రాతిచిత్రాలలో ‘జమిలి ఎద్దుబొమ్మ’

మానవపురాచరిత్రలో రాతియుగాల అధ్యయనం మానవజీవన వికాసానికి మౌలికమైంది. పురామానవుడు ఆకలిని తీర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలలో రాతిపనిముట్ల తయారీ ఒక ముందడుగు. నిరంతరం ఆహారాన్ని వెతుక్కుంటు నేటిఖండాలు, దేశాలు దాటిన మానవులు తమజీవనయాత్రాచరిత్రను తెలుపడానికి చేసిన ప్రయత్నంలో ఒకానొక సమాచారవ్యక్తీకరణ రూపమే రాతిచిత్రం. ఒక రకంగా చెప్పాలంటే పురామానవుని బొమ్మలలిపి అది. అద్భుతమైన రాతిచిత్రాలతో చరిత్రపూర్వయుగపు సంస్కృతి, నాగరికతలను మనకందించారు మన పూర్వీకులు.


చారిత్రకయుగం మానవులు పురాతనకాలం నుంచి మధ్యయుగాలనాటి దేవాలయాలదాక ఆంత్రోపోమార్ఫిక్‍ శిల్పాలను, ఊహాత్మక, భావనాత్మక శిల్పాలనెన్నింటినో అద్భుతంగా రాతిబొమ్మలుగా చెక్కి భవిష్యత్తరాలకు కానుకలుగా ఇచ్చారు.
దేవాలయ శిల్పాలలో యాళీశిల్పాలు ప్రత్యేకం. ఏనుగు, ఎద్దు, సింహం, గుర్రం, మొసలి, పాము, కోతి ఇట్లా అనేక జంతు రూపాలను కలగలిపి కొత్త, వింత జంతురూపాన్ని స•ష్టిస్తుంటారు శిల్పులు. కొన్ని గుడుల గోడలమీద ఒకేతలతో రెండు జంతువులు, ఐదు జంతువులు, ఒకేతలతో ఐదారు శరీరాల మనిషిని చెక్కారు. రామప్పవంటి దేవాలయాలలో న•త్యకారుల కాళ్ళను కలిపేసి 3గురికి 4కాళ్ళే కనిపించేటట్టు చెక్కిన శిల్పాలున్నాయి. ఇవన్నీ శిల్పకారుల ప్రతిభా, వ్యుత్పత్తులకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కాని, ఇటువంటి ప్రతిభాత్మకమైన కళ రాతిచిత్రాలలో కనిపించడం అరుదు. అద్భుతం. మా చారిత్రక యాత్రలో, పరిశీలనలో తెలంగాణరాష్ట్రం మేడ్చల్‍ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామం బయటి అడివిలో ఒక రాతినెలవులోని రాతిచిత్రాల నడుమ రెండుదేహాలు ఒకేమూపురం ఉన్న ఎద్దుల ఎరుపురంగు రాతిచిత్రం కనిపించింది.


గుండ్లపోచంపల్లి రాక్‍ షెల్టర్స్ వివరాలు:
హైదరాబాదుకు 30 కి.మీ.ల దూరంలో కొంపెల్లి గ్రామానికి చేరువలో ఉన్న గుండ్ల పోచంపల్లికి 2కి.మీ.ల దూరంలో ప్రభుత్వ అటవీభూముల అంచున 3శిలాశ్రయాలు (Rock Shelters) భౌగోళికంగా 17.5820 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 78.4617 డిగ్రీల తూర్పు రేఖాంశాల పైన, సముద్రమట్టానికి 545 మీ.ల ఎత్తున ఉన్నాయి. వీటిని తొలుత గుండ్ల పోచంపల్లికి చెందిన డా. సాయికృష్ణ, ఏఎస్సై, నాగార్జునకొండ మ్యూజియం అధికారి గుర్తించాడు. మా చరిత్రబృంద సభ్యులు శ్రీరామోజు హరగోపాల్‍, వేముగంటి మురళీకృష్ణ, కట్టా శ్రీనివాస్‍, కట్టా జ్ఞానేశ్వర్‍, బెల్లంకొండ సంపత్‍ కుమార్‍, చంటి ఈ రాతిచిత్రాల తావులను సందర్శించారు.


గుండ్లపోచంపల్లి రాతిచిత్రాల ప్రత్యేకతలు:
ఇక్కడి రాతిచిత్రాలలో 3 తావులలో ఎరుపురంగు గీతలతో అందంగా చిత్రించిన అడవిదున్నలు, ఇఱ్ఱులు, దుప్పిబొమ్మ, సన్నని గీతల ఏనుగుబొమ్మ, ఈటెలు, తాళ్ళవలలతో వేటగాళ్ళ బృందాలు అగుపించాయి. మరొకచోట 3గురు పురామానవులు సామూహికనృత్యం చేస్తున్నట్లున్న చిత్రం ఉంది. వేర్వేరు కాలాలలో గీసిన చిత్రాలు కొన్నిచోట్ల ఒకదానిపై ఒకటి గీసిన (అధ్యారోపణం, Super imposed) చిత్రాలున్నాయి.
జమిలిఎద్దు బొమ్మ ప్రత్యేకత:
గుండ్ల పోచంపల్లిలోని రాతిచిత్రాల తావులలో మూడవ తావులోని ఎరుపురంగు రాతిచిత్రాలలో ఒకేబొమ్మగా గీసిన ఈ రెండెద్దుల రాతి చిత్రంలో ఎద్దులు ఎదురెదురుగా ఒకఎద్దు మూపురం మరొక ఎద్దుమూపురం కలిసిపోయేంత దాక కలిపిగీసిన తీరు అనన్య సాధ్యం. రెండు మూపురాలు కలిసి ఒకే మూపురంలెక్క, లింగాకారంలో కనిపిస్తాయి. ఎద్దుల తలలు రెండు వైపుల ఏకరీతిని గీయబడ్డాయి. ఎద్దుల కాళ్ళు కలిపిపోలేదు. రెండెద్దులు ఒకే ఎత్తు, ఒకేరూపు దేహాలతో చిత్రించబడ్డాయి. రెండెద్దులు కలిసున్న బొమ్మ పొడవు 70 సెం.మీ., ఎత్తు 55 సెం.మీ., బొమ్మలో ఎడమవైపున్న ఎద్దు కొంచెం పొడవుగా, కుడివైపునున్నది చిన్నగా ఉన్నాయి. కొమ్ముల ఎత్తే 20 సెం.మీ.లున్నది. రెండెద్దుల కొమ్ములు 1300 డిగ్రీల కోణంతో రెండువైపుల అగుపిస్తున్నాయి.
ఈ రాతిచిత్రాలలో మధ్యయుగాల నాటి దేవాలయాల యాళీ శిల్పాలకు ఆదర్శమైన ‘ద్వయాద్వైత వృషభచిత్రం’ అపూర్వమైనది. ఎక్కడా ఇంతకు ముందు కనిపించని రాతిచిత్రం. ఒక ఎద్దుకు ఎదురుగా మరొక ఎద్దు మూపురాల వరకు ఒకదానిలో ఒకటి ఇమిడిపోయి ఒక్కటిగా కనిపించే ఈ రాతిచిత్రం నభూతో నభవిష్యతి. రాతిచిత్రాలలో పట్టం కట్టదగిన బొమ్మ. సాధారణంగా ఏనుగు, ఎద్దు జమిలిగా తల వరకు కలిసిపోయి (ఇంటర్‍ లాకింగ్‍), అటు ఎద్దు, ఇటు ఏనుగు తలలతో పట్టడకల్లులో, వాంకిడిలో, శ్రీశైలంగుడి ఉత్తరప్రాకారం గోడమీద, కనిపించే ‘వ•షభకుంజరం’ కల్పనాశిల్పాలలో ప్రఖ్యాతమైనది. కాని, ఇక్కడ రెండెద్దులు ఒకదానిలో ఒకటిచేరి ఒకే చిత్రంగా చిత్రించిన ఆ పురామానవుని చేతులకు మొక్కాలి. అద్భుతమైన నైపుణ్యం, నవ్యమైన ఆలోచనల స•ష్టి ఈ ‘జమిలి ఎద్దు బొమ్మ’ రాతిచిత్రం. ఈ చిత్రం గీతలశైలినిబట్టి కొత్తరాతియుగపు పశుపోషణ కాలానికి చెందిందని చెప్పవచ్చు.


రాతిచిత్రాలతో పోలిలు, భేదాలు
కర్ణాటక రాష్ట్రం ‘సంగనకల్లు’లోని చెక్కుడుచిత్రాల (Petroglyphs)లో 5 ఎద్దుల కాళ్ళను మాత్రమే సవ్యదిశలో ముగ్గువలె కలిపి చెక్కిన అపూర్వమైన రాతిబొమ్మకు గుండ్ల పోచంపల్లి రాతిచిత్రానికి విశేషమైన సంభావ్యత ఉంది. అక్కడ కూడా కనిపించే మరో రెండెద్దులు గుండ్లపోచంపల్లి జమిలిఎద్దువలె ఒక్కటిగా కాక విడిగానే కనిపించాయి.
రాతిచిత్రాల కాలం:
మొదటి, రెండవ రాతిచిత్రాలతావులలో చిత్రించబడిన అడవిదున్నల బొమ్మలు ఇఱ్ఱుల(మగజింకల) రాతిచిత్రాల చిత్రణశైలి, చిత్రాలలోని వస్తువు ఆధారంగా మధ్యరాతియుగాల నాటివి అనిపిస్తుంది. మూడవ తావులో కనిపించే వైవిధ్యభరితమైన రాతిచిత్రాలు ఒకే కాలానికి చెందినవి కావు. ఈ తావులో అగుపించే రాతిచిత్రాలలో డిజైన్లు, రేఖాగణితాకృతులు, వేట దృశ్యాలు, సామూహిక నృత్యాలు, నెమలి, ఏనుగు, ఎద్దులు కనిపించడంవల్ల ఈ రాతిచిత్రాలు మధ్యరాతి యుగం నుంచి పెదరాతియుగం దాక చిత్రించినవనిపిస్తున్నది.
ఇక్కడ పెచ్చురాతి పనిముట్లు, కొత్తరాతియుగం రాతిగొడ్డలి, పరిసరాల్లో సూక్ష్మరాతి పనిముట్లు లభించాయి. దొరికిన రాతిపనిముట్లు కూడా రాతిచిత్రాల కాలనిర్ణయానికి దోహదపడ్డాయి.
రాతిచిత్రాలమీద రామన్‍ స్పెక్టోగ్రఫీ పరిశోధన:
కొత్తతెలంగాణ చరిత్రబృందం రాతిచిత్రాలను గీయడానికి పురామానవులు రంగుల కొరకు వాడిన పదార్థాలను గుర్తించడానికి సైంటిస్టు, మా సభ్యుడు కట్టా జ్ఞానేశ్వర్‍ ‘రామన్‍ స్పెక్ట్రా’ ద్వారా రాతిచిత్రాల సాంపిల్స్ తీయకుండానే వర్ణవిశ్లేషణలను పరిశోధించి, రాతిచిత్రాలకు ఎరుపురంగు రావడానికి పురామానవులు హెమటైట్‍ వంటి ఇనుపఖనిజపు రాళ్ళచూర్ణాన్ని వాడినట్టు కనుగొనడం జరిగింది. ఇది ఆధునికపరికరాల టెక్నాలజీతో శాస్త్రీయంగా నిరూపించబడిన పద్ధతి. పూనాలో జరిగిన Rasi వారి సెమినార్‍ లో ఈ పరిశోధనా ఫలితాలను మా బృందం ప్రజెంటు చేసింది.
ముగింపు: గుండ్లపోచంపల్లి రాతిచిత్రాలు పరిశోధన చేయతగిన ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. గతంలో తెలంగాణ రాతిచిత్రాలలో నెమళ్ళు అనే పత్రరచన చేసినపుడు కూడా ఇక్కడి రాతిచిత్రాలలోని నెమలిని పరిగణించడం జరిగింది. మునుముందు రాతిచిత్రాల పరిశోధకులు తెలంగాణ రాతిచిత్రాల మీద కొత్త విశేషాల గురించి రాస్తారని ఆశ. (నేనీ వ్యాసం రాయడానికి ప్రోత్సాహమందించిన రాతిచిత్ర నిపుణులు, నాణకవేత్త మా చరిత్రబృందానికి గైడ్‍, అడ్వైజర్‍ బండి మురళీధర్‍ రెడ్డిగారికి, సంగనకల్‍ పెట్రోగ్లైఫ్‍ ఫోటో పంపిన మిత్రుడు కె.లింగనస్వామి, సంగనకల్లుగారికి ధన్యవాదాలతో.)

  • శ్రీరామోజు హరగోపాల్‍, ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *