సిద్ధప్ప వరకవి


ఆయన చదివింది ఏడవతరగతి. ఆరు భాషలపై ఆయనకు పట్టుంది. చేపట్టింది ఉపాధ్యాయ వృత్తి , సమాజ సేవ ఆయన ప్రవృత్తి. స్వరాజ్య ఉద్యమంలో రూమి టోపీకి బదులుగా , గాంధీ టోపి ధరించి విధులకు వెళ్ళి నందుకు ఉపాధ్యాయ ఉద్యోగం నుండి నిజాం ప్రభుత్వం ఆయనను తొలగించింది. అప్పటి నుండి తన ప్రవృత్తి కనుగుణంగా వాస్తు , వైద్య , ఆయుర్వేద శాస్త్రాల్లో ప్రాముఖ్యం సంపాదించి ప్రజలకు సేవ చేసారు. ఆయనే సిద్దప్ప వరకవి. కోహెడ మండలం గుండారెడ్డి పల్లెకు చెందిన లక్ష్మమ్మ , పెద్ద రాజయ్యలకు 1903లో జన్మించారు. 1984లో తాను చనిపోయే రోజును ముందుగానే ప్రకటించి తేదీ. 23.3.1984 రోజు సాయంత్రం 3 గంటలకు ప్రాణాలు విడిచారు. తెలంగాణ తొలి సమాజ వేదాంత కవి, గోల్గొండ కవి, తత్వకవిగా పేరు పొందారు.


తెలంగాణాలో నిజాం కాలాన సంక్లిష్టమైన పరిస్థితులుండేవి. ఒకవైపు విద్య, అనారోగ్యం, అసమానతలు, నిజాం సైన్యం, దొరలు, దేశముఖ్‍ ఆగడాలతో ఈ ప్రజలు అసహాయులై దీనంగా కాలం గడిపారు. అలాంటి ప్రజలను స్వాంతన పరచడానికి ఈ ప్రాంతంలో వరకవులు పుట్టుకొచ్చారు. అందులో ప్రసిద్ధుడీ సిద్దప్ప, భక్తి భావన ముందు అసమానతలు, కుల భేదాలు కానరావు కనుకనే అంతా ఒక్కటే అని నినదించాడు.


ఆ మాట ప్రజలకు బలాన్ని ఇచ్చింది. మూఢ విశ్వాసాలను ఖండించి ప్రజలకు జ్ఞానమార్గాన్ని చూపించారు. తమ కష్టసుఖాలను పట్టించుకొని, వాటి పరిగీత మార్గాలను చూపించటం వల్ల ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. అందుకే శిష్యగణం తయారయ్యారు. జలస్థంబన ఊరి జనం మంచి చెడ్డలు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లు, వీరు తన వద్దకు వచ్చిన ప్రజలకు భవిష్యత్తు బోధించి వారికి ధైర్యాన్ని ఇచ్చి పంపేవారు. ఆపాటి మాట సాయం అనేది ఆనాడు ఒక పెద్ద బాధ్యత. అది నెరవేర్చి సిద్దప్ప వరకవి చిరస్మరణీయు డయ్యాడు.


సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని నాలుగు భాగాల్లో రచించి వరకవిగా గొప్ప పేరుతోపాటు యక్షగానాలు, స్తోత్రాలు, వర్ణమాలలు, సుభాషితాలు, హితబోధలు, వేదాంత తత్వకీర్తనలు, కాలజ్ఞానములు, కందార్దదరువులు, నక్షత్రమాలలు వంటి ఎన్నో రచనలు చేసారు. సురవరం ప్రతాపరెడ్డి తన గోల్కొండ పత్రికలో రాసారు. నీల జంగయ్య తెలుగు తత్వకవి పరిశోధన గ్రంథంలో వేమన, కబీర్‍ దాస్‍ పద్య పోలికలు ఎలా ఉన్నాయో సిద్ధప్ప రచనలోనూ అలా
ఉన్నాయని అన్నారు.


పల్లెలో పుట్టి పెరిగినవాడవటంవల్ల, తన కులవృత్తిని విడువక పోవటంవల్ల, నిత్యం ప్రజలలో సేవా సంబంధాలు నెరపటంవల్ల సిద్దప్ప సాహిత్యంలో తెలంగాణ పలుకుబడులు తేలియాడతాయి. తన కులవృత్తిలో భాగంగా మట్టి తడపడం, కుండలు చేయడం, వాము పెట్టడంవంటివన్నీ చేస్తూనే మంత్రముగ్ధులను చేసే గొప్ప కవితాత్మక ప్రయోగాలు చేసారు. ఆయన తన గురించి గొప్పలు ఎప్పుడు చెప్పుకోక పోగా, తనలోని అక్షరశక్తికంతటికీ బాసరమ్మ (బాసర సరస్వతీదేవి) కృపాకటాక్షణాలే కారణమని ప్రకటించడం విశేషం. సీసం, గీతం, కందం, ఆటవెలది, తేటగీతి వంటి పద్యాల శైలిలో అద్భుతంగా, సరళసుందరమైన పదప్రయో గాలు చేసారు. వీరి పద్యాలు, వేమన పద్యాలవలె పండిత పామర నాలుకలపై తారాడతాయి.


సామాజిక స్థితిగతులకు స్పందించి రచనలు చేయడం, దురన్యాయాలను దునుమాడడం వీరికి ఇష్టమైన కర్తవ్యాలు. దొరలు, పెత్తందారులు, దేశీయులు, దేశ్‍ముఖ్‍లు వంటి పెత్తందార్లపై తన పద్యాలలో విరుచుక పడ్డారు.
బూతి జంద్యాలు చేతుల రాతి లింగాలు
చేతురూ శివపూజ చెలుల ఇంట
చక్కనీ దండాలు చంక కమండలాల్‍
పడకవేతురు – పడుచులకునూ!
అంటూ నేడు చూస్తున్న దొంగస్వాముల బాణాన్ని నాడే తేటతెల్లం చేసారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, యోగి వేమనలను ఆదర్శంగా చేసుకొని సాహితీసేద్యం చేసారు.
ఆకాశమొక్కటే తెప్పలతీరులెన్నో
జలా ఒక్కటే అయినా చెట్ల సారంవేరు
మానవ జన్మ ఒక్కటేకాని గుణాలు వేరు
ఇలా ఎన్నో తత్వ ప్రబోధనలు సిద్దప్ప వరకవి రచనల్లో మనకు కనిపిస్తాయి.
‘‘చదువులేదిక నాంధ్ర సంగ్రహంబులలెస్స,
కనిచూడలేదొక్క కావ్యమైన
నోట బల్కియు చేత నొసరంగ వ్రాసింది చెలువొంద
మీ పాదసేవకుడును’’
అని వినమ్రంగా తెలిపాడు. వాడివరంచే కవిత్వానికి చేరువై పద్యం రాయగలిగానని, అందుకే తాను వరకవినని తెలుపుకున్నాడు. ‘‘గొప్పవాడనుగాను, కోవిదుడనుగాను తప్పులున్న దిద్దుడీ తండ్రులార’’ అని విశదపరిచాడు.


చాలామంది తాత్వికుల్లానే సిద్ధప్ప కూడా వైరాగ్యాన్ని బోధించారు. ప్రజలు ఈ బోధనలను కళ్ళకద్దుకున్నారు.
సీ. అజ్ఞానియే శూద్రడవనిలో నెవడైన
సుజ్ఞానియే యాత్మ సుజనుతడు
వేదంబు జదివినా విప్రుడా విహితుండు
బ్రహ్మమెరిగిన వాడే బ్రాహ్మణుడు
వర్తకంబును జేయు వణిజుండు వైశ్యుండు
అవని పాలించె నరుడె ప్రభువు
సకల నిందలు నోర్చు సదయిడు నరుడౌను
మత భేద విడిచిన యతివరుండు
గీ. జన్మచేతను వీరింక కలియంషమున
పేరు గాంచిన యెవరెవరి బేర్మి పనులు
వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప
అంటూ చాతుర్వర్థ లక్షణాలను పునర్నిర్వచించి,
భావజాలపరంగా సమతను సాధించాడు. చాలా పద్యాలలో ఆర్తి, వేదన, సంఘరీతిపట్ల కసి, అనమానతలపట్ల అసహ్యం కనపడుతుంటాయి.
సీ. ఏ కులుంబని నన్ను ఎరుకతో నడిగేరు
నా కులంబును జెప్ప నాకు సిగ్గు
తండ్రి తబొందిలివాడు తల్లి దాసరి వనిత
మా తాత మాలోడు మరియు వినుడి
మా యత్త మాదిగది మామ యెరుకలవాడు
మా బావ బల్జతడు మానవతుడు
కాపువారీ పడుచుకాంత దొమ్మరి వేశ్య
భార్యగావలె నాకు ప్రాణకాంత
ఈ విధంగా కులవాదాన్ని నిరసిస్తాడు. సమస్త కులాల విరాట్‍ స్వరూపంగా కనిపిస్తాడు.
‘‘రాతి బొమ్మల మొదట రాశిగా అన్నంబు
తినమన్న యా రౌతు తినదురన్న
తినెడి వాడవు నీవె తీవంబు చెందేవు
కానలేవు నీలోని తిమిరములను
పేదలకు అన్నంబు పెట్టు ధైర్యంబులేదు
గట్టురాళ్ళకు తిండి పెట్టగలవే…’’ అంటాడు.


వీరి పద్యాల్లో జాషువా, కాళోజీల అడుగుజాడలు కనపడతాయి, భక్తి మార్గంలో ఉంటూనే మూఢ భక్తిని నిరసించాడు. జ్ఞాన మార్గంలో పయనిస్తూ కొత్త దారులు చూపాడు. ఛందస్సును పుక్కిట పట్టుకున్నా. వ్యాకరణాన్ని తోసివేయలేదు.


తెలంగాణలో మరణం తరువాత కూడా బతికున్న సిద్దప్ప వరకవి అత్యంత ప్రసిద్ధుడు. సిద్దప్ప జ్ఞాపకార్ధం 1996లో అతని సమాధి వద్ద విగ్రహప్రతిష్ట ఏర్పాటు చేశారు. ప్రతి కార్తీక పౌర్ణమి రోజున నలుమూలల నుంచి వచ్చిన వీరి శిష్యులు విగ్రహం సాక్షిగా గురుపూజోత్సవాన్ని జరుపుతారు. కార్తీక పౌర్ణమే కాకుండా గురుపౌర్ణమి పాల్గుణ బహుళ నవమి రోజుల్లో ఆశ్రమంలో అన్నదానాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుతుంటారు. 1984 లో వరకవి భౌతికంగా ఈ లోకం నుండి వెళ్ళిపోయినా శిష్యుల చేతుల ద్వారా సారస్వతిభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక, కొత్తగా తీర్చిదిద్దబడిన తెలుగు వాచక పుస్తకాల్లో ఒకటైన తొమ్మిదవ తరగతి తెలుగు వాచకంలో సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని రెండవ భాగం నుంచి ఒక సీసపద్యం ‘‘కోపంబు మనుషుల కొంపముంచు’’ అనే పద్యాన్ని చేర్చారు. అలా సిద్దప్ప ఎదుగుతున్న చిన్నారుల నోళ్ళలో నానుతున్నాడు.


(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
-డా।। బి.వి.ఎన్‍.స్వామి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *