వ్యక్తుల గుప్తత హక్కు – ఆటో శంకర్‍ ఆత్మ కథ


వ్యక్తులకి ఆంతరంగిక హక్కులు ఉన్నాయా? దీన్నే మరో రకంగా గుప్తత హక్కు అంటున్నాం. వ్యక్తి జీవిత చరిత్ర వల్ల ఇతరుల హక్కులకి భంగం వాటిల్లితే వాళ్ళు చర్యలు తీసుకోవచ్చా? పత్రికల్లో అలాంటి రాతలని నిలిపి వేయవచ్చా? ప్రైవేట్‍ వ్యక్తుల జీవిత చరిత్రలు ప్రచురించినప్పుడు ఇతరుల ఆంతరంగిక హక్కులకి ఇబ్బంది కలిగితే, నష్టం కలిగితే ఎలా ఉంటుంది?
శంకర్‍ అలియాస్‍ గౌరీ శంకర్‍. అతన్ని ఆటో శంకర్‍ అని కూడా అంటారు. ఆరు హత్య కేసుల్లో అతను ముద్దాయి. ఆ కేసుల విచారణ జరిపిన చెంగల్పట్టు సెషన్స్ జడ్జి 1991, మే 31న అతనికి మరణశిక్షని విధించారు. ఆ మరణ శిక్షని మద్రాస్‍ హైకోర్టు ధృవీకరించింది.


అతను సుప్రీంకోర్టులో అప్పీలుని దాఖలు చేశాడు. కోర్టు అప్పీలుని డిస్మిస్‍ చేసింది. అతని క్షమాభిక్ష ధరఖాస్తు రాష్ట్రపతి ముందు పరిశీలనలో ఉంది.
ఆటో శంకర్‍ జైల్లో ఉండగా 1991లో 300 పేజీల ఆత్మ కథను రాశాడు. తన జీవిత చరిత్రను జైలు అధికారుల అనుమతితో న్యాయవాది చంద్రశేఖరన్‍కి ఇవ్వమని తన భార్య జగదీశ్వరికి ఇచ్చాడు. అదే విధంగా తన ఆత్మకథని నక్కీరన్‍ అనే తమిళ పత్రికలో ప్రచురించేలా చూడమని కూడా శంకర్‍ తన న్యాయవాదిని కోరాడు. ఈ కోరికను వివిధ ఉత్తరాల ద్వారా కూడా అతను వెలిబుచ్చాడు.
నక్కీరన్‍ యజమాన్యం అతని ఆత్మ కథను తన పత్రికలో ప్రచురించడానికి ఒప్పుకుంది. ఆ ఆత్మకథలో అతనికి వివిధ ఐఏఎస్‍, ఐపీఎస్‍, రెవిన్యూ అధికారులతో గల సంబంధాల గురించి వివరంగా రాశాడు. అంతేకాకుండా తాను చేసిన నేరాలతో వాళ్లకు ఉన్న సంబంధాన్ని కూడా అతను వివరించాడు. ఆ నేరాలతో వాళ్లకు కూడా సంబంధాలు ఉన్నాయని కూడా ఆ తన ఆత్మకథలో పేర్కొన్నాడు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియో క్యాసెట్‍ కూడా అతని దగ్గర ఉన్నాయి.
ఆ ఆత్మ కథను తమ పత్రికలో సీరియల్‍గా ప్రచురించడానికి ఆ పత్రిక నిర్ణయించింది. ముందుగా ఆ సీరియల్‍ని సెన్సేషనల్‍ చేయడానికని తన పత్రికలో ఒక ప్రకటన కూడా ఇచ్చారు.


ఆ ప్రకటనతో పోలీస్‍, రెవెన్యూ, జైలు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఆటో శంకర్‍తో తమకు గల సంబంధాలను ఎక్కడ బయటపడతాయోనని వాళ్ళు భయాందోళనలకు లోనయ్యారు. అతని ఆత్మకథను ప్రచురించవద్దని ఆ పత్రిక యాజమాన్యానికి జైలు ఇన్స్ పెక్టర్‍ జనరల్‍ ఆఫ్‍ పోలీస్‍ పై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు.
ఈ విషయం గురించి నక్కీరన్‍ యాజమాన్యానికి జిల్లా అధికారులకు మధ్య కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. చివరకు 1994, జూన్‍ 15 రోజున ఇన్స్పెక్టర్‍ జనరల్‍ నక్కీరన్‍ యాజమాన్యానికి ఓ ఉత్తరం రాశాడు. ఆ లేఖ సారాంశం…


‘‘ఆటో శంకర్‍ జైల్లో ఉండగా ఎలాంటి ఆత్మకథను రాయలేదని, అతని ఆత్మ కథ ప్రతిని జైలు అధికారుల అనుమతితో అతని భార్యకు ఇచ్చారన్నది కూడా అబద్ధమని ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. ఆటో శంకర్‍ కూడా తాను ఎలాంటి ఆత్మకథ రాయలేదని చెప్పాడని, తన ఆత్మకథను ప్రచురించమని అతని న్యాయవాది చంద్రశేఖర్‍కి ఎలాంటి అధికారం ఇవ్వ లేదని కూడా పేర్కొన్నారు. అంతే కాదు జైలు నిబంధనల ప్రకారం తమ ఆమోదముద్ర ఉండాలని, అది లేకుండా ప్రచురించ రాదని పేర్కొన్నారు. ఈ కారణాల వల్ల నక్కీరన్‍ పత్రికలో ప్రచురించబడ్డ ఆటో శంకర్‍ ఆత్మకథ, అతను రాసింది కాదని అతని పేరుతో మరొకరు రాసిందని పేర్కొన్నారు.


అతని పేరుమీద సీరియల్‍ ప్రచురించకూడదని అది చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ కారణాల వల్ల ఆటో శంకర్‍ జీవిత చరిత్ర అబద్దమని, ఆ సీరియల్‍ ప్రచురిస్తే తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ ఉత్తరాన్ని సవాలు చేస్తూ దానికి వ్యతిరేకంగా నక్కీరన్‍ యాజమాన్యం సుప్రీంకోర్టులో పిటిషన్‍ దాఖలు చేసింది. ఆ పత్రిక ఎడిటర్‍, ప్రింటర్‍ • పబ్లిషర్‍ అదేవిధంగా అసోసియేట్‍ ఎడిటర్‍ ఇద్దరూ కలిసి ఒక రిట్‍ పిటిషన్‍ దాఖలు చేసి ఆ ఐ.జి.ఇచ్చినటువంటి ఉత్తరం రద్దుచేయాలని కోరినారు.
నక్కీరన్‍ యాజమాన్యం ప్రకారం శంకర్‍ 350 పేజీల ఆత్మకథని చెంగల్పట్టు సబ్‍ జైల్లో ఉన్నప్పుడు రాశాడని ఆ ప్రతిని అతని భార్యకి అందజేశారని, అది కూడా జైలు అధికారుల అనుమతితోనే అందజేశారని పేర్కొన్నారు. జైలు నుంచి అతను రాసిన చాలా ఉత్తరాల్లో తన ఆత్మకథను ప్రచురించాలని అతను కోరడం కూడా జరిగిందని కోర్టుకి నక్కీరన్‍ యాజమాన్యం తెలియజేసింది.


కోర్టు ముందు ఉన్నటువంటి ప్రశ్నలు

  • ఒక వ్యక్తి జీవిత చరిత్రని ప్రచురణని ఆపే అధికారం మరొ వ్యక్తికి ఉంటుందా?
  • ఇలాంటి రాతలు వల్ల ఇతరులకి గుప్తత హక్కుకి భంగం వాటిల్లే అవకాశం ఉందా?
  • రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్‍ 19లో చెప్పిన భావ ప్రకటనా స్వేత్చకి ఇది ఆటంకమా?
  • ఒకవేళ ఆటంకం అయితే అతని హక్కులను కాపాడుకోవడానికి అతను ఏం చేయడానికి అవకాశం ఉంది?
  • ఇలా ఆ రాతల వల్ల ఇతరులకి పరువు నష్టం జరిగితే ఏం చర్యలు తీసుకోవచ్చు?
  • ప్రభుత్వానికి, దాని అధికారులకి కూడా ఆ రాతలు పరువు నష్టం కలిగిస్తే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా?
  • ప్రచురణ జరగకముందే, ప్రచురణ ఆపమని చెప్పే అధికారం ప్రభుత్వానికి కానీ దాని అధికారులకు కానీ ఉందా?
  • పౌరులకి భంగం కలుగుతుందని, పరువు నష్టం కలిగిస్తుందని భావించిన అధికారులు అది ప్రచురణ జరగకుండా ఆపే అధికారం ఉందా?


నక్కీరన్‍ పత్రిక వాదన
తాము ప్రచురిస్తున్న సీరియల్‍ ఆటో శంకర్‍ రాసిందేనని, అది ప్రచురించే హక్కు తమకు ఉందని, ఆటో శంకర్‍ కోరిక మేరకే తాము ప్రచురిస్తున్నామని, ఇప్పటికే మూడు వారాలు ప్రచురించామని, ఆ ఉత్తరంలోని బెదిరింపుల వల్ల తదుపరి ప్రచురణ నిలిపివేశామని పిటిషన్‍లో నక్కీరన్‍ యాజమాన్యం పేర్కొంది.
రాజ్యాంగంలోని భావప్రకటన స్వేచ్ఛ ప్రకారం అది ప్రచురించే హక్కు తమకు ఉందని తమ ప్రచురణ నిలిపివేయడానికి ఎవరికీ హక్కు లేదని కూడా వారు వాదనలు చేశారు.


సుప్రీం కోర్టు ఆదేశాలు
ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

1. జీవించే హక్కులో వ్యక్తి ఆంతరంగిక జీవితం హక్కు మిళితమై ఉందని పౌరుడు తన గుప్త జీవితం (కుటుంబ వివాహ, సంతాన, మాతృత్వ, విద్యా తదితర విషయాలన్నీ) రక్షించుకునే హక్కు కలిగి ఉంటాడు. ఈ విషయాల గురించి ఆ వ్యక్తి అనుమతి లేకుండా ఎవరు కూడా ఎలాంటి రాతలు అవి నిజమైనప్పటికీ విమర్శానాత్మకమైనప్పటికీ రాయడానికి వీలు లేదు. ఒకవేళ ఎవరైనా అలా రాసిన పక్షంలో వాళ్ళ ఆ పౌరుని ఆంతరంగిక హక్కుకి భంగం కలిగించిన వాళ్ళవుతారు. చట్టబద్ధమైన చర్యలకి బాధ్యులు అవుతారు. జైలు శిక్ష కూడా పడాల్సి రావచ్చు. నష్ట పరిహారం చెల్లించాల్సి రావచ్చు. ఒకవేళ ఎవరైనా వ్యక్తికి తనకు తానుగా స్వచ్ఛందంగా అలాంటి వివాదంలోకి వచ్చినప్పుడు ఇది వర్తించదు. ఈ విషయాలని దృష్టిలో పెట్టు కోవాల్సి వుంటుంది.

2. ఈ విషయాన్ని కూడా మినహాయింపు ఉంది. పబ్లిక్‍ రికార్డుల నుంచి ఈ విషయాలు రాసినప్పుడు అది వర్తించదు. పబ్లిక్‍ రికార్డుల్లోకి వచ్చినప్పుడు ఆంతరంగిక జీవితం హక్కు వర్తించదు. అప్పుడు వాటి గురించి వ్యాఖ్యానించడం చట్టవ్యతిరేకం కాదు. అయితే హుందా దృష్ట్యా ఎవరైనా స్త్రీ సెక్సువల్‍ బాధితురాలు అయినప్పుడు, కిడ్నాప్‍కి గురైనప్పుడు, ఆమె పేరు రాయకూడదు. ఎందుకంటే ఆ ప్రచారం వల్ల ఆమె హోదాకి భంగం వాటిల్లుతుంది.

3. ఎవరైనా పబ్లిక్‍ ఉద్యోగి చర్యల మీద, నడవడిక మీద ఏదైనా రాసినప్పుడు, అవి అబద్ధాలు అయినప్పుడు అది ప్రచురించిన వ్యక్తులు అవుతారు. ఆ ఉద్యోగులు నష్టపరిహారాలు కోరవచ్చు. పార్లమెంట్లు, లెజిస్లేచర్‍లకి పరువు నష్టం కలిగించినప్పుడు ఆ అధికారుల చర్యలు తీసుకోవచ్చు. కోర్టులు కోర్టు ధిక్కరణా చర్యలు తీసుకోవచ్చు.

4. ప్రభుత్వానికి, లోకల్‍ అథారిటీలకు పరువు నష్టం దావా వేయడానికి అవకాశం లేదు.

5. ప్రభుత్వానికి గానీ, దాని ఉద్యోగులకు గాని ఏదైనా విషయాన్ని ప్రచురణకు ముందే, ప్రసారాణకి ముందే నిలిపివేయాలని ఆదేశించే అధికారం లేదు.


ఈ సూత్రాల ఆధారంగా నక్కీరన్‍ పత్రిక యాజమాన్యానికి ఆటో శంకర్‍ ఆత్మకథని గానీ, జీవిత చరిత్రని గానీ ప్రచురించే హక్కు ఉందని అయితే అది పబ్లిక్‍ రికార్డుల ప్రకారం వుండాలని. అలా ప్రచురించినప్పుడు ఎలాంటి అనుమతి అధికార పత్రం కానీ అవసరం లేదని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.
ఒకవేళ తమ పరిధికి మించి విషయాలను ప్రకటించినట్లయితే ఇతరుల వ్యక్తిగత జీవిత హక్కులోకి ప్రవేశించి నట్లైతే వాళ్ళు చట్ట ప్రకారం తీసుకునే పరువునష్టం చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అవి క్రిమినల్‍ చర్యలు కావచ్చు. సివిల్‍ చర్యలు కావచ్చు.
నక్కీరన్‍ యాజమాన్యం ఆటో శంకర్‍ జీవిత చరిత్ర ప్రచురించ వచ్చని కోర్టు స్పష్టం చేసింది. అయితే అది పబ్లిక్‍ రికార్డులకి లోబడి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎవరి అనుమతి గాని అధికరణ గాని అవసరం లేదు. ఒకవేళ ఆ పరిధి దాటితే బాధితులు చర్యలు తీసు కోవడానికి అవకాశం ఉంది. దానివల్ల ఏర్పడ్డ పరిణామాలకి యాజ మాన్యం అదేవిధంగా ఆటో శంకర్‍ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
సుప్రీంకోర్టు మరో తీర్పు ప్రకారం వ్యక్తుల పరువు నష్టం కలిగించే అంశాలు రాయకుండా సివిల్‍ కోర్టు నిరోధించే అవకాశం ఉంది. ఏ విధంగా నిజం కానీ, రాజ్యం అధికారులు కానీ, ముందే దాన్ని ప్రశ్నించకుండా నిలిపివేయాలని ఆదేశించింది. అధికారం లేదు ఆ ప్రచురణల వల్ల లో మెన్షన్‍ చేసినటువంటి వివరాలు వల్ల సేన ఎవరికైనా, ఎవరి హక్కులకైనా భంగం వాటిల్లితే వారు తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ ప్రచురించిన వ్యక్తులు, అదేవిధంగా రాసిన వ్యక్తులు దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.


-మంగారి రాజేందర్‍ (జింబో)
ఎ : 9440483001

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *