ఎన్నో యాసలున్న తెలుగు భాషను మాట్లాడే వారినందరినీ ఒక్కతాటిపైకితెచ్చి, ఆయా భూభాగాలను ఒక్కటిగా కూర్చి తమిళ, కన్నడ, మరాఠి, ఒరియా సరిహద్దులుగా మొత్తం తెలుగు నేలను 62 సంవత్సరాల పాటు పాలించిన ఘనత కాకతీయ గణపతిదేవునిదే. ఎలాంటి శతృభయం లేకుండా దేశరక్షణకు, సమృద్ధ పంటలతో సస్యరక్షణకు పూనుకొన్న గొప్ప చక్రవర్తి. సాగునీటికి విశాలమైన చెరువుల్ని, పెరుగుతున్న జనాభాకు కొత్త కొత్త పట్టణాలను, ఆధ్యాత్మిక వనరులుగా ఎన్నో దేవాలయాలను నిర్మించిన గొప్పదార్శనికునిగా పేరు తెచ్చుకొన్నాడు. దేశీయ, విదేశీయ వర్తక వాణిజ్యాలను ప్రోత్సహించి ప్రజలకు నిత్యావసర సరుకుల నందించటమేకాక, సముద్రంపై వెళ్లి వ్యాపారం చేసేవారి జీవితాలు ప్రమాదభరితమైనవని గుర్తించి, వారి కుటుంబాలకు బీమా సౌకర్యాల్ని కల్పిస్తూ భారతదేశ సాంఘిక సంక్షేమ చరిత్రలో తొలిసారిగా ‘అభయ’ శాసనాన్నిచ్చిన సామాజిక ఆర్థిక శాస్త్రవేత్త గణపతిదేవుడు కవులనూ, కళాకారులను ప్రోత్సహించి అన్నిరంగాల్లోనూ అభివృద్ధిని సాధించి, తెలుగువారికి తొలిసారిగా స్వర్ణయుగాన్ని అందించిన ఏకైక చక్రవర్తి.
తనకంటే పెద్దవాడైన సేనాని, తననూ తన సామ్రాజ్యాన్నీ కాపాడిన రేచర్ల రుద్రిరెడ్డిని సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి, ఉచిత రీతిన సత్కరించాడు. రేచర్ల రుద్రుడు, గణపతి దేవుని అడుగు జాడలో నడిచి పాలంపేట పట్టణాన్ని, అక్కడున్న రామప్ప చెరువును, రుద్రేశ్వర (రామప్ప) దేవాలయాన్ని నిర్మించారు. తన కొడుకుల్లో ఒకరికి చక్రవర్తి పేరుపెట్టుకొని రుణం తీర్చుకున్నాడు. అదే వారసత్వాన్ని పుణికిపుచ్చుకొన్న రేచర్ల రుద్రుని కొడుకు గణపతిరెడ్డి, తండ్రి బాటలోనే నడిచాడు. రామప్ప దేవాలయానికి నాలుగు మైళ్ల దూరంలో తన తండ్రిని సమాదరించిన గణపతిదేవుని పేర గణపురం పట్టణాన్ని (ములుగు – ఘనపూర్), గణపేశ్వరాలయ సముదాయాన్ని, గణపసముద్రమనే చెరువును నిర్మించి తెలుగు మాగాణమైన తెలంగాణాకు మరో మహాబలిపురాన్నందించాడు. 22 దేవాలయాలు ద్రావిడ, కన్నడ, చాళుక్య, హొయసల, చోళ, ఘూర్జర, కళింగ, లాట సంప్రదాయాలను పుణికిపుచ్చుకున్నాయి. ఇలా ఇన్ని రకాల విమానాలున్న దేవాలయాలు ఒక్క చోట నిర్మించి తండ్రినే మించిపోయాడు గణపతిరెడ్డి.
తరతరాలపాటు కళాఖండాలుగా నిలిచి ఉంటాయని తలపోసిన గణపతిరెడ్డి ఆశలు, 1319-23 మధ్య జరిగిన ఢిల్లీ పాలకుల దాడిలో ఓడిపోయాయి. దేదీప్యమానంగా వెలుగొందిన కళా నిలయాలపై నిర్లక్ష్యపు నీలి నీడలు కమ్ముకున్నాయి. శిఖరాలు వొంగిపోయాయి. గోడలు కూలి పోయాయి. ఆలయాలు శిథిలాలైనాయి. మంటపాలు కుంగి కంటతడి పెట్టుకొంటున్నాయి. శిల్పుల సుత్తిదెబ్బల బాధపడని రాళ్లు ముందుగా గణపతిరెడ్డికి, కొద్దిపాటి మరమ్మతులు చేయించిన నిజాం రాష్ట్ర పురావస్తుశాఖ సంచాలకులు గులాం యాజ్‍దానీకి చేతులెత్తి నమస్కరిస్తూ, నేటి తరాన్ని వేడుకుంటున్నాయి. రాష్ట్ర పురావస్తుశాఖ గతకొన్నేళ్లుగా ఈ ఆలయ సముదాయాన్ని పునరుద్ధరించటానికి పూనుకోవటం హర్షించదగ్గ విషయం. అయితే ఇప్పటికీ మరమ్మతుకు నోచుకోక, పునాదులు కుంగి, స్థంభాలు వొంగి, దూలాలు రాలి, కప్పులు పడిపోయి ఉనికినే కోల్పోతున్నా, శక్తిని కూడగట్టుకొని తనను కాపాడమని కడుదీనంగా వేడుకొంటోంది గణపురం దేవాలయ సముదాయంలోని కళ్యాణ మండపం!
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446