‘బాల చెలిమి’కారులు మణికొండ వేదకుమార్ చైర్మన్‍గా దాదాపు మూడు దశాబ్ధాలుగా బాల వికాసం కోసం పనిచేస్తూ ‘బాల చెలిమి’పత్రిక, ‘బాల చెలిమి గ్రంథాలయం’, ‘చెలిమి క్లబ్’లు నిర్వహిస్తూ అదే కోవలో చేసిన మరో గొప్పపని తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల వారిగా ‘తెలంగాణ బడిపిల్లల కథలు’ తెచ్చారు. కథల కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ వారి ఆహ్వానం మేరకు ఆదిలాబాద్ జిల్లా ‘బడిపిల్లల కథలు’ ఎంపిక కోసం 38 కథలు రాగా కథల కార్యశాలలో పాల్గొన్న నిష్ణాతులైన బాలసాహితీవేత్తలు 15 కథలను ఎంపిక చేశారు. ఈ బాధ్యతను నెరవేర్చే క్రమంలో ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ’ నిష్ణాతులతో ఎన్నో సమావేశాలు, సదస్సులు, చర్చలు, బాల చెలిమి ముచ్చట్లు నిర్వహించింది.
పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్ లాంటి సమస్యలూ ఉన్నా, ఇలాంటి అంశాలపై దృష్టి సారించిన ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. కవర్ పేజీ బొమ్మ : చింతల జగదీష్, లోపలి బొమ్మలు : కూరెళ్ల శ్రీనివాస్ వేశారు. ఆ పది జిల్లాల బడి పిల్లల కథలు దక్కన్‍ల్యాండ్ పాఠకులకు పరిచయం చేస్తూ మొదటగా ‘ఆదిలాబాద్ బడిపిల్లల కథలు’ బాల సాహితీవేత్త తుమ్మూరి రాంమోహన్‍రావు విశ్లేషణ.
సాక్షాత్తూ చదువులతల్లి కొలువైన జిల్లా సంగడి ఆదిలాబాదు జిల్లా. అభినవ పోతన వానమామలై వరదాచార్యులు, యాది సదాశివ వంటి లబ్ధప్రతిష్టులు నివసించిన జిల్లా. అంబేద కొండయ్య, పులికుంట వీరన్న, మునిపంతులు వంటి పూర్వకవుల నెలవే కాకుండా అందమైన అడవులతో అలరారుతూ ఆదివాసులకు ఆలవాలమైన జిల్లా ఆదిలాబాదు. నైజామునెదిరించిన గోండు వీరుడుదయించిన ఉద్యమనేల ఈ జిల్లా. అల్లం రాజయ్య, వసంతరావు దేశ్‍పాండే, బి.మురళీధర్ వంటి లబ్ధ ప్రతిష్ఠులైన కథా రచయితల పుట్టినిల్లు ఈ జిల్లా. ఇంకా ఎందరో వర్ధమాన కవులు, రచయితలతో సాహితీ సుసంపన్నమైన ఈ జిల్లా నుండి తొలిసారిగా బాలల కథా సంపుటి వెలువడడం ఆనందకరమైన విషయం.
పదిహేను పిల్లల కథలతో ఆదిలాబాదు జిల్లా నుండి వెలువడిన కథా సంపుటి చదువగానే ఆశ్చర్యం కలిగింది. బడిపిల్లల్లో భావ వికాసం స్పష్టంగా గోచరించింది. కథలన్నీ సామాజికతను పెనవేసుకుని సమాజం పట్ల పిల్లల ధోరణిని తెలియబరచేవిగా ఉన్నాయి. నాలుగు జిల్లాలుగా విడిపోక ముందున్న ఆదిలాబాదు జిల్లా ప్రాతిపదికన వెలువడిన ఈ సంపుటిలో దండేపల్లి, మంచిర్యాల, రాస్పల్లి విద్యార్థుల కథలున్నాయి. ఆయా పాఠశాలల సంబంధిత ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయుల ప్రోత్సాహం ప్రేరణలే పిల్లలను కథలు రాయడానికి పురికొల్పి ఉండవచ్చు. ఇప్పుడిప్పుడే బాలసాహిత్య అభివృద్ధికి బాటలేర్పడుతున్నాయి. ఇది తొలి దశ అయినా విద్యార్థుల ఊహాశాలీనతకు మచ్చు అనవచ్చు. మున్ముందు ఈ పిల్లకాలువలే పెద్ద నదులుగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.
కథలను పరిశీలిస్తే ఒకరు అమ్మ త్యాగాన్ని, ఒకరు తల్లితండ్రుల కష్టాన్ని, మరొకరు గురువు చదువు ప్రయత్నాన్ని, ఇంకొకరు అతిథి సత్కారాన్ని, ఇంకా లౌక్యం, గుణ పరీక్ష వంటి విషయాలను ఎన్నుకుని కథలు రాసే ప్రయత్నం చేయడం హర్షదాయకం.
నేటి బాల రచయితలే భావితరంలో పెద్ద రచయితలు కావడమే గాక బాధ్యతగల పౌరులౌతారనే ఆశ ఈ చిరుపుస్తకం చదవగానే కలిగింది. ప్రేరణ వల్ల అనేక మంచి పనులు జరుగుతాయన్నది నిర్వివా దాంశం. బాలచెలిమి నిర్వాహకులు ఇలా జిల్లాల వారీగా బడిపిల్లలను పురికొల్పి అసలైన బాలసాహిత్యాన్ని వెలికి తీసుకువచ్చే ప్రయత్నం అభినందనీయం. కథలు రాసిన విద్యార్థులకు ఆశీస్సులు. తోడుపడిన ఉపాధ్యాయులకు అభినందనలు. బాలచెలిమి నిర్వాహకులకు ధన్యవాదములు తెలియ జేస్తూ …
తుమ్మూరి రాంమోహన్ రావు
బాల సాహితీవేత్త
పుస్తకాల కోసం సంప్రదించాల్సిన చిరునామా :
‘బాలచెలిమి’ భూపతిసదన్, 3-6-716, స్ట్రీట్ నెం.12,
హిమయాత్‍నగర్, హైదరాబాద్ – 500029
ఫోన్ : 9030 62628