూరు తాలూకాలోని ఒక పెద్దగ్రామం. చారిత్రక ఆలయాలకు, మధ్యయుగం, సంస్థానాల కాలపు కోటకు నెలవైన స్థావరం. నేను, నీటి ముంపు తరలింపు గ్రామాల్లోని దేవాలయాల నమూనాలను తయారు చేయటానికి కావలసిన డ్రాయింగులు వేసే పనిలో భాగంగా, ఆవూరు కెళ్ళాను. నాతో పాటు కె. యాదగిరిరెడ్డి అనే ఇంజనీరింగ్‍ సూపర్‍వైజర్‍ కూడ వచ్చాడు. అక్కడున్న కోట చాలా పొడవైంది. కృష్ణానది కుడివైపున, స్థానిక నాపరాతితో, అర్థచంద్రా కారపు బురుజులతో నిర్మించబడింది. కోట నుంచి ఒక పెద్ద దర్వాజ. దాని ముందు విశాలమైన అనేక మెట్ల వరుసలు, ఆనాటి కోటలోపలి వారు. 1978లో ఆ గ్రామస్తులు, తాగునీటి కోసం, ఆ మెట్లనే వాడేవారు. కోటగోడలు, బురుజులు చూస్తున్న నాకు, ఏదో పుస్తకంలో చూచిన రాజస్థాన్‍ కోటలు గుర్తు కొచ్చాయి. లోపల రెండు దేవాలయాలు, ఒకటి క్రీ.శ. 8వ శతాబ్ది నాటి బసవేశ్వర, మరోటి క్రీ.శ16వ శతాబ్దినాటి వరదరాజ స్వామివి. ఊరు బయట క్రీ.శ. 18వ శతాబ్దినాటి రామేశ్వరాలయం ఉన్నాయి. ఆలయాలన్నీ చూడటానికి ఒకపూట పట్టింది. ఏదైనా హోటల్లో అన్నం తిందామని ప్రయత్నించా. కరణంగారు, సదాశివరావుగారు పరిచయమై వాళ్లింటికి తీసుకెళ్లారు. భోజనం తరువాత, కోట వెలుపల, రాష్ట్ర పురావస్తు శాఖ జరుపుతున్న తవ్వకాల వద్దకు తీసుకెళ్లారు. వాళ్లు ఒక టెంటు, మరో రెల్లుగడ్డి గుడిసె వేసుకొని, చక్కటి పర్నిచర్‍తో క్యాంపు నడిపిస్తున్నారు. ఆ తవ్వకాల అధికారి బి. సుబ్రహ్మణ్యంగారిని నాకు పరిచయం చేశారు. ఆయన్నడిగి ప్రాగటూరు ఆలయాలు చరిత్ర తెలుసుకొన్నాను. బాదామీ చాళుక్య, రాష్ట్రకూట, కళ్యాణ చాళుక్య, విజయనగర రాజులు, తరువాత ప్రాగటూరు సంస్థానాధిపతి బిజ్జల చినతిమ్మభూపాలు (రెడ్డి)ని గురించి చెప్పారు.


బిజ్జల చినతిమ్మభూపాలుడు అనగానే, నాకు అనర్ఘరాఘవం గుర్తుకొచ్చింది. ఇక, ప్రాగటూరులోని వరదరాజస్వామి ఆలయం మొదటి అంతస్తులోని చక్కటి నల్ల శాసపు రాతి ద్వార శాఖలు, వాటిపైన గంగ, యమున, పైన రామ పట్టాభిషేక దృశ్యం, ద్వార నిలువు శిఖలపై గల అద్భుత శిల్పం నన్ను కట్టి పడేశాయి. ఆ ద్వారం డ్రాయింగును 3 రోజుల్లో పూర్తి చేశాను. తరువాత, దాన్ని తరలించి, వారసత్వ తెలంగాణ (పురావస్తు) శాఖలోని శ్రీశైలం పెవిలియన్‍లో నిలబెట్టారు. అదీ, ప్రాగటూరుకు నాకూ ఉన్న అనుబంధం. ఆ తరువాత నేను, బసవేశ్వరాలయం, ఆంజనేయాలం, ఊరి బయటి రామేశ్వరాలయాల డ్రాయింగులు కూడా వేశాను. అపుడు నేను అలంపురు కేంద్రంగా ఉన్న దేవాదాయ శాఖ, దేవళాల తరలింపు ఇంజనీరింగ్‍ విభాగంలో శిల్పి డ్రాఫ్టస్మన్‍గా పని చేస్తున్నాను.
ఇక ప్రాగటూరు తెలుగు శాసన విషయాని కొద్దాం. శాసనానికి మొదటి వైపు 25, రెండో వైపు 7 పంక్తులున్నాయి.


శాసన పాఠం :
మొదటి వైపు

  1. స్వస్తి సకనృపకాలాతీతసంవ
  2. త్సరసత(o) బు 781 ప్రమాది సంవ
  3. త్సరబుప్రవత్తి( )షితద్వరిషభ్య
  4. న్తరబునుత్తరాయన(o) బున మ (హే)స్వ
  5. రజ(భ)టార(ద)లు, దమతోణ్డకుతి(ల)
  6. కులీస్వరదేవరభోగంబునకు వి
  7. త్తియిచ్చిరి కీవురదేవుల గుణ్డ
  8. యపఱుకడచేనుపదిమఱు
  9. తురును, పాఱవరతూమున పాఱ
  10. తిప్పయ క్రొతూరి నెలవున మూణ్డు
  11. వైపులు యొక్క చేను
  12. ముప్పదిమఱు
  13. తురును, పఱవాడతూమున పాఱిముకబై
  14. ణ్డకుణ్డ తెరువు చేను పణ్డ్రెణ్డు మఱుతురూను
  15. బల్లియసెట్టి పసపుమడేభది
  16. మఱుతురును, ప(o) చరాసి అధ్యక్షంబుననాలు
  17. గు సేలును, కాలుగళుగొని ఆచన్ద్రతారకంబు
  18. నకు యీవ్రిత్తి ధర్మక్యా oబున ప్రతిపాలి(ం)చునది
  19. దీని ఎవ్వరేని అమ్మిరేని
  20. ఱె, యవరేని, పాఱుణ్డేని, కోమటి యేనికా(ం)
  21. పుల యేని, లంబియేని, తపసులేని, మోహపడి
  22. తేని, శ్రీపర్వతముఖానరాసి, గురుక్షేత్రంబు వ్రచ్చి
  23. నపాపముగొనువారుతోణ్టకరులుసమ
  24. న్నను తపసులకు బెట్టినవారా ఈ గుడిచేనిని ముడిఎంబదు
  25. మగల
    రెండవ వైపు
  26. స్వస్తి ప్రభవ సంవత్సరంబువస్ర
  27. వనంబులపున్నమమోదలుగా
  28. మహ(ర)శ్వజ భటారలకు ఉత్తరేస్వర
  29. దే(వు)లు లకులీస్వరభటారలు….
  30. ……. క…… రు…
  31. ……….లపన్నససడిగళులుక.
  32. పదారగోమాత……. పెవెనన్త


ఈ శాసనాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ 1966లో నకలు తీసి ఆ సం।। వార్షిక నివేదికలో 258వ సంఖ్యను సంక్షిప్త వివరాల నందించారు. శాసన పూర్తిపాఠం.
ముద్రకోసం, డా.ఎన్‍.ఎస్‍. రామచంద్ర మూర్తి (సం), ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్‍ ఆంధప్రదేశ్‍, మహబూబ్‍నగర్‍ డిస్ట్రిక్టు, హైదరాబాదు, 2003 (పే.26-27)లో చూడవచ్చు. అందులో ఈ శాసనాన్ని రట్టభటారుల ఇచ్చారని ఉందిగాని, ఆ పదమే శాసనంలో లేదు. ప్రాగటూరు, బసవేశ్వరాలయం ముందున్న నంది మండప స్థంభంపై నున్న క్రీ.శ.859వ సం।।పు ఈ తెలుగు శాసనం భాషపరంగా, లిపిపరంగా ప్రాముఖ్యతను సంతరించుకొంది. భాష, తెలుగు లిపి, తెలుగు – కన్నడ. రాజవంశ ప్రస్తావన లేదు.


శాసనంలో ఉన్న క్రీ.శ.859వ సం।।, రాష్ట్రకూట రాజైన మొదటి అమోఘవర్షుని పాలన (క్రీ.శ.814-878)లోకి వస్తుంది కాబట్టి పైగా ఈ ప్రాంతం, అపుడు అతని ఆధీనంలోనే ఉంది గాబట్టి, ఈ శాసనం రాష్ట్రకూటుల ఏలుబడిలో, పాశుపత శైవశాఖకు చెందిన లకులీశ్వర భటారలు, మహేశ్వర భటారల ప్రస్తావన ఉండటాన, ప్రాగటూరు ఒక పాశుపతశైవ క్షేత్రంగా ఉండేదని చెప్పొచ్చు. పైగా, ఆలయంలో ప్రతిష్టితుడైన శివుని పేరు లకులీశ్వరదేవర భోగానికి భూమిని దానం చేసిన వివరాలున్నాయి. శాసనాన్ని పరిశీలిస్తే అనేక ఆసక్తకర విషయాలు తెలుస్తున్నాయి. శక సంవత్సరాన్ని, సకనృప కాలాతీత సంవత్సర సతంబు 781 ప్రమాది సంవత్సరంబు ప్రవర్తిత’ అని పేర్కొన్నారు. శకకు సక, శతంబుకు సతంబు, సంవత్సరంబుకు సంవత్సరబు అని, మహేశ్వర భటారలకు బదులు మహేశ్వర జటారలు అనీ, తమతోణ్డ = తమతోంట, విత్తి = వృత్తి, పాఱ = బ్రాహ్మణుడు, క్రొతూరి = క్రొత్తూరి, మూణ్డు – మూడు, పణ్డ్రెణ్డు = పన్నెండు, సెట్టి = శెట్టి, పంచరాసి = పంచరాశి, అధ్యక్షంబున = అధ్యక్షంబున, సేలు = చేలు, కాలుగళుగుకొని = కాళ్లు గడుగుకొని (దానసందర్భ సంప్రదాయం), ఆచన్ద్ర తారకంబు = ఆచంద్ర తారార్కంబు, ధర్మ క్యాoబున = ధర్మకార్యంబున, ఎవ్వరేని = ఎవరైనా, అమ్మిరేని ఱో = అమ్మినట్లైతే, (అమ్మినారో) పాఱుణ్డేని = బ్రాహ్మణుడైనా, కోమటి యేని = కోమటి అయినా, కాంపులయేని = కాపులైనా, మోహపడుతేని = ఆ భూమి పట్ల ఇష్టం పెంచుకొంటే, స్రవనంబులపున్నమ = శ్రావణ పున్నమి, మోదలుగా = మొదలుగా, మహేశ్వజ భటారలకు = మహేశ్వర భటారలకు అని చదువు కోవాలి.


ఈ శాసనంలో పాఱ= బ్రాహ్మణ, కోమటి = కోమట్ల గురించిన కుల ప్రస్తావన ఉంది. ‘కోమటి’ పదం ఈ శాసనంలోనే, మొదటి సారిగ ప్రస్తావిస్తుందని, మహబూబ్‍నగర్‍ జిల్లా శాసనాలు పుస్తక సంపాదకులు డా. ఎన్‍. ఎస్‍. రామచంద్రమూర్తిగారు పేర్కొన్నారు.


శాసన విషయాలను మరోసారి పరిశీలిస్తే, స్థానిక లకులీశ్వర దేవర భోగమునకు మహేశ్వర భటారులు, కొంత భూమిని వృత్తిగా ఇచ్చినట్లునూ, ఇంకా పఱకాడకు చెందిన కివుర దేవులగుండయ, పదిమఱుతురులును, పాఱవరతూమున పాఱతిప్పయ, కొత్తూరులో మూడు వైపులగల చేను ముప్పై మరుతురులు, పాఱిముక బైణ్డు కుణ్ట తెరువున పన్నెండు మరుతురులూ, బల్లియశెట్టి, యాభైమరుతుర్ల పసుపుచేను (పసపుమడేబది), పంచరాశి (పాశుపతాచార్యులు?) నాలుగు చేనులు, కాళ్లు కడుక్కొని, ఆ చంద్రతారార్కంగా చెల్లే వృత్తిగా ఇచ్చిన దానం, ధర్మకార్యక్రమనీ, దానిని అందరూ గౌరవించాలని, ఈ భూములపైన ఎవరైనా మోహ(ఇష్ట) పడినా, అమ్మినా, వారు బ్రాహ్మణులైనా, కోమట్లైనా, కాపులైనా, లంబియైనా, తపసులైనా, శ్రీ పర్వతంలో ముఖాన్ని (నేలకు) రాసి, గురుక్షేత్రంలో చచ్చిన పాపాన పోతారని చెప్పబడింది. ప్రభవనామ సంవత్సరం, శ్రావణపున్నమి మొదలుగా మహేశ్వర భటారలకు, ఉత్తరేశ్వరదేవులు, లకులీశ్వర భటారలు భూమిపై హక్కులు కల్పించారని ఉంది.


దక్షిణ తెలంగాణ చివర కృష్ణాతీరంలో వాడుకలో నున్న తెలుగు మాటల్ని ఈ శాసనం మనకు అందిస్తుంది. అంతేకాక కోమటి అన్న కుల వాచకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి అందించిన తొలి శాసనంగా ప్రాగటూరు శాసనం గుర్తింపు పొందింది. క్రీ.శ.9వ శతాబ్ది నాటి లిపిలో, కుర్క్యాల, అద్దంకి, బెజవాడ శాసనాలకు సమకాలీనంగా ఉండటాన, అక్షరాలు కుదురుగా, విడివిడిగా, తెలుగు అక్షరాల పొందికను అలవర్చుకొంటున్నట్లుగా మనం గమనించవచ్చు.
ఇలా, క్రీ.శ.9వ శతాబ్దిలో నాటి, భాష, లిపికి అద్దం పడుతూ, మునుపటి మహబూబ్‍నగర్‍ జిల్లాలోని పూర్తి తెలుగు శాసనంగా గుర్తింపు పొంది, నాటి సామాజిక, మతపరమైన భాష లిపి పరమైన విలువైన సమాచారాన్ని స్తున్నందున ఈ శాసనం, అలనాటి మేటి తెలంగాణ శాసనాల జాబితాలో చోటు దక్కించుకొంది.


-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *