సిరిధాన్యాలతో మెట్ట రైతుకు మేలు..


రబీలో బోర్ల కింద రైతులు వరికి బదులు చిరుధాన్యాల సాగును చేపట్టేలా తగిన ధర కల్పించడం, మిల్లెట్‍ బోర్డును సత్వరం ఏర్పాటు చేయడం, ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించడం కోసం తెలుగు రాష్ట్రాలు ఇటీవల చర్యలు తీసుకున్నారు. ఈ పరిణామాలను మీరెలా చూస్తున్నారు?
నాలుగు వర్షాలొస్తే మెట్ట భూముల్లో పండే సిరిధాన్యాల (అవి చిరుధాన్యాలు కావు.. సిరిధాన్యాలు)ను ప్రోత్సహిస్తూ తెలుగు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవటం చాలా సంతోషదాయకం. నీటి పారుదల సదుపాయం ఉన్న ప్రాంతాల్లో రైతులపై ప్రభుత్వాలు దృష్టికేంద్రీకరిస్తూ వస్తున్నాయి.
పేదరికంలో మగ్గుతున్న వర్షాధార వ్యవసాయదారుల అభ్యున్నతిపై, నిర్లక్ష్యానికి గురైన సిరిధాన్యాల సాగు, వినియోగంపై ప్రభుత్వాలు ద•ష్టి కేంద్రీకరిస్తున్నందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ ప్రయత్నాల వల్ల అల్పాదాయ మెట్ట ప్రాంత రైతాంగం ఆదాయం పెరుగుతుంది. సిరిధాన్యాలను సాగు చేస్తే మనుషులకు అవసరమైన పౌష్టికాహారం అందటంతోపాటు భూమికి, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.


ఆహారం 95% భూమి ద్వారానే అందుతోంది. భూసారం అడుగంటిన నేపథ్యంలో ‘నేలల ఆరోగ్యమే మన ఆరోగ్యం’ అన్న భావనను మీరు ఎలా చూస్తున్నారు?

రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందుల మూలంగా భూసారం క్షీణించింది. నిస్సారమైన భూముల్లో సైతం సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలను రసాయనాలు వాడకుండా సహజ పద్ధతుల్లో పండించుకోవచ్చు. ఈ పంటలు మనుషుల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించి ఆరోగ్యవంతంగా మార్చడంతోపాటు భూసారాన్నీ పెంపొందిస్తాయి.


సిరిధాన్యాల ద్వారా ఒనగూరే ఆరోగ్య, పర్యావరణ ప్రయోజనాల గురించి తెలుగు నాట సభలు, సమావేశాల ద్వారా మీరు విస్త•తంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజా స్పందన ఎలా ఉంది?
ప్రజలు, రైతులు సానుకూలంగా స్పందిస్తున్నారు. సిరిధాన్యాల సాగు విస్తీర్ణంతో పాటు వినియోగం పెరుగుతోంది. నేను చెప్పిన పద్ధతుల్లో కషాయాలను వాడటం, సిరిధాన్యాలను, ఇతర సంప్రదాయ ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటున్న దీర్ఘరోగుల ఆరోగ్యం క్రమంగా స్థిమితపడుతోంది. రోగనిరోధక శక్తిని పెంపొందించు కోవటం ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ఈ మార్పు మరింత వేగవంతం కావాలంటే సంప్రదాయ పంటలను, వికేంద్రీకరణ విధానాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.


జన్యుమార్పిడి పంటలు, జన్యుమార్పిడి ఆహారోత్పత్తుల దిగుమతులకు గేట్లు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ముసాయిదా మార్గదర్శకాలను ఇటీవలే విడుదల చేసింది. ఎప్పటి నుంచో జన్యుమార్పిడి ఆహారాన్ని వినియోగిస్తున్న అమెరికాలో పరిశోధనా శాస్త్రవేత్తగా పనిచేసిన మీరు ఈ పరిణామాలపై ఏమనుకుంటున్నారు?

పారిశ్రామిక వ్యవసాయ సాంకేతికతల ద్వారా ఉత్పత్తయ్యే ఆహారోత్పత్తుల ద్వారా మన ఆరోగ్యానికి, ప్రకృతికి కూడా నష్టం కలుగుతుంది. సహజ పద్ధతుల్లో పండించుకోవడంతో పాటు వికేంద్రీకరణ పద్ధతుల్లో ప్రజలే శుద్ధి చేసుకొని స్థానికంగా అందుబాటులోకి తెచ్చుకునే అద్భుతమైన మన దేశీయ సంప్రదాయ ఆహారోత్పత్తుల ద్వారా మాత్రమే ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని చెప్పడానికి ప్రబల నిదర్శనాలు ఉన్నాయి.


షుగర్‍, బీపీ వంటి జీవనశైలి జబ్బులు పెచ్చుమీరుతున్నప్పటికీ తాము తింటున్న ఆహారానికి- జబ్బులు రావడానికి మధ్య నేరుగా సంబంధం ఉందని ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారా?
సిరిధాన్యాలను పండించడం, ఖరీదైన ప్రాసెసింగ్‍ యంత్రాల అవసరం లేకుండా స్వయంగా మిక్సీల ద్వారా శుద్ధి చేసుకొని వినియోగించడం ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అక్కడక్కడా ప్రారంభించారు. సిరిధాన్యాల సాగును ప్రోత్సహించడంతోపాటు వీటిని ఎలా వండుకొని తినాలో ప్రజలకు రుచి చూపాలి. అన్ని జిల్లాల్లో సిరిధాన్యాల ఫుడ్‍ ఫెస్టివల్స్ నిర్వహణపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. వినియోగం పెరిగితే రైతులు పండించే సిరిధాన్యాలకు మార్కెట్‍లో మంచి ధర కూడా వస్తుంది.


ఎద్దు గానుగ నూనెలు, తాటి/ ఈత / జీలుగ బెల్లం ఆవశ్యకతను మీరు నొక్కి చెబుతున్నారు. ప్రజలందరికీ వీటిని అందుబాటులోకి తేవటం సాధ్యమేనా?
ఎద్దు గానుగ నూనెల వాడకం పెరగటంతో ఎద్దు గానుగలు చాలా చోట్ల ఏర్పాటవుతున్నాయి. ప్రతి గ్రామంలో నూనె గింజలు సాగు చేసుకొని, అక్కడే నూనెలు ఉత్పత్తి చేసి వాడుకోవాలి. తాటి/ ఈత / జీలుగ చెట్లు కోట్ల సంఖ్యలో ఉన్నాయి. వీటి నీరాతో గ్రామాల్లోనే ఎక్కడికక్కడ బెల్లం ఉత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే సమీప భవిష్యత్తులోనే ప్రజలందరికీ అందించవచ్చు.


ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకోబోతున్నాం. మీ అభిప్రాయం..?
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం జరుపుకునే దిశగా సన్నాహకంగా ఒకటీ అరా సమావేశాలు మాత్రమే తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. మరింత విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది.


-డా।। ఖాదర్‍ వలి
ప్రఖ్యాత స్వతంత్ర శాస్త్రవేత్త,
ఆరోగ్య, ఆహార నిపుణులు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *