నాగులవంచ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంజిల్లాలో చింతకాని మండలానికి చెందిన ఒక గ్రామం. ఇది జిల్లా కేంద్రం ఖమ్మానికి 20 కిలోమీటర్లదూరంలో వుంటుంది. ఇప్పుడు రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల గ్రామం. 16వ శతాబ్దంలో మచిలీపట్నం గోలుకొండ పరిపాలనలో వున్న కాలంలో గోలుకొండనుంచి మచిలీపట్నం ఓడరేవుకు మర్గమధ్య రహదారి కేంద్రంగా ఎంచుకోబడినది ఆ తర్వాత VOC కి వ్యాపారస్థావరంగా ఎదిగింది. వస్త్రాలు నీలిమందు ఎగుమతుల్లో ప్రత్యేక స్థానాన్ని పొందింది. దానితో పాటు అనేక ఇతర ఉత్పత్తులకు ప్రధాన స్థావరం అయ్యింది. 1669 నుంచి 1687 వరకూ తొమ్మిదేళ్ళపాటు ఇక్కడ డచ్ వ్యాపారం నడిచింది. 1687 అక్టోబర్ 13 తేదీన జరగిన స్థానిక తిరుగుబాటులో ప్యాక్టరీ నేలమట్టం అయ్యింది. సైనికులు చంపబడ్డారు. మొత్తంగా స్థావరం ఊరినుంచి ఎత్తివేసారు. ఈ డచ్ వారి తీరప్రాంతంలో పెట్టిన కేంద్రాలు కాకుండా మైదాన ప్రాంతపు వ్యాపార కేంద్రం అరుదు.
కంపెనీ పాలనా విధానం
డచ్ కంపెనీ వాటాదారులంతా కలిసి ఆరు విభాగాలుగా ఏర్పడి ఆరు ప్రధాన పట్టణాల్లో వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీటిని చాంబర్స్ అంటారు. ఒక్కొక్క చాంబర్‍కు పాలన కోసం ప్రత్యేకంగా ఒక కౌన్సిల్ ఉండేది. ఆరు కౌన్సిల్‍లు కలిపి డచ్ ఈస్టిండియా కంపెనీ అనే ప్రధాన పాలక వర్గంగా ఏర్పడింది. వారు 17 మంది సభ్యులున్న సభని ఎన్నుకుంటారు. వారిని ‘‘డైరెక్టర్స్’’ అంటారు.
డచ్ దేశస్థులు ఇంగ్లాండ్ ఫ్రాన్స్ దేశస్థుల కంటే బలహీనులు. మొదటి నుంచి వీరి ఆసక్తి ఆగ్నేసియా మీదనే. కాబట్టి భారతదేశ వ్యాపారాల మీద శ్రద్ధ చూపలేదు. వీరు1759 సంవత్సరంలో బెడెరా యుద్ధంలో బ్రిటీష్ వారి చేతిలో ఓడిపోయారు. సుశిక్షితులైన ఫ్రాన్స్, ఇంగ్లండ్ సేనల ముందు వీరి సేనలు నిలవలేకపోయాయి
నాగులవంచ గ్రామానికి వలందులోరి పట్నం అనే పేరు కూడా వాడుకలో వుంది. హాలండు నుంచి వచ్చిన వారు ఓలండులు హాలండులు వలందులు. ఒలండర్ పేట అనేది తమిళనాట కూడా డచ్ వారు తిరుగాడిన ప్రాంతానికి వున్న పేరే. వలందర రేవు వలందుల పురం వంటి వేర్వేరే చోట్ల పేర్లు డచ్ వారి ఆచూకీ
ఆనవాళ్లుగా వచ్చిన పేర్లే.
నాగులవంచలో డచ్ పాలన
1668 నుంచి 1687 వరకూ 19 సంవత్సరాల కాలంలో ఆరుగురు ప్రధాన అధికారులు వారికి తోడు ఆరుగురు ఉపప్రధాన అధికారులు ఈ ప్రాంతంలో నిర్వహణా పాలకులుగా వున్నట్లు రికార్డులలో వుంది. నికోలస్ ఫాబర్ (1668 నుంచి 1676) జాకబ్ కార్బెస్సర్ (1676 నుంచి 1679) అంబ్రోసియస్ వాండర్ వీల్ (1679 నుంచి 1684) ఆండ్రియన్ బ్లక్కీల్ (1684 నుంచి 1686) చివర్లో నికోలస్ డాంక్ వార్డ్ (1686 నుంచి 1687) వరకూ ప్రధానాధికారులు (Opperhoofd) గా వున్నారు. అలాగే అబ్రహం వాండర్ వూర్ట్ (1668 నుంచి 1676) వరకూ రెండు పర్యాయాలు డిర్క్ వాంక్ (1676 నుంచి 1678) నికోలస్ బోల్క్ (1678 నుంచి 1679) బారెంట్ హాత్యూన్ (1679 నుంచి 1682) నికోలస్ డాంక్ వార్డ్ (1682 నుంచి 1686) రెండు రెండు ఏళ్ళ కాలపరిమితితో రెండుసార్లు చివరిగా గెరార్డ్ బెనూర్డెన్ (1686 నుంచి 1687) చివరి సంవత్సరంలో ఉపపాలనాధికారి (SECUNDE)గా పనిచేసారు. ఎక్కవ కాలం అబ్రహం వాండర్ వూర్ట్ నాగుల వంచ గ్రామంతో అనుభందాన్ని కలిగివున్నారు. ఆయన సెకండ్ గా తొమ్మిదేళ్ళు పనిచేసి ప్రధానాధికారిగా పదొన్నతి పొంది మళ్లీ ఆరేళ్లు పనిచేసారు. అంటే నాగులవంచలో 19 ఏళ్ళ డచ్ పాలనలో ఈయన పాత్ర 15 ఏళ్లు వుంది. అందుకేనేమో ఆయనకు ఈ ప్రాంతపై అభిమానం వల్ల ఈయన మరణానంతరం ఇక్కడే సమాధి చేయబడ్డారు.
స్మారక శిలాఫలకాలు (మెమొంటమోరీలు) ఈ గ్రామంలో ఇప్పటికీ రెండు శిలా పలకాలు వున్నాయి. వాటిపై డచ్ బాషలో ఎవరి స్మారకంగా నైతే వాటిని వుంచారో వారి వివరాలు రాసి వుంచారు. అవి అచ్చంగా ఇక్కడ డచ్ వారు ఒకప్పుడు వున్నారు వారి క్రేంద్రం నడిచింది అనేందుకు స్పష్టమైన ఆధారాలుగా వున్నాయి.
నికోలస్ ఫాబర్ సమాధి శాసన పాఠం
దీన్ని ఏమంటారు : డచ్ పద్దతిలో వీటిని మెమొంటమోరీ అంటారు
భౌతిక స్థితి : ఆరు అడుగుల ఎత్తు, రెండున్నర అడుగుల వెడల్పు ఎనిమిదంగుళాల మందం వున్న గ్రానైట్ రాతిపై రాసిన రాతలు ఫలకానికి పగుళ్ళు లేవు అక్షరాలు చెరిగిపోయే దశలో వున్నాయి. బహిరంగ ప్రదేశంలో రోడ్డు పక్కన పడవేసి వున్నది.
శాసన భాష : పాత డచ్
ఎవరిది : నికోలస్ ఫాబర్
హోదా : నాగులవంచ వర్తక స్థావరానికి ప్రధాననాయకుడు, తొలి నాయకుడు, నాగులవంచ గ్రామం స్థావరానికి సరైనది అనేది సర్వే నిర్వహణ ద్వారా తేల్చిన వాడు.
జననం : 1628 ఏప్రియల్ 5 వ తేదీ (బుధవారం)
మరణం : 1676 ఫిబ్రవరి 8వ తేదీ (శనివారం)
జీవిత కాలం : 47 సంవత్సరాల 10 నెలల 3 రోజులు
శాసన పద్యం రాసినవారు : DHఅనే పొడిఅక్షరాలున్నయి వీళ్ల సమకాలికుడు కవి చరిత్రకారుడు డేనియల్ హావర్డ్ ఈ శాసన పద్యాన్ని రచించినట్లు తెలుస్తోంది.
ఇతర ప్రత్యేకతలు : ఫలకం మధ్య భాగంలో గుండ్రని ఆకారంలో డచ్ ఎంబ్లం చిత్రించబడి వుంది.
నికోలస్ ఫాబర్ ఎపిటాప్ పూర్తి పాఠానికి తెలుగు అనువాదం :
ఇక్కడ సమాధిగతుడయ్యింది గౌరవనీయులైన నికోలస్ ఫాబర్ ఆయన జీవితం కంపెనీ వర్తకునిగా నాగులవంచ వ్యాపారకేంద్ర వ్యవస్థాపకునిగా గడిచింది. ఆమ్టరడామ్ నగరంలో ఏప్రియల్ నెల 5వ తేదీ 1628 జన్మించి ఫిబ్రవరి 8వ తేదీ 1676లో తన 47 ఏళ్ళ పదినెలల మూడు రోజులకు తనువు చాలించారు. ఈ చీకటి గుయ్యారంలోనికి తన జీవితాన్ని మరలించారు పురుగూపుట్రకు దేహఖండాలనప్పగించారు. ఆయన భక్తి ప్రపత్తులు శతాబ్దాల కాలం నిలుస్తాయి.
అబ్రహం వాండర్ వూర్ట్ సమాధి శాసనపాఠం
దీన్ని ఏమంటారు : డచ్ పద్దతిలో వీటిని మెమొంటమోరీ అంటారు
భౌతిక స్థితి : ఆరు అడుగుల ఎత్తు, రెండున్నర అడుగుల వెడల్పు ఎనిమిదంగుళాల మందం వున్న గ్రానైట్ రాతిఫలకం పై రాసిన రాతలు, ఈ బండ రెండుగా చీలివున్నది. అక్షరాలు చెరిగిపోతున్నాయి. బహిరంగ ప్రదేశంలో రోడ్డు పక్కన పడవేసి వున్నది.
శాసన భాష : పాత డచ్
ఎవరిది : అబ్రహం వాండర్ ఊర్ట్
హోదా : నాగులవంచ వర్తక స్థావరానికి ఉపనాయకుడిగా
జననం : 1640 అక్టోబర్ 4వ తేదీ (గురువారం)
మరణం : 1676 జూన్ 8వ తేదీ (సోమవారం)
జీవిత కాలం : 35 సంవత్సరాల 8 నెలల 4 రోజులు
పూర్తి పాఠానికి తెలుగు అనువాదం
ఈ నేల గుండెల్లో అబ్రహం వాండర్ ఊర్ట్ నిద్దరోతున్నాడు. వర్తకునిగా, ఉపనాయకుడిగా జీవించాడు. 1640 అక్టోబర్ 4న ఉదయించి 1676 జూన్ 8 న తన 35 సంవత్సరాల ఎనిమిది నెలల 4 రోజులకు తన ప్రస్తానాన్ని ముగించాడు. హృదయాంతరాళం నుంచి సున్నితుడూ కలహామెరగని వాడు, మోసానికి పాల్పడనివాని దేదీప్యప్రయాణం భువిపై ఇక ముగిసింది.
- కట్టా శ్రీనివాస రావు
ఎ : 9885133969