తెలంగాణ హరిత నిధి ఏప్రిల్‍ 1నుంచి అమల్లోకి


తెలంగాణలో పచ్చదనం పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హరిత నిధి ఏప్రిల్‍ 1 నుంచి అమల్లోకి వస్తున్న ఇందుకోసం ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు తమ నెల జీతాల నుంచి కొద్ది మొత్తంలో విరాళాలు ఇవ్వనున్నారు. మే నెల నుంచి ఉద్యోగుల జీతాల నుంచి ఈ విరాళాలు సేకరిస్తారు. ఇందుకు సంబంధించి పలువురు మంత్రులు, అధికారులతో ఆర్థికమంత్రి మంత్రి హరీశ్‍రావు సమీక్షించారు. హరితనిధి ఏర్పాటు చరిత్రాత్మకమని, హరితనిధికి జమ అయ్యే నిధులతో నర్సరీలు, మొక్కల పెంపకం చేపట్టనున్నట్టు ఆర్థికమంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్‍ హరిత సంకల్పాన్ని అందరూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పచ్చదనం పెంచే అంశంలో ఇప్పటికే మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నామని చెప్పారు.


గతంలోనే ఉత్తర్వులు..
రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించేందుకు వీలుగా ‘తెలంగాణ హరిత నిధి’ ఏర్పాటైంది. దీని విధివిధానాలను ఖరారుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్‍లో ఉత్తర్వులు జారీచేసింది. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఛైర్మన్‍గా రాష్ట్ర స్థాయి కమిటీని కూడా ఏర్పాటుచేశారు. ఈ నిధి వినియోగానికి అటవీశాఖ నోడల్‍ ఏజెన్సీగా వ్యవహరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం 2015లో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, 230 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యంకాగా, 2021 నవంబరు నాటికి 239.44 కోట్ల మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలతోపాటు స్థానిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు ఇందులో పాలుపంచు కున్నాయి. హరిత ఉద్యమాన్ని నిరంతరం కొనసాగించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్‍ తెలంగాణ హరితనిధి (గ్రీన్‍ ఫండ్‍) ఏర్పాటుచేయనున్నట్లు గతేడాది అక్టోబరు 1న శాసనసభ వేదికగా ప్రకటించారు.


నిధుల సమీకరణ ఇలా
ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతోపాటు వివిధ వర్గాల నుంచి వచ్చే విరాళాలు, ప్రభుత్వం విధించే పన్నులు, ఫీజుల రూపంలో హరితనిధి సమకూరుతుంది. హరితనిధి రాష్ట్రస్థాయి కమిటీలో అటవీశాఖ మంత్రి ఛైర్మన్‍గా వ్యవహరిస్తారు. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వైస్‍ ఛైర్మన్‍గా, పీసీసీఎఫ్‍ కన్వీనర్‍గా, పీసీసీఎఫ్‍ ‘కంపా’, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ, ఆర్థికశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.


నర్సరీల నుంచి.. మొక్కల సంరక్షణ వరకూ
హరితనిధి వినియోగంపై విధివిధానాలను రాష్ట్ర అటవీశాఖ జీవోలో వెల్లడించింది. నర్సరీలను ఏర్పాటుచేయడం, మొక్కలు నాటడం, నీళ్లు పోయడం, సంరక్షించడం, మొక్కల లెక్కలు తేల్చడం, పచ్చదనంపై అవగాహన పెంచే కార్యక్రమాలు, ప్రణాళికల రూపకల్పన, అమలు, పర్యవేక్షణ వంటి అవసరాలకు ఈ నిధిని
ఉపయోగించాలని స్పష్టంచేసింది. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలను స్వీకరించి హరితనిధి రాష్ట్ర కమిటీకి పంపిస్తుంది. తర్వాత సంవత్సరంలో పెంచే నర్సరీలు, నాటే మొక్కలకు సంబంధించిన ఆమోదాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టులోపు పొందుతుంది. ప్రతి మూణ్నెల్లకోసారి ఈ కమిటీ సమావేశం అవుతుంది. హరితనిధికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవనుంది.

  • దక్కన్‍న్యూస్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *