చరిత్రకెక్కని బహుజన స్ఫూర్తి మూర్తులు


‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ నిర్వహించిన 12వ జూమ్‍ మీటింగ్‍ ప్రసంగం…


చరిత్రను ఆనాది నుంచి ఆధిపత్య కులాల వాండ్లే రాస్తూ వస్తున్నారు. దీంతో తమ సామాజికవర్గం చేసిన కృషిని వాళ్లు శ్రద్ధతో రికార్డు చేసిండ్రు. అదే సమయంలో బహుజన కులాల వారిని విస్మరించారు. లేదంటే తక్కువ చేసి చూపించారు. ఇదంతా ఒక క్రమపద్ధతిలో అమలు పరిచిన వివక్ష. ఈ వివక్షను అధిగమించి బహుజనులు ‘మేమూ చరిత్రకెక్కదగ్గ వాళ్ళమే’ అని నిరూపించు కోవడానికి ఇప్పుడు ఆధారాలు చాలా వరకు కనుమరుగయ్యాయి. ఇట్లాంటి దశలో బహుజన చరిత్రను సాక్ష్యాధారలతో రికార్డు చేయడం మరింత క్లిష్టంగా మారింది. అయినప్పటికీ ఆ పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందుకు సమిష్టి కృషి జరగాలి.
నిజానికి బహుజనుల భాగస్వామ్యం లేకుండా ఏ ఉద్యమమూ జరగలేదు. వారి తోడ్పాటు లేకుండా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. అయితే ఈ విషయాన్ని చరిత్రలో ఇప్పటి వరకు నిష్పక్షపాతంగా పెద్దగా రికార్డు కాలేదు. దాన్ని అధిగమించే ప్రయత్నమే ఈ వ్యాసం.


ఆధునిక తెలంగాణ చరిత్ర సాలార్జంగ్‍ సంస్కరణ అమలుతో ప్రారంభమయిందని చెప్పవచ్చు. అనంతరం గ్రంథాలయోద్యమం, బ్రహ్మసమాజ్‍, నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ, సామాజికోద్యమాలు, విద్యావ్యాప్తి ఉద్యమం, ఆర్యసమాజ్‍, తెలంగాణ సాయుధ పోరాటం, కాంగ్రెస్‍ రాజకీయాలు, తెలంగాణ రచయితల సంఘం, ఆంధ్ర యువతీ మండలి, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, మలి దశ తెలంగాణ ఉద్యమం ఇట్లా అన్ని ఉద్యమాల్లోను బహుజనులు అంటే బీసిలు మొదటి నుంచి ముందు వరుసలోనే ఉన్నారు. అయితే ఆ యా ఉద్యమాల చరిత్రను రాసిన వారు వీరి ఘనతను, ప్రాధాన్యతను, పాత్రను సరిగ్గా రికార్డు చేయలేదు, తగ్గించారు. ఇది చరిత్రను వక్రీకరించడమే. ఉదాహరణకు పుచ్చలపల్లి సుందరయ్య (సుందరరామిరెడ్డి) రాసిన ‘వీరతెలంగాణ విప్లవ పోరాటం’ పుస్తకంలో రెడ్లు, బ్రాహ్మణులను వారి పేరు చివరి తోకలతో గుర్తించిండు. అదే విధంగా పుస్తకంలో రాసిండు. అయితే దొడ్డి కొమురయ్య, ఆయనతో పాటు పోరాడిన, అసువులు బాసిన కొన్ని వేల మంది బహుజన ఉద్యమకారులను మాత్రం ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ‘తదితరులు’గా, ‘ఎల్లయ్య’, ‘మల్లయ్య’లుగా కుల మూలాలు తెలుసుకోవడానికి వీలు లేకుండా నమోదు చేసిండు. అట్లాగే ‘మనకు తెలియని మన చరిత్ర’ పుస్తకంలోనూ నలుగురైదుగురు బీసీ మహిళలు తప్ప మిగతా అందరూ ఆధిపత్య కులాల వాండ్లే ఉన్నారు. ఇదంతా పట్టింపు లేక పోవడం మూలంగా జరిగిన నష్టం. అందులో దళితులు అసలే లేరనేది వేరే విషయం. దాదాపు అన్ని చరిత్ర గ్రంథాల్లోనూ ఇదే వివక్ష.


ఇక మళ్ళీ విషయానికి వస్తే సాలార్జంగ్‍ సంస్కరణలు ఒక వైపు నడుస్తున్న సమయంలోనే మరోవైపు తెలంగాణలో పండుగ సాయన్న, బండ్లోల్ల కురుమన్న నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిండ్రు. లెవీకి వ్యతిరేకంగా ఉద్యమించిండ్రు. వీళ్ళని దోపిడీ దొంగలుగా చిత్రించి తమ పబ్బం గడుపుకున్నారు. ప్రజలకు అండగా నిలుస్తూ వారి కోసం పోరాడిన వారిని ‘దొంగలు’గా ముద్ర వేయడం ఎనుకటి నుంచి వస్తున్న ఆనవాయితే.
సాలార్‍జంగ్‍ అవసాన దశలో హైదరా బాద్‍లో నిజాం కళాశాల ఏర్పాటయింది. ఈ కళాశాల ప్రిన్సిపాల్‍గా ఇంగ్లండ్‍లో చదువుకున్న వ్యక్తి అఘోరనాథ్‍ చటోపాధ్యాయను ప్రిన్సిపాల్‍గా నియమించారు. ఈయన ప్రోద్బలంతో హైదరాబాద్‍లో బ్రహ్మసమాజ్‍ కార్యకలాపాలు రూపుదిద్దుకున్నాయి. వీటిని ముందుకు తీసుకపోయింది మాత్రం రఘుపతి వెంకటరత్నం నాయుడు, ముత్యాల గోవింద రాజులు నాయుడు, వేలూరి రంగధామ నాయుడు తదితరులు. వీళ్ళందరూ బలిజలు. రఘుపతి వెంకటరత్నం నాయుడు 1901 నాటికే సికింద్రాబాద్‍ మహబూబియా కాలేజి ప్రిన్సిపాల్‍గా పనిచేసిండు. బ్రహ్మసమాజ్‍ ఉద్యమంతో మమేకమ యిండు. సరోజిని నాయుడు – ముత్యాల గోవిందరాజుల వివాహం బ్రహ్మసమాజ్‍ పద్ధతిలో కందుకూరి వీరేశలింగం జరిపించిండు.


వీళ్ళు తెలంగాణ – మిలిటరీతో సంబంధమున్న వారు. ఇందులో వేలూరి రంగధామ నాయుడు ఇంజనీర్‍, సాహితీవేత్త కూడా. ఈయన శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం పోషకుడిగా చాలా ఏండ్లు పనిచేశారు. ఈయన నేతృత్వంలోనే భాషానిలయం రజతోత్సవాలు జరిగాయి. అంతకు ముందు 1901లో భాషానిలయ స్థాపకుల్లో రఘుపతి వెంకటరత్నం నాయుడు ఒకరనేది గుర్తుంచుకోవాలి. మిట్లా లక్ష్మీనరసయ్య కూడా కొన్ని రోజులు బ్రహ్మసమాజ్‍ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు.
భాషానిలయం రజతోత్సవాల నిర్వహణలో వేలూరి రంగధామ నాయుడు కీలక భూమిక పోషించిండు. తదనంతర కాలంలో అంటే 1950వ దశకంలో బిరుదురాజు రామరాజు కూడా ఈ భాషానిలయం నిర్వహణలో పాలుపంచుకున్నాడు. ఇక్కడే నాంపల్లి గౌరీశంకర్‍ వర్మ గురించి చెప్పుకోవాలి. ఈయన సుల్తాన్‍ బజార్‍లో పుస్తకాల షాపుని నిర్వహించేవాడు. భాషానిలయం నిర్వహణలోనూ పాలుపంచు కున్నాడు. ఈయన నడిపేది పేరుకు మాత్రమే పుస్తకాల షాపు. కానీ అది ఆనాటి సాహితీవేత్తలందరికీ కూడలి కేంద్రం. గౌరీశంకర వర్మ అనేక సామాజికోద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. వితంతు వివాహాలు జరిపించాడు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా ‘సింగర్‍’ కుట్టు మిషన్లు తీసుకొచ్చి డీలర్‍గా ఉంటూ అమ్మిన వ్యాపారవేత్త. ఈయన కులం రీత్యా దర్జీ. ఈయన చాలా ఏండ్లు భాషానిలయ నిర్వహణలో కీలకంగా పనిచేసిండు.


నాంపల్లి గౌరీశంకర వర్మ స్ఫూర్తితో సికింద్రాబాద్‍లో సిద్ధాబత్తుని శ్యామ్‍సుందర్‍, హైదరాబాద్‍లో సంగెం సీతారామయ్య యాదవ్‍లు పాఠశాలలను స్థాపించారు. సామాజికోద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ముఖ్యంగా బాలికల విద్య కోసం తమ సర్వస్వాన్ని ధారబోసిండ్రు. సిద్దాబత్తుని శ్యామ్‍సుందర్‍తో పాటు టేకుమళ్ల నరసింహం అనే అతను సికింద్రాబాద్‍లో ‘కళావంతుల సంస్కరణ’కు ఉద్యమాలు చేసిండు. పుస్తకాలు రాసిండు. ప్రతి యేటా బాలికలను బలవంతంగా వేశ్యావృత్తిలోకి దించే ‘దేవదాసీ’ కార్యక్రమాలను వీళ్ళిద్దరు కలిసి అడ్డుకున్నారు. వారికి చదువు చెప్పించి తీర్చిదిద్దిండ్రు. శ్యామ్‍సుందర్‍ తల్లి 1920లోనే సికింద్రాబాద్‍లో ‘పరోపకారిణీ బాలికా పాఠశాల’ను స్థాపించి నిర్వహించింది. సికింద్రాబాద్‍లో తెలుగులో కూడా విద్యాబోధన చేసిన మొదటి పాఠశాలల్లో ఇది కూడా ఒకటి. ఈయన పూర్వీకులు దోమకొండ సంస్థానానికి చెందిన కళావంతుల కుటుంబానికి చెందిన వారు. శ్యామ్‍సుందర్‍ ఉద్యమానికి ఆనాటి సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అండగా ఉండేవాడు. వీరిద్దరూ కలిసి సికిందరాబాద్‍లో పులిగిళ్ల అంజయగుప్త లాంటి సంస్కర్తలను కలుపుకొని మహాంకాళి గుడి వద్ద దున్నపోతులు, మేకలు కోయడాన్ని నిరోధించగలిగారు. జంతుబలికి, అస్పృశ్యతకు వ్యతిరేకంగా వీరు చేసిన ఉద్యమం సత్ఫలితాలనిచ్చింది. విద్యారంగంలో నాగర్‍కర్నూలుకు చెందిన పార్సా పాపయ్య చేసిన కృషి కూడా చిరస్మరణీయమైనది.


మరోవైపు హైదరాబాద్‍లో సంగెం సీతారామయ్య యాదవ్‍ ‘శ్రీకృష్ణ సమితి విద్యాలయాల’ను ఏర్పాటు చేసి ఒక వైపు వ్యాయామ శిక్షణ, విద్యాబోధన రెండూ చేసేవారు. హైదరాబాద్‍ ఓల్డ్సిటీ కేంద్రంగా ఈయన కార్యక్రమాలు కొనసాగేవి. తన మేన కోడలు, బాల వితంతువు సంగెం లక్ష్మీబాయమ్మను గుంటూరులోని శారదా విద్యాపీఠంలో చేర్పించి విద్యావంతురాలిగా, ఆర్టిస్ట్గా, టీచర్‍గా, ఎమ్మెల్యేగా ఎదగడంలో కీలక భూమిక పోషించిండు. ఈయన బాటలోనే ఎదటి సత్యనారాయణ అనే సగర సంఘ నేత పనిచేసిండు. విద్యాసంస్థలను హైదరాబాద్‍లో నెలకొల్పిండు. ఈయన కూతురు ఎ. శ్యామలాదేవి ఆ తర్వాతి కాలంలో ఆంధ్రయువతీ మండలి స్థాపనలో ముందు వరుసలో ఉన్నారు. ఎంతోమంది బాలికలు ఉన్నత విద్యలు చదువుకోవడానికి తోవలు వేసిండ్రు. ఇవ్వాళటికీ ఆంధ్రయువతీ మండలి కార్యాలయంలో ఉన్నటువంటి జూనియర్‍ కళాశాల ఎ.శ్యామలదేవి పేరిటే ఉన్నది.


నిజాం రాష్ట్రాంధ్ర జన సంఘం, ఆంధ్రమహాసభల ఏర్పాటు నిర్వహణలోనూ బీసీలు బలంగా పనిచేసిండ్రు. 1921లో మహారాష్ట్రీయుల హేళనను తాళలేక నిజాం రాష్ట్రాంధ్ర జన సంఘంలోనూ, ఆ తర్వాత కేంద్ర సంఘం లోనూ పనిచేసిన వ్యక్తి మిట్టా లక్ష్మీనరసయ్య. మున్నూరుకాపు కులానికి చెందిన ఈయన హైదరాబాద్‍ కేంద్రంగా అటు బ్రహ్మసమాజ్‍ ఉద్యమంలోనూ ఆ తర్వాత నిజాంరాష్ట్రాంధ్ర మహాసభ స్థాపనలోనూ కీలకంగా ఉన్నాడు. ఈయన హైదరాబాద్‍ హైకోర్టులో ఆనాటికే అడ్వకేటుగా పనిచేసిండు. ఈయన ఘనతను 1927లో మహారాష్ట్ర (బొంబాయి) నుంచి వెలువడ్డ తెలుగు సమాచార్‍ పత్రిక విశేషంగా పేర్కొన్నది. ఈయన మనవడు మనోజ్‍ మిట్టా జర్నలిస్టుగా డిల్లీలో స్థిరపడ్డారు. ఈయన రాసిన పుస్తకం ‘1984 డిల్లీ 2002 గుజరాత్‍ వ్యవస్థల వైఫల్యాలపై పంచనామ’ పుస్తకం విశేష ఆదరణ పొందింది. బీసీలు రాజకీయ, ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనడం ఈయనతోనే ఊపందుకున్నది అనిచెప్పవచ్చు. అనంతర కాలంలో రంగారెడ్డి జిల్లా పెద్ద మంగళారంకు చెందిన చిరాగు వీరన్న గౌడ్‍ హైదరాబాద్‍లో గౌడ్‍ల అభ్యున్నతి కోసం హాస్టల్‍ ని ఏర్పాటు చేసిండు. ఎందరో విద్యార్థులు 1920 ఆ ప్రాంతం నుంచి హైదరాబాద్‍లో ఉండి చదువుకున్నారు. అంతేగాదు కల్లు డిపోల్లో పనిచేసే స్త్రీలను హేళన చేస్తూ మాట్లాడేవారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని అప్పటి పోలీసు కమిషనర్‍ రాజబహదూర్‍ వెంకటరామిరెడ్డికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చిండు. గౌడ్‍ల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేసిండు. ఎక్సయిజ్‍ కాంట్రాక్టర్‍గా ఉంటూ ఎంతో డబ్బుని సంపాదించడమే గాకుండా వాటిని సాహిత్య, సామాజిక కార్యకలాపాలకు వినియోగించిండు. జనపాల రఘురామ్‍ అనే మంగలాయిన కూడా ఈ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు.


ఇదే సమయంలో హైదరాబాద్‍లోని చుడిబజార్‍లో కృష్ణస్వామి ముదిరాజ్‍ హిందీ గ్రంథాలయాన్ని ఏర్పాటుచేసిండు. అంతేగాదు ‘పిక్టోరియల్‍ హైదరాబాద్‍’ పేరిట నగర అందాలను చిత్రాల్లో రికార్డు చేస్తూ రెండు విశిష్టమైన కాఫీ టేబుల్స్ బుక్స్ని అచ్చేసిండు. ఇప్పటికీ 100 ఏండ్ల నాటి హైదరాబాద్‍ అందాలు తెలుసుకోవడానికి ఆ పుస్తకమే ప్రధాన వనరు అంటే అతిశయోక్తి కాదు.
ఒకవైపు సామాజిక సంస్కర్తలు కృష్ణస్వామి ముదిరాజ్‍, చిరాగు వీరన్న గౌడ్‍, గుంటుక నరసయ్య పంతులు, సిద్ధాబత్తుని శ్యామ్‍సుందర్‍, ఎదటి సత్యనారాయణ లాంటి వాండ్లు చేస్తున్న సమయంలోనే ఆర్యసమాజ్‍ ఉద్యమం ఊపందుకుంది. ఇందులో రావి నారాయణరెడ్డి లాంటి వారే గాకుండా కొండా లక్ష్మణ్‍ బాపూజీ కూడా చురుగ్గా పాల్గొన్నాడు. బాపూజీతో పాటు ఆయన శిష్యులు, ఆ తర్వాత నిజాంపై బాంబుదాడిలో కీలకంగా ఉండి జైలు శిక్ష అనుభవించిన జగదీశ్‍ ఆర్య, కోత్మిర్‍ ప్రేమ్‍రాజ్‍ యాదవ్‍, పాలమాకుల్‍ గంగారాం, తన్నీరు లక్ష్మయ్య, అందరు కూడా బీసీ సామాజిక వర్గం వారే కావడం విశేషం.
ఆంధ్రమహాసభ కార్యకలాపాల నిర్వహణలో ఎక్కువగా బీసీలే ముందు వరుసలో ఉండేవారు. హకీమ్‍ నారాయణదాసు, హకీం జనర్ధానదాసులు దేవరకొండ ఆంధ్రమహాసభ ఖర్చునంతా భరించడమే గాకుండా వచ్చిన అతిథులందరికీ బస ఏర్పాట్లు చేసిండ్రు. అంతేగాదు ఈసందర్భంగా వివిధ వర్గాల వారికి పోటీలు నిర్వహించి వారికి బహుమతులందజేసిండ్రు. అట్లాగే సిరిసిల్ల సభ నిర్వహించింది పద్మశాలి గంగుల భూమన్న. నిజామాబాద్‍ సభ నిర్వాహకులు రాజా నర్సాగౌడ్‍. అయితే ఈ సభల అధ్యక్షుల పేరిటనే సభలు రికార్డయ్యాయి. దీంతో పందిళ్ళు, పీటలు వేసి, ఖర్చంతా భరించి వచ్చిన వారికి అతిథి మర్యాదలు అందజేసిన వారికి చరిత్రలో జాగాలేకుండా పోయింది. 1930 నుంచి 1948 వరకు వివిధ స్థాయిల్లో, వివిధ ప్రాంతాల్లో ఆంధ్రమహాసభలు జరిగాయి. వీటిలో సభల అధ్యక్షులు, ఆహ్వాన సంఘం అధ్యక్షులు, మహిళా సభల అధ్యక్షులు అందరూ అయితే రెడ్డి లేదంటే బ్రాహ్మణ వర్గాల వారే ఉండేవారు. దీంతో ఎక్కడ కూడా బీసీల చరిత్ర రికార్డు కాలేదు. అట్లా అని బీసీలు ఉద్యమంలో లేరా అంటే ఉన్నారు అని పైన పేర్కొన్న విషయాల మూలంగా తెలుస్తుంది. చరిత్రను, వక్రీకరించి, వర్గీకరించి రాయడం వల్ల ఈ సమస్య వచ్చింది. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.


1952లో జరిగిన తొలి ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీసీలు తమ సొంత బలం, బలగంతో ఎన్నికల్లో దిగి అగ్రకులాల వారి కుట్రలను ఎదుర్కొని విజేతలుగా నిలిచిండ్రు. ఇట్లా 1952లో విజేతలుగా నిలిచిన వారిలో కొండా లక్ష్మణ్‍ బాపూజీ, సంగెం లక్ష్మీబాయమ్మ, పెండెం వాసుదేవ్‍, బొమ్మగాని ధర్మభిక్షం, గంగుల భూమయ్య, గడ్డం రాజారామ్‍, ఎం.బుచ్చయ్య (సిర్పూర్‍-సోషలిస్టు పార్టీ), ఎల్‍.ముత్తయ్య (పెద్దపల్లి -పిడిఎఫ్‍)లు బీసీ సామాజిక వర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయిండ్రు. అయతే ఇందులో ఒక్క సంగెం లక్ష్మీబాయమ్మకు మాత్రం మంత్రిపదవి దక్కింది. ఈమె తర్వాతి కాలంలో 1957లో మెదక్‍ నుంచి పార్లమెంటుకు ఎన్నికయింది. బహుశా పార్లమెంటుకు ఎన్నికైన తొలి బీసీ మహిళ ఈమెనే కావొచ్చు.
నిజాం ప్రభుత్వంలో తొలిదశలో ఉద్యోగాలు సంపాదించుకున్న బీసీలు తమ శక్తివంచన లేకుండా సేవలు అందించారు. అయినా కూడా వారి గురించి పెద్దగా ఇప్పటి తరానికి తెలియదు. అట్లాంటి వారిలో మాటేటి రామప్ప 1946లోనే సికింద్రాబాద్‍ మున్సిపల్‍ కార్పోరేషన్‍ కమిషనర్‍గా పనిచేసిండు. ఆ తర్వాత ఐసిఎస్‍కు ఎన్నికయిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సూపరింటెండ్‍గా పనిచేసిన డాక్టర్‍ మల్లన్న విదేశాల్లో విద్యనభ్యసించిండు. నోబెల్‍ లారెట్‍కు అసిస్టెంట్‍గా పనిచేసిండు. ఇదే సమయంలో ముత్యాల గోవిందరాజులు నాయుడు కూడా వైద్యుడిగా సేవలందించిండు. మల్లన్న కొడుకు శ్రీనగేష్‍ చీఫ్‍ ఆఫ్‍ ఇండియన్‍ ఆర్మీగా పనిచేసిండు. అంతేకాదు 1962-64 మధ్యకాలంలో ఆంధప్రదేవ్‍ గవర్నర్‍గా కూడా పనిచేసిండు. జస్టిస్‍ కొమురయ్య అంతర్జాతీయ కోర్టులో జడ్జిగా పనిచేసిన తెలంగాణ వాడు. కరీంనగర్‍కు చెందిన కుమ్మరాయిన. సరోజిని రేగాని ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర ఆచార్యులుగా పనిచేశారు. ఈమె యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు.


తెలంగాణ రచయితల సంఘం కార్యకలాపాలను వివిధ జిల్లాల్లో నిర్వహించిన వారిలో గఱ్ఱేపల్లి సత్యనారాయణరాజు, గూడూరి సీతారామ్‍ ముఖ్యులు. హైదరాబాద్‍లో రాజశ్రీ గ్రంథమాలను ఏర్పాటు చేసి అనేక మంది పుస్తకాలను ప్రచురించిన మడిపడగ బలరామా చార్యులు స్మరణీయులు. పరిశోధన రంగంలో విశేష కృషి చేసిన ఠాకూర్‍ రాజారామ్‍ సింగ్‍, ప్రొఫెసర్‍ సరోజిని రేగానిలకు కూడా తగినంత గుర్తింపు దక్కలేదు.
ఈ దశలో సాహిత్య రంగంలో విశేషమైన కృషిచేసిన వారు, పత్రికా సంపాదకులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సంగారెడ్డి నుంచి ‘పల్లెటూరు’ అనే పత్రికను నడిపించడమే గాకుండా, మెదక్‍ జిల్లా సాహిత్య చరిత్రను రాసిన మల్యాల దేవి ప్రసాద్‍ యాదవ్‍, గౌడ ప్రబోధం తదితర గ్రంథాలను రాసిన మామిండ్ల రామాగౌడ్‍, కథకులు జి.రాములు, గూడూరి సీతారామ్‍, నవలాకారులు లోక మలహరి, కవులు వరకవి సిద్ధప్ప కవి, రాఘవనగరం రామసింహ కవి, నవలాకారిణి బొమ్మ హేమాదేవి తదితరులు ఉన్నారు. వీరితో పాటుగా తూము రామదాసు, గుజ్జరి ఎల్లాదాసు, పోశెట్టి లింగకవి, కైరం భూమదాసు, బంగారు రంగప్ప, మఠం మహంతమ్మ, రుద్ర ఎఱ్ఱయ్య, కాంచనపల్లి నరసింహరాజు, శ్యామరాజు, రామరాజు సోదరులు, సుద్దాల హనుమంతు, సామల సదాశివ, చందాల కేశవదాసు, చిదిరెమఠం వీరభద్ర శర్మ, ఏలె ఎల్లయ్య, వారణాసి రామయ్య తదితర సాహితీవేత్తలు వివిధ పక్రియల్లో ప్రతిభను కనబరిచారు.
అట్లాగే తెలంగాణ ఉద్యమకారులు కొండా లక్ష్మణ్‍ బాపూజీ, కొత్తపల్లి జయశంకర్‍, ఆకుల భూమయ్య, మారోజు వీరన్న, బెల్లి లలిత, సాంబశివుడు, ఆలె నరేంద్ర ఇట్లా ఎందరో విస్మృతులుగా మిగిలి పోయిండ్రు. వీరందరిని సోయితో రికార్డు చేసుకోవాలి. చరిత్రకెక్కించాలి. ఇది సమిష్టిగా చేయాల్సిన పని. ఇందుకు యువ తెలంగాణ చరిత్రకారులు ముందుకు రావాల్సిన అవసరమున్నది.


-సంగిశెట్టిశ్రీనివాస్‍,
ఎ : 98492 20321

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *