కన్దూరి తొండయచోడుని (తండ్రి అస్తినిమజ్జన) పానగల్లు శాసనం (క్రీ.శ.1091)

హిందూ షోడశ సంస్కారాల్లో అంత్యక్రియలకు ప్రాముఖ్యత నిచ్చారు. వ్యక్తి మరణానంతరం, స్థాయిని బట్టి, ఆ వ్యక్తి అస్తికలు, చితాభస్మాలను పుణ్యతీర్థాల్లోనో, స్థానిక జలవనరుల్లోనో కలపటం మధ్యయుగంలో ఆచరించిన శాసనాధారాలున్నాయి. రాజ, సామంత, మాండలిక వంశీకులకు చెందిన వారు మరణిస్తే కర్మకాండల నిర్వహణ కోసం, పండితులైన బ్రాహ్మణులను ఎంచుకొని, వారిని కాశీ, గయకు పంపి, అందుకయ్యే ఖర్చుల కోసం నగదు, వచ్చిన తరువాత జీవితకాలం సరిపడే పంట భూముల్నిగానీ, గ్రామాలను గానీ దానం చేశారు.


మహబూబ్‍నగర్‍ జిల్లా కోడూరు నుంచి కోడూర్పురవ రాధీశ్వరులుగా, అదే జిల్లా కందూరుకు చెందిన తెలుగు చోళుల్ని కందూరు చోళులని పిలిచారు. వీరు, కందూరు, కోడూరు, వర్ధమానపురం, కొలనుపాక, పానగల్లు లను రాజధానిగ చేసుకొని కళ్యాణ చాళుక్యులు, తరువాత కాకతీయులకు సామంతులుగా క్రీ.శ. 11-13 శతాబ్దాల్లో, దక్షిణ తెలంగాణ ప్రాంతాలను పాలించారు. వీరి వంశంలో గోకర్ణ, ఉదయన, భీమ, గోకర్ణ, తొండ, చోడభీమనారాయణలు ముఖ్యులు. వీరిలో భీమచోడుని కొడుకు రెండో తొండయ చోడుడు. భీమ చోడుడు మరణించగా, ఆయన అస్తికలు గంగలో కలిపి, గయలో పిండం పెట్టి వచ్చిన యజ్ఞప్రోలమయ్యకు పానగల్లులో కొంత భూమిని దానం చేస్తూ తొండయ క్రీ.శ. 1091లో ఒక శాసనాన్ని వేశాడు.


వివరాల్లోకెళితే ‘కందూరు చోడులు’ అన్న వ్యాసాన్ని రాసిన ఎన్‍.ఎస్‍. రామచంద్ర మూర్తిగారి ప్రకారం, కందూరుచోడుల మూలపురుషుడు ఏరువ భీముడు (క్రీ.శ.1025-50), అతని కుమారుడు ఏరువ తొండడు (క్రీ.శ.1050-75), అతని కొడుకు, రెండోభీమచోడుడు (క్రీ.శ.1075-90), భీమచోడునికి రెండో తొండడు, ఇరుగ, మరో కుమారుడు (పేరు తెలియదు), మల్లికార్జునచోడుడు అనే నలుగురు కుమారులు. ప్రస్తుత పానగల్లు శాసనాన్ని, రెండో తొండడు, (క్రీ.శ.1077-93) విడుదల చేశాడు. ఇతడు తండ్రి భీమచోడుడు, క్రీ.శ.1090లో మరణించక ముందు క్రీ.శ.1077 నాటికే రాజ్యపాలనలో భాగం పంచుకొన్నట్లు అతని కొలనుపాక మొదటి శాసనం తెలియజేస్తుంది. అతడు, ముందు కొలనుపాక, తరువాత పానగల్లు నుంచి, మహబూబ్‍నగర్‍, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు కలిసిన భూభాగాన్ని, కళ్యాణచాళుక్య చక్రవర్తి ఆరోవిక్రమాదిత్యుని సామంతునిగా పాలించాడు. అతని కొలనుపాక, పానగల్లు, కొప్పోలు, అనిమెల శాసనాలు, అతని భార్య మైలాంబిక పానగల్లు, దాక్షారామ శాసనాలు, అతని కొడుకు మల్లికార్జునుని ఒల్లాల శాసనాల వల్ల రెండో తొండచోళుని పాలన గురించి తెలుసుకోవచ్చు (ఎన్‍.ఎస్‍. రామచంద్ర మూర్తి, ‘కందూరు చోడులు’, మధ్యయుగ ఆంధ్రదేశం (క్రీ.శ.1000-1324); ఆంధ్రదేశ సమగ్ర చరిత్ర – సంస్కృతి-4, (సం), సి.సోమసుందరరావు, హైదరా బాదు, 2012, పే.69-77). చారిత్రక ప్రాధాన్యతగల ఈ పానగల్లు శాసనం, బి.యన్‍. శాస్త్రిగారు రాసిన, కందూరి చోడుల శాసనములు, చరిత్ర- సంస్కృతి (హైదరాబాదు, 1984, పే.10-12)లో ఎందుకో చోటు చేసుకోలేదు. ఈ శాసనాన్ని రాష్ట్రపురావస్తుశాఖ వారు, 1969లో 164వ శాసనంగా నకలు తీశారు. (పి.వి.పరబ్రహ్మశాస్త్రి (సం), ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్‍ ఆంధప్రదేశ్‍ : నల్గొండ డిస్ట్రిక్టు, వా.1. శా. 20, పే.56-57).


ఇక ఈ శాసనాన్ని పరిశీలిద్దాం.


శాసన పాఠం :

  1. స్వస్తిసమస్తభువనాశ్రయ శ్రీపృధ్వీ వల్ల
  2. భమహారాజాధిరాజ
    పరమేశ్వర ప
  3. (రమ భట్టారక సత్యాశ్రయకులతిలక)
  4. చాలుక్యాభరణ శ్రీమత్త్రిభువన (మ)
  5. ల్లదేవర విజయరాజ్య (ముత్తరోత్త) రాభి
  6. వ్రిద్ధి ప్ర(వద్ధ మాచంద్రాక్క •మగునట్లుగానుంద)
  7. త్పాదపద్మోపజీవి (—డైన) సమ(ధి)
  8. గత పంచమహా(శబ్ద మహామండ) లేశ్వర (ప)
  9. రమహేశ్వరం —- సూయ్య
  10. వంశోద్భవ (కులతిలకకాస్యప) —– గోత్రకరికా (లా)
  11. న్వయనామాది —— ప్రసస్తి సహితంమ
  12. హామండలేశ్వర శ్రీ(మత్‍) తొండయచోడ మ
  13. హారాజులును వారి —– (యాకమబ్బె) మహాదే
  14. వియు (శ్రీమచ్ఛాలుక్య (విక్రమ) కాలమున
  15. ్గఙగు ప్రజాపతి సంవత్సర కాత్తి క సుద
  16. ్గయు గురువారమునాండు శ్రీ మన్మహా
  17. మండలేశ్వర కన్దూరి భీమ (-) చోడ మహా
  18. రాజుల యస్థులు పరువున గొంపో
  19. యి గంగబెట్టి గయ పిండం బెట్టి వచ్చిన ఆ
  20. యజ్ఞ ప్రోలమయ్యకు (ఉ)త్తరాయణ సం
  21. క్రాంతినాండు ధారాపూవ్వ కము సేసి యి
  22. చ్చిన వ్రిత్తులు (—–) యుం బానుంగ్గం
  23. టనోదయ (సముద్రము) యొద్ద నుత్త (మ)
  24. గండ ఘడ ।।…… ను బెద్ద చెఱవు
  25. న నార —— గు ్గ ఙ—–ష
  26. డ్డును తమ్ముండు లోకరాజు ——
  27. —— తమ్మ —– గురవా
  28. డ ఖ ్గం—– తాటివనము వెలివొలము
  29. లోనుగా ఖ ్గ ్గ ఆచంద్రాక్క స్థాయిగ
  30. నిచ్చితిమి । బహుభివ్వ సుధా దత్తా రాజభి సగ
  31. రాదిభిః । యస్య యస్య యదాభూమి తస్య తస్య త
  32. దాఫలం (స్వదత్తాం పరదత్తాం) వాయోహరేత వ
  33. సుంధరాం (షష్టివ్వ ష సహశ్రాణి) విష్టాయాం జాయ
  34. తే క్రిమి ।


సత్యాశ్రయకులతిలకుడు, త్రిభువనమల్ల బిరుదాంకితుడు అయిన కళ్యాణచాళుక్య చక్రవర్తి ఆరో విక్రమాదిత్యుని సామంతుడైన, పంచమహాశబ్ద, మహామండలేశ్వర, శ్రమత్‍ తొండయచోడ మహారాజు, ఆయన భార్య యాకమబ్బెమహాదేవి కలసి, శ్రీమన్మహామండలేశ్వర కందూరు భీమచోడమహారాజుల అస్తులు (అస్తికలు) పరువున (నడచివెళ్లి), గంగబెట్టి (గంగానదిలో, నిమజ్జనం చేసి), గయ పిండం బెట్టి (గయలో శ్రాద్ధ కర్మలు నిర్వహించి, పిండంపెట్టి), కాలినడకన తిరిగి వచ్చిన యజ్ఞప్రోలమయ్యకు పానుంగంటనోదయ (సముద్రం) యొద్ద (పానుగల్లు ఉదయ సముద్రం దగ్గర), (విత్తులుగా, ఉత్తరాయన సంక్రాంతినాడు) ఉత్తమ గండఘడ మానముతో, ఇంకో ఆయన తమ్ముడు లోకరాజుకు తాటివనము, వెలిపొలమును ఆచంద్రార్కంగా దానం చేశాడు.
ఇలా, తండ్రి అస్తికలను గంగలో నిమజ్జనం చేయటానికి, గయలో శ్రాద్ధ పిండం పెట్టడానికి ఒక బ్రాహ్మణున్ని, కాలినడకన పంపిన తొలిరాజుగా కందూరి తొండయచోడుడు రికార్డు సృష్టించాడు. తరువాతి కాలంలో ఇలాంటి కార్యక్రమాలకు మార్గదర్శకుడైనాడు. కాకతీయ, విజయనగర కాలాల్లో ఇదే సంప్రదాయం కొనసాగినట్లు తెలిపే శాసనాధారాలున్నాయి.
కాకతీయ గణపతిదేవుని కుమార్తె, గణపాంబ, తన భర్త కోట (ధరణికోట) వంశీకుడైన బేతరాజు క్రీ.శ.1218 ప్రాంతంలో మరణించగా, అతనికి పుణ్యలోకాలు దక్కాలని, రుద్రాపెద్ది అనే బ్రాహ్మణున్ని గయకు పంపి, ఖర్చుల కోసం గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గరున్న మొగలుట్ల గ్రామాన్ని ఏకభోగంగా క్రీ.శ.1219లో దానం చేసింది. (ఎన్‍ రమేశన్‍, మొగలుట్ల ‘గ్రాంట్‍ ఆఫ్‍ కోట గణపాంబ’ ఎపిగ్రాఫియా ఆంధ్రికా, వా.4, పే.93-102, ఆం.ప్ర.పురావస్తు శాఖ ప్రచురణ, హైదరాబాదు, 1975; డా. పి. కనకదుర్గ, కాకతీయుల నాటి సామాజిక జీవనం, శ్రీ మానస పబ్లికేషన్స్, విజయవాడ, 1992, పే.125) వివరాలకు ఆ శాసనంలోని సంబంధిత భాగాన్ని పరిశీలిద్దాం.


రెండో రేకు : రెండో పక్క

  1. యత్కీర్తిః సంతానలతా సమంతా ద్విజృంభమాశా కనుభాముభేఘ అ
  2. త్యాహతారుహ్య కులాచలేంద్రా న్నక్షత్రపుష్పా ఫలతీవచంద్రమే ।। స్వ
  3. స్తి చతుస్సముద్ర ముద్రిత నిఖిల వసుంధరాపరిపాలక శ్రీమత్త్రిణయ
  4. న పల్లవ ప్రసాదాదిత కృష్ణవెన్నానదీ దక్షిణ షట్రహస్రావన
  5. య లోభ దుర్లభ చోడచాళుక్య వల్లభ సామంత భ మదానే
  6. కపమృగేంద్ర విభవామరేంద్ర శ్రీ మదమరేశ్వర దేవదివ్య
  7. శ్రీ పాదపద్మారాధక పరబల సాధక శ్రీధాన్యకటకపురవ
  8. రాధీశ్వర ప్రతాపలంకేశ్వర కలిగల మోడకె బేడు వర గీవ కైగంగరగం
  9. డ గండ భేరుండ జగమెచ్చుగండ నందిమార్తాండ నామాది సమస్త ప్ర
  10. శస్తి సహిత శ్రీమన్మహామండలేశ్వర కోట గణపమదేవి అమ్మగారు తన
  11. పురుషుందు భేతరాజునకు పుణ్యలోక ప్రాప్తిగాను మొగలి
    ఉట్లు
  12. రుద్రిపెద్దింగారిని మహారాజు సంనిధి ధారాపూర్వకముగాను అ


మూడో రేకు మొదటి పక్క

  1. ష్ట భోగైశ్వర్య సహితంగాను ఏక భోగము గయావ్రజన దక్షిణ గా
  2. ను ఇస్తిమి. గణపద్దేవండున్ను తమఅంశము ధోరవోసె రు
  3. ద్ర పెద్దింగారున్ను తమ ఆశ్రిత బంధూలకు ఆ అగ్రహారమం
  4. దు అర్థము ఇచ్చిరి. ఉన్న అర్థమున్ను ఆవశ్యక బంధూలకున్ను
  5. తమకున్ను వారల నామాలు అనంత ఘడశా
  6. సులు పిన్నప్పయ్య ఘడశాసులు ఏతౌ భారద్వాజౌ
  7. సోమనాథ ఘడశాసులు ద్వయంశులు వాసుదేవఘడ శా
  8. సులు జనార్థనభట్లు గోపాలభట్లు ఏతే కౌండిన్య గోత్రాః
  9. మారపోత భట్లు ప్రోలిదేవఘడశాసులు ద్వ్యంశులు మ
  10. ల్లిఖార్జున పింనిగారు ఏతేలోహిత గోత్రాః ప్రోలిదేవఘ
  11. …. తస్య భూమిభృతాంభర్తుః పుత్రీ
  12. గణపమాంబికాయా బేతక్షితినాధస్య తస్యదేవీ గుణాన్వతా


గణపతి దేవుని కుమార్తె, కోట కేతరాజు భార్య గణపమాంబిక (గణపమదేవి) అమ్మగారు తమ పురుషుడు బేతరాజుకు పుణ్యలోక ప్రాప్తిగా, మహారాజు గణపతి దేవుని సన్నిధిలో, శ్రాద్ధకర్మల నిమిత్తం గంగానదిలో అస్తికలు కలిపి, గయలో పిండం పెట్టడానికి కాలినడకన వెళ్లి వచ్చిన రుద్ర పెద్దిగారికి, మొగలుట్ల గ్రామాన్ని (గయావ్రజన దక్షిణ) దానం చేసింది. దానికి తోడు గణపతిదేవుడు కూడ తనవంతు మరికొంత భూమిని దానం చేయగా, రుద్రిపెద్ది, ఆ గ్రామాన్ని తన బంధువులు, ఆశ్రితులకూ, అవసరమున్న బంధువులకు పంచినట్లు చెప్పబడింది. అతని బంధువుల పేర్లు, గోత్రాలతో సహా పేర్కొన బడినాయి.


ఇదే సందర్భంగా, శ్రీకృష్ణదేవరాయని గయ శాసనాన్ని కూడా చెప్పుకోవాలి. ‘శ్రీకృష్ణదేవరాయని గయశాసనం’, (ఎపిగ్రాఫియా ఇండికా, వా. 33, పే.110.) క్రీ.శ. 1521 ఫిబ్రవరి 2వ తేదీన బీహారులోని ‘గయా క్షేత్రంలో’, శ్రీకృష్ణదేవరాయలు వేయించిన విజయ శాసమని, ముక్క తిమ్మయ ఈ శాసనాన్ని వ్రాసెను, అని ఉండటాన, పరిశోధకుల మధ్య ఈ శాసనం, గయ శాసనం, జయ శాసనమా? అన్న చర్చకు దారి తీసింది. గయవరకూ గల భూభాగం పాలించని కృష్ణదేవరాయలు, బహుశ, తన తల్లి దండ్రులలో ఎవరో ఒకరికి శ్రాద్ధకర్మలను అక్కడ నిర్వహింపజేసిన సందర్భంగా ఈ తెలుగు శాసనాన్ని అక్కడ వేయించి ఉంటాడనుకోవచ్చు. ఇలా, మరణించిన వారి శ్రాద్ధకర్మల నిమిత్తం, సంబంధీకులు బ్రాహ్మణులను గయ, వారణాసి (కాశి) లాంటి పుణ్య, తీర్థక్షేత్రాలకు పంపి, వారికి తగు ప్రతిఫలాన్ని ముట్ట జెప్పటం ఆనవాయితీగా వస్తున్నదే.


క్రీ.శ. 12వ శతాబ్దిలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఒకరాజు, తన తండ్రి అస్తికలను గంగలో నిమజ్జనం, గయలో శ్రాద్ధకర్మలను నిర్వహింపజేసి, శాసనాన్ని వేయడం తొలిసారి ఒక సనాతన సంప్రదాయాన్ని నమోదు చేస్తున్న అరుదైన శాసనం గాబట్టి పానుగల్లులోని కందూరి రెండో తొండయచోడుని శాసనం అలనాటి మేటి తెలంగాణ శాసనాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకొంది. ఈ వ్యాస రచనకు తోడ్పడిన డా. ఎన్‍ఎస్‍ రామచంద్రమూర్తి, డా. డి. సూర్య కుమార్‍, తెలంగాణ చరిత్ర బృందం శ్రీరామోజు హరగోపాల్‍ గార్లకు నా కృతజ్ఞతలు.


ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *