రచయితలు చాలా మంది వివిధ వృత్తులలో వున్నవారే. రచననే వృత్తిగా చేసుకొని బతుకుతున్న రచయితలు చాలా తక్కువ. తెలుగులో లేరనే చెప్పవచ్చు. ఉన్నా వాళ్ళని వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు.
వివిధ వృత్తుల్లో వున్నవాళ్ళు వాళ్ళ వృత్తికి సంబంధించిన రచనలు చేస్తే అవి చాలా బలంగా వుంటాయని చాలా మంది అంటూ ఉంటారు. అది నిజమని చెప్పిన రచయితలూ వున్నారు. అది పూర్తి నిజం కాదని చెప్పిన రచయితలు ఎంతో మంది. వేరే వృత్తుల్లో వున్న వాళ్ళు తమది కాని వృత్తుల గురించి చాలా బలమైన కథలూ కవిత్వాలు ఎంతో మంది రాశారు.
సాహిత్యం ఎలా ఉద్భవిస్తుంది? రచయితల అనుభవాల నుంచి ఉద్భవిస్తుంది. ఆలోచనల నుంచి కూడా వస్తుంది. అది కథ కావొచ్చు, మరేదైనా కావొచ్చు. అనుభవాలు, ఆలోచనలు తప్పక ఆ రచయితవే అయివుండాల్సిన అవసరం లేదు. ఇతరుల అనుభవాల నుంచి కూడా సాహిత్యం వస్తుంది. తాను చూసిన వాతావరణాన్ని అట్లాగే తాను చూడని వాతావరణాన్ని కూడా రచయిత సృష్టిస్తారు.
రోజూ రాసే వృత్తి వున్న వాళ్ళు న్యాయవాదులూ, న్యాయ మూర్తులూ, పోలీసులు, ఆయా వృత్తుల నుంచి వచ్చిన రచయితలనీ వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు. ‘న్యాయవాద వృత్తిలో వున్న వాళ్ళు సాహిత్య వృత్తిలో వున్నట్టేనని’ విలియమ్ ఎల్.ప్రాసర్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో చాలా మంది ఏకీభవించరు కానీ వాళ్ళు సృజన చేస్తున్నారన్న విషయంతో ఏకీభవిస్తారు. న్యాయవాదులూ, న్యాయమూర్తులే కాదు రోజూ సృజన చేస్తున్న జాబితాలోకి పోలీసులు కూడా వస్తారు. ఇంకా చాలా మంది వృత్తుల్లో వున్న వాళ్లు కూడా వుండవచ్చు. పోలీసులకి సృజనాత్మకత శక్తి ఎక్కువ. అందుకే ఓ కవితలో ఇలా అన్నాను.
‘‘కథల్ని సృష్టించడం
విషయాల్ని వక్రీకరించడం
వాళ్ళకి తెల్సినంత
మన వ్యాపార రచయితలకి కూడా తెలియదు.
లాకప్ డెత్‍ల గురించి
ఎన్‍కౌంటర్ల గురించి
లాఠీ చార్జీల గురించి
పోలీస్ కాల్పుల గురించి
వగైరా వగైరాల గురించి
వాళ్ళ కథలు
వాళ్ల సృజనాత్మక శక్తికి ప్రతిరూపాలు
వాళ్ల సృజనాత్మ శక్తితో
కాస్సేపు
వాళ్ళు రచయితలవుతారు’’
న్యాయవాద వృత్తిలో వున్న వాళ్ళూ, న్యాయమూర్తులూ, పోలీసులూ ప్రతిరోజూ చదవాల్సి వుంటుంది. రాయాల్సి వుంటుంది. మన తెలుగు రచయితలు తమ రచనలని తప్ప ఇతరుల రచనలు చదవడం లేదన్న అపవాదం వుండనే వుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే వాళ్ళందరూ ఎక్కువగా చదవాల్సి వుంటుంది. అట్లాగే రాయాల్సి వుంటుంది. మనుషుల మనస్తత్వాన్ని పరిశీలించాల్సి వుంటుంది. సునిశితంగా పరిశీలించే గుణం కూడా వాళ్ళలో ఎక్కువగా వుండాలి. అందులో ఎవరికీ సందేహం లేదు.
న్యాయవాదులకీ రచయితలకీ సామీప్యం వుంది. కానీ ప్రతి న్యాయవాది రచయిత కాలేదు. ప్రతి రచయితా న్యాయవాది కాలేడు. ఈ సామీప్యత ఒక్కటే కాదు, రెండు వృత్తులకీ పొందిక వుండాలి. ఈ సామీప్యతే కాదు రెండు వృత్తుల్లో ప్రధాన స్థానం సృజనే. అట్లాగే రెండింటికి కావల్సిన ముడి పదార్థాలు దాదాపు ఒకే విధంగా వుంటాయి. మనుషుల్లోని వైరుధ్యాలూ, సస్పెన్స్, ట్రాజెడీ లాంటివి లేకుండా ఏ రచనా వుండదు. ఏ కేసూ కూడా వుండదు. పోలీసుల్లో కూడా సృజనాత్మకత వుంటుంది. వాళ్ళు తమ అభియోగాల్లో ఎన్నో కొత్త కథలు సృష్టిస్తూ వుంటారు. అయితే వీళ్ళకీ రచయితలకీ, న్యాయవాదులకీ ఒక భేదం వుంది. న్యాయవాద వృత్తిలో వున్న వాళ్ళకీ అదే విధంగా రచయితలకీ, రాయడం ఎంత ముఖ్యమో చదవడం కూడా అంతే ముఖ్యం. బాగా చదవని రచయితలూ న్యాయవాదులూ తమ వృత్తుల్లో రాణించలేరు. వారి స్థానం వెనకవైపే వుంటుంది. కానీ పోలీసుల విషయానికి వస్తే వాళ్లు చదవాల్సిన అవసరం లేదు. కథలు సృష్టించే నేర్పు వుంటే చాలు. వాళ్ళు చేస్తున్న పని కూడా అదే.
రచయితలు తమ అనుభవాలనే వ్యక్తీకరించాలన్న నియమం ఏదీ లేదు. అలాంటి నియమం ఎవరైనా పెట్టుకుంటే ఆ రచనలు పేలవంగా మారే అవకాశం వుంది. కన్యాశుల్కం నాటకం విషయానికి వస్తే అందులో అప్పటి సమకాలీన జీవనం ఎంత వుందో న్యాయవాద వృత్తి పోలీసుల గురించిన ప్రస్తావన అంతకంటే ఎక్కువగా ఉంది.
‘లా’ చదువుకున్న వాళ్ళు ఆ వృత్తిలోనే రాయాల్సిన అవసరం లేదు. ఇది అన్ని చదువులకీ వర్తిస్తుంది. చాలా మంది వ్యక్తులను గమనిస్తే వాళ్ళు చదివింది ఒకటి చేస్తున్నది మరో వృత్తి. వృత్తులని కూడా మార్చుకున్న రచయితలు ఎంతో మంది. గ్లాస్‍వర్తీ చదివింది లా. చార్లెస్ డికేన్స్ లా రిపోర్టర్‍గా తన వృత్తిని మొదలు పెట్టాడు. హెన్సీ ఫీల్డింగ్ చదువుకున్నది న్యాయ శాస్త్రమే అయినా ఆయన జర్నలిజంలో, రచనల్లో స్థిరపడ్డాడు.
లా చదవని చాలా మంది గొప్ప రచనలు చేశారు. న్యాయ శాస్త్రాన్నీ, కోర్టు వాతావరణాన్ని తమ రచనల్లో ప్రతిబింబించారు. ఇవి ఇప్పటి రచనలు కావు. 339 బి.సి.లో ప్లేటో రాసిన అపాలజీలో అప్పటి న్యాయస్థానాల వాతావరణం ప్రస్ఫుటంగా కన్పిస్తుంది. సోక్రటీస్ క్రీస్తుపూర్వం 470లో జన్మించాడు. ఈ అపాలజీలో అతను విచారణని ఎదుర్కొంటాడు. అతని సహచరుడు మెలిటన్ ఆరోపణలని అతను ఎదుర్కొంటాడు. భగవంతుడు లేడని చెబుతూ యువత మనస్సులని చెరుపు చేస్తున్నాడన్న ఆరోపణని సోక్రటీస్ పై మెలిటన్ చేస్తాడు. అతనిపై వున్న ఆరోపణలు రుజువైన తరువాత సోక్రటీస్ జ్యూరీని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తాడు. ఆ తరువాత సోక్రటీసు మరణ శిక్షని అనుభవిస్తాడు. ప్లేటో అపాలజీలోని కొన్ని అంశాలు చదివితే అప్పటి గ్రీకుదేశం, న్యాయవ్యవస్థ మనకు గోచరమవుతాయి. విలియమ్ షేక్స్పియర్ రాసిన నాటకం ‘మర్చంట్ ఆఫ్ వెనీస్’ చదివితే చట్టానికి, మానవత్వానికి వున్న సంక్లిష్టత మనకు అర్థమవుతుంది. షేక్స్పియర్ కాలంలో రెండు రకాలైన కోర్టులు వుండేవి. అవి లా కోర్టులు, ఈక్విటీ కోర్టులు. నిబంధన రూపంలో వున్న చట్ట ప్రకారం ఉపశమనం పొందాలనుకునే వ్యక్తులు ఉపశమనాల కోసం కామన్ ఆ కోర్టులకి వెళ్ళేవాళ్ళు. అలాంటిది లేనప్పుడు ఈక్విటీ కోర్టులకి వెళ్ళేవాళ్ళు. ఆ నాటకంలో ఒప్పంద పత్రాలకి సంబంధించిన చట్టం, దాన్ని అమలు చేసే విధానం ప్రతిబింబిస్తాయి. వీటిని కాదని తీర్పు ఎలా చెప్పవచ్చో ఈ నాటకం ద్వారా తెలుస్తుంది.
ప్లేటో, షేక్స్పియర్‍లే కాకుండా ఇంకా చాలా మంది రచయితలు కోర్టులకి సంబంధించిన రచనలు చేశారు. చట్టాలని, కోర్టులని తమ రచనల్లో చూపించారు. హృదయాలని ద్రవింపజేశారు. వీళ్ళిద్దరూ న్యాయవాద వృత్తితో సంబంధం వున్న వాళ్లు కాదు. తెలుగులో కూడా ఇలాంటి రచనలు చేసిన రచయితలు ఎందరో. అట్లాగే తమ వృత్తి అనుభవాలని అద్భుత కథలుగా మలచిన వ్యక్తులు కూడా వున్నారు. రావిశాస్త్రి, బీనాదేవే కాదు క్రిష్ణారావు, జింబోలు కూడా అందుకు ఉదాహరణలు.
వృత్తిలో వున్న వాళ్ళు తమ వృత్తికి సంబంధించిన కథలు రాయగలరు. సంబంధం లేని వాళ్ళూ రాయగలరు. అందరికీ కావల్సింది సునిశిత పరిశీలనా శక్తి. దానితోబాటు ప్రజల పట్ల ప్రేమా, చదివించే గుణం.
-మంగారి రాజేందర్ (జింబో)
ఎ : 9440483001