అలనాటి మేటి తెలంగాణ శాసనాలు-17 ‘కరణం’ పదాన్ని మొదటిసారి ప్రస్తావించిన మొదటి సోమేశ్వరుని కురుమిద్దిశాసనం(క్రీ.శ.1046)

కరణం, మునసబు అనే పదాలు గ్రామాధికారులను సూచిస్తాయి. కరణం అంటే గ్రామంలోని పొలం కొలతల పట్టీని నిర్వహించే వాడు. ఏదైనా పొలం అమ్మాలన్నా, కొనాలన్నా ఆ పొలం గురించి కరణం మాటే వేదం. అందరికీ అందుబాటులో లేని కొలత పద్ధతులు, కొలమానాలతో మోసం చేసేవారని వారి మీద ఒక అపవాదుండేది. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న మొదటి పర్యాయంలో కరణం, మునసబుల వ్యవస్థను రద్దు చేసి రెవెన్యూ సంస్కారాలను ప్రవేశపెట్టాడు. కరణాల వ్యవహారశైలిపై అనేక వ్యంగాస్త్రాలు, సామెతలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ వ్యవస్థ బ్రాహ్మణులకు పరిమితమైనా, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో విశ్వకర్మలు కూడా కరణాలుగా వ్యవహరించారు. కరణము అంటే ‘లెక్కలు వ్రాయు వాడు’ అని, కరణీకము అంటే కరణము వాని పని అని. శబ్దరత్నాకరం అనే గ్రంథం, కరణకమ్మలు అనేపదానికి ‘బ్రాహ్మణజాతి విశేషమని’ తప్పుకొందే తప్ప వివరాలివ్వలేదు.


మధ్యయుగ ప్రారంభం (క్రీ.శ.1000) నుంచే శాసనాల్లో కరణం శబ్దం వాడుకలో ఉంది. కరణము, శ్రీకరణము, స్థలకరణము అని హోదా, స్థలాలను బట్టి కూడా శాసనాల్లో ప్రస్తావనలున్నాయి. ‘గ్రామాధికార ముఖ్యుడు, గ్రామ లెక్కలు వ్రాయువాడు, ప్రతినిధి, కార్యకర్త’ అని శాసన శబ్దకోశములో కుందూరి ఈశ్వరదత్తు కరణము అను పదానికి అర్థవివరణతో పాటు, శాసనాధారాలను కూడా ఇచ్చారు. (శాసన శబ్దకోశములో (ఆంధ్ర ప్రదేశము), ఆం.ప్ర. సాహిత్య అకాడెమీ, హైదరాబాదు, 1967, పే.61). కరణము కేతరాజు (క్రీ.శ. 1246, Sll.lV 788, కరణము మారయ క్రీ.శ. 1145, Sll.X 303; కరణము అన్ని పెద్ది (క్రీ.శ.1264, 811×402; అఱలూరి కరణాలున్న, రెడ్లున్నూ (క్రీ.శ.1317, నెల్లూరు జిల్లా శాసనాలు, ఒంగోలు 8) కొన్ని ఉదాహరణలు. ‘కరణమనగా పొలమనీ, భూమి అనీ, దానిపై వచ్చే ఆదాయాన్ని కరణాయమంటా’రని (కరణాయముగా సమస్తాయములు, Sll.X.227), ఇలా గ్రామ లెక్కల్ని రాసినందుకు ఇచ్చిన మాన్యాన్ని కరణీకపు మాన్యమంటారని (మాకరణీకపు మాన్యాలలోను పండిన ధాన్యాలు (నెల్లూరు జిల్లా శాసనాలు, దర్శి. 52 (క్రీ.శ.1519) సాగింస్తిమి, అన్న
ఉదాహరణలను ఈశ్వరదత్తు గారిచ్చారు (పే.61).


మధ్యయుగ శాసనాల్లో శ్రీకరణం, స్థలకరణం అన్న పదాలు కూడా ఉన్నాయి. క్రీ.శ.1165 నాటి ములింగం శాసనంలో ‘మధుకేశ్వర దేవరకు ఇప్పిలి కాయస్తుండైన ప్రోలినాయకుమఱమ నాయకుఱాలి కొడుకు శ్రీకరణగంగ్ల విద్యాధరదేవ ( Sll.V .1088)’ అని, అలాగే ‘స్థలకరణమంటే ఇరువది లేక ముప్పది గ్రామముల కరణము’ అని క్రీ.శ.1521 నాటి మాచర్ల శాసనంలో ‘శ్రీమహాదేవిచర్ల చన్నకేశవ పెరుమాళ్లు… కొండపల్లి స్థళకరణము బుయ్యెన ప్రెగడ గోవిందరాజుల మహాపాత్రులుంగారు చేయించిన వరుంబని ( Sll.X.×736) అని, మరో రెండు ఉదాహరణలిచ్చారు. ప్రముఖ శాసన పరిశోధకులు పి.వి.పరబ్రహ్మశాస్త్రి 12 మంది గ్రామ సేవకుల్లో కరణము ఒకడని, ‘సాధారణంగా 12 మంది గ్రామ సేవకులను పేర్కొంటారు. 1. కరణం, 2. గౌడ లేదా రెడ్డి, 3. తలారి, 4. రజకుడు, 5. చెప్పులు తయారు చేయు వాడు, 6. క్షురకుడు, 7. వడ్రంగి, 8. కుమ్మరి, 9. స్వర్ణకారుడు, 10. నీరటి, 11. కుమ్మరి, 12. బ్రాహ్మణ పురోహితుడు, అని తన ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర గ్రామీణ జీవనం లో (ఎమెస్కో, హైదరాబాదు, 2012, పే.105) ప్రస్తావించారు. ఇలా గ్రామాధికారిగా, పొలాలు, దేవాలయాల స్థలాల లెక్కలు రాసేవాడుగా, కరణము తన పాత్ర పోషించాడు. ఇంతటి ప్రాధాన్యతగల కరణము వ్యవస్థ గత 40 ఏళ్ల కిందటి వరకూ కొనసాగింది. ఈ వ్యవస్థకు సంబంధించిన తొలి శాసనాన్ని అందించిన ఘనతను తెలంగాణ దక్కించుకొంది.


మునుపటి మహబూబ్‍నగర్‍, ఇప్పటి నాగర్‍కర్నూలు జిల్లా, కల్వకుర్తి మండలంలోని కురుమిద్ది గ్రామంలోని రెడ్డి బావికి దగ్గరున్న కళ్యాణ చాళుక్య చక్రవర్తి త్రైలోక్యమల్ల మొదటి సోమేశ్వరుని పాలానా కాలంలో, మానెవెర్గడ కూచిమయ్య వేసిన క్రీ.శ.1046, ఏప్రిల్‍ 10వ తేదీ శాసనంలో ‘కరణము’ అనే గ్రామాధికారి ప్రస్తావన తొలిసారిగ కనిపించింది. ఇప్పటి వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో లభించిన శాసనాల్లో ఇదే మొదటి శాసనం కావటం విశేషణం.


శాసన పాఠాన్ని పరిశీలిద్దాం :

 1. శ్రీ పృథ్వీ వల్లభ మహారా
 2. జాది రాజ పరమేశ్వర పరమ
 3. భట్టారక సత్యాశ్రయ కుళ
 4. తిళకం చాళుక్యాభరణం
 5. శ్రీమత్రైళోక్యమల్లదే
 6. వర విజయరాజ్యముత్తరో
 7. త్తరాభివృద్ధి ప్రవద్ధన్‍ మానమా
 8. చంద్రాక్కన్‍ తారంబరం సలుత్తమి
 9. రె తత్పరమేశ్వర పాద పద్మోప
 10. జీవి సమధిగత పంచమహాశబ్ద
 11. మహామణ్డళేశ్వర నుదారమహేస్వ
 12. రం, సత్యయుధిష్ఠిరం, రిపుబళని (ష్ఠూ)రం
 13. శౌయ్యన్‍ మాత్తన్‍ణ్డం కదన ప్ర
 14. చణ్డం, సోక్కొనె గుళ్దం, భువనై
 15. కమల్లం, సరస్వతీ ముఖరత్న
 16. భూషణం, సమరైక భీషణం
 17. మఱుమ్రగెకావం, కోలూర
 18. గోన నామాది సమస్త ప్రస
 19. స్తి సహితం, శ్రీమత్‍ బి
 20. జ్జర సమరె యువరాజం సంక
 21. రీను నుంకుమార నాణామ
 22. రసనుం దన్నాళెయ ద కోట్యెయ
 23. బిడిసిబిట్టప్పయణదీడి
 24. నూళ్‍ సకవష నెయవ్య
 25. య సంవత్సరద వైసాఖ సు
 26. ద్ధ ఁ బుధవారదన్దున సూయ్య •
 27. గ్రహణ నిమిత్తదింకోడూ
 28. రు300 బఱియ తాళ్ళుకుఱుము
 29. ద్దెయం మనెవెగ్గ డకూచిమ
 30. య్యం గగ్రహార మానెరడుం
 31. భాగము ఱ్చెమం కాల్గఱ్చెధారా
 32. పూవ్వ కడిం కొట్టర్‍ పుత్రా
 33. ను లౌతృక మాచంద్రాక్క తా
 34. రం సలుబరెదం పత్థెళెక
 35. రణం నాగదేవయ్య ।।

ఎన్నెస్‍ రామచంద్రమూర్తి (సం), ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్‍ ఆంధప్రదేశ్‍: మహబూబ్‍నగర్‍ జిల్లా, వా. 1, ఆం.ప్ర. పురావస్తుశాఖ, హైదరాబాదు, పే.
కోడూరు 300 (మహబూబ్‍గనర్‍ పక్కనున్న కోడూరు, కందూరు చోళులనే తెలుగు చోడులకు రాజధాని)లోని కురుమిద్దెలో, సమస్త భువనాశ్రయ శ్రీపృధ్వీవల్లభమహా రాజాధిరాజ, రాజపరమేశ్వర, పరమభట్టారక, సత్యాశ్రయ కులతిళకం, చాళుక్యాభరణం, శ్రీమత్‍ త్రైలోక్య మల్లదేవర పాదపద్మోపజీవి, సమథిగత పంచ మహాశబ్ద, మహామండలేశ్వర, ఉదారమహేశ్వర, సత్యయుధిష్టర, రిపుబలనిష్టూర, శౌర్యమార్తాండ, కదన ప్రచండ, భువనైక మల్ల, సరస్వతీముఖ రత్నభూషణం, సమరైక భూషణం, కోళూర గోవ, శ్రీమత్‍ బిజ్జరస, కోడూరు నుంచి పాలిస్తుండగా (అతని కుమారులు యువరాజు శంకరస, అణెమరసలు) శకవర్షం 968 వ్యయ సం।। వైశాఖ శుద్ధ పాడ్యమి బుధవారం (గురువారం) సూర్యగ్రహణ సందర్భంగా, తాళ్లు కుఱుమిద్దె మనెవెర్‍గ్గడ కూచిమయ్య ఆ అగ్రహారం మూడింట రెండు వంతులు కాలుగడిగి దానం చేసిన వివరాలున్నాయి. ఈ శాసనాన్ని చెక్కింది కరణం నాగదేవయ్య.


శాసన విషయానికొస్తే, భాష కన్నడం, లిపి, తెలుగు – కన్నడ. లిపి క్రీ.శ. 11వ శతాబ్ది నాటి అక్షరాలు పొందికతో, తెలుగు అక్షరాలకు దగ్గరగా ఉంది. భాషాపరంగా చూస్తే కుళతిళకం =కులతిలకం, రిపుబళ= రిపుబల, శౌర్య మార్తండం = శౌర్య మార్తాండం, కోళూరగోన= కోడూరగోవ, ప్రసస్తి=ప్రశస్తి, సకవర్ష = శకవర్ష, వైసాఖ = వైశాఖ, సుద్ధ = శుద్ధ, తాళ్లుకురుమద్దె = తాళ్ల కురుమిద్ద అని పదాలను సరిచేసు కోవచ్చు.
ఈ కురుమిద్ది శాసనంలో మహా మండలేశ్వర బిజ్ఞరస అనే సామంతున్ని అతని కొడుకులైన యువరాజ శంకరస, ఆణెమరసలు తొలిసారిగ ప్రస్తావించ బడినారు. ఈ శాసనాన్ని చెక్కినది (పత్థెళె) కరణం నాగమయ్య. శాసనాన్ని చెక్కాడు గాబట్టి ఇతడు విశ్వకర్మ కులానికి చెందినవాడై ఉంటాడు. అలాగే క్రీ.శ.1046 నాటి ఈ శాసనం తొలిసారిగ కరణం అన్న పదాన్ని మనకు అందించింది. ఈ మూడు విషయాలవల్ల కురుమిద్ది శాసనం, అలనాటి మేటి తెలంగాణ శాసనాల్లో ఒకటి.
‘‘కాకతీయ గణపతిదేవ చక్రవర్తి కొలువులో విశ్వకర్మలు కరణాలుగా ఉండేవారని వరంగల్‍ కైఫీయతులో, నోరి నరసింహశాస్త్రి ‘రుద్రమదేవి’ నవలలో ప్రస్తావించారనీ, ఈ శాసనంలో ప్రస్తావించిన నాగదేవయ్య (ఎక్కువసార్లు జైన శాసనాలలో కనిపించే పేరు) విశ్వకర్మే’’ననీ అభిప్రాయంపడిన శ్రీరామోజు హరగోపాల్‍ గారికి ధన్యవాదాలు.


-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *