విజయీ భవ


పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్‍ లాంటి సమస్యలూ ఉన్నా, ఇలాంటి అంశాలపై దృష్టి సారించిన ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. ఆ ‘పది జిల్లాల బడి పిల్లల కథలు ’ దక్కన్‍ల్యాండ్‍ పాఠకులకు పరిచయం చేయడంలో భాగంగా ‘మెదక్‍ బడిపిల్లల కథలు’ కథా రచయిత ఐతా చంద్రయ్య విశ్లేషణ.
కథల కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ వారి ఆహ్వానం మేరకు మెదక్‍ జిల్లా ‘బడిపిల్లల కథలు’ ఎంపిక కోసం 108 కథలు రాగా కథల కార్యశాలలో పాల్గొన్న నిష్ణాతులైన బాలసాహితీవేత్తలు 18 కథలను ఎంపిక చేశారు. ఈ పుస్తకానికి బొమ్మలు పర్కపెల్లి యాదగిరి వేశారు. ఈ బాధ్యతను నెరవేర్చే క్రమంలో ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’ నిష్ణాతులతో ఎన్నో సమావేశాలు, సదస్సులు, చర్చలు, బాల చెలిమి ముచ్చట్లు నిర్వహించింది.


చిన్ని చిన్ని బాలలు / చిగురించిన ఆశలు
దేశమాత మెడలోన / వాడిపోని పూవులు
నేటి బాలలే రేపటి బాధ్యత గల పౌరులు. పసిప్రాయములో బాలలేవి నేర్చుకున్నా జీవితాంతం మరువలేరు. చక్కని సాహిత్యం వారికి సంస్కారం నేర్పిస్తుంది. ఆ సంస్కారమే జీవితమును విజయ పథములో నడిపిస్తుంది. నేటి రోజుల్లో బాలసాహిత్యం మూడు పూవులు, ఆరు కాయలుగా పరిఢవిల్లుతోంది. పిల్లల కోసం పెద్దలు కథలు రాయడం సహజమే. పిల్లల కోసం పిల్లలు కథలు రాయడం విశేషం. బాల రచయితలు పెద్దల ద్వారా కథలు విని పుస్తకాలు చదివి తమ స్థాయిలో కథలు రాయడం వెనుక వారికి మార్గదర్శనం చేసే ఉపాధ్యాలుంటారు. రచయితలైన ఉపాధ్యాయులు విద్యార్థులకు చక్కని మార్గదర్శనం చేయాలి.


ఈ చిన్నారుల కథలు (మెదక్‍జిల్లా పిల్లల కథలు) చదువుతూంటే పై విషయానికి దృవీకరణగా వున్నాయి. బడిలో చదువుతున్న విద్యార్థుల కలం నుండి జాలువారిన ఈ 18 కథలు పిల్లలకే కాదు, పెద్దలకు కూడా నీతిని బోధిస్తాయి. పిల్లల కథల్లో జంతువులు, రాయి – రప్ప మొదలైనవి మాట్లాడుతుంటే అవి ప్రతీకాత్మకంగా మానవులగ్గూడా మంచి దారి చూపించడమే.
18 కథలు నిడివిలో చిన్నవైనా నీతిలో పెద్దవి. ఆదర్శం కథలో రాణి 10వ తరగతి బాలిక పేదరికాన్ని అనుభవిస్తున్నా పెద్దయ్యాక తల్లిదండ్రుల్ని పోషించాలని నిర్ణయించుకుని, అదే పట్టుదలతో చదివి అనుకున్నది సాధిస్తుంది. ‘నక్క తోడేలు’ కథలో జిత్తులమారి నక్కకు చేతల్లో పాఠం నేర్పుతుంది. ‘తొందరపాటు పనికిరాదు’ అంటుంది చీమ పాత్ర.
బడిపిల్లలకు మార్గదర్శనం చేసి కథలు రాయిస్తున్న వివిధ పెద్దలు, పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి అమూల్యము. నేటి చిట్టి, చిట్టి బాలలే రేపటి గట్టి రచయితలు కావాలని వీణావాణిని ప్రార్థిస్తున్నాను. అభినందనలతో…

  • ఐతా చంద్రయ్య
    కథా రచయిత

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *