అంటార్కిటికా చెపుతున్న భూతాప గోస?

ప్రకృతే నియంత్రిస్తుంది! 13 ప్రకృతే శాసిస్తుంది!!

గత కథనాల్లో డార్వినిజంకు దారితీసిన పరిస్థితుల్ని చూసాం. ఈ సిద్దాంతం అనగానే కేవలం జీవుల పరిణామం గూర్చే అనుకుంటాం! నిజానికి డార్విన్‍, భూగర్భ విషయాలు తెలుసుకోవడానికై కెప్టెన్‍ ఫిట్జ్రాయ్‍కు తోడుగా వెళ్ళడం జరిగింది. కాని, సునిశిత ఆలోచన అనేక కొత్త ఆవిష్కరణలకు దారులు వేస్తుందన్నట్లుగా, డార్విన్‍ బీగల్‍యాత్ర జీవరాశి పుట్టిన తర్వాత ఎలా మార్పు చెందిందని నిశితంగా పరిశీలించి ఓ శాస్త్రీయ సిద్ధాంతానికి పునాదులు వేసింది. అయితే, డార్విన్‍ ముందే అనుకున్నట్లుగా రకరకాల శిలజాలను, ఖనిజాలను కూడా సేకరించి, పరిశీలించి భూగర్భ శాస్త్ర సంబంధిత అంశాలపై కూడా కథనాలను రాయడం జరిగింది. అందులో నాలుగు పుస్తకాలు ప్రధానమైనవి.

  1. The structure and Distribution of Coral Reefs-1842
  2. Geological observations – 1844
  3. Geological Observations on South America – 1846
  4. Geological observations on the Volcanic Islands

ఈ రచనలు తర్వాతి కాలంలో మరిన్ని పరిశోధనలకు దోహద పడ్డాయి. ఇందులో అంటార్కిటికా ఖండంపై చేపట్టిన ప్రయోగాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
రంధ్రాన్వేషణ:
ఓ పరికల్పనకు శాస్త్రీయతను జోడించి ఓ అంచనాకు రావడమే శాస్త్రీయ పరిశోధనగా చెప్పుకున్నాం. భూగోళానికి సంబంధించిన విషయంగా చూసినప్పుడు అనేక పరిశోధనలు వివిధ పద్ధతుల్లో జరిగాయి. జరుగుతూనే వున్నాయి. శిలజాలు ఏర్పడిన కాలంపై కొన్ని అంచనాలు జరగ్గా, కొన్ని పరిశోధనలు భూసంబంధంగా, భూలోపలి పొరలతో సంబంధంగా వున్నాయి. ఇందులో బాగా ప్రచారంలోకి వచ్చిన పరిశోధన ఫ్రాన్స్కు చెందిన క్లాడ్‍ లోరియస్‍ (Claude Lorius-1932) అనే భూరసాయన శాస్త్రవేత్తది. రష్యా, అమెరికా, బ్రిటన్‍, ఆస్ట్రేలియా, తదితర దేశాల శాస్త్రజ్ఞులతో అంటార్కిటికాలోని వొస్టాక్‍ (Vostok) అనే ప్రాంతంలో మంచుపొరల్లోకి 2,083 మీటర్ల లోతు రంధ్రంవేసి వివిధ పొరల మధ్యనగల విభిన్న ఉష్ణోగ్రతల్ని రికార్డు చేశారు. ఈ ఫలితాలలో 4,20,000 సంవత్సరాల భూలోపలి వాతావరణాన్ని, జరిగిన, జరుగుతున్న మార్పుల్ని లెక్కలు కట్టారు.ఈ వేడిమికి గ్రీన్‍హౌస్‍ వాయువులకు గల సంబంధాన్ని విశ్లేషించారు.


ఒంటరితనం భరించే ధైర్యంగల యువకులు కావాలి!

ఫ్రాన్స్లో పేరెన్నికగల బేసన్‍కన్‍ (Besancon) విశ్వవిద్యాలయం తరపున తలపెట్టిన అంటార్కిటికా యాత్ర నిమిత్తం ఒంటరి తనాన్ని భరించే ధైర్యంగల నవయువకులు కావాలనే కళాశాల బులిటెన్‍ బోర్డ్ ప్రకటన చూసిన క్లాడ్‍ లోరియస్‍ వెంటనే ‘తానంటూ’ దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 23 సం।।లు మాత్రమే! అదే విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో బాచిలర్‍, మాస్టర్‍ డిగ్రీలను పొందడమేకాక, పిహెచ్‍డికి కూడా రిజిస్టర్‍ చేసుకున్నాడు. 1955లో ప్రకటించబడిన అంతర్జాతీయ జియోఫిజికల్‍ (Geophysical) సంవత్సరం సందర్భంగా వెలువడిన ప్రకటనకు స్పందించిన క్లాడ్‍ అనుకున్నట్లుగానే అంటార్కిటికా ఖండం గూర్చిన పరిశోధనలు చేయడానికి మార్గదర్శకం వహించే అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు.
డార్విన్‍ లాగానే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న క్లాడ్‍ ఆ మంచు ఖండం గూర్చిన సమాచారాన్ని, వాతావరణాన్ని, వాతావరణ పరిస్థితుల్ని, వాయువేగాన్ని, ఉష్ణోగ్రత స్థితిగతుల్ని, ఆవాసయోగ్యాన్ని, పరిశోధనకై అనుకూల ప్రాంతాల్ని ముందుగా తన బృందంతో సర్వే చేసి గుర్తించాడు. దీంతో ఏ ప్రాంతంలో మంచు ఎంత మందంగా వుంటుందో, అవి ఎలా కదులుతాయో అంచనాకు రాగలిగాడు. తన పరిశోధన (ph.D) సిద్ధాంతమైన మంచులో ఉండే ఆక్సిజన్‍, హైడ్రోజన్‍ల ఐసోటోపుల (isotopes) కు మంచుకు సంబంధించిన గత ఉష్ణోగ్రతలకు గల సంబంధాన్ని క్షేత్రస్థాయిలో పరీక్షించాలని నిశ్చయించాడు. (Past temperature can be reconstructed using measurments of oxygen and hydrogen isotopes in ice).. నేటికి గూడా ఈ విధానంతోనే గతంలోని భూతాపాన్ని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు.
ఇలా తాను పరికల్పిన (Hypothesis) చేసిన సిద్ధాంతాన్ని మొట్టమొదటసారి 1963లో ప్రయోగపూర్వకంగా పరిశీలించడానికి అంటార్కిటికాను ప్రయోగశాలంగా మార్చుకున్నాడు. అనుకున్నట్లుగానే సంవత్సరం తర్వాత మంచులోని గాలి బుడగలు వాతావరణంలోని వాయువుల గత స్మృతుల్ని, ఉష్ణోగ్రతల్ని తెలుపుతాయని టూకీగా గుర్తించాడు. దీని లోతుపాతుల్ని మరింతగా శోధించడానికై అదే సంవత్సరం ఫ్రెంచ్‍ సెంటర్‍ ఫర్‍ సైంటిఫిక్‍ రీసెర్చి (NRS) లోని గ్లాసియాలోజి (Glaciology) మరియు జియోఫిజిక్స్ ఆఫ్‍ ది ఎన్విరాన్‍మెంట్‍ (Geophysics of the Environment) పరిశోధనా శాఖలలో చేరాడు. తర్వాత అదే సంస్థకు అధిపతిగా ఎదిగిన క్లాడ్‍ తన జీవితాన్ని ఆ సంస్థకే అంకితం చేసాడు.


ఉష్ణ శీతల చక్రం (ICE – TempCycle)
మంచులోని గాలి బుడగలకు, గత వాతావరణానికి సంబంధం వుంటుందనే పరికల్పనకు అనుగుణంగా, అంటార్కిటికాలోని విభిన్న ప్రాంతాల నుంచి మంచును సేకరించడం ప్రారంభించారు. 1970- నాటికి సేకరించిన మంచు నమూనాలతో, వేలాది సంవత్సరాల వాతావరణ పరిస్ధితులు, ఎల్ల కాలాల్లో ఒకేలాగా కాకుండా, జలచక్రంలా ఉష్ణ, శీతల మార్పులకు గురౌతాయనే నిర్దారణకు వచ్చాడు. మొదట చార్‍కోట్‍ (Charcot) అనే ప్రదేశంలో మరో ఇద్దరితో కలిసి రెండు సంవత్సరాలు గడిపాడు. దాదాపు 2,400 మీటర్ల ఎత్తులో గల ఈ ప్రాంతంలో గాలిమర (Wind Mill) ద్వారా విద్యుత్తును పొందేవారు. అయినా, శీతాకాలంలో వీచే తుఫానులకు వారు ఉపయోగించే పరికరాలన్నీ ధ్వంసమయ్యాయి. చలినుంచి తట్టుకోవడానికై విస్కీలో ఆ మంచునే కలుపుకునేవారు. అలా ఓసారి గ్లాసులో వేసిన మంచులో గాలిబుడగల్ని చూసి, ఆ బుడగలకు, వాతావరణానికి సంబంధం వుంటుందన్న తన సిద్ధాంతానికి ఆధారం దొరికినట్టుగా భావించి, తన ప్రయోగాన్ని మరింతగా అభివృద్ధి చేశాడు. 1959లో మొదలైన పరిశోధన 1974 నాటికి దక్షిణ ధృవం దగ్గర ఓ పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పేలా చేసింది. ఈ ప్రాంతంలోనే చరిత్రపూర్వపు మంచును సేకరించి గతించిన కాలపు భూతాపాన్ని లెక్కగట్టారు. దాదాపు 20,000 సం।।ల క్రితం మంచులో కార్బన్‍ డయాక్సైడ్‍ చాలా తక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే హైడ్రోజన్‍ గాఢతను బట్టి భూ వేడిని తెలుసుకోవచ్చని కూడా నిర్ధారించాడు.


22 సాహసయాత్రలు – మూడు టన్నుల మంచు నమునాలు:
దాదాపు మూడు దశాబ్దాల పాటుగా సాగిన ఈ సాహస పరిశోధనకై క్లాడ్‍ బృందం అంటార్కిటికాను 22 సార్లు సందర్శించి, మూడు టన్నులకు పైగా మంచు నమూనాలను విభిన్న ప్రాంతాల నుంచి సేకరించారు. గాలిమర దెబ్బ తినడంతో ఓ సంవత్సరం పాటు విద్యుత్తు లేకుండా గడిపారు. దీంతో తమ తమ కుటుంబాలతో సంబంధాలు కూడా తెగిపోయాయి. సూర్యుడి వెలుతురు వస్తే మహాదానంద పడే పరిస్ధితి. నెలల తరబడి సూర్యకిరణాలు లేకపోవడంతో అనేక మానసిక సమస్యలు
ఉత్పన్నమయ్యాయి. పాదాలు కొంకర్లుపోగా నడవలేని స్ధితి ఏర్పడింది.
ఈ మొత్తం యాత్రలో 1982లో జరిపిన యాత్రకు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. తీరప్రాంతం నుంచి సుమారు 1400 కి.మీ. లోతట్టులో గల అతిశీతల ప్రాంతమైన (సాధారణ ఉష్ణోగ్రత కన్నా 89.30సి) వొస్టాక్‍ (Vostok)లో కొత్త పరిశోధనకు నాంది పలికారు. డర్‍మౌంట్‍ డి ఉర్విల్లే (Durmount d Urville) అనే పేరుతో పిలిచిన ఈస్టేషన్‍ చుట్టూ పెంగ్విన్‍ల సంచారం వుండేది.


మంచుపొరల్లోకి రంధ్రం :
దాదాపు 1820 నుంచి అంటార్కిటికాకు సాహసయాత్రలు ప్రారంభమైనా, పరిశోధనలన్నీ ఉపరితలానికే పరిమితంగా వుండేవి. క్లాడ్‍ కూడా మొదట్లో ఈ పరిమితులతోనే పరిశోధనల్ని చేపట్టాడు. కాని ఈ సారి రష్యా, అమెరికా, ప్రాన్స్ నిపుణుల బృందంతో చేపట్టిన పరిశోధన భూమికి సంబంధించిన సరికొత్త విషయాల్ని తెలుసుకునేలా చేసింది. పై నుంచి మంచు పొరలలోనికి 2,083 మీటర్ల రంధ్రాన్ని తొలిచి వివిధ మంచు పొరలలో దాగిన గాలిబుడగల్ని, ఉష్ణోగ్రతల్ని తెలుసుకున్నారు. దీంతో దాదాపుగా 1,40,000 సం।। నుంచి అడుగు భాగపు మంచు పొరలు పొరలుగా రూపొందిందని గుర్తించి, సుమారు 4,20,000 సంవత్సరాల భూ సంబంధిత ఉష్ణోగ్రతల్ని లెక్కించవచ్చని తేల్చుకున్నారు. తర్వాత 1999 మరింత లోతుగా 3,623 మీటర్ల రంధ్రాన్ని వేసి మంచు యుగానికి నాలుగు దశలున్నట్లు లెక్కించారు. మంచులోని గాలిబుడగల్లోని ఉష్ణోగ్రతలతో భూతాపాన్ని, మంచు వయస్సును వరుసగా 18,000 సం।।లు, 1,35,000 సం।।లు, 2,45,000 సం।।లు 3,35,000సం।।లు అని తేల్చుకున్నారు. ఈ రూపాంతరానికి భూకక్ష్యలకు, సూర్యుడి యొక్క వికిరణంకు (irradiation) సంబంధం వున్నట్లుగా గుర్తించాడు. ఈ విధానమే విభిన్న వాతావరణ మార్పులకు దారి తీసిందని నిర్ధారించాడు.
ఇలా సేకరించిన గణాంకాల్ని నేటి వాతావరణానికి అన్వయించి భూతాపానికి ఆధునిక మానవుడే కారణమని నిర్ధారించాడు. అలాగే భూతాపానికి హరిత వాయువులకు చాలా దగ్గరి సంబంధం వున్నట్లుగా మంచులో దాగిన గాలి బుడగల ద్వారా గుర్తించాడు.

గత స్మృతుల చిరునామా అంటార్కిటికా! (Past temperature)
భూగోళానికి సంబంధించిన గత కాలపు వాతావరణ పరిస్ధితులు క్లాడ్‍ బృందం పరిశోధనలతో బయటి ప్రపంచానికి తెలిసాయి. మంచు పొరలల్లో దాగిన విభిన్న భాగాలను పరిశీలించగా, లక్షల సంవత్సరాల క్రితం హరిత వాయువుల ప్రభావం అంతంత మాత్రమేనని తేల్చారు. మానవ మనుగడ, విధ్వంసక చర్యలతో హరితవాయువుల ఉద్గారం బాగా పెరిగిందని, దీంతో భూతాపం రోజు రోజుకు పెరుగుతుందని గుర్తించిన క్లాడ్‍ ఈ కింది నిర్ధారణలకు వచ్చాడు.

  • మంచు పొరలు అవపాతాన్ని, భూచరిత్రను చెపుతాయి. (about precipitation)
  • భూగోళ గత ఉష్ణోగ్రతను సాక్షాత్కరిస్తాయి. (temperature)
  • వాతావరణంలోని విభిన్న సమ్మేళనాలు, ఎప్పుడు, ఎలా ఏర్పాడ్డాయో తెలుపుతాయి. (atmospheric composition)
  • వాయువుల గమనాన్ని, వేగాన్ని, జరిగిన, జరుగుతున్న మార్పుల్ని చెవిటి వారైన మానవులకు హొరెత్తిస్తాయి. (present wind pattern)
  • అగ్ని పర్వతాల ఉనికిని, కదలికల్ని మన కళ్ళకు జిగేల్‍ మనిపిస్తాయి. (status of volcanic activity)


నిరంతర పరిశోధనా! నిగ్గుతేల్చిన నిజాలు!?

ఓ ప్రాంత పరిశీలనకై జీవితాంతం సాధన చేసిన ఘనత కేవలం క్లాడ్‍ లోరియస్‍దే! అలాగే పరిపూర్ణ జీవితాన్ని ఆస్వాదిస్తున్న అసామాన్యుడు కూడా ఈయనే! ప్రత్యక్షంగా, పరోక్షంగా భూ అంతర్గత, బాహ్య ఆరోగ్య స్ధితిగతుల్ని తులనాత్మకంగా పరిశీలించడమే కాక, మిలియన్‍ సంవత్సరాల క్రితం నాటి భూ ఉష్ణోగ్రతల్ని, వాతావరణ పరిస్థితుల్ని ఇరవయొకటవ శతాబ్దానికి చాటింపు వేసి, యావత్‍ ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన క్లాడ్‍ నిజంగా ఆధునిక ప్రపంచానికి ఓ ఆరాధ్యుడే! ఈ హెచ్చరికలే నేటి పెట్టుబడి దేశాలు, కార్పొరేట్‍ శక్తులను కదిలించి, పర్యావరణ, వాతావరణ, భూపరిరక్షణ దిశగా ఆలోచించేలా చేస్తున్నాయి. దోపిడి వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న అగ్రదేశాల, ఎల్లకాలం అభివృద్ధి చెందుతున్న దేశాంగానే మిగిలిపోతున్న భారత్‍ పాలకులను కూడా ఈ దిశగా ఆలోచించేలా చేసాయి. 2015 నాటి ప్యారిస్‍ ఒప్పందానికి కాన్ఫరెన్స్ ఆఫ్‍ పార్టీస్‍ (COP) లను ముందుకు నెట్టుతున్నది. మొన్నటి గ్లాస్గో (COP26) లో జరిగిన చర్చలు కూడా ఈ కోవలోనివే!
తన ఆరు దశాబ్దాల (1859 నుంచి) అంటార్కిటికా పరిశోధనలపై 2015లో మంచు, ఆకాశము (Ice & Sky ) అనే సినిమా నిర్మించబడగా, అందులో స్వయంగా క్లాడ్‍ లోరియస్‍ నటించి పాల్గొనడం, అదే సంవత్సరం భౌగోళిక పర్యావరణ పరిరక్షణకై ప్యారిస్‍లో ప్రపంచస్ధాయి ఒప్పందం (Paris accord) జరగడం యాదృచ్ఛికమే! ఇలాంటి అరుదైన అనుభూతులు ఇప్పటి వరకు ప్రపంచస్ధాయి శాస్త్రజ్ఞులకు ఎవరికి దక్కలేదు. అందుకే ఆయనకు ప్రపంచస్ధాయిలోని పర్యావరణ సంబంధ అత్యుత్తమ అవార్డులన్నీ దక్కాయి. ఒక్క నోబెల్‍ బహుమతి తప్ప!
ఆయన విరచిత పుస్తకం,The white planet: The Evolution and Future of our Frozen worldను రేపటి భవిష్యత్‍ విధాతలైన యువత, విద్యార్థులు విధిగా చదవాలి! చదివేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది, ఆలోచనాపరులైన తల్లిదండ్రులదే!!
ఇదో అత్యాశ కాదని… భావిస్తూ… (వచ్చే సంచికలో అంటార్కిటికాపై జరిగిన మరికొన్ని పరిశోధనల్ని చూద్దాం!)

  • డా।। లచ్చయ్య గాండ్ల, ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *