పోరు జెండా.. మల్లు స్వరాజ్యం

మల్లు స్వరాజ్యం… పోరాటానికి పర్యాయ పదం.. భూమికోసం.. భుక్తికోసం… పేద ప్రజల విముక్తికోసం సొంత జీవితాన్ని వదిలిపెట్టిన స్ఫూర్తి చరిత… పట్టుకుంటే పదివేల బహుమానమన్న నిజాం సర్కార్‍పై బరిగీసి ఎక్కు పెట్టిన బందూక్‍… చావుకు వెరవని గెరిల్లా యోధురాలు.. అసెంబ్లీలో ఆమె మాట తూటా.. పదవి లేకపోయినా ప్రజా సమస్యలే ఎజెండా – ఆమె పోరాటాల ఎర్రజెండా..


తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (91) అనారోగ్యంతో కన్నుమూశారు. ఊపిరితిత్తుల సమస్యతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె మార్చి 19న బంజారాహిల్స్ కేర్‍ ఆస్పత్రిలో కన్నుమూశారు. స్వరాజ్యం 10 ఏండ్ల వయసులోనే మల్లు వెంకట నరసింహారెడ్డిని వివాహం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో 1931లో జన్మించిన మల్లు స్వరాజ్యం.. నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించి, రజాకార్ల పాలిటి సింహస్వప్నమై నిలిచింది. 1945 నుంచి 1948 వరకు జరిగిన సాయుధ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి నిజాం సర్కారును గడగడలాడించింది. వరంగల్‍, కరీంనగర్‍, ఆదిలాబాద్‍ జిల్లాల్లో గిరిజనులను మేల్కొల్పడంలో మల్లు స్వరాజ్యం కీలక పాత్ర పోషించింది. నా మాటే తుపాకీ తూటా పేరుతో ఆత్మకథను రాశారు.


స్వరాజ్యం జానపద బాణీల్లో పాటలు కట్టి స్వయంగా పాడి గ్రామాలలోని ప్రజలను ఆకట్టుకునేది. స్వరాజ్యం ఆంధప్రదేశ్‍ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1978-1983, 1983-1984 సంవత్సరాలలో రెండు పర్యాయాలు సి.పి.ఐ.(ఎం) పార్టీ తరఫున ఎన్నికైంది. నల్లగొండకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణా యోధుడు, పార్లమెంటేరియన్‍ భీమిరెడ్డి నరసింహారెడ్డికి సోదరి కావడం గమనార్హం. వామపక్ష భావాలతో, స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక ‘చైతన్య మానవి’ సంపాదకవర్గంలో స్వరాజ్యం కూడా ఒకరు.


మల్లు స్వరాజ్యం జీవిత విశేషాలు
మల్లు స్వరాజ్యం చిన్నప్పటి నుంచి వామపక్ష భావాజాలంతో పెరిగింది. దాంతో ఆమె మార్క్సిస్ట్ పార్టీ పట్ల ఆకర్షితురాలైంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు. వీరికి వందలాది ఎకరాల భూమి ఉండేది. 1945 సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో స్వరాజ్యం.. నిజాం సర్కారును గడగడలాడించారు. ఈమె పోరాటాల ధాటికి తట్టుకోలేక 1948లో స్వరాజ్యం ఇంటిని నిజాం గూండాలు దగ్ధం చేశారు. మల్లు స్వరాజ్యం సాయుధ పోరాటంలో భాగంగా.. ఆదిలాబాద్‍, వరంగల్‍, కరీంనగర్‍ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని నిరసిస్తు జనాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు.


స్వరాజ్యం దళంలో మహిళ కమాండర్‍గా పని చేశారు. అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యాన్ని పట్టిస్తే పదివేల రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు. స్వరాజ్యం భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. స్వరాజ్యం సోదరుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి.. మిర్యాలగూడ పార్లమెంటు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. స్వరాజ్యం నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978 నుండి 83 వరకు మొదటి దఫా, 1983 నుండి 84 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు.


అన్నం పెట్టి… ఆలోచన మార్చుకుని..
బాల్యంలో ఓ ఘటన మల్లు స్వరాజ్యం ఆలోచనను మార్చేసింది. అప్పట్లో వడ్లను కూలోల్లే దంచేటోళ్లు. ముఖ్యంగా ఆడవాళ్లు. పుట్లకొద్ది దంచినా కూలీ ఉండదు. రోజుల తరబడి పని జరిగేది. అలా దంచుతున్న ఎల్లమ్మ అనే కూలీ కళ్లు తిరిగి పడిపోయింది. అక్కడే కాపలాగా ఉన్న స్వరాజ్యం నీళ్లు తీస్కపోయి తాగించారు. అన్నం తినలేదని చెబితే.. అన్నం తీసుకొచ్చి తినిపించారు. మిగిలిన కూలీలు తినలేదంటే… చూస్తే అన్నం లేదు.
బియ్యం నానబెట్టుకుని తింటామంటే వాళ్లకు సాయం చేశారు. అట్లా సాయపడ్డందుకు ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. స్వరాజ్యం చిన్నాయనలు తప్పుబట్టి తిట్టిండ్రు. అప్పుడు వాళ్లమ్మ చొక్కమ్మ అండగా నిలబడ్డది. ‘చిన్న పిల్ల ఏమనకండి’ అని వెనకేసుకొచ్చింది. కష్టం చేసే వ్యక్తికి తినే హక్కెందుకు లేదోనన్న ఆలోచన ఆనాడే స్వరాజ్యం మనసులో అంకురించింది. అక్కడి నుంచే ఆమె తిరుగు బాటు నేర్చుకున్నారు.


మనుసులో ముద్రించుకుపోయిన ‘అమ్మ’
స్వరాజ్యంపై వాళ్లమ్మ చొక్కమ్మ ప్రభావం ఎక్కువ. బిడ్డను రాణీరుద్రమలా పెంచాలి అనుకునేవారామె. స్వరాజ్యం ఎనిమిదో ఏట తండ్రి మరణించాడు. అప్పటికే అన్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్‍)ఆంధ్రమహాసభ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. ఆయన ప్రోత్సాహంతో బాలల సంఘం పెట్టారు స్వరాజ్యం. అన్న తెచ్చిచ్చిన మాక్సీం గోర్కీ ‘అమ్మ’ పుస్తకాన్ని వాళ్లమ్మతో కలిసి చదివారు.
రాత్రి దాలిలో పాలు కాగబెట్టి.. తోడెయ్యడం కోసం వాటిని ఆరబెట్టినప్పుడు కూర్చుని చదివిన ఆ పుస్తకంలోని అక్షరం అక్షరం ఆమె మనసులో ముద్రించుకుపోయింది. ఆ పుస్తకంలోని అమ్మ పాత్ర వాళ్లమ్మను, ఆమెను ప్రభావితం చేసింది. అందుకే బీఎన్‍ని సాషా అని పిలుచుకునేవారామె. కొడుకుతోపాటు కూతురు స్వరాజ్యం పోరాటంలోకి వెళ్తానంటే అడ్డుపడలేదు సరికదా… ప్రోత్సహించి ఉద్యమాల్లోకి పంపించిందా అమ్మ. తన 11వ ఏట గెరిల్లా యుద్ధంలో శిక్షణ, ఆత్మరక్షణా పద్ధతులు నేర్చుకున్నారు. 12 ఏళ్ల వయసులోనే ఆంధ్రమహాసభలో చేరారామె. ఆ తరువాత వారిల్లు ఆంధ్ర మహాసభకు కేంద్రమయ్యింది.


కూలీరేట్ల పెంపు… పెద్ద మలుపు..
తెలంగాణలో వెట్టిచాకిరీ, భూస్వాముల దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, కూలీ పెంచాలని ఉద్యమం మొదలైంది. తమది దొరల కుటుంబమే అయినా… ఊళ్లో ఉన్న జీతగాళ్లు, కూలోళ్లందరినీ కూడగట్టి సమ్మె చేద్దామని ప్లాన్‍. అప్పటికే పోలీస్‍ పటేల్‍ అయిన స్వరాజ్యం చిన్నాయన తుంగతుర్తి పోలీస్‍ స్టేషన్‍కు సమాచారం ఇవ్వడంతో బీఎన్‍ని అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారు. తల్లి పోలీసులను దర్వాజ కాడనే అడ్డుకుంటే… అన్నను ఊరుదాటించారు స్వరాజ్యం. ఆయన వెళ్తూ ‘నేను పోతున్న… సమ్మె జరిగేట్టు చూడాలె’ అంటూ బాధ్యతను పెట్టాడు. తెల్లారి వాడలన్ని తిరిగి పనికి పోవద్దని చెప్పారామె.
అయినా వినలేదు… తన చిన్నాన్న పనిలోకే పోతున్నరని తెలిసి, వాగులో వాళ్లకడ్డం పడుకున్నది. ‘మీరు కూలికి పోవాలంటే.. నన్ను దాటుకుపోండి’ అని పట్టుబట్టారామె. భూస్వాముల పిల్ల కనుక ఆమెను దాటి వెళ్లలేకపోయారు. ఆరోజుకు వెనుదిరిగిండ్రు. మరునాడు పనిలోకి రానందుకు వాళ్ల చిన్నాయన కూలోళ్లను పిలిచి పంచాయతీ పెట్టిండ్రు. అది తెలిసిన స్వరాజ్యం.. ‘దెబ్బ నామీద పడ్డంకనే వాళ్ల మీద పడాలి’ అంటూ బాబాయి దౌర్జన్యాన్ని అడ్డుకున్నారు. రేటు పెంచితే తప్ప పనిలోకి రాలేమన్నరు కూలీలు. అప్పటిదాకా సోలెడున్న కూలీ… మూడు సోలెలు అయ్యింది. సమ్మె జయప్రదమైంది. అది స్వరాజ్యం ఉద్యమ జీవితంలో తొలి అడుగు.


16 ఏళ్లకే గెరిల్లా…
భూస్వాముల దగ్గరున్న ఆయుధాల స్వాధీనంతో మొదలైన పోరు.. పోలీసు క్యాంపుల దాకా కొనసాగింది. గ్రామాల మీద దాడి చేసిన పోలీసుల దగ్గర్నుంచి ఆయుధాలు గుంజుకోవడంలో మహిళలకు శిక్షణ నిచ్చారు స్వరాజ్యం. ఆకునూరు, మాచిరెడ్డిపల్లి, సూర్యాపేట, మల్లారెడ్డిగూడెం, పోరాటాల్ల్లో కీలక పాత్ర పోషించారు స్వరాజ్యం. కడివెండి పోరాటంలో మహిళలను కూడగట్టడంలో ఆమెది ప్రధాన భూమిక.
నల్గొండ, వరంగల్‍జిల్లాల్లో దాదాపు పదిహేను సాయుధ పోరాటాలు ఆమె నాయకత్వంలో జరిగాయి. తాడి, ఈత చెట్లపై నిజాం సర్కార్‍పెత్తనాన్ని సవాలు చేస్తూ… ‘గీసేవాడిదే చెట్టు.. దున్నేవాడిదే భూమి’ నినాదానికి పార్టీ పిలుపునిచ్చింది. సూర్యాపేట తాలూకాలో నిర్వహణ బాధ్యతలు స్వరాజ్యానికి అప్పగించారు. గ్రామరాజ్యాలు, గ్రామ రక్షణ మహిళా దళాలు ఏర్పాటు చేయడం, తాళ్ల పంపకం, భూ పంపకం సమర్థవంతంగా నిర్వహించారు స్వరాజ్యం.
గ్రామాల్లో తిరిగి పనిచేసినా.. తుపాకీ పట్టి గెరిల్లాగా ఉన్నా, అసెంబ్లీలో నిలబడినా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఆమెది పోరాటమే. దోపిడీ ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది. పోరాటాలు ఉన్నంత కాలం.. మల్లు స్వరాజ్యం పేరు ఉంటుంది.


మల్లు స్వరాజ్యం భర్త మల్లు వెంకట నర్సింహారెడ్డి (వీఎన్‍) ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, నల్లగొండ జిల్లా సీపీఎం కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 2004 డిసెంబర్‍ 4న మరణించారు. వీరికి ఒక కుమార్తె పాదూరి కరుణ, ఇద్దరు కుమారులు మల్లు గౌతంరెడ్డి (వైద్యుడు), మల్లు నాగార్జునరెడ్డి (న్యాయవాది) ఉన్నారు.

  • దక్కన్‍న్యూస్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *