తెలంగాణ శాసనాల పరిష్కరణ-ఒక పరిశీలన


కొత్తతెలంగాణ చరిత్రబృందం 7వ నెల వెబినార్‍లో డా. దామరాజు సూర్యకుమార్‍ గారి ప్రసంగపాఠం


తెలంగాణ శాసనాలను మొదట ఎవరు, ఎపుడు పరిష్కరించా రన్నది పెద్దప్రశ్న. చరిత్రకారులు రాసిన ఆధారాలు వెతుకుతుంటే తెలంగాణాలో లభించిన శాసనాలను పరిష్కరించిన వారు 35 మంది కనిపించారు. వారి గురించి వాకబు చేయడానికి, వివరసేకరణ సమయమైతే పట్టింది కాని, విలువైన సమాచారమే దొరికింది.


తెలంగాణలోని పాతజిల్లాలు పదింట్లో వెలుగుచూసిన శాసనాలు 2,795. అందులో జిల్లాలవారీగా అప్పటి పురావస్తుశాఖ ప్రచురించింది నల్గొండ, కరీంనగర్‍, వరంగల్‍, మహబూబ్‍ నగర్‍, మెదక్‍, నిజామాబాద్‍.. 6జిల్లాలవి 1110 శాసనాలు. ఇంకా మిగిలిన హైదరాబాద్‍, ఆదిలాబాద్‍, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలలో ఆదిలాబాద్‍ నాలుగు జిల్లాలలో శాసనాల సర్వేలు పూర్తికాలేదు. అచ్చుతీసి, దాచిన శాసనాలను ఎడిట్‍ చేసి, జిల్లాలవారీగా ప్రచురించాల్సిన పని ఉంది. వీటిలో నిజాం ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రం ఆంధప్రదేశ్‍ ప్రభుత్వాలు ముద్రించినవి, బిఎన్‍ శాస్త్రిలాంటివారు, నాలాంటివారు అచ్చువేసిన శాసనాలు అన్నీ 1500వరకు ఉంటాయి.


శాసనం అన్న మాట ‘శాస్‍’ అనే ధాతువు నుంచి వచ్చిన పదం. శాసించు, ఆజ్ఞాపించు అని అర్థం. యదార్థ చరిత్ర నిర్మాణానికి శాసనాలు ముఖ్యమైన ఆధారాలు. ‘శాసనాలు చరిత్రరచనకు శ్వాసనాళాలు’. శాసనాల అధ్యయనాన్ని ఇంగ్లీష్లో ‘ఎపిగ్రఫీ’ అంటారు. Epi అంటే పైన, graphy అంటే గీత అని అర్థం. దేనిమీదనైనా రాసిన రాతను ఎపిగ్రాఫ్‍ అంటున్నాం మనం. ఈ శాసనాలను శాశ్వతంగా ఉండే పదార్థాలు 1. లోహాలు (Metal Inscriptions), 2. శిలల (Stone Inscriptions) మీద చెక్కుతారు. మల్లంపల్లి వారు తెలుగునేలపై మొదట శిలాశాసనాలు, తర్వాత లోహశాసనాలు, తిరిగి శిలాశాసనాలొచ్చాయని చెప్పారు. కాని, తెలంగాణాలో కోటిలింగాలలో అక్షరాలు తాపిన నాణాలు లభించాయి. కనుక తెలంగాణాలో 2లోహ, 2శిలా శాసనయుగాలు అగుపిస్తాయి. విషయాన్ని బట్టి శాసనాలను దాన, జయస్తంభ, అభయ, క్రయ, దశబంధాలని అనేకరకాలుంటాయి. ఈ శాసనాలలో రాజులు, ప్రాంతీయపాలకులు, అధికారులు ఇచ్చిన దానశాసనాలెక్కువ. వీరు చేసినపనులతో తమని, తమవంశాన్ని, తమ వంశప్రతిష్టని భావితరాలు గుర్తుంచుకోవడానికి వేస్తారని నల్గొండ, హుజూరునగర్‍ నారాయణపురం దగ్గర దొరికిన శాసనం వివరిస్తున్నది.


శాసనాలు వేయించిన రాజవంశాలలో సాతవాహనులు, ఇక్ష్వాకులు, ఆభీరులు, విష్ణుకుండిలు, బాదామీ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణీ చాళుక్యులు, వేంగి చాళుక్యులు, కాకతీయులు, సామంత పాలకులు కాయస్థ, రేచర్ల, చెరకు, విరియాల, మల్యాల, గోన, పారమార, యాదవులు, ఆ తర్వాత వెలమ నాయకులు, ముసునూరి నాయకులు, విజయనగరరాజులు, గజపతులు, రెడ్డిరాజులు, బహమనీలు, కుతుబ్షాహీల లున్నారు. ప్రాకృతం, ప్రాకృత-సంస్కృతం, సంస్కృతం, కన్నడం, తెలుగన్నడం, తెలుగు, ఉర్దూ, పార్సీ, ఆంగ్ల భాషలలో శాసనాలు లభించాయి.
భాషాపరంగా చూసినపుడు కోటిలింగాల నాణాలమీద గోబద(స) తొలితెలుగు పేరు. అచ్చ తెలుగుపదం రాతిమీద చెక్కి లభించింది విష్ణుకుండిల నాటి కీసరగుట్టకోటలోని ‘తొలుచు వాండ్రు’. ఇది 5వ శతాబ్దినాటిది. దీన్నే తొలి తెలుగుశాసనం అనవచ్చు. తెలంగాణా శాసనాలలో తొలితెలుగు పద్యం వేములవాడ చాళుక్యులనాటి కుర్క్యాల జినవల్లభుని శాసనంలో కనిపించింది. తొలి సంస్కృత శాసనం నాగార్జునకొండలో అభీరవాసుదేవుడి శాసనం.


శాసనపద్ధతి:
తెలంగాణా శాసనాలలో 3 ముఖ్య భాగాలుంటాయి.
1. ప్రస్తావన 2. ప్రకటన 3. ఉపసంహారం.
ప్రస్తావనలో మంగళవాచకం, శాసన స్థలం, శాసనకాలం, దాత వివరం ఉంటాయి.
మంగళవచనాలలో నాటి మతవిశ్వాసాలప్రకారం హిందువుల శాసనం స్వస్తితో, జైనుల శాసనం జినవల్లభాయతో, బౌద్ధుల శాసనం నమోబుద్ధాయతో మొదలౌతాయి. మతచిహ్నాలు, రాజలాంఛనాలు శాసనాల మొదటే చెక్కుతారు. కాలాన్ని చెప్పడానికి కలియుగం, శక సం., విక్రమ సంవత్సరం, హిజ్రీ, ఫసలీ, క్రీస్తుశకం వాడుతారు. కొన్ని శాసనాలలో కాలాన్ని తెల్పడానికి Chronogramని ఉపయోగిస్తారు.


ప్రకటనలో దానవివరాలు, సుంకవిషయాలు, దానం ఉద్దేశం, గ్రహీత ఘనత, దానభూమి వివరాలుంటాయి. ఉపసంహారంలో ఆశీస్సులు, అభ్యర్థన, అభిశంసన, శాపోక్తులు కనిపిస్తాయి. ఆశంసనమంటే శాసనాలలోని నియమ, నిబంధనలను ఆచరించడంవల్ల కలిగే శుభాలు, పుణ్యాలను వివరించడం, అభ్యర్థన అంటే తామిచ్చిన దానాన్ని రక్షించమని భావితరాలను కోరడం, ‘శాసనాన్ని పాటించినవారి పాదాలను, పాదధూళిని శిరస్సుపై ధరిస్తామని చెప్పడం కనిపిస్తుంది. ఆశంసనలో ‘ఈ శాసనధర్మాన్ని ఆచరించినవారికి అనంతములైన పుణ్యములగును, కాదన్న వారికి పంచమహాపాతకాలు చుట్టుకుంటాయనడం ఉంటాయి. అభిశంసన అంటే శాసనభంగం చేసినవారికి కలిగే దోషాలు ‘స్వదత్తాం పరదత్తం’ వంటి శ్లోకాలలో కనిపిస్తుంది.


తెలంగాణ శాసనాలు వెలుగు చూసిన వైనం:
పరబ్రహ్మశాస్త్రిగారు రాసినట్లు 1882లో జెఎఫ్‍ ఫ్లీట్‍ వేయి స్తంభాలగుడి శాసనాన్ని పరిష్కరించడంతో మొదలైందని చెప్పవచ్చు. కాదు అంతకుముందే మొద లైందని ఆధారాలు కూడా చూపుతున్నారు. అట్లే 1903లో బెందాల్‍ అనే కేంబ్రిడ్జి యూనివర్సిటి ప్రొఫెసర్‍ ప్రచురించిన ‘గ్రాంట్‍ ఆఫ్‍ కుసుమాదిత్య’ అనే తామ్రశాసనం తొలి తెలంగాణాశాసన పరిశోధకపత్రం. ఇది తొలిసారిగా ముదిగొండచాళుక్య రాజ వంశాన్ని వెలుగులోనికి తెచ్చిన శాసనం. కోటగిరి తామ్రశాసనం విరియాల వంశాన్ని బయటపెట్టింది. నిజాం ప్రభుత్వం 1925లో ప్రకటించిన లేఖలో బోధన్‍ తాలూకాలోని ఒక జాగీరు గ్రామం చెరువులో చేపలవలలో పడ్డ 3రాగిరేకుల శాసనం నిజాం కాలేజి ప్రొఫెసర్‍ సిరిగురి హను మంతరావు వద్దకు చేరింది. ఆ శాసనాన్ని హైద్రాబాద్‍లోని చాదర్‍ ఘాట్‍ పాఠశాలలోని సంస్కృత పండితుడు లక్ష్మీకాంతశాస్త్రి పరిష్కరించి పంపాడు. నిజాం పురావస్తు శాఖ అధికారి గులాం యాజ్దానీ దానిని పరిశీలించి భారతప్రభుత్వ ఎపిగ్రఫిస్టు కృష్ణశాస్త్రికి పంపాడు. శాసనాన్ని చదివి వారు 1. ఈ కోటగిరిశాసనంవల్ల రుద్రమ దేవి గణపతిదేవుని భార్య కాదు కూతురన్నది విదితమవుతున్నదని, 2. విరియాల వంశంవారు కాకతీయుల సామంత రాజులని తెలుస్తున్నదని దీనిమీద ఒక మోనోగ్రాఫ్‍ రాయాలని కోరారు. అంతకు ముందే వెలుగుచూసిన మల్కాపురం శాసనంలో రుద్రమ గణపతిదేవుని కూతురుగా పేర్కొనబడిన సంగతిని కోటగిరిశాసనం బలపరుస్తున్నదన్నారు.


ఇంద్రపాలనగరం (తుమ్మలగూడెం) పొరుగూరు నాగారం గ్రామంలో తమ్మళి ఆంజనేయులుకు దొరికిన రాగిరేకుల శాసనాన్ని సేకరించిన బిఎన్‍ శాస్త్రిగారు వాటిని చదివి, పరిష్కరించి, తుమ్మల గూడెమే విష్ణుకుండుల రాజధాని అని నిర్ధారించి ప్రభుత్వ పురాతత్త్వ శాఖాధికారిగారికి అందజేసారు. ఈ శాసనాన్ని నిర్ధారించడానికి భారతప్రభుత్వ ఎపిగ్రఫిశాఖ అధికారి ఘాయ్‍ గారే స్వయంగా వచ్చి, శాసనాన్ని పరిశీలించి, అది కూటశాసనం కాదని, నిజమని తెలిపారు. నకిరెకల్‍ సమీపగ్రామం చందుపట్లలో ముత్యాలమ్మగుడి వద్ద వున్న శాసనాన్ని గుర్తించిన రంగాచారిసోదరులు పురాతత్వశాఖకు తెలియజేసినారు. 1974లో ఆ శాసనాన్ని పరిష్కరించిన పరబ్రహ్మశాస్త్రి అది రుద్రమదేవి, ఆమె సేనాని మల్లికార్జుననాయకునితోపాటు యుద్ధంలో మరణించిన సంగతిని తెలియజేస్తున్నదని భారతిపత్రికలో వ్యాసం రాసారు.
తెలంగాణ శాసనపరిష్కర్తలలో భారతప్రభుత్వ ఎపిగ్రఫిస్టు, చరిత్రకారుడు, బ్రిటిష్‍ ఇండియా ప్రభుత్వంలో సివిల్‍ సర్వంట్‍,’The Inscriptions of Early Guptas and Their Successors’ గ్రంథకర్త, జెఎఫ్‍ ఫ్లీట్‍(1878) ‘వేయిస్తంభాలగుడి’ శాసనాన్ని చదివి పరిష్కరించాడు. కంభంపాటి అప్పన్నశాస్త్రి, తదితరులు కూడా ఈ శాసనాన్ని చదివారు. సంస్కృతాంధ్రపండితులు మానవల్లి రామకృష్ణకవి (1908-12, వనపర్తి సంస్థానోద్యోగి) మహబూబ్‍ నగర్‍ జిల్లా శాసనసేకరణ, పరిష్కరణలు చేసాడు. రంగస్వామి సరస్వతి(ఏఎస్సై అధికారి) నాగార్జునకొండ సంస్కృతభాషాశాసనాన్ని పరిష్కరించారు. వీరితోపాటు హెచ్‍.శాస్త్రి, హీరానంద్‍ శాస్త్రి కూడా నాగార్జునకొండ శాసనాలను చదివారు. వి.రామచంద్రన్‍ (ఆం.ప్ర. ప్రభుత్వాధికారి) గారు కూడా అక్కడే నివసించి శాసనాలను సేకరించి, పరిష్కరించి నారు. శేషాద్రి రమణ కవులు (1915-25) నేటి వరంగల్‍, ఖమ్మం జిల్లాలలోని అనేకశాసనాలను సేకరించి, పరిష్కరించి ప్రకటించినారు. పుట్టపర్తి శ్రీనివాసాచారి (నిజాం ప్రభుత్వ ఎపిగ్రఫీ సంపాదకులు) ‘Corpus of Inscriptions of Telangana Districts of H.E.H.Nizam Dominions’ అనే శాసనగ్రంథానికి సంపాదకులుగా ఉన్నారు. Corpus of Inscriptions of Telangana Districts of A.P%. అనే 3శాసనసంపుటులకు కూడా వారే ఎడిటర్‍. సిరిగురి హనుమంతరావు (నిజాంకాలేజి) ‘కోటగిరి ప్లేట్స్ ఫేం’, హెచ్‍.క•ష్ణశాస్త్రి ‘విరియాల వంశాన్ని వెలుగులోనికి తెచ్చినవారు’, ‘చరిత్రకారులకు ముఖ్యంగా శాసనపరిశోధకులకు తెలంగాణా స్వర్గధామం’ అన్న కొమర్రాజు లక్ష్మణరావుపంతులు, ‘తెలంగాణా శాసనాలు-2’వ సంపుటికి సంపాదకులు గడియారం రామకృష్ణశర్మ, ‘తెలంగాణా శాసనపఠన పితామహుడ’నదగిన మల్లంపల్లి సోమశేఖర శర్మ, ప్రభుత్వ ఎపిగ్రఫిస్టు, వరంగల్‍, నల్గొండ శాసనాల పరిష్కర్తగా ప్రసిద్ధులు నేలటూరి వేంకటరమణ, స్టేట్‍ మ్యూజియంలోని తామ్రపత్రశాసనాల మీద పుస్తకాలు రాసిన ఎన్‍.రమేశన్‍, శంకరనారాయణ (మైసూర్‍), లక్ష్మీనారాయణ, సిజెఎమ్‍ కోట్రయ్య, సీతారాం జాగీర్దార్‍, జి.చంద్రయ్య, డిసి సర్కార్‍, జి.ఎస్‍. ఘాయ్‍, తెలంగాణాశాసన పరిష్కర్తలకే పితామహుడు, తెలంగాణా శాసనాలను పరిశోధించిన తొలితెలంగాణా శాసనపరిష్కర్త, బహు(70)గ్రంథకర్త, విష్ణుకుండి రాజవంశ శాసనాల ఫేమ్‍ బి.ఎన్‍.శాస్త్రి, ‘నల్గొండ జిల్లా శాసన సంపుటి-1, కరీంనగర్‍ జిల్లాశాసనాల సంపుటులు, ఎపిగ్రాఫియా ఆంధ్రికా వంటి శాసనగ్రంథాలు, కాకతీయులు ఫేమ్‍ పి.వి.పరబ్రహ్మ శాస్త్రి, తెలంగాణపేరున్న తెల్లాపూర్‍ శాసనాన్ని వెలుగులోకి తెచ్చినవాడు, మెదక్‍ జిల్లా శాసనసంపుటి సంపాదకుడు ఎన్‍.ముకుందరావు, ‘మహబూబ్‍ నగర్‍ జిల్లా శాసనసంపుటాలు రెంటికి సంపాదకుడు జోగినాయుడు, ఎన్నెస్‍ రామచంద్రరావు మెదక్‍, మహబూబునగర్‍ జిల్లా శాసనసంపుటాలకు తాను కూడా సంపాదకుడే. ‘జైనశాసనాల స్పెషలిస్టు ఘంటా జవహర్‍ లాల్‍, ప్రభుత్వ ఎపిగ్రఫీ డిపార్టుమెంటులో టెక్నికల్‍ అసిస్టెంటుగా చేరి, చదువుకుని శాసన పరిష్కర్తగా ఎదిగిన కొమరయ్య, తెలంగాణా శాసనాలపై ప్రత్యేకంగా కృషిచేసిన జితేంద్రబాబు, ఈమని శివనాగిరెడ్డి గారలు, నిజామాబాద్‍ శాసనసంపుటికి సంపాదకులైన వెంకటరత్నం, బ్రహ్మచారిగారలు, తెలంగాణాలోని ఎన్నో బ్రాహ్మీశాసనాలను పరిష్కరించినవారు ఏఎస్సై ఎపిగ్రఫీ శాఖ డైరెక్టర్‍ మునిరత్నంరెడ్డి. మంజీరానదిలోయలో బ్రాహ్మీలిపి లేబుల్‍ శాసనాలను వెలుగులోనికి తెచ్చినవారు ఎం.ఏ.శ్రీనివాసన్‍. తెలంగాణాశాసనాల మీద కృషిచేస్తున్నవారు ద్యావనపల్లి సత్యనారాయణ. ‘ఆచంద్రార్కం, తెలంగాణా కొత్తశాసనాలు కొన్ని’ అనే శాసనసంపుటులను, బిఎన్‍ శాస్త్రి తర్వాత తెలంగాణ శాసనాలమీద ప్రత్యేకంగా గ్రంథాన్ని తెచ్చినవారు దామరాజు సూర్యకుమార్‍. కొత్తతెలంగాణ చరిత్రబృందం నిర్వాహకుడు, కొత్త తెలంగాణశాసనాలను పరిష్కరిస్తున్నాడు శ్రీరామోజు హరగోపాల్‍.


తెలంగాణా నాణాల పరిశోధకులు సంగనభట్ల నరహరి, మారేమండ రామారావు, దేమెరాజారెడ్డి, వీరేందర్‍, బి.మురళీధర్‍ రెడ్డి, కందుల వేంకటేశ్‍, వైకుంఠాచారి లిపిగల నాణాలను పరిశోధించినవారు.
గతంలో ఐకె శర్మ, వివి కృష్ణశాస్త్రి, సూర్యనారాయణ, గులాం యాజ్దానీ, ఖాజా అహమ్మద్‍ మొహమూద్‍, టి.శ్రీనివాస్‍, పిఎస్‍ తారాపోర్‍, ఎస్‍.రామ, హర్మజ్‍ కౌస్‍, అబ్దుల్‍ వహీద్‍ ఖాన్‍, ఆర్‍.సుబ్రహ్మణ్యం, వివి మిరాసీ, ఎస్‍. శంకర్‍ నారాయణ్‍, దినకర్‍ కేశవరాం మన్సబ్‍ దార్‍, డా. అమ్జద్‍ అలీ, సిద్ధిఖీ, పిఎల్‍ గుప్త, పివిపిశాస్త్రి, ఎన్‍.రమేశన్‍, ఎన్నెస్సార్‍, సఫీయుల్లా, కేఎస్బీ కేశవ, జి.కమలాకర్‍, టివీజీ శాస్త్రి, ఎఆర్‍ వి ప్రసాద్‍, ఏఎమ్‍ శాస్త్రి నాణాలమీద పరిశోధనలు చేసినవారిలో ముఖ్యులు.


ఉపసంహారం:
1880 నుంచి నేటివరకు తెలంగాణాలో అవిచ్ఛిన్నంగా, నిరంతరంగా కొత్త శాసనాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. చరిత్ర పరిశోధకులు ఈ శాసనాల్ని చదువకుండా చరిత్రరచనలో ముందుకు సాగలేరు. చరిత్రకు శ్వాసకోశాలు శాసనాలే. ఇటీవల తెలంగాణా శాసనాలమీద తెలుగు దిన, మాసపత్రికలలో చక్కటి వ్యాసాలు రాస్తున్నారు. భిన్నూరి మనోహరి శాసనపర్వం పేర నమస్తే తెలంగాణలో, ఈమని శివనాగిరెడ్డి ‘అలనాటి మేటి శాసనాలు’ శీర్షికతో దక్కన్‍ లాండ్‍ మాసపత్రికలో వ్యాసపరంపర కొనసాగి స్తున్నారు.

డా।। దామరాజు సూర్యకుమార్‍, 7995764613
శాసనాధ్యాయి, చరిత్రకారులు ప్రిహా ఉపాధ్యక్షులు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *