తెలంగాణా-శిలాజ సంపద కొత్తతెలంగాణ చరిత్రబృందం 8వ నెల వెబినార్‍లో చకిలం వేణుగోపాల్‍ రావు గారి ప్రసంగ పాఠం


ప్రస్తుతం తెలంగాణ పేరుతో ఉన్న భౌగోళికప్రాంతంలో అతి ప్రాచీనమైనశిలల నుండి క్వాటెర్నరీ మహాయుగపుశిలలదాకా దాదాపు అన్ని భౌమకాలాలకు చెందిన శిలలు విస్తరించి ఉన్నాయి. ప్రాక్‍ కేంబ్రియన్‍ కాలానికి చెంది అవక్షేపశిలలు శిలాజాలను కలిగి ఉన్నాయి. ఈ యుగానికి చెందిన శిలావిన్యాసాలు దక్కన్‍ భూభాగంలో కడప హరివాణము, భీమాహరివాణము, పాకాలహరివాణము, Sullavayi స్తరాలు, పెనుగంగస్తరాలుగా విస్తరించి ఉన్నాయి. వీటిలో కడప హరివాణములోని కర్నూల్‍ గ్రూపుకు చెందిన శిలలు ఉమ్మడి మహబూబు నగర్‍, ఉమ్మడి నల్లగొండ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. భీమా హరివాణము లోని శిలావిన్యాసాలు, రంగారెడ్డి, మహబూబు నగర్‍ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి.
ఎగువ ప్రికేంబ్రియన్‍ కాలానికి చెందిన కర్నూల్‍ సమూహములోని చెందిన స్తరాలలో దిగువ భాగానికి చెందిన బంగనపల్లి ఇసుకరాయి, నాగార్జునసాగర్‍ ప్రాంతంలో గ్రానైట్‍ శిలలపైన Unicomformable గా విస్తరించి ఉన్నాయి. ఈ స్తరాలు ఎగువ తొలి జీవమహాయుగానికి చెందినవి. వీటిలో ప్లానోలైటిస్‍ అనే Trace Fossil దొరికింది. ఇది ఒక సాధారణమైన చిన్న సొరంగం లాంటిది. స్తరాల వయసు నిర్ధారించడానికి అంతగా ఉపయుక్తం కాదు. కాని, జీవపరిణామక్రమంలో పురుగులవంటి ప్రాణుల ఉనికిని తెలియ జేస్తుంది. ఇదే కర్నూలు సమూహానికి చెందిన పాన్యం క్వార్జైట్‍ కర్నూలు జిల్లాలో ఎత్తైన శిలాకృతులుగా భాగంలో విస్తరించి ఉంటుంది. అది క్రమంగా ఉత్తరదిశగా తక్కువ మందం (కేవలం 1మీ.) కలిగిన పలుచనిపొరవలె కొల్లాపూర్‍ ప్రాంతంలో పెద్ద దగడ, ఆలంపూర్‍ మొ.. ప్రాంతాలలో విస్తరించి ఉంటుంది. ఇది అక్కడక్కడ ఇసుకరాయిలా కాకుండా ‘ఛెర్ట్’ అనే సిలికా సంబంధిత శిలగా కనిపిస్తుంది. ఇది నల్లని ఛెర్టుగా కూడా కనిపిస్తుంది. నందికొట్కూరుకు ఈశాన్యంగా ఈ బ్లాక్‍ ఛెర్టు విస్తారంగా లభిస్తుంది. కృష్ణానదికి ఆవల తెలంగాణా ప్రాంతంలో ఆలంపూరుకు దగ్గరగా ఇదే బ్లాక్‍ ఛెర్టు అక్కడక్కడా దొరుకుతుంది. ఈ రాయి పలుచని పొరలలో సయనో బాక్టీరియాకు చెందిన (దీన్ని బ్లూగ్రీన్‍ ఆల్గే అని అంటారు) ట్యూబినెల్లా రెనాల్‍ సిస్‍ బొటరియోకాకస్‍ మొదలైనవి లభించాయి. వీటివల్ల ఆధారాలు దొరికాయి.


కర్నూలు గ్రూపుకు చెందిన కోయిలకుంట్ల సున్నపురాళ్ళు శిలాజ రహితంగా ఉంటాయి. కాని, పెద్దదగడ ప్రాంతంలో అక్కడక్కడా వీటిలో గోళాకారంగా ఉండే ‘డోమ్‍’వంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇవి బహుశః స్ట్రొమాటోలైట్లై ఉంటాయి. కర్నూలు సమూహపు సున్నపురాళ్ళు వాడపల్లి ప్రాంతంలో ఉన్నాయి. ఈ శిలలలో ఇంతవరకు శిలాజాలు కనుగొన బడలేదు.
భీమాహరివాణపు ఈశాన్యభాగంలో గుల్బర్గా జిల్లాను చేరి ఉండే తాండూరు మొ.ప్రదేశాలలో ‘శాహబాద్‍ సున్నపు రాయి’గా ప్రసిద్దిచెందిన సున్నపురాళ్ళలో చిన్న, చిన్న గోళాకారపు నిర్మాణాలు లభించినా వీటిమీద నిర్ధారిత పరిశీలనలు జరగలేదు. ఇవి కేవలం శిలాజాల ఉనికిని మాత్రం తెలియజేస్తాయి.
ఉత్తరతెలంగాణాలోని ఖమ్మం, వరంగల్‍, గోదావరి లోయ ప్రాంతాలు, పెన్‍ గంగ మొ. ప్రదేశాలలో ఈ తొలి జీవ మహాయుగపు శిలలు పాకాలహరివాణంలో కనిపిస్తాయి. వీటిలోని సున్నపురాళ్ళలో స్ట్రోమాటొలైట్‍ అనే శిలాజాలు కనిపిస్తాయి.


ఖమ్మంపట్టణ శివారుగ్రామం వెంకటాపూర్‍ ప్రాంతంలో సున్నపురాయితో స్ట్రొమాటోలైట్లు విరివిగా ఉంటాయి. దీన్ని ‘శరణువాలా అవుట్‍ లేయర్‍’గా వ్యవహ రిస్తారు. ఇది రెండు హరివాణాలకు వారధిలెక్క ఉంటుంది. ఈ విన్యాసం ఖమ్మం మీదుగా దక్షిణంవైపు సన్ననిపొరగా చిరునోముల మీదుగా కడప హరివాణం లోనికి కలుస్తుంది. దీనివల్ల కడప, పాకాల హరివాణాలు భౌతికంగా కలిసి ఉండేవని తెలుస్తున్నది.
ప్రీ కేంబ్రియన్‍ మహాయుగం తరువాత గోదావరీలోయలో పేలియోజోయిక్‍ మహాయుగం నుంచి మీసోజోయిక్‍ మహాయుగం వరకు నిక్షిప్తమైన స్తరాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి గోండ్వానా సమూహపు శిలలు. ఇవి మధ్యభారతదేశంలో ఉన్నందున H.B.Medlicott వీటికి గోండ్వానా శిలలు అని వ్యవహరించినప్పటి నుంచి ఈ మహా సమూహం పేరు గోండ్వానా మహాసమూహంగా పేరుపడ్డది. ఇవి మంచినీటి సరస్సులు, నీటిప్రవాహప్రాంతాలలో ఏర్పడిన ఇసుకరాళ్ళు, షేల్‍, కంగ్లామరేట్‍లు, అక్కడక్కడ బొగ్గుపొరలు ఉంటాయి. ఇవి కార్బొని ఫెరస్‍, పెర్మియన్‍, ట్రయాసిక్‍, జురాసిక్‍, లోయర్‍ క్రెటేషియస్‍ భౌమకాలానికి చెందినవి. బోట్రియో కాకస్‍, రెనాల్సిస్‍, ట్యూబినెల్లా మొదలైనవి.


వీటిలో గోదావరి లోయలో తాల్చీర్‍ (కార్బొనిఫెరస్‍), బరాకర్‍ (పెర్మియన్‍), బారన్‍ మెజర్స్ (మధ్య పెర్మియన్‍), కామితి (ఎగువ పెర్మియన్‍, దిగువ ట్రయాసిక్‍), యర్రపల్లి, భీమారం, మలేరి ధర్మారం (ట్రయాసిక్‍), కోట ఫార్మేషన్‍ (జురాసిక్‍), గంగాపూర్‍ చికియాల (లోయర్‍ క్రెటేషియస్‍) స్తరాలు ఉన్నాయి. తాల్చేరు నుంచి కామితి వరకు దిగువ గోండ్వానాగాను, ఎర్రపల్లి నుంచి పైన ఉన్న స్తరాలను ఎగువ గోండ్వానాగాను వ్యవహరిస్తారు. దిగువ గోండ్వానాలో విస్తారంగా బొగ్గునిక్షేపాలు ఉన్నాయి. ఎగువభాగంలో బొగ్గుగనులు లేవు. ఇందులో వృక్షశిలాజాలు, అకశేరుకాలు, సకశేరుకాలు విస్తారంగా లభిస్తాయి.


వృక్ష శిలాజాలు: గ్లోసాప్టెరిస్‍, గంగమాప్టెరిస్‍, టిలో ఫిల్లం, ఇలటో క్లాడస్‍ మొదలయినవి
అకసేరుకాలు: ఇస్తరిడ్‍, ఆస్ట్రకోడా, పెలిసిపోడా
సకశేరుకాలు: చేపలు, ఉభయచరాలు, ఆదిమజాతి పాకే జంతువులు, డైనోసార్లు, రింకోసార్‍, క్షీరదాలు వంటి రెప్టైల్స్, సూక్ష్మక్షీరదాలు.


హైదరాబాద్‍లోని బిర్లా మ్యూజియంలో ఉన్న పూర్తి కోటాసారస్‍ యామనపల్లెన్సిస్‍ అనే డైనోసార్‍, కోట ఫార్మేషన్‍ లోనిదే. గోండ్వానా విన్యాసాలకు పైన క్రెటేషియస్‍ మహాయుగపు చివరి భాగానికి చెందిన మియాస్ట్రికియన్‍ కాలపు అగ్నిశిలలు దక్కన్‍ భూభాగాన్ని అలుముకొని ఉన్నాయి. దీన్ని దక్కన్‍ ట్రాప్‍లు అని అంటారు. ఈ శిలలు మెట్లవలె కనిపిస్తాయి. ఇవి ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్‍, ఉత్తరప్రదేశ్‍, మధ్యప్రదేశ్‍, కర్ణాటక, తెలంగాణాలలో విస్తరించిఉన్నాయి. ఈ లావా పొరలు భూమిలోపలి నుంచి చిన్న, చిన్న ఛిద్రాల ద్వారా ప్రవహించి ఒకదానిపై ఇంకొకటి దొంతరలుగా ఏర్పడ్డాయి. ఈ లావా ప్రవాహపు పొరలు ధూలైట్‍ అనే బసాల్ట్ రూపాంతరం.. ఇందులో అక్కడక్కడ లావాపొరల మధ్యలో ఉన్న విరామకాలంలో లావాపొర పైన నదులు, సరస్సులు ఏర్పడి కాలక్రమంలో మళ్ళీ లావా పొరలచేత కప్పబడ్డాయి. ఇలా ఏర్పడిన మంచినీటి అవక్షేపాలు గట్టిపడి ఇసుకరాయి, బంకమన్ను, ఛెర్ట్ మొదలైన శిలలుగా మారుతుంది. వీటిలో రెండు లావాపొరల మధ్యగల అవక్షేపశిలను అంతర ట్రాపియన్‍ అని లావాపొరకు గ్రానైట్‍ కు లేదా పూర్వశిలలపై ఏర్పడ్డ అవక్షేపశిలలను ‘పరట్రాపియన్స్’ అంటారు. వీటికి సమాన వయసు కలిగిన అవక్షేప శిలలను లామెటాలు (జబల్పూర్‍ లామెటా కొండలు) అంటారు.
వీటిలో తెలంగాణ ప్రాంతంలో దక్షిణ, తూర్పు దక్కన్‍ ట్రాప్‍ యొక్క చివరిభాగాలు ఉన్నాయి. ఇవి హైదరాబాదుకు పడమటగా శంకరపల్లి, వికారాబాద్‍ మొదలైన చోట్ల మెదక్‍, మహబూబ్‍ నగర్‍, కరీంనగర్‍, నిజామాబాద్‍, ఆదిలాబాద్‍ జిల్లాలలో అక్కడక్కడ అంతరట్రాపియన్‍, పరట్రాపియన్‍ అవక్షేపాలున్నాయి. వీటిలో చాలా పరిమితంగా శిలాజాలు మృత్తిక, చెర్ట్ వంటివాటిలో ఉన్నాయి.
వీటిలో వృక్షశిలాజాలు Palms, Charophytes, Silisified wood అకశేరుకాలు Ostracoda, , ఫైజా ప్రిన్స్ పి, ఫైజా తెర్పొ లెన్సిస్‍, లిమ్నియా, వీవిపెరస్‍, యూనియో.


సకశేరుకాలు గోండ్వానోథీరియం, కప్పలు, చేపలు, డైనోసార్‍ గుడ్డుపెంకులు, తాబేలు, సూక్ష్మక్షీరదాలు వీటివలన ఈ దక్కను లావా మియాస్టికియన్‍ (ఎగువ క్రేటేషియస్‍) 65 నుంచి 67 మి.ల సంవత్సరాలకు పూర్వం మొదలైనదని తెలుస్తోంది. శిలాజపరంగా అంతరట్రాపియన్లకు పరట్రాపియన్లు ఒకే విధమైనవి.
భౌమకాలంలో చిట్టచివరిదైన క్వాటర్నరీ యుగపు అవక్షేపాలు తెలంగాణాలో ఉన్నాయి. ఇవి ఒండ్రుమట్టి ఇసుక తదితర రూపాలలో ఉంటాయి. ఇవి ఇంకా శిలలుగా గట్టిపడలేదు. అక్కడక్కడా ఈ మట్టిలో పురాతన మానవుడు వాడిన రాతియుగపు పనిముట్లు ఎముకలు మొ. లభిస్తాయి.
ఆదిమానవుల ఆవాసాలుగా ఉన్న గుహలు రాతి ఆవాసాలు పడిగరాళ్ళు మొ. దగ్గర రాతిపనిముట్లు, గుహాచిత్రాలు ఇతర అవశేషాలు ఉంటాయి.

  • చకిలం వేణుగోపాల్‍ రావు,
    డిప్యూటీ డైరెక్టర్‍ జనరల్‍(రి.),
    జియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా,
    ఎ : 9866449348,

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *