ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే అనేక సముదాయాల సమాహారమే వారసత్వ సంపద. ఆ సముదాయాల సమాహారం అనేక రూపాల్లో ఉండవచ్చు. భావజాలరూపంలో ఉండొచ్చు. నాగరికత, సంస్కృతి, అలవాట్ల వంటి జీవనవిధాన రూపంలో ఉండొచ్చు. భౌతిక రూపాలైన మానవ నిర్మిత కట్టడాలు, దేవాలయాలు, ఆనకట్టలు, నగర నిర్మాణ పద్ధతులు, ఉద్యానవనాలతో పాటు ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కళాత్మక నిర్మాణాల రూపంలో ఉండొచ్చు. వీటిని కాపాడుకుంటూ ముందు తరాలకు అందివ్వడమనేది వర్తమాన సమాజపు బాధ్యత. ఆ బాధ్యతను గుర్తు చేసుకోవడానికే ప్రాధాన్యత గల వివిధ అంశాల గురించి దినోత్సవాలను, వారోత్సవాలను జరుపుకుంటున్నాం.
ఏప్రిల్ 18న ‘వరల్డ్ హెరిటేజ్ డే’ జరుపుకోబోతున్నాం. వివిధ దేశాలలో గుర్తించిన పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ కోసం యునెస్కో సభ్యదేశాల మధ్య పరస్పర ఆర్థిక, సాంకేతిక విషయాలలో సహకరించుకోవడం, ఆయా దేశాల్లోని ప్రజలకు వీటిపట్ల అవగాహన కలిగించడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 అంతర్జాతీయ స్థాయి కట్టడాలు, స్థలాలను గుర్తించి వాటి పరిరక్షణకు యునెస్కో కృషి చేస్తుంది. మనదేశంలో 18 కట్టడాలు, 7 స్థలాలు గుర్తింపు పొందాయి. వీటిలో క్రీ.పూ. మూడు, రెండు శతాబ్దాలకు చెందిన సాంచీ స్థూపాల నుంచి క్రీ.శ. 16, 17 శతాబ్దాలకు చెందిన గోవా చర్చిలు, నలందా విశ్వవిద్యాలయం దాకా ఉన్నాయి. సహజసిద్ధంగా ఏర్పడిన ఖజీరంగ వన్యసంరక్షణ ప్రాంతం, సుందరబన్స్, నందాదేవి ఉద్యాన వనాలు ఉన్నాయి. కాకతీయుల శిల్ప కళావైభవానికి ప్రతీక రామప్ప ఇటీవలనే ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందింది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 కట్టడాలు, స్థలాలు, బౌద్ధస్థూపాలు, ఆరామాలు, కోటలు, దేవాలయాలు, సమాధులు, లోయలు, గుహలు వారసత్వ జాబితాలో చేర్చతగ్గవి చాలా ఉన్నాయి.
విదేశీ దాడులవల్ల, దేశీయుల నేర ప్రవృత్తివల్ల, రోజురోజుకీ పెరుగుతున్న ‘కబ్జా’తనం వల్ల మన వారసత్వ సంపదకి హాని జరుగుతుంది. పట్టించుకునే వాళ్లు లేక అనేక పురాతన విగ్రహాలు తలొకచోట, కాలొకచోట, చెయ్యొక చోట మట్టిలో పడివుండటం మన పత్రికలో చరిత్ర పరిశోధకులు రాస్తున్న వ్యాసాల్లో కనిపిస్తూనే ఉంది.
ఈ వారసత్వ సంపదను ఎలా కాపాడుకోవాలి?
భారత ఉపఖండంలో అనేక రాజ్యాలుండేవి. రాజులు, పాలకులు స్వయంగా ఏ మతాన్ని ఆచరించినా, వారి నిర్మాణాలలో, రాజ ప్రాసాదాలలో, కట్టడాలలో వాస్తు, శిల్ప, కళా నైపుణ్యాలతో పాటు సర్వమత సామరస్యానికి ప్రాధాన్యతనిచ్చి వివిధ మత చిహ్నాలనూ నిర్మించి వాటిని ప్రజలందరి చారిత్రక సంపదగా అందించారు. విభిన్న మతాలు, జాతులు, కులాలు, భాషలు, సంస్కృతులతో కూడిన వైవిధ్యపూరితమైనది భారతీయ సమాజం. ఈ వైవిధ్య పరంపరల మధ్య సామరస్యతను నెలకొల్పినది ప్రజాస్వామిక దృక్పథం. భారతీయ సమాజ స్వభావంలో అంతర్లీనంగా ప్రవహించే జీవనది ప్రజాస్వామిక దృక్పథం. ఇవ్వాళ్టికీ అంతర్జాతీయ స్థాయిలో మనదేశ కీర్తిని నిలబెడుతున్నదీ యిదే.
ఇదే మన వారసత్వ సంపదను కాపాడగలుగుతుంది. సమాజంలో ప్రజాస్వామిక స్వభావాన్ని పెంపొందించడం, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా వారసత్వ సంపద పరిరక్షణకు కృషి చేయడం ప్రభుత్వాల, ప్రజల ఉమ్మడి బాధ్యత.
(మణికొండ వేదకుమార్)
ఎడిటర్