పిల్లలు పుట్టలేదని చెట్లను పెంచుకుంది

ఆమె నాటిన మొక్కల విలువ రూ।। కోటిన్నర పైనే


107 సంవత్సరాల వయసున్న సాలుమరద తిమ్మక్క. మనకెవరికీ అంతగా తెలియకపోయినా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులకు మాత్రం సుపరిచితురాలు. గొప్ప పర్యావరణవేత్త. సాలుమరద అంటే చెట్ల వరస అని అర్థం. తిమ్మక్కను మదర్‍ ఆఫ్‍ ట్రీస్‍గా పిలుస్తారు. ఎవరీ తిమ్మక్క? కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రూరల్‍ జిల్లా హులికల్‍ గ్రామానికి చెందిన సాధారణ మహిళ. పుట్టింది, పెరిగింది గుబ్బి పరిధిలోని తుముకూరులో. పేదరికం కారణంగా చదువుకోలేదు. తల్లిదండ్రులు దినసరి కూలీలు. పదేళ్ల వయసు వచ్చేసరికి తిమ్మక్క గొర్రెలను, మేకలను కాసే బాధ్యత చేపట్టింది.


చెట్లంటే ప్రాణం…
ఆమెకు చెట్లంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి తుముకూరులో చెట్లతో మంచి అనుబంధం ఏర్పరుచుకుంది. రోజూ అడవి నుంచి ఏదో ఒక చెట్టు పట్టుకొచ్చి ఇంట్లో నాటేదట. అలా ప్రకృతి నేస్తంగా మారిన ఆవిడ తనలా ఎందరినో ప్రకృతి గురించి ఆలోచింపజేసింది. అందుకే ప్లాంట్‍ ఎ ట్రీ.. అడాప్ట్ ఎ ట్రీ.. సేవ్‍ ఎ ట్రీ.. గెట్‍ ఎ ట్రీ అనే క్యాంపెయిన్‍ నడిపిస్తున్నారు.


చెట్లే పిల్లలుగా…
తిమ్మక్కకు బికాలు చిక్కయ్యతో పెళ్లయింది. అతడు ఏదో ఒక పని చేస్తున్నప్పటికీ పేదరికం మాత్రం పోలేదు. పెళ్లయి సంవత్సరాలు గడుస్తున్నా వాళ్లకు పిల్లలు పుట్టలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. చిన్నప్పట్నుంచి చెట్లంటే ప్రాణంగా భావించే తిమ్మక్క చెట్లనే పిల్లలుగా పెంచుకోవాలనుకుంది. ఊళ్లో చెట్లను నాటుతూ కన్న బిడ్డల్లా.. కంటికి రెప్పలా చూసుకున్నారు. హులికుల్‍ నుంచి కుడుర్‍ వరకు ఉన్న జాతీయ రహదారికి ఇరువైపులా సుమారు నాలుగు కిలోమీటర్ల మేర 385 మర్రి చెట్లు పెంచింది తిమ్మక్క. మర్రిచెట్టులే కాకుండా దాదాపు 8000 ఇతర రకాల చెట్లు పెంచి పోషించింది. ప్రతిరోజూ పొద్దున్న చెట్లకు నీళ్లు పోయడం.. పాదులు తీయడం.. అక్కడే ఉండి వాటిని పరిరక్షించడం వారి దినచర్యలో భాగమైంది.


కోట్ల విలువ…
ఆమె నాటిన మొక్కల విలువ రూ. 1,75,00,000 అని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. తిమ్మక్క సేవలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం ఆమెను పర్యావరణవేత్తగా ప్రకటించింది. చదువు లేకపోయినా.. డబ్బు లేకపోయినా వాళ్లకు తెలియకుండా సమాజానికి చేస్తున్న అమూల్య సేవలకు అనేకసార్లు అవార్డుల రూపంలో సన్మానించారు.


ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు…

ఆవిడ చేస్తున్నది గొప్ప కార్యంగా.. భవిష్యత్‍ తరాలకు ఆస్తిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ వేత్తలు ప్రశంసించారు. అమెరికాలోని లాస్‍ ఏంజిల్స్, ఆక్లాండ్‍, కాలిఫోర్నియాలోని పర్యావరణ సంస్థలకు ఆమె పేరు మీద తిమ్మక్కాస్‍ రీసోర్సెస్‍ ఫర్‍ ఎన్విరాన్‍మెంటల్‍ ఎడ్యుకేషన్‍ అని పేరు పెట్టారు. సీబీఎస్‍ఈ పాఠ్య పుస్తకాల్లో ఆమె గురించి పాఠాన్ని పొందుపర్చారు.


పద్మశ్రీ పురస్కారం…
పర్యావరణ సంరక్షణ కోసం కృషి చేస్తున్న తిమ్మక్క కోట్లాది రూపాయల సంపదనైతే సమాజానికి ఇచ్చింది కానీ.. ఆమె మాత్రం ప్రభుత్వం ఇచ్చే రూ.500 పింఛన్‍తోనే పూట గడుపుతోంది. పర్యావరణ కోసం.. సమాజం కోసం ఆమె చేస్తున్న సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మ అవార్డుల్లో భాగంగా తిమ్మక్కకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 1995లో భారతీయ పౌర సత్కారం.. 1997లో ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర పురస్కారం కూడా పొందింది.


ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా”National Citizen’s Award”ను గెలుపొందింది. అదే విధంగా అమెరికాలోని ఒక పర్యావరణ సంస్థ”Thimmakka’s Resources for Environmental Education”అనే విభాగాన్ని ఈమె పేరు మీద ఏర్పరిచి గుర్తింపును ఇచ్చింది.


ప్రస్తుతం ఆమెకు వయసు మీద పడటంతో, ఆ చెట్ల యొక్క సంరక్షణ బాధ్యతలను కర్నాటక ప్రభుత్వం స్వీకరించింది. ఆమెకు వచ్చిన అవార్డులు అనేకం, రాష్ట్ర ముఖ్య మంత్రి ఇచ్చిన పది లక్షల నగదు బహుమతిని తిరస్కరించారు. ప్రస్తుతం నెలకు ఐదు వందలు పింఛను అందుతుంది. ప్రకృతి మాతకు ఆమె చేసిన సేవకు గుర్తింపుగా ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించింది.!

  • సేకరణ : డెస్క్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *