ఎంతో కళాత్మక నైపుణ్యం… అపూర్వ మేధా శక్తి కలగలసిన చేనేత రంగం శతాబ్దాలుగా ఎందరికో ఉపాధినిస్తోంది. ప్రాచీన భారత దేశ సంస్క•తికి ప్రతిబింబమైన చేనేత రంగం… మారుతున్న కాలానికి అనుగుణంగా విభిన్న రకాల డిజైన్లతో రాణిస్తోంది. వ్యవసాయం తర్వాత గ్రామీణ రంగంలో ఎక్కువగా ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగమే. తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 3.5 లక్షల చేనేత మగ్గాలున్నాయి. వీటిపై 5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. పరోక్షంగా మరో 20 లక్షల కుటుంబాలకు ఈ రంగమే జీవనాధారం.
చేనేత కార్మికులు తమ నైపుణ్యంతో భారతీయ వస్త్రాలకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టారు. పోచంపల్లి, గద్వాల, సిద్ధిపేట, ధర్మవరం పేర్లు వింటేనే నాజూకు వస్త్రాలు గుర్తుకువస్తాయి. ఐతే ఈ చేనేత కార్మికులు ఇక్కడే ఆగిపోలేదు. మరమగ్గాలు వచ్చినప్పుడు వ్యాపార కౌశలం ప్రదర్శించి దూసుకు వెళ్లారు. అలాంటిది అటు చేనేత కార్మికులు, ఇటు మరమగ్గాల కుటుంబాలు ఇప్పుడు సంక్షోభంలో కూరుకు పోవడానికి గత ప్రభుత్వవిధానాలే కారణం కావడం దురదృష్టకరం. యాంత్రికీకరణను ప్రోత్సహించడం ద్వారా చేనేత రంగాన్ని దెబ్బ తీశాయి.
మన్నికైన వస్త్రాలతో ఒకప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత చేనేత వృత్తిది. భారీపరిశ్రమలకు పెద్దపీట వేస్తున్న ఈ ప్రభుత్వాల వద్ద మన దేశంలో 2వేల ఏళ్లుగా మన ఆర్థిక వ్యవస్థలో మన సామాజిక సాంస్కృతిక జీవనంలో భాగమైన చేనేత రంగాన్ని కాపాడు కోవడానికి కంటితుడుపు చర్యలు మినహాయించి శాశ్వత ప్రణాళికలేలేవు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చేనేత కార్మికుల యోగ క్షేమాలపై ప్రత్యేక ద•ష్టిపెట్టారు. తెలంగాణ చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రపంచ దేశాలు మెచ్చాయి, సిద్దిపేట చేనేత కార్మికులు నేసిన గొల్లభామ చీరలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. చాలీచాలని ఆదాయంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయడంలో కేటీఆర్ సహకారం మరువలేనిది. కార్మికులకు నూలు, రసాయనాల కొనుగోలుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ ఇస్తోంది. కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రతి పట్టణంలో చేనేత వస్త్రాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న గొల్లభామ చీరల తయారీని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
సిద్దిపేట సింగారాల ‘గొల్లభామ’ చీర
తల మీద చల్లకుండ పెట్టుకుని, కుడి చేతిలో గురిగి పట్టుకుని కాళ్ల గజ్జెలు ఘల్ ఘల్ లాడిస్తూ, మెండైన కొప్పులో తురిమిన పూలు అల్లల్లాడుతుండగా పల్లెపట్టుల్లో అలనాడు కలియదిరిగిన గొల్లభామల గురించి మనందరికీ తెలుసు. ఆ వనితల సింగారం దారాల్లో ఇమిడి పోతే.. ఆ మహిళామణుల ముగ్ధత్వం చీరలో మెరిసిపోతే అదే ‘గొల్లభామ’ చీర. తెలుగు నేతన్నల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచే ఈ గొల్లభామ చీరల తయారీలో సిద్దిపేటకు ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది.
ఒక్కో పోగు జత చేసి, కళాత్మకతను రంగరించి రూపొందించే గొల్లభామ చీరలంటే మక్కువ చూపని మగువలు ఉండరు. సిద్దిపేట, దుబ్బాకల్లో 1960వ దశకంలో చేనేత కార్మికులు గొల్లభామ చీరను ఆవిష్కరించారు. అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో గొల్ల వనితలు ఇల్లిల్లూ తిరుగుతూ పాలు, పెరుగు విక్రయించేవారు. వారిని గమనించిన నేతన్నలు చీరల మీద ఆ తరహా చిత్రాన్ని ఆవిష్కరించారు. అదే గొల్లభామ చీరగా ప్రాశస్త్యం పొందింది.
గొల్లభామ చీరల పేరు చెబితే సిద్దిపేట చేనేతన్నలే ముందుగా గుర్తొస్తారు. గతంలో సిద్దిపేట జిల్లాలో వేలాది మంది చేనేత కార్మికులుండేవారు. మారుతున్న పరిస్థితులు, యాంత్రికీకరణ వల్ల వీరి సంఖ్య చాలా వరకు తగ్గింది. చేనేత పరిశ్రమ కూడా పాలకుల నిరాదరణకు గురయ్యింది. దాంతో గొల్లభామ చీరల తయారీ ఒడుదొడుకులు ఎదుర్కొంది. వీటి నేతకు ఎక్కువ సమయం అవసరమవడం, తక్కువ ఆదాయం వస్తుండటంతో చేనేత కార్మికులు వీటి నేతను వదిలిపెట్టి మామూలు వస్త్రాల్లోకి వచ్చారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జాకార్డ్ మగ్గాలు అందుబాటులోకి రావడంతో ఈ చీరలకు మళ్లీ గత వైభవం వచ్చింది. అంతకుముందు వీటి నేతకు ఫ్రేమ్ (గుంత) మగ్గాలను వినియోగించేవారు. దీని మీద అయిదున్నర మీటర్ల చీర తయారీకి వారం రోజుల సమయం పట్టేది. ఇప్పుడు జాకార్డ్ మగ్గం మీద రెండు మూడు రోజుల్లోనే చీర నేస్తున్నారు.
పేటెంటు
గొల్లభామ చీరకు 2012లో భౌగోళిక గుర్తింపు దక్కింది. ఆ తర్వాత మెల్లగా నేతన్నలు మళ్లీ వీటి నేత వైపు మళ్లారు. ఈ క్రమంలో ఆసక్తి, అనుభవం కలిగిన కార్మికులకు ప్రభుత్వం జాకార్డ్ మగ్గంపై గొల్లభామ చీరల తయారీ శిక్షణ ఇచ్చింది. ఈ చీర నేత మీద సిద్దిపేట పేటెంటు హక్కులూ పొందింది.
ఇరవై రంగుల్లో
గొల్లభామ చీరల తయారీలో మొదట నూలును కొనుగోలు చేసి దానికి అవసరమైన రంగులు అద్దుతారు. తర్వాత ఆ నూలుని ఉండలు చుడతారు. అనంతరం పడుగు, పేకలుగా జాకార్డ్ మగ్గం మీదకి ఎక్కిస్తారు. గొల్లభామ డిజైన్ కోసం ప్రత్యేక గ్రాఫ్‍లు వాడతారు. వీటిని ప్రకాశం జిల్లా చీరాల నుంచి తెచ్చుకుంటారు. కాలితో యంత్రాన్ని తొక్కుతూ చీరలు, దుప్పట్టాలు నేస్తారు. పెద్ద గొల్లభామ బొమ్మకు దాదాపు 400 దారపు పోగులు అవసరమైతే, చిన్న బొమ్మకు 30 నుంచి 40 పోగులు అవసరం పడతాయి. ప్రస్తుతం నీలం, గోధుమ, పసుపు తదితర ఇరవై రంగుల్లో గొల్లభామ చీరలను రూపొందిస్తున్నారు. గొల్లభామ చీరలు నేయడంలో తమ కళాత్మకతను ప్రదర్శించిన చాలా మంది నేతన్నలు రాష్ట్ర చేనేత జౌళి శాఖ అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
కళాత్మకత ఉట్టిపడే గొల్లభామ చీరలు ఎందరో ప్రముఖుల్ని ఆకట్టుకున్నాయి. దివంగత మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్‍సింగ్‍కు ఈ చీరల గురించి తెలిసి తమ కుటుంబంలోని మహిళల కోసం సిద్దిపేట నుంచి తెప్పించుకున్నారు. శంకర్ దయాళ్ శర్మ ఆంధప్రదేశ్ గవర్నర్‍గా ఉన్నప్పుడు కుటుంబం కోసం వీటిని కొనుగోలు చేశారని ఇక్కడి చేనేత కార్మికులు గొప్పగా చెప్పుకుంటుంటారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ ఉమ్మడి మెదక్ జిల్లా పాలనాధికారిగా
ఉన్నప్పుడు గొల్లభామ చీరలనే ధరించేవారు. తెలంగాణకు చెందిన ఎన్నారై మహిళలూ ఇష్టంగా వీటిని కొనుగోలు చేస్తుంటారు. సినీ కథానాయిక సమంత ఈ చీరల మీద మక్కువపడి పలుసార్లు సిద్దిపేటకు వచ్చారు.
కళా నైపుణ్యంలో మేటిగా నిలిచే ఈ చీరల తయారీని నేర్చుకోవ డానికి ఆధునిక తరం ముందుకు రాకపోవడం బాధాకరం. ఇక్కడి ఆదర్శ చేనేత సహకార సంఘంలో అందరూ యాభై ఏళ్లు పైబడిన వారేనని, యువతరం ఈ కళను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా లేదని సంఘం వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చీరలకు ఆదరణ బాగా ఉన్నా నేతగాళ్ల కొరత ఎక్కువగా ఉంది. ఈ సమస్య పరిష్కారమైతే.. మన నేతన్న కళాత•ష్ణకు అద్దంపట్టే గొల్లభామ చీరలు మరింతగా వన్నెచిన్నెలద్దుకుంటాయి.
ఉత్థాన పతనాల సిరిసిల్ల
నేత రంగం ఉత్థాన పతనాలకు సిరిసిల్ల ప్రత్యక్ష నిదర్శనం. 1920వ దశకంలోనే మహారాష్ట్ర వెళ్లి నైపుణ్యం సాధించిన సిరిసిల్ల చేనేత కార్మికులు 1970 దశకం నాటికి సొంత మరమగ్గాలు నడిపించడం ప్రారంభించారు. 1990 దశకం నాటికి దాదాపు 12వేల మరమగ్గాలతో సిరిసిల్ల కళకళలాడింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాలతో ఈ రంగంపై మొదటి దెబ్బ పడింది. ప్రభుత్వం నూలు ఎగుమతికి అనుమతి ఇవ్వడంతో ధర పెరిగిపోయింది. కేంద్రం 9.25 శాతం ఎక్సైజ్ సుంకం విధించడం ద్వారా ఈ కుటీరపరిశ్రమ పూర్తిగా దెబ్బ తిన్నది. మరోవైపు పెద్ద పరిశ్రమలకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడమే కాక పాతయంత్రాలు దిగుమతి చేసుకోవడానికి కస్టంస్ సుంకం తగ్గించింది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం పేరుతో 50శాతం సబ్సిడీ ఇచ్చింది. దీంతో ఈ పెద్ద కంపెనీలలో నూలు వడకడం, నేయడం, రంగులు అద్దడం వంటి పనులు చౌకగా జరుగుతున్నాయి.
పవర్ లూమ్:
రాష్ట్రంలో పవర్‍లూమ్‍లు సిరిసిల్లలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. రేపియర్ మగ్గాల స్థాయికి పవర్‍లూమ్‍లను ఆధునీకరించాలి. ఇప్పుడున్న మరమగ్గాలతో రోజుకు 40 మీటర్ల బట్ట ఉత్పత్తి అయితే, రేపియల్ మగ్గాల ద్వారా 150 మీటర్లకుపైగా తయారవుతుంది. దీంతో యజమానులకు లాభాలొస్తాయి. ఈ ఫలితం కార్మికులకు దక్కాలి. కార్మికులకు ప్రతి నెలా రూ. 15 వేలకు తగ్గకుండా వేతనం అందాలి. రూ.15 వేల నుంచి రూ. 20 వేల ఆదాయం తప్పక రావాలి.
సవాళ్ళు:
చేనేత ఎదుర్కొంటున్న సవాళ్ళు ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటిది ప్రజల మనస్సుల్లో చేనేతపట్ల ఆదరణ పెరగడం. ఎంత ధర అయినా పట్టు బట్టలు, గార్మెంట్స్, రెడీమేడ్, సూటింగ్స్ కొంటున్నట్లుగా చేనేతను ప్రతిష్టాత్మకంగా కొనే స్థితి పెరగాలి. స్వయం పోషకంగా ఎదగడానికి ప్రభుత్వం నుండి అనేక సదుపాయాలు శాశ్వత ప్రాతిపదికగా అందించడం అవసరం. చేనేత కోసం కొన్ని రకాలను ప్రత్యేకంగా కేటాయించడం, దాన్ని పవర్‍లూమ్‍లు, బట్టలమిల్లులు ఉత్పత్తి చేయకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవడం మరొక కార్యక్రమం.
చాలాకాలం నుండి బట్టలపై ప్రభుత్వం రిబేటు ఇవ్వడం ద్వారా సహకరించే కార్యక్రమం కొనసాగుతూ వచ్చింది. దీని ద్వారా దొంగ లెక్కలు రాసి, ఉత్పత్తి, మార్కెట్, అమ్మకాలు లేకుండానే కాగితాలపై వాటన్నిటిని స•ష్టించి భోంచేసే యంత్రాంగం పెరుగుతూ వచ్చింది. పైగా సహకార రంగంలో ఉన్న మగ్గాలు నాలుగింట ఒకటవ వంతు మాత్రమే. మిగతా మూడు వంతుల నేత కార్మికులకు ఆ సౌకర్యం కూడా అందేది కాదు. అందువల్ల ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, ప్రావిడెంట్ ఫండ్, జియో ట్యాగింగ్ వంటి వాటిని అనుసంధానించి పక్కాగా ప్రత్యక్షంగా చేనేత వ•త్తివారికి లాభం కలిగించడం అవసరం.
నేతన్నలకు రుణమాఫీ : మంత్రి కేటీఆర్
నేతన్నలకు రుణమాఫీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. లక్ష లోపు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ వర్తించనుంది. రూ. లక్ష లోపు రుణంపై అసలు, వడ్డీ కలిపి ప్రభుత్వమే చెల్లిస్తుంది. 2014 జనవరి నుంచి 2017 మార్చి 31 మధ్యకాలంలో లక్షలోపు రుణాలు తీసుకున్న నేతన్నలకు ఈ మాఫీ వర్తించింది. నేతన్నల రుణమాఫీ నిర్ణయంతో 4,400 మంది లబ్ధి పొందారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై రూ.20 కోట్ల మేరకు అదనపు భారం పడిందని అధికారులు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంతో నేతన్నలు సంతోషం వ్యక్తం చేశారు.
‘రాష్ట్రంలో ఒక్క నేతన్న కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడనే మాట విన్పించొద్దనేదే మా విధానం’ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నేతన్న బాగుంటే, ఆత్మగౌరవంతో, సంతృప్తిగా ఉంటే రాష్ట్రానికి, ప్రజలకు అన్ని రకాలుగా మేలు కలుగుతుందని పేర్కొన్నారు. చేనేత కళాకారుల సంక్షేమానికి మరెన్నో కార్యక్రమాలపై సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు. మల్టీప్లెక్స్, మాల్స్లో చేనేత ఉత్పత్తుల ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నామని, టెస్కో వెబ్‍సైట్ ద్వారా ఆన్‍లైన్‍లో విక్రయాలు జరుపుతామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కేటాయించని విధంగా చేనేత, జౌళి శాఖకు రూ.1,200 కోట్లు కేటాయించామని, అందులో రూ.400 కోట్లను చేనేత రంగానికే వెచ్చిస్తున్నట్లు వివరించారు. ప్రతి పైసా చేనేత కళాకారులకే అందేలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మగ్గాలకు జియో ట్యాగింగ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 17,573 మగ్గాలు, వాటికి అనుబంధంగా 22,875 మంది కలిపి మొత్తం 40 వేల చేనేత కళాకారులు ఉన్నారని తెలిపారు.
కేసీఆర్ ఆదేశాల మేరకు నేతన్నల వేతనం పెంచాలనే ఉద్దేశంతో చేనేత మిత్ర పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టి 50% సబ్సిడీపై నూలు, రసాయనాలు, అద్దకాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ పథకంలో 18,683 మంది చేనేతకారులు నమోదు చేసుకున్నారని, ఇప్పటికే రూ.20 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. చేనేతకారుల సామాజిక భద్రత కోసం నేతన్నలకు చేయూత పేరుతో పొదుపు పథకాన్ని ప్రారంభించామని, ఇందులో 19,125 మంది చేనేత కార్మికులు చేరారని, ప్రభుత్వం రూ.60 కోట్లు కేటాయించిందన్నారు. కళాకారుల కుటుంబానికి ప్రతీ నెలా రూ.6 వేల నుంచి రూ.8 వేల ఆదాయం వచ్చేలా ఈ 2 పథకాలు అమలు చేస్తున్నామన్నారు. 12 వేల మంది నేతన్నలకు సంబంధించిన రూ.40 కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. రుణాలు కట్టిన వారికి తిరిగి చెల్లిస్తామన్నారు.
రూ.10.2 కోట్లతో 2,600 మంది కళాకారుల కోసం ఇప్పటికే రాష్ట్రంలో 8 చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేశామని, కొత్తగా 18 క్లస్టర్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. రూ.15 కోట్లతో పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు పునరుద్ధరణ, రూ.14 కోట్లతో గద్వాలలో చేనేత పార్కు ఏర్పాటు చేయనున్నామన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో 30 మంది కళాకారులకు చేనేత పురస్కారాలు ప్రదానం చేశారు.
చేనేత కార్మికులకు చేయూత
తెలంగాణలో చేనేత, జౌళి శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించిన సంఘాలు, లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.73.50 కోట్లు విడుదల చేసింది. పథకాల అమలు, కార్యక్రమాల పురోగతిపై నిర్వహించిన సమీక్షలో మంత్రి కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చేనేత సహకార సంఘాలకు రాయితీతో నూలు, రంగుల పథకానికి నిధుల విడుదల, పావలా వడ్డీ, మార్కెటింగ్ ప్రోత్సాహక పథకం కింద నిధుల విడుదల, టెస్కో పరిహారం చెల్లింపు, చేనేత మిత్ర కార్మికులకు రాయితీ, క్యాష్ క్రెడిట్ రుణాల చెల్లింపు, థ్రిఫ్ట్ ఫండ్ పథకం పునఃప్రారంభం వంటి అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు.
ఆయా పథకాల అమలుకు సంబంధించి రూ.73.50 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. థ్రిఫ్ట్ పండ్ పథకం ద్వారా నేతన్నకు చేయూత కింద 54వేల మంది చేనేత కార్మికులకు రూ. 30 కోట్లు, చేనేతమిత్ర కింద 20వేల మంది కార్మికులకు రూ. 14.49 కోట్లు, టెస్కో నిధులు 73 సంఘాలకు రూ.14 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. మార్కెటింగ్ ప్రోత్సాహక పథకం కింద 48 సంఘాలకు రూ. 7 కోట్లు, నూలు, రంగుల రాయితీ కింద రూ.3 కోట్లు విడుదల చేశామన్నారు. విడుదల చేసిన నిధులను ఆయా సంఘాలు, కార్మికులకు తక్షణమే అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పథకాల అమలుతో చేనేత కార్మికుల తలసరి ఆదాయాలు వృద్ధి చెందడమే కాకుండా సహకార సంఘాలు పరిపుష్టమై కార్మికులకు ఏడాదంతా పని లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా చేనేత కార్మికుల నెలసరి ఆదాయం కనీసం రూ.15వేలకు మించి పొందేందుకు ఆస్కారం ఏర్పడిందన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అందులో భాగంగానే చేనేత రంగాన్ని సంస్థాగతంగా, నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్లేందుకు వివిధ పథకాలను అమలు చేస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.
చేనేత కార్మికుల కోసం ఏ రాష్ట్రంలో లేనివిధంగా టీఆర్‍ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వారు ఉపాధి కోల్పోకుండా బతుకమ్మ చీరలు కూడా చేనేత సంఘాలకు అప్పగించి ఆదుకుంటుంది. చేనేత కార్మికులకు వృత్తిలో నైపుణ్యాన్ని పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‍మెంట్ శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోని ఏ రాష్ట్రం కూడా అందించని పథకాలతో చేనేతకు మరింత చేయూత నందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
-సువేగా, ఎ : 9030 6262 88