ప్రకృతిలో వికృతి ‘మదినా హిజ్రాఘర్‍’

పూర్వజన్మలో ఏ దేవుడికి ఏ నిప్పుల పూజ చేసుకున్నామో ఈ జన్మలో ఇట్లా అఘోరిస్తున్నాం’’.
‘‘ఈ సమాజంలో వేశ్యకైనా ఒక గౌరవ స్థానముందేమో గాని మాకు మాత్రం లేదు. ఒక చిన్న చిల్లిపైసకు ఉన్న విలువ కూడా ఈ సంఘంలో మాకు లేదు. మేమందరం ఈ మానవ సమాజంలో అటుఇటు ఎటూగాని వింత ప్రాణులం. మేం నరుడు కాదు నారీ కాదు. ఇట్లాగాక కనీసం అడవిలో ఏ చెట్టుగానో, పక్షిగానో, జంతువుగానో పుట్టినా బాగుండేది. మేం శిలల్లాంటి వాళ్లమే అయినా మాకూ ఓ మనస్సుంటుందని, స్పందించే హృదయం ఉంటుందని ఈ లోకానికి తెలియదు.
ఇది మన మధ్యనే సంచరిస్తున్న ‘‘యదార్థ జీవుల వ్యథార్థ గాథ’’. తెలుసుకుందామా? సరే పదండి!

నయాపూల్‍ దాటి మదినా హోటల్‍ దగ్గర కుడివైపు మలుపు తిరిగి హైకోర్టుకు పోతుంటే ఎడమవైపు బస్సుస్టాండు వెనుక ఎత్తు అరుగుల మీద ఒక పెద్ద గడీ లాంటి ఇల్లు కనిపిస్తుంది. దాని దర్వాజా పాతకాలం వైభవం, నగిషీలతో దర్పంగా నిలబడి ఉంటుంది. అదే హిజ్రా ఘర్‍.
అక్కడ హిజ్రాలందరూ సామూహికంగా నివసిస్తుంటారు. ఈనాడు మనం గౌరవంగా పిలుస్తున్న ‘‘ధర్డ్ జండర్‍’’ల ‘‘కమ్యూన్‍’’ అది. ఇక్కడే గాక లార్డ్ బజార్‍ ప్రాంతంలో మరో మూడు ‘‘హిజ్రాఘర్‍’’లు ఉన్నాయి. ఈ ఇళ్లను ఎవరూ కొనటానికి, అమ్మటానికి వీల్లేదు. నైజాముల కాలం నుండి తరతరాలుగా వారసత్వంగా వస్తున్న ఇండ్లు అవి. టోలీచౌకీ దగ్గరున్న ఖోజా గూడ వీరికి సంబంధించినదే. దానిని ఇప్పుడు ఖాజా గూడా అంటున్నాం. హైద్రాబాద్‍ చరిత్ర, సంస్కృతిలో హిజ్రాలు కూడా ఒక విడదీయలేని భాగం.


ఆరవ నిజాం మహబూబ్‍ అలీ ‘‘పాషా’’ సోదరి పర్వరీష్‍ – ఉన్నిసా బేగంను పాయగా నవాబ్‍ ఆస్మాన్‍జాకు ఇచ్చి వివాహం చేసారు. మలక్‍పేట టి.వి.టవర్‍కు ఎదురుగా ఉన్న ‘‘ఆస్మాన్‍ ఘర్‍ ప్యాలెస్‍’’ ఇతను నిర్మించినదే. నిజాం వంశం ఆడపడుచులను పాయగా వంశం వారికి ఇచ్చి పెళ్లి చేసే సాంప్రదాయం పూర్వం నుండి వస్తున్నది. అయితే పాయగా నవాబులకున్న లోపం వలననే వారికి సంతానం కలగటం లేదన్న వదంతి కూడా గుసగుసలుగానే వినబడేది. ఈ నేపథ్యంలో ఆస్మాన్‍ జా నవాబుకు 50 సం।।ల వరకూ సంతానం కలుగలేదు. అల్లాకు ప్రతిరోజూ ఎంత విన్నవించుకున్నా, ఏం ఫాయిదా కలగలేదు. ఆఖరున ఒకరి సలహాపై ఆస్మాన్‍జా మధ్యప్రదేశ్‍లోని ఇండోర్‍కు వెళ్లి ఒక హిజ్రాను కలిసారు.
సంతానం లేని వారు ఆమె దగ్గరికి వెళ్తే సఫలులౌతారని ఒక నమ్మకం. ఆ హిజ్రా నవాబుగారికి తగు మర్యాదలు చేసి అసలు సంగతి తెలుసుకుంది. సరే మీకు సంతానం కల్గితే ఈ ఇండోర్‍లోనే ఒక మసీదు కట్టించాలని వాగ్ధానం తీసుకుంది. దీవెనలు ఫలించి నవాబుకు పుతప్రాప్తి సిద్ధించింది. ఇచ్చిన మాట ప్రకారం ఆస్మాన్‍ జా కట్టించిన మసీదు ఇప్పటికీ ఇండోర్‍లో ఉంది.


హైద్రాబాద్‍ రాచవంశంలో మగసంతానం కలగగానే కోటపై ఫిరంగులు మ్రోగేవి. ఆరవ నిజాంకు పుత్ర సంతానం కల్గినపుడు వారం రోజులు కొజ్జాలను రాజభవనంలో పెట్టుకుని వారి ఆటపాటలను, వినోదాలను తిలకించి ఆనందించి ఆఖరిరోజు వారికి ఐదువేల అశ్రఫీలను భక్షీస్‍గా సమర్పించుకుని వారు ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు వీధులలో వారిని ఆకతాయిలు అవమానించకుండా కుడిఎడమలా జవాన్‍ల నిఘరానీలో పంపాడు.
కొజ్జాలందరూ పుట్టుకతో పురుషులే. కాని వారికి జన్మతహాగా అంగం చాలా చిన్నదిగా ఉండటం లేదా సాధారణ పరిమాణంలో ఉన్నా మొగతనం లేక పోవటం వలన సమాజంలో ఇమడలేక తమ ఉనికి కోసం హిజ్రాల సంఘంలోకి వెళ్లిపోతారు. మరికొందరికి స్త్రీల జీవనశైలిపై బలమైన కోరిక, దుస్తులు, నడక, అలంకరణ, మాట తీరులో స్త్రీలను అనుకరించాలన్న రహస్య కోరిక వలన, అసహజ ప్రవర్తన, మానసిక వైకల్యం వలన సభ్య సమాజంలో ఇమడలేక హిజ్రాల సంఘంలో చేరుతారు. స్వజాతి సంపర్కంపై కోరికున్న మగవారు వారిని వ్యభిచారులుగా వాడుకుంటారు. కొంతమంది హిజ్రాలు తమ పుట్టుక మీద, తమ మీద తమకే కోపం ఉండటం వలన తమకున్న చిన్న అంగాన్ని కూడా బలవంతంగా ఛేదించుకుంటారు. మరికొంతమంది హిజ్రాగా పూర్తిస్థాయి అర్హత సంపాదించుకునేందుకు ఉన్న కొంత అంగాన్ని కూడా కోసేసుకుంటారు. 1948లో హైద్రాబాద్‍ విమోచన తర్వాత ఓటర్ల లిస్టు సిద్దం చేస్తున్నప్పుడు హైద్రాబాద్‍ నగరంలో రెండు మూడు వేల మంది కొజ్జాలున్నారని, వీరిని నీగ్రో సైనికులైన చావూష్‍లు, హబ్సీలు లైంగికంగా వాడుకునే వారని తెలిసింది. హిజ్రాలు బలవంతంగా మొగపిల్లలను, యువకులను తమలో కలుపుకుంటారని ఒక అపవాదు, భయం ఉంది. కాని అది తప్పు. ఎవరైనా స్వచ్ఛంధంగా వారి సంఘంలో చేరుతామని వస్తే ‘‘ఇనుపగూటంపై’’ కూచుండబెడ్తాం అని మొదట భయపెడ్తారు. అదొక రకమైన పరీక్ష లేదా బెదిరించటం. భయపడకుండా దానికి కూడా సిద్ధమైన వారిని మాత్రమే తమ సంఘంలో చేర్చుకుంటారు. కాని అట్లా కూచుండబెట్టరు.


అంగవిచ్ఛేదనను ఒక ఉత్సవంగా జరుపుతారు. ఆ సందర్భంలో వారి దేవత ‘‘బస్రాజీ మాతను’’ పూజిస్తారు. ముస్లింలైతే అల్లాపేరు తలుచుకుంటారు. కొత్తగా చేరిన వారితో బండచాకిరీ చేయిస్తారు. తట్టుకుని నిలబడిన వారికి చీర కట్టిస్తారు. ఆ కఠిన చాకిరీ కాలం కూడా పరీక్షా సమయమే. ప్రతి ‘‘డుప్కి పున్నమి’’ (కార్తీక పౌర్ణమి) రోజు బస్రాజీ మాతను కొలుస్తారు. ముస్లింలు వారి పద్దతులలో నమాజులు, పండుగలు చేసుకుంటారు.
వీరికి కూడా గురు శిష్య పరంపర ఉంటుంది. హైద్రాబాద్‍ నగరంలో వీరు వివిధ సమూహాలుగా ఉన్నారు. ప్రతి సమూహంలో సీనియర్‍ను గురువుగా భావించి  ‘‘గురుభాయి’’ లేదా ‘‘కమాలియా’’ అని పిలుస్తూ గౌరవిస్తారు. గురు, నాయక్‍, భక్ష్ వారి వారి హోదాలకు తగిన బిరుదులు. సంఘ సమావేశాలలో సీనియర్లకే ప్రాధాన్యత, ప్రాముఖ్యత. జూనియర్లు అతి తక్కువగా మాటాడుతారు. వివిధ బృందాలలో ఏవైనా తగాదాలు వస్తే ‘‘నాయక్‍’’లు పరిష్కరిస్తారు. ఒక నాయక్‍ క్రింద అనేక మంది గురుభాయిలు ఉంటారు. వారు తెచ్చిందాట్లో సగం నాయక్‍కు ఇస్తారు. అందులో నుండి కొంత పొదుపు చేసి మిగతాది వచ్చిపోయే అతిధులు, చుట్టాల కోసం, ఇల్లు రిపేర్ల కోసం, అంత్యక్రియల కోసం ఖర్చు చేస్తారు. అవసరం అనుకుంటే అప్పులు చేసి మళ్లీ తీరుస్తారు. అనారోగ్యం, వైద్యం ఖర్చులు కూడా సంఘమే భరిస్తుంది. హిందూ, ముస్లిం పద్దతుల ప్రకారం అంత్యక్రియలు జరుగుతాయి.


గురుభాయి ఉన్నంత కాలం శిష్యులందరూ పునిస్త్రీలలాగే పసుపు కుంకుమలు, అత్తరు, గాజులు, పువ్వులు, రంగుల చీరలు ధరిస్తారు. గురుబాయి చనిపోగానే వైధవ్యం పొందిన స్త్రీలలాగానే తెల్లచీరెలో ఉంటారు. అయితే బయటికి వెళ్లినపుడు తెల్లచీరలో  ఉంటే డబ్బులు ఇవ్వరు కావున రంగుల చీరలు కట్టుకుని ఇంటికి రాగానే మళ్లీ తెల్లచీరలు ధరిస్తారు. ఇక్కడ కూడా ‘‘కూటి కోసం కోటి విద్యలు’’. నైజాంల కాలంలోనూ, ఆ తర్వాత పిల్లలు పుట్టినపుడు ఇండ్లకు వెళ్లి ఆడి, పాడి అందర్ని దీవించి బహుమానాలు పుచ్చుకోవటమే వీరి ప్రధాన వృత్తి. పండుగలపుడు ప్రత్యేకంగా దీపావళి రోజులలో ఇండ్లల్లకు, దుకాణాలకు వెళ్లి దీవెనార్తులు ఇచ్చి బక్షీసులు అందుకుంటారు. వీరి దీవెనార్తులకు ప్రభావం ఉంటుందని జనులు ఇప్పటికీ నమ్ముతారు. వీరి ప్రధాన వాయిద్యం ‘‘డోలక్‍’’.


నయాపూల్‍ దగ్గరుండే ‘‘జజ్గీఖానా’’ (విక్టోరియా మెటర్నిటీ హాస్పిటల్‍) ఒకప్పుడు వీరికి బాగా సహకరించేది. అప్పుడే పుట్టిన నూతన శిశువుల వివరాలు, అడ్రసులు వీరికి అందించేవారు. లేదా వీరే స్వయానా జనన వివరాలు నమోదు చేసే రిజస్టరును చూసి ఇంటి అడ్రసులను రాసుకుని ఇండ్లల్లకు వెళ్లేవారు. కొన్ని సందర్భాలలో బస్తీలకు, వాడకట్టులకు వెళ్తే అక్కడి ప్రజలు వివరాలు అందించేవారు. అపుడు నూతన శిశువులు జన్మించిన ఇండ్లల్లకు వెళ్లి డోలక్‍ వాయించుకుంటూ, రెండు అరచేతులతో చప్పట్లు చరుస్తూ పాటలు పాడి, నృత్యాలు చేసి శిశువునూ, తల్లితండ్రులను, ఇతరులను మనసారా దీవించేవారు. ప్రజలు వారిని ఆనందంగా ఆహ్వానించే వారు.


మార్వాడీలు, ధనికులు ప్రత్యేకంగా ఆదివారం రమ్మని ఆహ్వానించేవారు. మగ శిశువుల జన్మిస్తే ఐదు రూపాయలు, ఆడశిశువైతే అందులో సగం (1948కి పూర్వం రోజులు) రూపాయలే గాక ఒక పళ్లెంలో ఐదు సేర్ల బియ్యం, సవాసేరు కందిపప్పు, కుడుకలు, ఆకువక్కలు, మిఠాయిలు, ఎర్రకుంకుమ, పాత పట్టు చీరెలు ఇచ్చేవారు. ఎవరైనా పొరపాటున వారిని నిరాశ పరిచి ఉత్త చేతులతో వాపస్‍ పంపితే ఇరుగుపొరుగు వారు ‘‘ఇదేం అన్యాయం. హిజ్రాలకు డబ్బు లివ్వనంత దరిధ్రంలో ఉన్నారా?’’ అని దెప్పిపొడిచేవారు. బాధపడే వారు. మనుషులకు మనసున్న కాలం అది.
ఏడవ నిజాం మీర్‍ ఉస్మాన్‍ అలీ ఖాన్‍ ‘‘30 సం।।ల లోపు ఉన్నవారెవరినీ హిజ్రాల సంఘంలో చేర్చుకోరాదని’’ ఫర్మానా జారీ చేశాడు. ఈ చట్టం సంస్కరణవాద దృష్టితోనే చేసినా దాని వెనక కక్షపూరితమైన కథ ఒకటుంది. ఒకసారి ఆరవ నిజాంకు, ఏడవ నిజాంకు ఒకేసారి పుత్ర సంతానం కలిగింది. అప్పుడు ఆరవ నిజాం ‘‘నవాబు’’ కావున నగరంలోని హిజ్రాలందరూ ‘‘పురానీ హవేలీ’’ (ఆరవ నిజాం నివాసం)కి వెళ్లి ఎనిమిది రోజులు అక్కడే అంగరంగ వైభోగంగా గడిపారు. ఏడవ నిజాం వంక ఎవరూ కన్నెత్తి చూడలేదు. ఆ కక్షను మనసులో పెట్టుకున్న ఏడవ నిజాం తను అధికారంలోకి రాగానే ఇక ఏ సంతానం కల్గినా వారిని ఆహ్వానించ లేదు సరికదా వారికి నష్టం కల్గించే ఆ ఫర్మానాను జారీ చేశాడు. వారి దీవెనలకు దూరమయ్యే రాజ్యాన్ని కోల్పోయాడని 1948 పోలీస్‍ యాక్షన్‍ తర్వాత ప్రజలు అనుకున్నారు.


రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. సంపద పెరిగి మనిషి మరుగుజ్జుగా మారాడు. బస్తీలు లేవు. వాడలు లేవు. అన్నీ అపార్ట్మెంట్లే. అన్నీ గేటెడ్‍ కమ్యూనిటీలే. దాన ధర్మాల సంస్కృతి నశించింది. సాక్షాత్తూ ఆదిభిక్షువే ఇంటి ముందటికి వచ్చినా భిక్షం వేసే అలవాటు లేదు. ఇక గరీబులకు బక్షీసులు లేవుగాక లేవు. ఇదీ మనం సాధించిన నాగరికత. ఇక హిజ్రాలను ఎవరు పట్టించుకుంటారు?
‘‘మావాళ్ల మధ్య అనగా మా కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య మేం ఇమడలేకనే మేం ఇంటి నుండి పారిపోతాం లేదా వారే మేం పారిపోయేటట్లు పరిస్థితులు కల్పిస్తారు. మా వాళ్లెప్పుడైనా రోడ్డు మీద కనబడితే మమ్మల్ని చూడనట్టుగానే తప్పించుకుని పక్కకు వెళ్లుతారు. ఒకవేళ మేం ఒకళ్లనొకళ్లం చూసుకున్నా మా హృదయాల్లో ఏ బడభాగ్నులున్నాయో వారికి తెలుసా?


సభ్య సమాజం మమ్మల్ని తృణీకరించి, హేళన, అవమానం చేయటం వల్లనే మేం కూడా ప్రతీకారంగా వారిని భయపెట్టటం, అవమానించటం చేసి డబ్బులు సంపాదించే ధోరణి అలవాటు చేసుకున్నాం. ఈ ఆధునిక సమాజంల మాకు స్థానం లేకుండా పోయింది. ఈ లోకం అన్నింటినీ పట్టించుకుంటుంది. జాలి, దయ చూపిస్తుంది ఒక మామీద తప్ప. మాది కూడా ఒక రకమైన వికలాంగత్వమే అని ఈ లోకానికి ఎపుడు జ్ఞానోదయం కలుగుతుందో? మాకు కూడా విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఎందుకు కల్పించరు? బ్రతికే జీవనాధారమే ఉంటే ఇట్లా బిచ్చమెందుకు ఎత్తుకుంటాం?
ఇదీ వారి అంతరంగ కల్లోలం. ఎవరికీ జన్మ ఇవ్వలేని ఆ అభాగ్యులు అందరి ఇళ్లల్లో సంతానం కలగాలని అందరూ సంపదలతో తులతూగాలని అందర్నీ మనసారా దీవిస్తారు. తమకు అన్యాయం చేసిన దేవుడిని ఇతరుల సంతోషం కోసం ప్రార్థిస్తారు. రోడ్డు మీదనో, రైళ్లలోనో, బస్సులలోనో వారెపుడైనా తారసపడితే కొంచెం దయ, కనికరంతో ఒకటి రెండు మంచి మాటలు మాట్లాడండి. ఎంతోకొంత సహాయం చేయండి.
‘‘గరీబోంకీ సునో
ఓ తుమ్హారీ సునేగా
తుమ్‍ ఏక్‍ పైసా దోగే
వో దస్‍ లాఖ్‍ దేగా’’


(షహర్‍ నామా (హైద్రాబాద్‍ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్‍,
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *