హిందూ ముస్లింల అధ్యాత్మిక కేంద్రం బాబా యుసుఫైన్‍ దర్గా


‘‘ఏదోస్తీ హమ్‍ నహీఁ తోడేఁగే
చోడేఁగే దమ్‍ అగర్‍
తేరే సాథ్‍నా చోడేఁగే..’’

‘‘ఈ స్నేహాన్ని మేం విడదీయం. శ్వాస వీడినా స్నేహాన్ని మాత్రం వీడిపోము’’. షోలే సీన్మాలోని ఈ పాట 330 సం।।ల క్రితం హైద్రాబాద్‍ నగరంలో ఏకాత్మగా జీవించి మరణించిన ఇద్దరు స్నేహితులకు అక్షరాలా వర్తిస్తుంది. వారు హజ్రత్‍ సయ్యద్‍ షా యూసుఫుద్దీన్‍, హజ్రత్‍ సయ్యద్‍ షా షరీఫుద్దీన్‍లు. నాంపల్లి స్టేషన్‍ వెనుక భాగాన బజార్‍ ఘాట్‍ చౌరస్తాలో ఉన్న బాబా యూసుఫైన్‍ దర్గా వీరికి సంబంధించినదే.


వీరిద్దరు మన దేశానికి సంబంధించిన వారు కాదు. యూసుఫ్‍ సాహెబ్‍ ఈజిప్టు వాసి. షరీఫ్‍ సాహెబ్‍ సిరియా వాసి. ఇద్దరు మహమ్మద్‍ ప్రవక్త వంశానికి చెందిన వారు. ఇద్దరు కాలి నడకన తమ దేశాల నుండి పవిత్రస్థలమైన మక్కా చేరుకుని అక్కడ స్నేహితులైనారు. మక్కాలో వీరిద్దరికి మరో స్నేహితుడు తోడైనాడు. అతని పేరు హజ్రత్‍ షేక్‍ కలీముల్లా. ఇతను భారతదేశంలోని షాజహానా బాద్‍ (ఢిల్లీ) నివాసి. 1650లో జన్మించాడు. ఇతని తాత లాల్‍ఖిల్లా నిర్మాణంలో పాల్గొని షాజహాన్‍ చక్రవర్తిచే సన్మానింప బడినాడు. ఇతని తండ్రి ప్రఖ్యాతి గాంచిన వాస్తుశిల్పి. మరియు కాలిగ్రాఫర్‍ కూడా జామా మసీదు ముందు భాగాన ఇతని కాలిగ్రఫీ (చిత్రలిపి, అందమైన దస్తూరి) ఉంది. కలీముల్లాకు వీరిద్దరు శిష్యులుగా మారి ఆయన సాంప్రదాయానికి వారసులైనారు. భారత దేశంలో మత ప్రచారానికి శిష్యులిద్దర్నీ ఆయన ఆహ్వానించాడు. కలీముల్లా సూఫీ తత్వ విచారంలో చిస్టియా సిల్‍సిలాకు (సంప్రదాయానికి) చెందినవాడు. ఇతనికి ఔరంగజేబు సైన్యంలో అనేక మంది మురీద్‍లు (శిష్యులు) ఉండేవారు. ఆ సైన్యం దక్కన్‍ దండయాత్రకువెళ్లుతున్నందున తన శిష్యులిద్దర్నీ అందులో చేరి ద్కనులో సూఫీ తత్వాన్ని ప్రచారం చేయమని ఆదేశించాడు.

1687లో ఔరంగజేబు గోల్కొండ రాజ్యంపై దండెత్తి వచ్చినప్పుడు ఆ పటాలంలో వీరిద్దరు సామాన్య సైనికులు.
ఆ సందర్భంలో రెండు మహత్తులు జరిగాయి.

ఔరంగజేబు తన సైన్యంతో హైద్రాబాద్‍ నగరంలో ప్రవేశించి మీర్‍ జుమ్లా తలాబ్‍ కట్టమీద కవాతు చేస్తూ గోల్కొండ కోట వైపు వెళ్తున్నాడు. ఆ దారిలో హజ్రత్‍ బుర్హాన్‍షా అనే నగ్న సాధువు యోగ సమాధిలో కూచున్నాడు. బాటసారులు నగ్నత్వాన్ని దాచుకోవటానికి ఏదైనా గుడ్డను ఇస్తే కోపంతో విసిరికొట్టేవాడు. ‘‘పశువుల ముందు నేను సిగ్గుపడను, దుస్తులు ధరించను’’ అని మొండిగా వాదించేవాడు. అలాంటి అతను ఔరంగజేబు సైన్యం తన ముందు నుండి వెళ్ళటం గమనించి ఒక గుడ్డను సంపాదించి ఒళ్ళంతా కప్పుకున్నాడు. ఎన్నడూ లేనిది ఇదేమీ విడ్డూరం అని ఒకరు ఆ యోగిని ప్రశ్నించగా ఆ యోగి తన అరచేతితో అతని కండ్లను మూసాడు. పశువులన్నీ వరుసగా వెళ్ళుతున్నట్లు అందులో ఇద్దరు మాత్రమే మనుష్యులున్నట్లు ఆ యువకుడి మనో నేత్రానికి గోచరించింది. ఆ ఇద్దరు బాబా యూసుపుద్దీన్‍, బాబా షరీఫుద్దీన్‍.

వారి ముఖాలలో ఒక వింత కాంతి ప్రసరిస్తున్నది.
ఇక రెండవ మహత్తు.
ఔరంగజేబు ఎనిమిది నెలల నుండి గోల్కొండ కోటను జయించటానికి యుద్ధం చేస్తున్నాడు. అయినా విజయలక్ష్మి అతడిని వరించటం లేదు. అతని సైన్యానికి సరఫరా అవుతున్న ఆహార పదార్థాలను శత్రువులు మధ్యలోనే అడ్డగించి ఎత్తుకుపోతున్నారు. ఇది చాలదన్నట్లు ప్రకృతి కూడా అతని మీద పగ బట్టింది. మూసీనదికి వరదలు వచ్చి గుర్రాలు, ఏనుగులతో సహా సైనికులు కూడా కొట్టుకపోయారు. గాలివానకు డేరాలన్నీ చెల్లాచెదరైనాయి. తుఫాను రాత్రి, అంతటా అంధకారం. ఆ చీకటి రాత్రి ఆలంగీర్‍ ఔరంగజేబు చక్రవర్తి, ఢిల్లీ పాదుషా తన సైనికులలో మనోధైర్యం నింపటానికి శిబిరంలో ఇటు అటూ సంచరిస్తున్నాడు. గాలి దుమారానికి అంతటా దీపాలు ఆరిపోయి అంధకారం ఏర్పడినా ఒక గుడారంలో మాత్రం ఒక కొవ్వొత్తి తేజోవంతంగా వెలుగుతుంది.


‘‘ఆలంగీర్‍’’ ఆశ్చర్యపోయి ఆ గుడారం వాకిట నిలబడి లోపలికి తొంగి చూసాడు. పసిమి చ్ఛాయతో, తేజోవంతమైన నయనాలతో, పొడుగు గడ్డాలతో దీక్షగా ఖురాన్‍ చదువుతూ, అల్లాను స్మరిస్తున్న ఇద్దరు పవిత్రులు ఆయనకు కనిపించారు. వారు హజ్రత్‍ యుసుఫ్‍, హజ్రత్‍ షరీప్‍లు. చక్రవర్తికి ఆ ‘‘అల్లావాలాల’’ మీద నమ్మకం ఏర్పడి గోల్కొండను జయించే మార్గం చెప్పమని పదేపదే వేడుకున్నాడు. చివరికి వారు ఒక పగిలిన కుండ పెంకు మీద ఏదో మంత్రాక్షరాలని రాసి లంగర్‍ ఖానా (నేటి లంగర్‍ హౌజ్‍) దగ్గర చెప్పులు కుట్టే ఒక మాదిగ ముసలతనికి దానిని అందచేయమని ఆదేశించారు. ఔరంగజేబు స్వయంగా ఆ కుండ పెంకును తీసుకుని చెప్పులు కుట్టే మాదిగ వృద్ధుడికి దానిని అందజేసాడు. అతను కోపంతో ఆ కుండపెంకును పగలగొట్టి మరో పెంకుపై ఏవో గీతలు గీసి రాసిన వారికే చూపెట్టమన్నాడు. చక్రవర్తి తన అహంకారాన్ని చంపుకుని మళ్లీ గుడారానికి వాపస్‍ వెళ్లి వారికి దానిని అందజేసాడు. వారు తీక్షణంగా భృకుటి ముడిచి అల్లా నామస్మరణతో మరి కొన్ని బీజాక్షరాలు అదే పెంకుపై లిఖించి అతనికే అందచేయమని మళ్ళీ ఆదేశించారు. చేసేదేమీ లేక ‘‘సబర్‍ కా ఫల్‍ మీఠా హోతాహై’’ అనుకుని ఓపిక నశించని ఆ ఢిల్లీ చక్రవర్తి లంగర్‍ హౌజ్‍లోని ఆ ‘‘మోచీ’’ దగ్గరికి చేరుకున్నాడు. ఆ మాదిగ ముసలివాడు ఆ అక్షరాలను చదవటం ముగించగానే ఒక పెద్ద వెలుగు వెలిగి, మిరుమిట్లు తెలిపే కాంతిలో ఆ ముసలివాడు మాయం అయినాడు.


ఔరంగజేబు ఆ ఇద్దరు పవిత్రుల వద్దకు తిరిగి వచ్చి జరిగిందంతా విన్నవించాడు. అప్పుడు వారు ఒక చిర్నవ్వు నవ్వి ఆ మాదిగ ముసలి ఎవరో కాదని, గోల్కొండ రాజ్యాన్ని రక్షిస్తున్న అతీత శక్తి అని ఇక ఆ శక్తి లేదు కావున ఇక విజయం మీదేనని ఆశీర్వదించారు.
ఆ తెల్లారే ఔరంగజేబు కోట ముట్టడిలో ‘‘ఫతేదర్వాజా’’ దగ్గర విజయం సాధించాడు. ఈ ఫతేదర్వాజా హుసేనీ ఆలం దాటిన తర్వాత ఉంటుంది.
యుద్ధం ముగిసిన తర్వాత ఆ ఇద్దరూ ఢిల్లీకి వాపస్‍ వెళ్లలేదు. సరికదా సైన్యం నుండే విరమించుకుని తమ ముర్షీద్‍ (గురువు) కలీముల్లా ఆదేశం ప్రకారం ఆధ్యాత్మిక మార్గం అవలంభించారు. హిందూ, ముస్లిం అని బేధభావం చూపక అందరికీ తత్వ బోధనలు చేసారు. నేక్‍నాంపురాలో స్థిరపడినారు. అదే తర్వాత కాలంలో నాంపల్లిగా మారింది. హిందూ మతంలోని భక్తి ఉద్యమానికి, ఇస్లాంలోని సూఫీ తత్వానికి చాలా పోలికలు ఉన్నాయి. అందుకే హిందూ మతంలోని క్రింది కులాల వారు సూఫీ సాధువులకు దగ్గరయ్యారు. భక్తి ఉద్యమం ప్రేమ శాంతి, సహనంల మీద ఆధారపడినట్లే సూఫీ ఇజం కూడా వాటినే పాటించింది. ఆత్మ పరిశుద్ధతకు, త్రికరణ శుద్ధికి రెండూ ప్రాధాన్యత ఇచ్చాయి. రెండు కూడా సంగీత సాహిత్యాలకు ప్రాముఖ్యతను ఇచ్చాయి. దేవాలయాలలోని ఆచారాలు పుష్పాల అలంకరణ, కొబ్బరికాయలు కొట్టటం, ప్రసాదాన్ని పంచటం, చందన సేవ, పాటలు పాడటం లాంటివి దర్గాలలో కూడా పాటిస్తారు. హిందువులు దర్గాలకు దగ్గర కావటానికి ఇవి కూడా కారణాలు.


హైద్రాబాద్‍లో వీరిద్దరే గాక, పహాడీ షరీఫ్‍లోని బాబా షర్ఫుద్దీన్‍, షేక్‍పేటలో హుస్సేన్‍ షా వలీ, శంషాబాద్‍లో బాబా జాహంగీర్‍ పీర్‍, మౌలాలీ దర్గాలోని మౌలా అలీలు ఈ సూఫీ ఉద్యమానికి చెందిన వారే. మన దేశంలోని చాలా మంది సూఫీ గురువులు ఇరాన్‍ నుండి ఇక్కడికి వచ్చిన వారే. బాబా ఫక్రుద్దీన్‍ ఇరాన్‍లో ఒక ప్రాంతానికి నవాబు. ఆయన వైరాగ్యంతో రాజ్యాన్ని త్యజించి కాలినడకన మన దేశానికి వచ్చి అనేక ప్రాంతాలు సంచరించి చివరికి అనంతపురం జిల్లాలోని పెనుగొండలోని గుట్టమీది గుహలో పన్నెండు సంవత్సరాల ఏకాంత వాసం, తపస్సు ఆచరించి అక్కడే సమాధి సిద్ధిని పొందినాడు. ఇతని తత్వబోధనల ప్రభావం వలన చాలా మంది ‘‘జంగములు’’ ఇస్లాంను స్వీకరించారు. పెనుగొండలోని ‘‘బాబా ఫకుక్రుద్దీన్‍ దర్గా’’ నేడు కూడా అన్ని మతాల వారికి ప్రసిద్ధిపొందిన పుణ్యక్షేత్రం. హిందువులలో ‘‘బాబయ్యి, బాబూరావు’’ అన్న పేర్లు ఈ సూఫీ బాబాల ప్రభావంతో పెట్టిన పేర్లే. షిర్డీ సాయిబాబా, సత్యసాయిబాబా, మెహర్‍ బాబా, తాజుద్దీన్‍ బాబా పేర్ల మీద కూడా సూఫీజం ప్రభావం ఉందేమో విజ్ఞులే సెలవివ్వాలి.


వీరే గాక ఢిల్లీలో నిజాముద్దీన్‍ ఔలియా, అజ్మీర్‍లో హజ్రత్‍ ఖాజా మొహియుద్దీన్‍ చిష్ఠీ, గుల్బర్గాలో బందా గరీబ్‍ నవాజ్‍, కాశ్మీర్‍లో నూరుద్దీన్‍ రుషిలు యావత్‍ భారతదేశంలోనే పేర్గాంచిన సూఫీ తత్వవేత్తలు. హిందువులు ఈ నూరొద్దీన్‍ను నందరుషి అని కీర్తించారు. ఇతను అన్ని మతాల వారిని సమానంగా ఆదరించాడు. బ్రాహ్మణ మతాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన శైవసాధ్వి ‘‘లల్లామాత’’ దగ్గర ఈ నూరొద్దీన్‍ పాలు తాగి పెరిగినాడని కాశ్మీరీలు నమ్ముతారు. ఈ సూఫీలతో నాలుగు సిల్‍ సిలాలు (పరంపరలు) ఉన్నాయి. అవి
1) ఖాదరియా
2) చిష్ఠియా
3) నక్షాబందీ
4) సుహర్‍ వార్దియా.

1710లో బాబా యూసుపుద్దీన్‍ అల్లాకు ప్రియతముడైనాడు. ఆ వార్త విన్న షరీపుద్దీన్‍ ఒక దుప్పటికప్పుకుని పడుకుని నిద్రలోనే ఆత్మార్పణ గావించాడు. స్థానికులు భక్తి ప్రపత్తులతో వారిద్దరికి సమాధులను నిర్మించి ప్రతి ఏటా ఉర్సులను చేయసాగారు. చోటా ఉర్సు అంటే జన్మదినం. బడా ఉర్సు అంటే చనిపోయిన దినం. వారి సమాధులకు భక్తులు మొక్కుకునే వారు. వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరేవి. ఆ అపూర్వ స్నేహితులు అల్లాకు ప్రియమైన తర్వాత 21 సం।।లకు అనగా 1731లో వారి గురువు కలీముల్లా కాలధర్మం చెందాడు.


మూడవ నిజాం సికందర్‍ జా అలీ కాలంలో అందమైన నగిషీలతో ఆ సమాధులను సుందరీకరించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు తండోపతండాలుగా రాసాగారు. సరాయిల (సత్రాలు) నిర్మాణం జరిగింది. భక్తుల అవసరాల కోసం దుకాణాల సముదాయాలతో బజార్‍ ఏర్పడి ఆ ప్రాంతానికి ‘‘బజార్‍ ఘాట్‍’’ పేరు స్థిరపడింది.
ఉర్సు సందర్భంగా ప్రతిఏటా చార్మినార్‍ నుండి యుసుఫైన్‍ దర్గా వరకు ‘‘సందల్‍’’ ఊరేగింపు జరుగుతుంది. మంచిగంధం, అత్తరు, సుగంధ ద్రవ్యాలను, పూవులను భక్తి ప్రపత్తులతో ఊరేగించి ఆ సూఫీ సాధువులకు సమర్పిస్తారు. భగవంతుడిని భక్తుడిని అనుసంధానించేది సంగీతం అన్న భావనతో ఖావాలీ కార్యక్రమాలు జరుగుతాయి.
పవిత్ర మక్కా సందర్శనం కోసం ఈజిప్టు, సిరియాల నుండి బయలుదేరిన ఆ ఇద్దరు ‘‘అల్లావాలాల’’ అధ్యాత్మిక ‘‘సఫర్‍నామా’’ (యాత్ర) నాంపల్లిలో ముగిసింది. ‘‘దునియాకే దో దీన్‍’’ ఔర్‍ ‘‘దోస్తీకీ నిషానీ’’ యుసుఫైన్‍ దర్గా.
‘‘వారు జీవించనూలేదు. మరణించనూ లేదు. ఆది మధ్యాంతరహిత విశ్వవిను వీధులలో సంచరిస్తూ రవంత సేపు విశ్రమించటానికి పాప పంకిలమైన ఈ పుడమి మీద ఆగినారు’’.


(షహర్‍ నామా (హైద్రాబాద్‍ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్‍,
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *