చొప్పకట్లపాలెం శాసనం


తెలంగాణా రాష్ట్రంలో పాతపదిజిల్లాలలో లభించిన శాసనాలను పరిష్కరించి, వాటినుంచి నల్గొండ, మహబూబునగర్‍, మెదక్‍, వరంగల్‍, కరీంనగర్‍, నిజామాబాద్‍ జిల్లాల శాసనసంపుటులను రాష్ట్ర వారసత్వశాఖ ప్రచురించింది. ఇంకా ఖమ్మం, ఆదిలాబాద్‍, రంగారెడ్డి, హైద్రాబాద్‍ జిల్లాల శాసనాలు ప్రచురించబడాల్సిన అవసర మున్నది. చరిత్రకు ప్రత్యక్షసాక్ష్యాలు, ఆధారాలైన శాసనాలను పరిష్కరించి, ప్రచురిస్తే తెలంగాణ చరిత్ర మరింత కొత్తగా తెలిసే అవకాశాలున్నాయి. విడిగా కొందరు శాసనకారుల అధ్యయనంలో వెలుగుచూసిన శాసనాలు కొన్ని. తెలంగాణాలో ప్రభుత్వం తరపున జరిగిన శాసనాధ్యయనం కాక బిఎన్‍ శాస్త్రిగారి శాసనపరిష్కార కృషి అనన్యసామాన్యం. శాస్త్రిగారి తర్వాత తెలంగాణ శాసనాలను పరిష్కరించిన తెలంగాణ శాసనవేత్తలే అరుదు.


కొత్తతెలంగాణ చరిత్రబృందం తాము క్షేత్రాన్వేషణలు జరిపిన చోట్లలో లభించిన శాసనాలను పరిష్కరించి, జనాంతికంగానే ప్రకటిస్తూ వస్తున్నది. అటువంటి కృషిలో భాగంగా మా చరిత్రబృందం కో-కన్వీనర్‍ కట్టా శ్రీనివాస్‍ అన్వేషణలో ఖమ్మం జిల్లా చొప్పకట్ల పాలెం గ్రామంలో చేసిన అన్వేషణలో కొత్త కాకతీయ శాసనం లభించింది.
కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రదేవుని పాలనాకాలంలో నిర్మించిన శివాలయాలకు మల్లినాథ లేదా మల్నాథ దేవాలయాలని, తన ముత్తాత కాకతీయ గణపతిదేవుని కాలంలో కట్టించిన శివాలయాలకు రామనాథ దేవాలయాలని పేరున్నది. ప్రతాపరుద్రుని కాలంలో ఖమ్మం జిల్లా, బోనకల్‍ మండలంలోని చొప్పకట్లపాలెం గ్రామంలో నిర్మించబడిన శివాలయం ‘స్వయంభు మల్నాథ మహాలింగ దేవాలయం’ అని ఆ గ్రామంలో లభించిన శాసనంలో పేర్కొనబడింది. ప్రతాపరుద్రుని సామంతుడో, ప్రతినిధో అయిన పినమలిదేవుని ఆజ్ఞ ప్రకారం శివాలయానికి ‘పూర్వోదత్తి’గా (గతంలో వాగ్దానమైన)ఉన్న దేవబ్రాహ్మణవ్రిత్తులను ఆ గ్రామం కరణం చౌండయ్య అమలు పరిచారు.


ఈ శాసనం శక వర్షాలు 1236 ప్రమాదీచ మాఘ శుద్ధ పాడ్యమిన అనగా క్రీ.శ. 1315సం. జనవరి 7వ తేదీన వేయబడింది. చొప్పకట్లపాలెం శివాలయంలోని మల్నాథ మహాలింగదేవరకు అంగభోగానికి పించిగంచిప్రోలు, తేర్నాన వంటి గ్రామాలలో వెలిపొలము(మెట్టభూమి), తాటితోట, పూలతోట, సంకిరెడ్డి చెఱ్వుకొమ్మున కోటరపాయతోట, తాటిమణి గుడం ముందట కందులతోట, రంగభోగానికి నల్లచెర్వువెనక, సంకిరెడ్డి చెర్వు వెనక, నల్లచెఱ్వులోన నీరునేల(తరిభూమి), వెలిపొలము (మెట్టభూమి) అచ్చుకట్టేటి కోటరపాయ తోటలు రెండు, సంకిరెడ్డి చెరువు, పెద్దినేని కుంట పొలాలు ఇవ్వబడ్డాయి. దేవాలయ పాలకగొల్ల ముక్తెబోయడు సంకదేవలంకు (శంకరదేవాలయానికి) పడ్డను (తొలిచూలు ఆవు లేక గేదె) వెలయిచ్చి కొన్నాడు.


దేవబ్రాహ్మణవ్రిత్తులు, రాచపొలము, స్థానమాన్యాలను కార్తీక, వైశాఖమాసాలలో (రబీ, ఖరీఫ్‍) అనగా 6నెలలకొకసారి, ఏడాదిలో రెండు పంటలు తీసుకునేవిధంగా కరణం చౌండయ్య, చొప్పకట్లపాలెం ప్రజలు కలిసి సూర్యగ్రహణకాలంలో ఈ దానశాసనం ఇచ్చారు. కాకతీయల రాజ్యపాలన ప్రజాస్వామికంగా ఉండేదని చెప్పడానికి ఈ శాసనం ఒక ఉదాహరణ. గ్రామకరణం చౌండయ్యకు అధిపతి ఆజ్ఞ లభించినా తాను గ్రామప్రజలతో కలిసి దేవబ్రాహ్మణ వ్రిత్తులను పునరుద్దరించాడు. దేవాలయ నిర్వహణకు కావలసిన బ్రాహ్మణసేవలు, దేవాలయంలో అంగ, రంగభోగాలకు, దీపార్చనకు నేయి కొరకు దేవాలయ పాలక గొల్ల బాధ్యతలు, ఈ శాసనంలో పేర్కొనబడ్డాయి.


కాని, ఈ శాసనంలో పేర్కొనబడిన పినమలిదేవుడు ఎక్కడి పాలకుడో వివరం లేదు. ఇటువంటిదే ఇదే కాలపు తెలుగులిపిలో లభించిన ఆమనగల్లు శాసనంలో కూడా పేర్కొనబడిన కొండమల్లి దేవరాజులెవరో వివరం లేదు. నెల్లూరుప్రాంతం పాలించిన వారిలో ఒకరు పినమలిదేవచోడుడని తెలుస్తున్నది. అతడు కాకతీయరాజ్య విధేయుడే. అందువల్ల అతడే ఇతడా అనేది సందేహం. అదిగాక కాకతీయ నాయంకరులలో మల్దెవ పాత్రుడు, అనాచి మల్దెవుడు, మురారి మల్దెవుడు అని ముగ్గురు మలిదేవుల పేర్లున్నాయి. వీరిలో ఒకరయే అవకాశం కూడా ఉంది.


గత సంవత్సరం చొప్పకట్లపాలెంలో ఈ శివాలయాన్ని కొత్తగా కట్టించారు. పూర్వశిథిలాలయాన్ని చూసినపుడు అది కాకతీయుల శైలిలో నిర్మించబడ్డదని తెలుస్తున్నది. గర్భాలయం, అంతరాళం, రంగమంటపాలతో ఉండే దేవాలయపు ఆనవాళ్ళుగా గర్భాలయంలో శివాలయం, రెండు జతల శైవద్వారపాలకులు, దేవాలయపు చూరుకు కాకతీయశైలిలో కనిపించే ఝారావళి కనిపించాయి. గ్రామంలో కనిపించిన విడి దేవస్థాన శిల్పాలలో ఊరముత్యాలమ్మ, గొడ్లముత్యాలమ్మ, ఆంజనేయుని విగ్రహం ఉన్నాయి. గ్రామంలో దొరికిన డచ్‍ వారి కాలంలో నీలిమందు ఆకును గానుగపట్టిన గానుగరాళ్ళు, రాతితొట్లు విదేశీవ్యాపార చరిత్రకు నిదర్శనాలు. చొప్పకట్లపాలెంలో లభించిన రెండు విడివిగ్రహాలు ప్రత్యేకమైనవి. మొదటి శిల్పంలో వీరుడు అశ్వారూఢుడై, చేతిలో ఒంపు కత్తి పట్టుకుని ఉన్నాడు. గుర్రం కాళ్ళ మధ్యన రెండు వేటకుక్కలు అగుపిస్తున్నాయి. గుర్రం ముందర కాళ్ళెత్తి తొక్కుతున్న జంతువు బహుశః అడివిపందై వుంటుంది. ఇది అడివిపంది వేటవీరగల్లు. మరొక విగ్రహంలో వీరుడు జడలతో, పెద్దమీసాలు, పెద్దకండ్లు, వీరశృంఖలల, వీరకాసెలతో, కుడిచేత కత్తి, ఎడమచేత డాలుతో, జయమాలతో కనిపిస్తున్నాడు. రూపంలో హంపిలోని భీమ శిల్పాన్ని పోలిఉన్నా, వీరశృంఖలతో, కాళ్ళకు ఎత్తుమడిమల పావుకోళ్ళతో వీరభద్రుడై ఉంటాడని అనిపించింది.


చొప్పకట్లపాలెం శాసన వివరం:


రాజ్యం : కాకతీయ
రాజు : ప్రతాపరుద్రదేవమహారాజు

శాసనకర్త : పినమలిదేవుడు
కాలం : శక వర్షంబులు:1236, ప్రమాదీచ మాఘ శు. పాడ్యమి – క్రీ.శ.1315సం. జనవరి 7వ తేది
గ్రామం: చొప్పకట్లపాళెం
శాసనస్తంభం: నల్లరాయి, 5అడుగుల 3అంగుళాల ఎత్తు, నలుపలకల స్తంభం
శాసన చిహ్నాలు: ఒకవైపు ఖడ్గం, కామధేనువు, మరొకవైపు శివలింగం, దాని కింద పడగెత్తిన పొడవైన పాము (ఆమనగల్లు కాకతీయ శాసనస్తంభం మీద కూడా ఇటువంటి నాగే కనిపించడం విశేషం)
శాసనలిపి: తెలుగు
శాసనభాష: తెలుగు, సంస్కృతం


శాసనపాఠం:
మొదటివైపు:

  1. స్వస్తి సమధిగత పంచ
  2. మహాశబ్ద మహామండలే
  3. శ్వర కాకతీయ ప్రతా
  4. ప రుద్రదేవ మహారాజు
  5. లు సుఖసంగతా వి
  6. నోదంబునం భువ
  7. న ప్రిథివీ రాజ్యంబు
  8. సేయుచుండంగాన
  9. (శక)వర్షంబులు 12
  10. (3)6అగునెందే ప్రమా
  11. దీచ సంవత్సర మా
  12. ఘ శుద్ధ1గు చొప్ప
  13. కట్లపాళెముల స్తా
  14. నం స్వయంభు మల్న్య
  15. థ మహాలింగదేవున్కి
  16. పూర్వోదత్తి అఇన వ్రి
  17. త్తులు చెఱు(ప్రా)ము
  18. ల సందు వడ్డున వెలి
  19. పొలం ఖ1న1 1.ప్రి
  20. చింగంచిప్రోల్లి తేర్నా
  21. న4 2.తాటితొంట
  22. న2 పువ్వుతొంట స
  23. 0కిరెడ్డి చెఱ్వుకొంమ్మన
  24. ననే కోటపాయ తొం
  25. ట స1 తాటిమని గుడ
  26. ముందట ర్గందుల
  27. తొంట న1 తానంక
  28. వ్రిత్తి న1లు నీరునే
    రెండో వైపు:
  29. ల నల్లంజెఱ్వు వెన్క
  30. ర 3.సంకిరెడ్డి చెఱ్వు
  31. వెన్క ర1 బందుం సం
  32. ద వెన్క ర3 4.రంత వ
  33. డ్డు అంగభోగము ఆ
  34. రంగభోగానకు పిద్ది
  35. నేనికుంట వెన్క ఖ1స
  36. 11 నల్లంచెఱ్వుంలోనను
  37. న 5 అచ్చోనె నీరునేల ర2
  38. వెలిపొలములచ్చు క
  39. డెంటి ర1 కోటర్పాయ
  40. తొంటలు 2కి నన2 సంకి
  41. రెడ్డి చెఱు వైశాఖాన ర
  42. 1 నల్లంచెఱ విశాఖా
  43. న 5ర111 పినమిల్దేవని
  44. ఆనతిని ఆ కరణం చ
  45. వుండయాను ఆటెరి
  46. అచ్చేటి ప్రెజాను సూ
  47. ర్యగ్రహణ కాల మ
  48. 0దు దేవబ్రాహ్మణ వ్రి
  49. త్తులు రాచపొలము
  50. స్తాన మాన్యాలును కార్తీక
  51. విశాఖలు దుర్గి వడ్డి పొ
  52. ల మోద ర1చింనము
  53. చక్రలబ్దవారు దీపగా
  54. ను1ది పాలకగొల్లము
  55. క్తె బోయుండు సంకద
    మూడో వైపు:
  56. వలంనేనూ విల్చె ప
  57. డ్డాన వ్రిత్తి వెలిపొ
  58. లం న6 సంకదవ అన్దె
  59. విల్చిన వ్రిత్తిది పాపి
  60. తన…
    ధేనువు బొమ్మ
  61. స్వదత్తం పరదత్తం వ
  62. ళిహాళద వసుంధర
  63. సష్టిర్వర్ష సహస్రాణి
  64. ప్రాప్తయా జయతిం దే
  65. స్వదత్తా ద్విగుణం పుణ్యం
  66. పరదత్తానుపాలనం ప
  67. రదత్తాపహరేణ స్వదత్తం
  68. నిష్ఫలం భవేత్‍
    (శాసన ప్రతిబింబాలు, ఫోటోలు, పరిశోధన: కట్టా శ్రీనివాస్‍)
శ్రీరామోజు హరగోపాల్‍,
ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *