పిట్టకొంచెం-కూత ఘనం @ డ్రోన్‍ టెక్నాలజీ


(గత సంచిక తరువాయి)


డ్రోన్లు ఎలా పనిచేస్తాయి
సాధారణంగా ఒకటి లేదా రెండు రెక్కలు కలిగిన హెలికాప్టర్స్ మరియు విమానాలు సుదూరంగా గాలిలో ఎగరడం మనం చూసే ఉంటాం. కానీ నాలుగు రోటర్లు కలిగిన డ్రోన్లు మనకు అత్యంత సమీపంలో, కంటికి కనిపించేంత ఎత్తులో ఎగరడం చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగానూ, గమ్మత్తుగానూ అనిపిస్తుంది. అలాంటి డ్రోన్లు ఎలా పనిచేస్తాయన్న విషయాన్ని పరిశీలిస్తే – ప్రస్తుతం మనం నిజజీవితంలో ఉపయోగించే ప్రతీ యంత్రం పనితీరు వెనుక ఏదో ఒక భౌతిక శాస్త్ర నియమం ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. డ్రోన్‍లు కూడా న్యూటన్‍ మూడవ గమన నియమం (Newton’s third law) ఆధారంగా పనిచేస్తాయి. ఈ నియమం ప్రకారం (To Every Action, There is An equal and opposite Reaction) ప్రతీచర్యకు దానికి సమానమైన మరియు వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది. సాధారణంగా విమానాలు, హెలికాప్టర్స్ యొక్క రోటర్లు (లేదా) రెక్కలు తిరగాలంటే వాటిలో పిస్టన్‍ ఇంజన్‍ లేదా టర్బైన్‍ ఇంజన్‍ వంటి వాటిని ఉపయోగిస్తారు.

అయితే సాధారణంగా డ్రోన్‍ అనేది 250 గ్రా।। నుండి 25 కేజీల బరువు మాత్రమే ఉంటుంది. కాబట్టి డ్రోన్లకు అలాంటి ఇంజన్లు అవసరం లేదు. డ్రోన్ల తయారీకి కార్బన్‍, ఫైబర్‍, పాలిస్టర్‍, నైలాన్‍, పాలీస్టెరీన్‍, అల్యూమినియం లాంటి పదార్థాలు వాడతారు. కాబట్టే అవి అతి తక్కువ బరువును కలిగి ఉంటాయి. డ్రోన్లు ఎగరడంలో మోటార్స్ మరియు ప్రొపెల్లర్స్ కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా డ్రోన్లకు బ్రష్‍లెస్‍ డీసీ మోటార్స్ను ఉపయోగిస్తారు. ఇవి చాలా తక్కువ బరువు కలిగి ఉంటాయి. మొదట డ్రోన్‍లో ఉన్న మోటార్ల సహాయంతో ప్రొపెల్లర్స్ తిరగడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న గాలిని డ్రోన్‍ భూమివైపుగా నెడుతుంది. ఎంతవేగంతో అయితే గాలి భూమి వైపు నెట్టబడుతుందో న్యూటన్‍ 3వ గమన నియమాన్ని అనుసరించి, అంతేవేగంగా కిందికి నెట్టబడిన గాలి డ్రోన్‍ను పైకి లేపుతుంది. తద్వారా డ్రోన్‍ గాలిలోకి ఎగురుతుంది. హెలికాప్టర్‍లో మెయిన్‍ రోటర్‍తో పాటు, దాని తోక భాగంలో మరో చిన్న రోటర్‍ ఉంటుంది. ఈ చిన్న రోటర్‍, హెలికాప్టర్‍ అటు, ఇటు తిరగకుండా ఒక నిర్దిష్టమైన దిశలో ప్రయాణించేందుకు దోహదపడుతుంది. అదేవిధంగా డ్రోన్లు కూడా స్థిరంగా ప్రయాణించేందుకు దానిలోని 2వ మరియు 4వ మోటార్లు అపసవ్యదిశలో (Anti clock wise), 1వ, 3వ మోటార్లు సవ్యదిశలో (clock wise) తిరుగుతాయి. తద్వారా వ్యతిరేక బలాలు సమానంగా ఉండి డ్రోన్లు అదుపుతప్పకుండా స్థిరంగా ఎగురుతాయి. ఇక పోతే డ్రోన్లు ముందుకు, వెనుకకు, ప్రక్కకు కదలడానికి ప్రధానంగా డ్రోన్లలోని మోటార్‍ల యొక్క వేగాన్ని నియంత్రించే ESC అనే పరికరాన్ని గురించి తెలుసుకోవాలి. డ్రోన్లలోని ESC (Electronic Speed controller) అనేది ఎలక్ట్రానిక్‍ సర్క్యూట్‍ రూపంలో డ్రోన్లలోని ప్రతి మోటర్‍లో అమర్చబడి ఉంటుంది. దీని ద్వారా మోటర్‍ తిరిగే వేగాన్ని మనం పెంచవచ్చు. మరియు తగ్గించవచ్చు. దీనిలో 3 రకాల దిశలు (ణDirections) ఉంటాయి. అవి. 1. Roll 2. Pitch 3. Yaw

1. Roll : ఏదైనా ఒక డ్రోన్‍ అది ఉన్న ప్రాంతం నుండి కుడికి లేదా ఎడమకు జరగడాన్నిRoll అంటారు. మనం డ్రోన్‍ను ఎడమవైపుకు మళ్ళించాలంటే ESCసహాయంతో కుడిపక్క ఉన్న మోటార్స్ తిరిగే వేగాన్ని పెంచాలి. అలాగే ఎడమవైపు ఉన్న మోటార్‍ల వేగాన్ని ఇంకా తగ్గించాలి. అలా కాకుండా డ్రోన్‍ను కుడివైపుకు మళ్లించాలంటే ఈసారి ఎడమవైపు ఉన్న మోటార్స్ వేగాన్ని పెంచి, కుడిపక్క ఉన్న మోటార్‍ల వేగాన్ని తగ్గించాలి. తద్వారా డ్రోన్‍ను కుడికి లేదా ఎడమకు సులభంగా కదిలించవచ్చు.

2.Pitch : ఏదైనా ఒక డ్రోన్‍ను అది ఉన్న ప్రదేశం నుండి ముందుకు గానీ లేదా వెనుకకు గానీ నడపడాన్ని Pitch అంటారు. డ్రోన్‍ను ముందువైపుకు అనగా మనవైపుకు కదిలించాలంటే ముందు వైపు ఉన్న రెండు మోటార్ల వేగాన్ని తగ్గించి, వెనుక వైపు ఉన్న మోటార్ల వేగాన్ని పెంచాలి. అలా కాకుండా డ్రోన్‍ను వెనుకకు అనగా మనం ఉన్న ప్రదేశం నుండి దూరంగా నడపాలంటే వెనుక వైపు ఉన్న మోటార్‍ల వేగాన్ని తగ్గించి, ముందువైపు ఉన్న మోటార్ల వేగాన్ని పెంచితే డ్రోన్‍ వెనుకకు వెళుతుంది.

3.Yaw : ఏదైనా ఒక డ్రోన్‍ అది ఉన్న ప్రదేశంలో కుడికి లేదా ఎడమ వైపుకు గుండ్రంగా తిరగడాన్ని Yaw అంటారు. డ్రోన్‍ను సవ్యదిశ (Clockwise direction) లో తిప్పాలి అనుకుంటే Anti Clockwise direction (అపసవ్యదిశ)లో రెండు మోటార్ల యొక్క వేగాన్ని పెంచి Clockwise directionలో తిరిగే మోటార్ల వేగాన్ని తగ్గించాలి.

కేవలం కొన్ని నిర్దిష్టమైన మోటార్‍ల యొక్క వేగాన్ని పెంచడం, తగ్గించడం ద్వారా మనం డ్రోన్‍ను ఎటువైపు కావాలంటే అటువైపుకు కదిలించవచ్చు. డ్రోన్‍లలో Landing gear, Flight controller, The Reciever, The transmitter, GPS module, lithium battery, Camera లాంటి ఇంతర పరికరాలుంటాయి.


ఇండియాలో నత్తనడకన డ్రోన్ల అభివృద్ధి ప్రాజెక్టులు
చైనా, టర్కీలు ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణి డ్రోన్లను ఎగుమతి చేస్తున్నాయి. టర్కీకి చెందిన ‘‘బేకర్‍’’ కంపెనీ డ్రోన్లు సిరియా, లిబియా, ఆర్మేనియాలలో అరాచకం సృష్టించాయి. 2011కు ముందు అమెరికా, బ్రిటన్‍, ఇజ్రాయిల్‍ మాత్రమే సాయుధ డ్రోన్లను వినియోగించగా, చైనా తన సరళీకృత ఎగుమతుల విధానంతో 2015 నుండి పాకిస్తాన్‍, ఇరాక్‍, నైజీరియా, సౌదీ, యూఏఈ, ఈజిప్ట్, జోర్దాన్లకు సరఫరా చేస్తున్నట్టు న్యూ అమెరికా. ఓఆర్‍జీ పేర్కొంది. పాకిస్తాన్‍ వద్ద సొంతంగా అభివృద్ధి చేసిన నెస్‍కామ్‍ బుర్రాక్‍ డ్రోన్‍ ఉన్నా, అది చైనా నుండి వింగ్‍లూంగ్‍ శ్రేణి సాయుధ డ్రోన్లను కొనుగోలు చేస్తోంది.


1998లో ఇజ్రాయిల్‍కు చెందిన సెర్చెర్‍ మార్క్ 1 కొనుగోలుతో భారత డ్రోన్ల ప్రస్థానం మొదలైంది. దాదాపు 23 ఏళ్ళు గడుస్తున్నా మనదేశం సాయుధ డ్రోన్‍ను రూపొందించుకోలేదు. పాక్‍లో బుర్రాక్‍ సాయుధ డ్రోన్‍ 2009లో తొలి పరీక్ష జరుపుకొంటే 2013లో ఆదేశ వైమానిక దళంలో చేరింది. భారత్‍లో 2010లో మొదలుపెట్టిన రుస్తుం-2 (తాపస్‍) ప్రాజెక్ట్ మందకొండిగా సాగుతోంది. పాక్‍ కంటే వనరులు, నిధులు అధికంగా ఉన్నా ఈ ప్రాజెక్ట్ బాలారిష్టాలను దాటలేదు. దాడిచేసే సామర్థ్యం ఉన్న ఘాతక్‍ మానవరహిత విమానం పరీక్షలు గత జులై మొదటి వారంలో ప్రారంభం అయ్యాయి. ఇజ్రాయిల్‍ నుంచి 90 హెరాన్‍, హరాప్‍ డ్రోన్‍లను భారత సైన్యం కొనుగోలు చేసింది. హెరాన్‍లను నిఘా కోసం వాడుతున్నారు. హరాప్‍ ఆకాశంలో ఎగురుతూ గురి చూసి శత్రువపై విరుచుకుపడుతుంది. ఈ తరహా డ్రోన్లను ‘లాయిటర్‍ మ్యూనిషన్‍ (నింగిలో తారట్లాడే ఆయుధం)’ అంటారు. అమెరికా నుండి ప్రిడేటర్‍ డ్రోన్ల కొనుగోళ్ళపై ఏళ్ళ తరబడి మళ్ళగుళ్లాలు పడుతున్నారు. వాస్తవానికి దిగుమతి చేసుకొన్న డ్రోన్ల నిర్వహణలో అయ్యే ఖర్చులో పదోవంతుకూడా పరిశోధనలపై పెట్టడంలేదనే విమర్శలు ఉన్నాయి.


మిలటరీ దాడులకు డ్రోన్లే ఎందుకు?
ఆకాశ హార్మ్యాలను తలపించే భారీ లోహవిహంగాలు, శతఘ్నలు, యుద్ధట్యాంకులతో చేసే యుద్ధాలకు కాలం చెల్లిందని ఒక వేళ అవి శత్రువులకు దొరికితే వాటివల్ల భారీ స్థాయిలో వినాశనం తప్ప సాధించేది శూన్యమని, అదే డ్రోన్ల ద్వారా నిర్వహించే దాడులతో శత్రువు చేతికి దొరకకుండా, ఒకవేళ దొరికినా నష్టాన్ని కనిష్ఠస్థాయికి పరిమితం చేస్తూ వైరిపక్షాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసే సౌలభ్యం ఉందని, ఇటీవల జరిగిన ఆర్మేనియా – అజర్‍ బైజాన్‍ యుద్ధం ఇదే చెబుతోందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. డ్రోన్‍లను మిలటరీపరమైన దాడులకు ఉపయోగించేందుకు ఈ క్రింది అను కూలతలున్నాయని ఆ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు.

1.చవకయినవి (Cheap):
డ్రోన్లు విపరీతంగా వాడుకలోకి రావడానికి ప్రధానకారణం సాంప్రదాయ యుద్ధ విమానాలతో పోలిస్తే వీటి ధర చాలా తక్కువ. మరియు యుద్ధ విమానాల దాడుల వల్ల కలిగే నష్టాల కంటే, రెట్టింపు నష్టాన్ని కలుగజేసి శత్రువులను కోలుకోలేని విధంగా దెబ్బతీయవచ్చు. సౌదీ అరేబియాకు చెందిన అరామ్‍కో చమురు శుద్ధి కర్మాగారంపై హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన డ్రోన్‍ దాడులు ఇందుకు ప్రబల నిదర్శనం.

2.రిమోట్‍తో నియంత్రణ (2.Remotely Controlled) :
దాడిచేసే వారు వారికి అనుకూలమైన ప్రదేశంలో ఉంటూ, శత్రుదేశంలోకి ప్రవేశించకుండానే వారికి ఎలాంటి అపాయం లేకుండా డ్రోన్లను రిమోట్‍ద్వారా నియంత్రిస్తూ, అవతలి పక్షంలోని సుదూర ప్రదేశాలలోని లక్ష్యాలను సైతం డ్రోన్లతో తుత్తునియలు చేయవచ్చు.

3.సులభతర నిర్వహణ (Easy to Operate) :
డ్రోన్లకు సాధారణంగా ఎప్పుడో తప్ప ఎలాంటి భౌతిక పరమైన నష్టాలు జరగవు. అలాంటి నిరోధకతను కలిగి ఉంటాయి. డ్రోన్లను సేకరించడంగానీ, తద్వారా వాటిని నిర్వహించడంగానీ చాలా తేలిక, ఇందులో ఎలాంటి సంక్లిష్టతలకు తావుండదు. వాటిని సులువుగా ఎక్కడైనా మోహరించవచ్చు.

4.ఖచ్చితత్వం (Prescision) :
డ్రోన్లు జీపీఎస్‍ విధాన సహకారంతో నిర్దేశించిన లక్ష్యాలను సులువుగా, అత్యంత ఖచ్చితత్వాన్ని పాటించి ఛేదిస్తాయి.


డ్రోన్‍ దాడులను నిలువరించలేమా?

  • భారత సరిహద్దులు దాటి అక్రమంగా దేశంలోకి ప్రవేశించే క్షిపణులు, యుద్ధవిమానాలు, హెలికాప్టర్లను పసిగట్టి వాటిని అడ్డుకునే రాడార్లతో కూడిన నిఘా వ్యవస్థను భారత రక్షణ వ్యవస్థ కల్గి ఉంది.
  • కానీ 60 సెం.మీ. నుండి 2 అడుగుల పొడవుతో అతి సూక్ష్మమైన పరిమాణం కలిగి, AUSA (Asociation of united States Army) నివేదిక ప్రకారం గంటకు 125 నుండి 950 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ సరిహద్దులు దాటి దేశంలోకి అక్రమంగా ప్రవేశించే డ్రోన్లను పసిగట్టే నిఘా వ్యవస్థ ఇండియా దగ్గర లేదు.
  • సాంప్రదాయ యుద్ధ విమానాలు ఎక్కువ ఎత్తులో ఎగరడం వల్ల, రాడార్లు వాటిని సులువుగా గుర్తించి, భూమిపై నున్న నిఘా కేంద్రాలకు (Ground Stations) హెచ్చరికలు జారీ చేస్తాయి. కానీ డ్రోన్లు తక్కువ పరిమాణం కలిగి, తక్కువ ఎత్తులో ఎగరడం వల్ల రాడార్లు వాటిని గుర్తించలేవు.


అంతర్జాతీయంగా డ్రోన్లను నిరోధించే సాంకేతికత – తీరుతెన్నులు
‘‘కేవలం డ్రోన్లతోనే 100 బిలియన్‍ డాలర్ల సైనిక పరికరాలను ధ్వంసం చేశాం’’ అని ఆర్మేనియాతో యుద్ధం తరువాత అజర్‍బైజాన్‍ అధ్యక్షుడు తెలిపారు. దీన్నిబట్టి డ్రోన్ల సత్తాను మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్మేనియా సాంప్రదాయ యుద్ధం చేస్తే అజర్‍బైజాన్‍ వ్యూహాత్మకంగా సైనిక ప్రాంతాలపై నిప్పులు కక్కే డ్రోన్లతో విరుచుకుపడి కీలక విజయాలు సాధించింది.


ఈ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్‍, ఇజ్రాయిల్‍ సహా చాలా దేశాలు డ్రోన్లను అడ్డుకునే సాంకేతికతను అభివృద్ధి పరచడంపై దృష్టి సారించాయి. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‍ రాకెట్లను నిరోధించడానికి ‘‘ఐరన్‍ డోమ్‍’’ వ్యవస్థను రూపొందించిన ఇజ్రాయిల్‍ రక్షణ సంస్థ రఫేల్‍ ‘‘డ్రోన్‍ డోమ్‍’’ అనే కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇది డ్రోన్లను గుర్తించి వాటిని కెమెరాలను పనిచేయకుండా చేస్తుంది. శక్తివంతమైన లేజర్‍ పుంజాలతో కచ్చితంగా డ్రోన్‍లను నేలకూల్చగలదు. రాత్రివేళ కూడా ఇది పనిచేస్తుంది. అమెరికాకు చెందిన ఫోర్టెమ్‍ టెక్నాలజీ ఇదే తరహాలో ఇంటర్‍ సెప్టర్‍ డ్రోన్‍ను తయారు చేసింది. దీని పేరు ‘‘డ్రోన్‍ హంటర్‍’’. ఇది ఒక వలలాంటి పరికరంతో డ్రోన్‍ను బంధించి నేలకు దింపుతుంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రైవేట్‍ సంస్థ డ్రోన్‍ షీల్డ్.. డ్రోన్ల రేడియో ఫ్రీక్వెన్సీని అడ్డుకొని, వీడియోకు అంతరాయం కలిగిస్తుంది. ఫలితంగా సదరు డ్రోన్‍ వెంటనే నేలపైకి దిగడమో, ఆపరేటర్‍ దగ్గరకు వెనుదిరగడమో చేస్తుంది.


డ్రోన్లను నిరోధించే టెక్నాలజీ – ఇండియా :
హైదరాబాద్‍లో ఉన్న రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‍డీఓ) అక్రమంగా ప్రవేశించే డ్రోన్లను గుర్తించి, నాశనం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని(Detect and destory technology)ని అభివృద్ధి చేసింది. దీనిని డీ-4 అనిపిలుస్తారు. గత ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ భారత పర్యటనలో దీన్ని మోహరించారు. అదే ఏడాది ఢిల్లీలో ఎర్రకోటవద్ద స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లోనూ ఉపయోగించారు. ఇది 3 కి.మీ. దూరంలోని డ్రోన్లను గుర్తించి జామ్‍ చేయగలదు. దీనినే సాంకేతిక పరిభాషలో Softkill అంటారు. 1-2.5 కి.మీ. దూరంలోని లోహ విహంగాలపై లేజర్‍ ఆయుధాన్ని ప్రయోగించగలదు. దీనినే Hardkill అంటారు. అయితే దీని పరిధి తక్కువగా ఉంది. వీటిని భారీస్థాయిలో ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఈ వ్యవస్థ పరిమిత ప్రదేశాలకు వాడే రక్షణ వ్యవస్థగా మాత్రమే ఉపయోగపడుతుంది.
భారత నౌకాదళం (Indian Navy) ఇజ్రాయిల్‍ నుండి డ్రోన్లను కూల్చే స్మాష్‍ 2000 ప్లస్‍ రైఫిళ్ళను కొనుగోలు చేసింది. తాజాగా డ్రోన్లను ఎదుర్కొనే ఈఎల్‍ఐ 4030 వ్యవస్థలను కూడా భారత్‍ కొనుగోలు చేసింది. అదేవిధంగా జెన్‍టెక్నాలజీ సిద్ధం చేసిన జెడ్‍పడీస్‍ వ్యవస్థ 15 కి.మీ. పరిధిలోపు వరకే రక్షణ ఇవ్వగలదు. జటాయు సంస్థకు చెందిన డ్రోన్‍ నిరోధక రైఫిల్‍ 15 కి.మీ దూరంలో లక్ష్యాలను ప్రత్యేక తరంగాల ద్వారా నిర్వీర్యం చేయగలదు. ఇవి కాకుండా హైదరాబాద్‍కు చెందిన గ్రీన్‍ రోబోటిక్స్ సంస్థ ఇంద్రజాల్‍ అనే కొత్త సాంకేతికను అందుబాటులోకి తెచ్చింది. దీని సహకారంతో 1000-2000 చ।।కి।।మీ పరిధిలో పనిచేయగల సత్తా ఈ టెక్నాలజీ సొంతమని ఆ సంస్థ చెబుతోంది. పాకిస్తాన్‍ సరిహద్దు పొడవునా యాంటీడ్రోన్‍ వ్యవస్థను నెలకొల్పాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. అయితే ఇంద్రజాల్‍తో ఆ ఖర్చును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీన్ని కృత్రిమ మేధ, రోబోటిక్స్ ఆధారంగా రూపొందించారు.


డ్రోన్ల నిర్వహణా నిబంధనలు

  • డ్రోన్‍ నిబంధనలు – 2021 పేరిట పౌర విమానయాన శాఖ కొన్ని నిబంధనలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి నుండి అమల్లోకి వచ్చిన, మానవరహిత విమాన వ్యవస్థల నిబంధనలు-2021 స్థానంలో వీటిని తీసుకురావడం జరిగింది. వీటి ప్రకారం…
  • డ్రోన్లను నిర్వహించేందుకు నింపాల్సిన దరఖాస్తుల సంఖ్యను 25 నుండి 5కు తగ్గించారు.
  • అలాగే ఒక్కో ఆపరేటర్‍ 4 రకాల రుసుములు చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుతం 72 రకాల ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
  • చెల్లించాల్సిన రుసుములకు డ్రోన్ల పరిమాణంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఉదా।।కు రిమోట్‍ పైలెట్‍ లైసెన్స్ కోసం రుసుమును రూ.3వేల (భారీ డ్రోన్‍కు) నుండి రూ.100కు (అన్ని విభాగాల డ్రోన్లకు) తగ్గించారు.
  • పెర్‍ఫార్మెన్స్, నిర్వహణ, దిగుమతి క్లియరెన్స్ ధృవీకరణ పత్రాలు, ఆపరేటర్‍ పర్మిట్‍, ఆర్‍ అండ్‍ డీ సంస్థ ధృవీకరణ, విద్యార్థి రిమోట్‍ పైలెట్‍ లైసెన్స్, విశిష్ట అధీకృత సంఖ్య, విశిష్ట ప్రొటోటైప్‍ గుర్తింపు సంఖ్య, గగనయాన సామర్థ్య సర్టిఫికెట్‍ వంటివి అవసరం లేదు.
  • గ్రీన్‍ జోన్లతో 400 అడుగుల ఎత్తు వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేకుండానే డ్రోన్లను నడుపుకోవచ్చు. విమానాశ్రయ ప్రహారీ గోడ నుంచి 8-12 కి.మీ. మధ్య ఉన్న ప్రాంతంలో 200 అడుగుల ఎత్తు వరకూ వీటిని నిర్వహించుకోవచ్చు.
  • గగనతల మ్యాప్‍లో రెడ్‍, ఎల్లో జోన్లకు వెలుపలి ప్రదేశాల్లో 400 అడుగల ఎత్తు వరకు ఉండే ప్రాంతాన్ని గ్రీన్‍ జోన్‍గా పేర్కొంటారు.
  • డ్రోన్ల బదిలీ, రిజిస్ట్రేషన్‍లను సరళీకరించారు.
  • మైకోడ్రోన్ల (వాణిజ్యేతర అవసరాలకు), నాన్‍ డ్రోన్ల ఆపరేటర్లకు పైలెట్‍ లైసెన్సు అవసరం లేదు. ఉల్లంఘనలకు పాల్పడే వారికి విధించే గరిష్ఠ జరిమానాను లక్షకు తగ్గించారు.
  • డ్రోన్‍ను భారత్‍లో నడపాలనుకున్న సందర్భంలోనే అది ఏ రకానికి చెందింది, దాని విశిష్ట గుర్తింపు సంఖ్య వంటి వివరాలు అవసరమవుతాయి.
  • సరకుల బట్వాడాకు ప్రత్యేక డ్రోన్‍ నడవాలను అభివృద్ధి చేస్తారు.
  • దేశంలో డ్రోన్‍ అనుకూల నియంత్రణా వ్యవస్థను తెచ్చేందుకు ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేస్తారు.


డ్రోన్లు-అనువర్తనాలు


I వ్యవసాయం (Agriculture)

  • డ్రోన్లు పంట పొలాలపై ఎగురుతూ పొలానికి సంబంధించిన నీటిపారుదలకు సంబంధించిన సమస్యలు, నేలలు – వాటి రకాలు, పంటలకు సోకిన వివిధ రకాల తెగుళ్ళకు సంబంధించిన సమాచారాన్ని స్పష్టమైన చిత్రాల రూపంలో అందజేస్తాయి.
  • రైతు ఆరోగ్యంగా ఉన్న మొక్క, అనారోగ్యంగా ఉన్న మొక్కల మధ్య ఉన్న తేడాను తన కంటితో స్పష్టంగా గుర్తించలేక పోవచ్చు. కానీ డ్రోన్స్ వాటి యొక్క హైరిజల్యూషన్‍ కెమెరాలతో తీసే చిత్రాలు, చిన్న లోపాన్ని కూడా స్పష్టంగా గుర్తించేంత నాణ్యతను కల్గి ఉంటాయి.
  • డ్రోన్లతో పురుగుమందులను పంటలపైన వేగంగా పిచికారీ చేయవచ్చు.
  • పొలాలలో డ్రోన్లద్వారా విత్తనాలు కూడా చల్లవచ్చు.

పైన చెప్పిన విధంగా డ్రోన్లను వినియోగించుకోవడం వల్ల రైతు తన పంట దిగుబడిని గణనీయంగా పెంచవచ్చు.


II వైద్య ఆరోగ్యరంగం (Health Care Sector) :

  • మందులు, రక్తము, ఇతర ఔషధ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని రహదారి సౌకర్యంలేని సుదూర ప్రాంతాలకు సులువుగా, వేగంగా చేరవేయవచ్చు.
  • అత్యవసరంగా అవయవాలు అవసరమైనవారికి కావలసిన అవయవాలను ఎయిర్‍ అంబులెన్స్ విధానంలో డ్రోన్ల ద్వారా త్వరితగతిన అందజేయవచ్చు.


III విపత్తు న్విహణ (Diaster Management ) :
విపత్తు ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించి జరిగిన నష్టాన్ని మదింపుచేయడంలో, బాధితులను గుర్తించడంలో వారికి కావలసిన సహాయ సహకారాలను అందించడంలోనూ డ్రోన్లు సమర్థవంతమైన పాత్ర పోషిస్తాయి.


IV పట్టణ ప్రణాళిక విభాగం (Uraban Planning Dept) :
పట్టణ ప్రాంతాల్లో రద్దీని నివారించడానికి, పచ్చదనాన్ని పెంచేందుకు కావలసిన భూములను గుర్తించి, వాటిని అభివృద్ధి పరచడంలో డ్రోన్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఉదా : ఇటీవల గ్రేటర్‍ చెన్నై మున్సిపల్‍ కార్పొరేషన్‍ డ్రోన్ల ద్వారా భూములను మ్యాపింగ్‍ చేసిన తొలి కార్పొరేషన్‍గా చరిత్ర సృష్టించింది.


V అంతరించి పోతున్న జాతుల పరిరక్షణ (Conservation of endangered species) :

అంతరించిపోతున్న విభిన్న రకాల మొక్కలు మరియు జంతువులను గుర్తించడంలో కూడా డ్రోన్లు సహకారమందిస్తాయి.


VI వాతావరణ అంచనా (Weather fore casting) :

డ్రోన్లు ఆకాశంలో సంచరిస్తూ వాతావరణంలో సంభవిస్తున్న మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తూ – పరిసరాలలోనూ మరియు వాతావరణంలోనూ సంభవిస్తున్న విపరీత మార్పుల్ని అవగాహన చేసుకొనేందుకు తోడ్పడతాయి.


VII వ్యర్థ పదార్థాల నిర్వహణ (Waste Management):

పట్టణ ప్రాంతాల్లో పేరుకుపోయే చెత్తను తొలగించడంలోనూ మరియు సముద్రాలలోని వ్యర్థాలను తొలగించి శుభ్రపరచడంలోనూ డ్రోన్లు ఇతోధిక సేవలందిస్తాయి. ఉదా।। రన్‍మెరైన్‍ సంస్థ విడుదల చేసిన రూంబాడ్రోన్‍


VIII గనులు : భూగర్భంలో దాగి ఉన్న విలువైన ఖనిజాలు, ముడి వస్తువులు, రాళ్ళు వంటి వాటిని గుర్తించడంలో డ్రోన్లు వెలకట్టలేని సేవలు అందిస్తాయి. మానవ ప్రయత్నంతో ఇలాంటి విధులు నిర్వర్తించడం చాలా కష్టం.


IX సరుకుల బట్వాడా : అమెజాన్‍, ప్లిప్‍కార్ట్, స్నాప్‍డీల్‍ లాంటి ఇ-కామర్స్ సంస్థలు రద్దీ ఉన్న నగరాలలో డ్రోన్ల ద్వారా తమ సరుకులను బట్వాడా చేస్తున్నాయి.


చివరగా : మనదేశానికి పొరుగునున్న చైనా, మనకన్నా చిన్నదేశమైన ఇజ్రాయిల్‍ సాంకేతిక రంగంలో నిరంతరం సంభవించే మార్పులను ఒడుపుగా ఒడిసి పట్టుకుంటూ ప్రపంచంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించగలిగాయి. మనదేశం కూడా సాంకేతిక రంగంలో సంభవించే ప్రగతిని అందిపుచ్చుకునేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం పరిశోధన మరియు అభివృద్ధి రంగాలకు (ఆర్‍ & డీ) భూరి నిధుల్ని కేటాయించడంతోపాటు విభాగాల వారిగా ప్రత్యేక కార్యదళాలను (టాస్క్ఫోర్స్) ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే రక్షణ రంగంతో పాటు సాంకేతిక పరంగా తలెత్తే ఎలాంటి విపత్తులనైనా సులువుగా అధిగమించవచ్చు.


-పుట్టా పెద్ద ఓబులేసు,
ఎ : 9550290047

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *