‘‘మన కంటి ముందే కనుమరుగైపోతున్న గిరిజన, గ్రామీణ పద్ధతులను కాపాడుకుంటేనే… సురక్షితమైన భవిష్యత్తును భావితరాలకు అందించగలం’’ అంటారు అర్చన సోరంగ్. ఒడిశా రాష్ట్రంలోని మారుమూల గ్రామానికి చెందిన ఈ ఇరవై ఆరేళ్ళ యువతి దేశీయ విజ్ఞానాన్ని వీడియోల్లో భద్రపరుస్తున్నారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి యువ సలహా బృందం సభ్యురాలిగా ఎంపికైన ఆమె… ఇటీవల ఇంగ్లండ్‍లో నిర్వహించిన ‘సిఓపి-26’లో తన వాణిని గట్టిగా వినిపించారు.
అర్చన సోరంగ్ స్వగ్రామం ఒడిశాలోని సుందర్‍గఢ్. ఆమె తండ్రి, తాత ఖడియా తెగకు చెందిన గిరిజన నాయకులు. తమ తెగ గురించి, పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాల గురించీ వారు చెప్పే విషయాలు వింటూ ఆమె పెరిగారు. ‘‘పర్యావరణాన్ని పరిరక్షించేపద్ధతులెన్నో దేశీయమైన జీవన విధానంలో కనిపిస్తాయి. దురదృష్టవశాత్తూ ఆధునికత పేరుతో వాటిని మనం పట్టించుకోవడం లేదు. గ్రామీణులు కూడా ఈ పద్ధతులకు క్రమంగా దూరమవు తున్నారు. కొన్ని కనుమరుగై పోతున్నాయి. అందుకే… ఆరోగ్య సంరక్షణ, పర్యావరణాన్ని, అడవులను పరిరక్షించడం, వ్యవసాయం, సరళమైన జీవన విధానం… ఇలా వివిధ అంశాల్లో స్థానికులు తరతరాలుగా అనుసరిస్తున్న పద్ధతులను నమోదు చేయాలను కున్నాను. అవన్నీ భిన్నమైన రూపాల్లో ఉంటాయి. ప్రజలందరికీ అవి అందుబాటులోకి వస్తే… రోజువారీ జీవితాల్లో వాటిని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. అందుకోసమే ‘ఆదివాసీ దృశ్యం’ అనే సంస్థను ఏర్పాటు చేశాను. గిరిజన సంఘాలను, అడవుల్లో నివసించే వారిని దానిలో భాగస్వాములుగా చేశాను. ఆ దేశీయ విజ్ఞానంపై వీడియోలు తీయడం మొదలుపెట్టాను’’ అని వివరించారు అర్చన. అంతేకాదు, ఈ పద్ధతులను పరిరక్షించాల్సిన అవశ్యకతపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు.
బాధితులు కాదు… నాయకులు కావాలి
‘‘వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉండేది నగరాలు, పట్టణాలపైనేననే అపోహ ఉంది. నిజానికి గ్రామీణ, గిరిజన ప్రజల జీవన విధానం నిలకడగా ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల వారికే ఎక్కువ హాని కలుగుతోంది. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా పర్యావరణం పైనే ఆధారపడి ఉన్నారు. వాతావరణ మార్పులను నిరోధించే చర్యల్లో… వారు బాధితులు కాకూడదు. నాయకులు కావాలి. కాలుష్యరహితమైన జీవనం, వర్షపు నీటి పరిరక్షణ, సేంద్రియ సేద్యం, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం లాంటి ఎన్నో పద్ధతులను మన గ్రామీణులు అనాదిగా అనుసరిస్తున్నారు. అలాగే గిరిజనుల పద్ధతులు, వారు వాడే ఉపకరణాలు కూడా ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. వీటిని ఇతర ప్రజలు కూడా అనుసరిస్తే, పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ మార్పులపై పోరాటానికీ దోహదం చేస్తుంది’’ అని చెప్పారామె.

ప్లాస్టిక్‍కు అదే ప్రత్యామ్నాయం…
ప్రపంచాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్ సమస్య పరిష్కారంలో కూడా గిరిజన సమాజాలు ప్రత్యామ్నాయాలను చూపించగలవని అర్చన అంటున్నారు. ‘‘వాళ్ళు అడవుల నుంచి ఆకులను సేకరిస్తారు. వాటితో ప్లేట్లు తయారు చేస్తారు. గడ్డి ఉపయోగించి కుర్చీ ల్లాంటివి అల్లుతారు. కొబ్బరి పీచుతో దృఢమైన తాళ్ళు పేనుతారు. నవార్లు తయారు చేస్తారు. పొద్దున్నే దంతాలు శుభ్రం చేసుకోవడం మొదలు… రాత్రి నిద్రించేదాకా వారు ఉపయోగించేవన్నీ బయోడీగ్రేడబుల్. అవి ప్లాస్టిక్‍కు ప్రత్యామ్నాయం. కానీ, పర్యావరణ పరిరక్షణలో తమ భాగస్వామ్యానికి తగిన గుర్తింపును గిరిజనులు పొందలేకపోతున్నారు. అంతేకాదు, వారు సేకరించే, తయారు చేసే ఉత్పత్తులకు అందే ప్రతిఫలం కూడా చాలా తక్కువ. ఈ పరిస్థితి మారాలి’’ అంటారు అర్చన.
ఆ త్యాగాలవల్లే సాధ్యమయింది…
ఆమె టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిఐఎస్‍ఎస్) నుంచి రెగ్యులేటరీ గవర్నెన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ప్రస్తుతం ఒడిశాలో ‘టిఐఎస్‍ఎస్ అటవీ హక్కులు, పరిపాలన ప్రాజెక్ట్’లో పరిశోధన అధికారిగా పని చేస్తున్నారు. బాలలు, యువతతో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ‘వైఓయుఎన్‍జిఓ’లో క్రియాశీలక సభ్యురాలు. అలాగే వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శికి సలహాలిచ్చే యువసలహా బృందం సభ్యులు ఏడుగురిలో ఒకరుగా ఆమె ఎంపికయ్యారు. ఈ ఏడాది అక్టోబర్ చివరి నుంచి నవంబర్ పన్నెండు వరకూ ఇంగ్లండ్‍లోని గ్లాస్గోలో నిర్వహించిన ‘వాతావరణ మార్పుల సదస్సు’లో (సిఓపి-26) భారతదేశం తరఫున పాల్గొని… దేశీయ పద్ధతుల విశిష్టతను, స్థానిక ప్రజల భాగస్వామ్యం ఆవశ్యకతను అర్చన గట్టిగా వివరించారు. ‘‘వాతావరణ మార్పుల సమస్య పరిష్కారానికి గ్రామీణ, గిరిజన ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. అటవీ సంపదకు వారే పరిరక్షకులు’’ అనే ఆమె అభిప్రాయంతో సదస్సు ఏకీభవించింది. ఆ మేరకు తీర్మానం చేసింది. ‘‘ఆ సదస్సులో పాల్గొనడం, నా ఆలోచనలను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది’’ అంటున్న అర్చన మరిన్ని ప్రాంతాల గ్రామీణ, గిరిజన పద్ధతులను దృశ్యబద్ధం చేసే ఆలోచనలో ఉన్నారు.
పర్యావరణ పరిరక్షణలో తమ భాగస్వామ్యానికి తగిన గుర్తింపును గిరిజనులు పొందలేకపోతున్నారు. అంతేకాదు, వారు సేకరించే, తయారు చేసే ఉత్పత్తులకు అందే ప్రతిఫలం కూడా చాలా తక్కువ. ఈ పరిస్థితి మారాలి.
సేకరణ : దక్కన్‍న్యూస్
ఎ : 9030 6262 88