సాహిత్యం అనేది హృదయగీతం. అది కథ కావొచ్చు. నవల కావొచ్చు. కవిత్వం కావొచ్చు. రచయిత తన భావాలని వ్యక్తీకరించే సాధనం సాహిత్యం. తన ఆవేశాన్ని, ఉద్దేశాన్ని బహిరంగ పరచుకునే సాధనం సాహిత్యం. రచయిత తన ఉద్దేశాలని, ఆవేశాన్నే కాదు తన తోటి ప్రజల ఆవేశాన్ని, బాధని, అనుభవాలని వ్యక్తీకరిస్తాడు
సమకాలీన సమస్యలని రచయిత పట్టించుకోవాలి. వీటి మీద సృజన చెయ్యాలి. ఇప్పుడు మన దేశం అనేక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నది. రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రాజధానిలో రోజూ జరుగుతున్నాయి. చిన్న పిల్లల మీద మహిళల మీద నేరాలు నిరాటంకంగా జరుగుతున్నాయి. ఇవే కాకుండా అవినీతి, నిరుద్యోగం ప్యాక్టరీల మూసివేతలు, కరెంటు కోత, నీటికొరత ఇలా ఎన్నో సమస్యలు… వీటి గురించి గొంతు విప్పకుండా తన వ్యక్తిగత సమస్యల మీద అనుసృజన చేస్తే ఆ రచయితని సమాజం పట్టించుకోదు.
గతంలో జరిగిన విషయాల గురించి చాలా మంది రాస్తూ వుంటారు. అది బాగానే వుంటుంది. సమకాలీన సమస్యల మీద రాస్తే వాటిని ఆసక్తికరంగా చదువుతారు. గత కాల విషయాలని వర్తమాన విషయాలతో పోల్చి చెప్పినప్పుడు కూడా ఎక్కువ చదువుతారు.
కళ కళ కోసమా? కళ ప్రజల కోసమా. వీటి గురించి చాలా మంది చాలా కాలంగా చర్చించారు. కళ ప్రజల కోసమే. ప్రజల కోసం చెప్పే కళలో కళ వుండాలి. కళలేనపుడు అది కాంతి విహీనం అవుతుంది. భారతదేశం లాంటి దేశానికి ఆ మాటకొస్తే పేద దేశాలన్నింటిలో కళకళకోసం వుండకూడదు. కళ ప్రజల కోసం వుండాలి. మనదేశం ఎదుర్కొంటున్నటువంటి సవాల్లు ఏ దేశమూ ఎదుర్కోవడం లేదు. పేదరికం, నిరుద్యోగం, అమాయకత్వం, కులం, ప్రాంతం లాంటి సమస్యలని, సవాళ్లని ఎన్నో మన దేశం ఎదుర్కొంటుంది.
రచయితలు, కవులు కలలు కంటారు. అందరూ మంచిగా వుండే కాలం రావాలని కోరుకుంటారు. అందుకని రచనల్లో సమాజం ప్రతిబింబించాలి. సమస్యలపైన గొంతెత్తాలి.
గతంలో వచ్చిన మంచి సాహిత్యాన్ని గుర్తించాలి. వర్తమానంలో వస్తున్న మంచి సాహిత్యాన్ని కందీలు పెట్టి ప్రజలకి చూపించాలి. ప్రతిదీ వ్యాపారం అయిన ఈ కాలంలో సాహిత్యం వ్యాపారం కాలేదు. అందుకు అందరూ సంతోషించాలి. కవిత్వం, కథలు ఎవరూ చదవడం లేదని చాలా మంది అంటూ వుంటారు. అది పాక్షిక సత్యమే. చదువుతున్నారు, పుస్తకాలని కొంటున్నారు.
ప్రభుత్వం రచయితలని, కవులని పట్టించుకోరు. సాహిత్యాన్ని ప్రోత్సహించరు. రచయిత పుస్తకాలని గ్రంధాలయాలు కొనవు. కొన్నా వాటిలో ఎన్నో సమస్యలు. వీటి గురించి ఆలోచించే వాళ్లు లేరు. కానీ ఇదే ప్రభుత్వం క్రీడాకారులకి, సినిమా తారలకి ఇస్తున్న ఆదరణ ప్రోత్సాహం అధికం. ఎన్నో అవార్డులు, ఎన్నో కమిటీలు. పద్మశ్రీలు, పద్మవిభూషణ్‍లు అన్నీ వాళ్ళకీ దానికి కారణం ఏమిటి?
కవులు, రచయితలు తమ రచనల్లో ప్రశ్నిస్తారు. ఇది సమాజం గురించి పట్టించుకున్న రచయితల గురించి చెబుతున్న మాట. కవిత్వంలో వ్యాపారం లేదు. కథలో కూడా లేదు. నవలల్లో కొంత వ్యాపారం వుండేది. ఇప్పుడు అది లేదు. ఏమైనా వుంటే జీవిత చిత్రణ వుంటుంది. ఇవి జోల పాటలు పాడవు. పాడక పోగా ఆలోచింప చేస్తాయి. ఆందోళన కలిగిస్తాయి. ప్రభుత్వం కోరుకుంటున్న వేవీ ఇవి అందించవు.
రోమన్ చక్రవర్తులు ఈ విధంగా చెప్పేవాళ్ళు ‘‘ప్రజలకి అన్నం పెట్టక పోయినా పర్వాలేదు. కానీ కొంత సర్కస్ లాంటి వినోదాన్ని వాళ్లకి అందించాలి’’ ఈ మాటని మన దేశంలోని అన్ని ప్రభుత్వాలు పాటిస్తున్నాయని అన్పిస్తుది. ఒక దేశంలో క్రికెట్ ఆ తరువాత మరో దేశంలో క్రికెట్. ఒక కప్పు తరువాత మరోకప్పు. సంవత్సరం పొడుగునా ఏదో ఒక క్రికెట్ నిరంతరాయంగా కొనసాగు తూనే వుంటుంది. ప్రజలు ఆటల్లో తలమునకలవుతూ వుంటారు. వారికి తమ ఆర్థిక అవసరాలు, కష్టాలు, కన్నీళ్లు మర్చిపొయ్యేలా ఈ ఆటలు దోహదపడతాయి. పెరిగిన ధరలు, గుర్తుకు రావు. కరెంటు కోతలు గుర్తుకు రావు. ప్రజలు తమ సమస్యల్ని మర్చిపోయేలా ఈ క్రికెట్ ఉపయోగపడుతుంది.
ఇదే పరిస్థితి సినిమాల్లో వుంది. ఊహాలోకాల్లో తిరిగే పరిస్థితి. బుల్లితెర సంగతి చెప్పాల్సిన పనేలేదు. అత్త మీద కోడలు, కోడలు మీద అత్త, హత్యలు, అహంకారాలు, కక్ష్యలు, కాఠిన్యాలూ ఇలా ఎన్నో మనకు రోజూ దర్శన మిస్తూనే వున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాహిత్యం ఎవరికి కావాలి అన్న మాట విన్పిస్తుంది. కానీ ఇది నిజం కాదు. ఒక జీవితాన్ని ప్రతిబింబించిన కథనో కవిత్వమో, వ్యాసమో రాసినప్పుడు ప్రజల నుంచి ఎంతో స్పందన లభిస్తుంది. ఈ మధ్య పత్రికల్లో రచయిత రచన క్రింద అతని మొబైల్ నెంబరుని, అతని ఈ మెయిల్‍ని ప్రచురిస్తున్నాయి. మొబైల్ ఫోన్ లేని ప్రజలు మన దేశంలో లేరంటే అతిశయోక్తి కాదు. చాలామంది మంచి రచనను, చదివి నిశబ్ధంగా వుండటం లేదు. రచయితలకి ఫోన్ చేసి అభినందిస్తున్నారు. చిన్న మెసేజ్‍ల ద్వారా, సాంఘిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలని పంచుకుంటున్నారు. మెయిలు ద్వారా కూడా అభినందిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అవార్డులు లేవు కానీ ప్రజల నుంచి రచయితలకి అభినందనలు అందుతూనే వున్నాయి.
ప్రజలు మంచి సాహిత్యాన్ని కోరుకుంటున్నారు. మంచి సాహిత్యం అంటే ప్రజల సమస్యలని ప్రతిబింబించే సాహిత్యం ప్రజల బాధల పట్ల ఓ సహనుభూతి అవసరం. అలాంటి రచయితలని గతంలోనే కాదు. ఇప్పుడు గుండెలకు హత్తుకుంటూనే వున్నారు. రచయితలు చేయాల్సింది ఒక్కటే. ప్రజలకి అర్థం అయ్యే విధంగా రాయాలి. వారి సమస్యలు గురించి, వారి బాధల గురించి వారికి అర్థం అయ్యే విధంగా రాయాలి. ప్రపంచంలోని గొప్ప సాహిత్యమంతా సులభంగా వున్నదే. ప్రేంచంద్ రచనలు కావొచ్చు శరత్ చంద్ర రచనలు కావొచ్చు అన్నీ సులభశైలిలో వున్నవే. రచయిత మంచి రచనలు చేయడమే కాదు. మంచి రచనల గురించి చెప్పగలగాలి. ఇది మంచి రచన అని ప్రజలకి చెప్పాలి. కొంతమంది రచయితలు వ్యాసాలు రాసి ఈ పని చేస్తున్నారు.
టీవీ చానళ్ళు కొత్తదనం చూపించడం కోసం రచయితలకు కొంత సమయాన్ని కేటాయిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. రచయితలని గుర్తించే విధంగా పాలకుల మీద ఒత్తిడి కూడా తీసుకొని రావాలి. ఆ తరువాత అవార్డులు అవే వస్తాయి. మానవత్వం వున్న కథలని, హృదయాన్ని తాకే కథలని నవలలని, కవిత్వాన్ని ప్రజలు స్వీకరిస్తున్నారు. ఆయా రచయితలని రచయితలు అభినందిస్తున్నారు. అదే విధంగా రాజ్యహింసని వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘జైభీమ్’ సినిమానే అందుకు ఉదాహరణ. ఈ విషయాన్ని రచయితలు గుర్తించుకోవాలి.
-మంగారి రాజేందర్ (జింబో)
ఎ : 9440483001