ఉస్మానియా విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం

  • 7వ నిజాం ఫత్‍ జంగ్‍ మీర్‍ ఉస్మాన్‍ అలీ ఖాన్‍ ఆసఫ్‍ జా-Vll చే 1917, ఏప్రిల్‍ 26న స్థాపించబడింది
    • ఓయూకు పూర్వవైభవం తీసుకొద్దాం
    • గతవైభవాన్ని సైతం విద్యార్థులకు చాటిచెప్పేలా చర్యలు
    • ఈ ఏడాది నుంచి ప్రతీ ఏటా ఘనంగా వ్యవస్థాపక దినోత్సవం
    • సమావేశంలో వెల్లడించిన ఓయూ వీసీ ప్రొఫెసర్‍ రవీందర్‍


ఏప్రిల్‍ 26న ఠాగూర్‍ ఆడిటోరియంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్స్ తో పాటు అంబేడ్కర్‍ రీసెర్చ్ సెంటర్‍, మైనార్టీ సెల్‍ ఆధ్వర్యంలో ఓయూ 105వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ ప్రొ. రవీందర్‍ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‍కుమార్‍ జ్యోతి ప్రజ్వలన చేశారు. జాతీయ లోక్‍పాల్‍ కార్యదర్శి భరత్‍లాల్‍ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కొనియాడారు

. ఓయూ అభివృద్ధి కార్యక్రమాలపై వీసీ ప్రొ. రవీందర్‍ వివరించారు. అనంతరం మహిళ భద్రతపై రూపొందించిన యాప్‍ను అతిథులు ఆవిష్కరించారు. ఫౌండేషన్‍ డే సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యాశాఖ కార్యదర్శి సందీప్‍కుమార్‍ సుల్తానియా, రిజిస్ట్రార్‍ ప్రొ. లక్ష్మీనారాయణ, ఓయూ మహిళా అధ్యయన కేంద్రం డైరెక్టర్‍ ప్రొ.సూర్య ధనుంజయ్‍ మరియు డెవలప్‍మెంట్‍ అండ్‍ యూజీసీ ఎఫైర్స్ డీన్‍ ప్రొఫెసర్‍ జి. మల్లేశం, ఓయూ రిజిస్ట్రార్‍ ప్రొఫెసర్‍ లక్ష్మీనారాయణ తదిరులు పాల్గొన్నారు.


ఉస్మానియా విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో వైస్‍ చాన్స్లర్‍ ప్రొ. డి. రవీందర్‍ మాట్లాడుతూ… 1917లో హైదరాబాద్‍ ఏడవ నిజాం మీర్‍ ఉస్మాన్‍ అలీఖాన్‍చే స్థాపించబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నత విద్యకు వెలుగుగా, అకడమిక్‍ ఎక్సలెన్స్ కేంద్రంగా భారతదేశంలోనే ఏడవ అతి పురాతనమైనది మరియు దక్షిణ భారతదేశంలో మూడవ పురాతనమైనదిగా పేర్కొన్నారు. ఇది హైదరాబాదులో స్థాపించబడిన మొదటి విశ్వవిద్యాలయం. ఎనిమిది దశాబ్దాలకు పైగా విశ్వవిద్యాలయం ఉనికి గణనీయమైన పురోగతిని సాధించడమే కాక. ఇక్కడ చదివిన విద్యార్థుల ప్రతిభ దేశదేశాలకు వ్యాపించి ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిందని తెలిపారు. దివంగత భారత మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‍ గారు మరియు దేశవ్యాప్తంగా ఇంకెంతోమంది ప్రముఖ వ్యక్తులు ఈ విశ్వవిద్యాలయం నుంచే పట్టభద్రులయ్యారని ఆయన తెలిపారు.


ఉస్మానియా యూనివర్సిటీ పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఓయూ వైస్‍ చాన్స్లర్‍ ప్రొఫెసర్‍ డి. రవీందర్‍ పిలుపునిచ్చారు. వర్సిటీ గత వైభవాన్ని ప్రస్తుత తరం విద్యార్థులకు చాటిచెప్పేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వర్సిటీ ప్రారంభించిన రోజును పురస్కరించుకుని వ్యవస్థాపక దినోత్సవాన్ని గత 105 ఏండ్లలో ఎప్పుడూ నిర్వహించలేదని (శతాబ్ధి ఉత్సవాలు మినహా) గుర్తు చేశారు. ఇప్పటి నుంచి ప్రతీ ఏడాది వర్సిటీని ప్రారంభించిన ఏప్రిల్‍ 26న ఘనంగా ఓయూ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఓయూ ఇంజినీరింగ్‍ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. కేవలం ఉర్దూ బోధనా భాషగా కొన్ని కోర్సులతో ప్రారంభించిన వర్సిటీ అంచలంచెలుగా ఎదుగుతూ వివిధ భాషలు, విభాగాలతో అలరారుతున్నదని పేర్కొన్నారు.


ప్రస్తుతం వర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు యూనివర్సిటీ ప్రారంభించేనాడు ఉన్న పరిస్థితులు, నిజాం ఫర్మానా, కాలక్రమంలో ఇక్కడ జరిగిన ఉద్యమాలు, ఓయూ నుంచి ఎదిగిన రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణుల గురించి తెలియజెప్పేందుకే వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. అదేవిధంగా ప్రతీ రెండు నెలలకు ఒకసారి ప్రముఖుల ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.


చరిత్ర
ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ప్రధాన విశ్వవిద్యాలయం. దీని విస్తీర్ణం 3.90 హెక్టారులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‍ 7వ నిజాం ఫత్‍ జంగ్‍ మీర్‍ ఉస్మాన్‍ అలీ ఖాన్‍ ఆసఫ్‍ జా-Vll చే 1917లో స్థాపించబడింది. దీని స్థాపనకు సంబంధించిన ఫర్మానాను 1917, ఏప్రిల్‍ 26న జారీ చేశారు.


ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధావులను రూపొందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగునాట ఏర్పాటుచేసిన పప్రథమ విశ్వవిద్యాలయం. హైదరాబాదులోని ప్రస్తుత ఆబిడ్స్ ప్రాంతంలో ఒక అద్దె భవనంలో తరగతులు ప్రారంభించగా, 1939లో ప్రస్తుత ఆర్టస్ కళాశాల భవనం నిర్మించబడింది. 1919లో కేవలం ఇంటర్మీడియట్‍ తరగతులతో ప్రారంభమవగా, 1921 నాటికి డిగ్రీ, 1923 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్‍ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో ఉర్దూ బోధనా భాషగా ఉండగా, స్వాతంత్య్రానంతరం 1948 నుంచి ఆంగ్లం బోధనా భాషగా మారింది.


ఆర్ట్స్ కళాశాల భవనం
నిజాం పరిపాలన కాలంలో హైదరాబాదులో స్థాపించిన కొన్ని కళాశాలలు రాజ కుటుంబీకులకు, సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో వుండేవి. ఉన్నత విద్యను అన్ని సామాజిక వర్గాలకు అందించాలనే ఉద్దేశంతో బ్రిటిష్‍ ప్రభుత్వం 1913లో తమ పాలనలో వున్న ప్రాంతాలలోనే గాక సంస్థానాలలో కూడా విశ్వవిద్యాల యాలను స్థాపించాలని తీర్మానించింది. ఆవిధంగా పాట్నా, బనారస్‍, మైసూరు, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు స్థాపించ బడ్డాయి. ఆబిడ్స్ గన్‍ఫౌండ్రి దగ్గర తరగతులు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ఉన్నత విద్యా ప్రాప్తిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 7వ ప్రాచీన సంస్థగా, దక్షిణ భారతావనిలో 3వ సంస్థగా పేరుగాంచింది. ఇది హైదారాబాదు సంస్థానంలో స్థాపించబడిన మొట్టమొదటి విద్యాసంస్థ. తన తొమ్మిది దశాబ్దాల చరిత్రలో ఈ విశ్వవిద్యాలయము అన్ని విభాగాలలోనూ మంచి పురోగతి సాధించింది.


ఇక్కడ ఉర్దూ ప్రథమ భాషగా మాద్యమంగా ప్రవేశ పెట్టి బ్యూరో ఆఫ్‍ ట్రాన్స్లేషన్‍ను ఏర్పాటు చేసారు. మొదట గన్‍ ఫౌండ్రీ ప్రాంతంలో 25 మంది సిబ్బంది, 225 విద్యార్థులతో ఇంటర్మీడియట్‍ సాయంకాలం కోర్సులతో ప్రారంభించి క్రమంగా 1921లో బి.ఏ, 1923లో ఎం.ఎ.ఎల్‍.ఎల్‍.బి 1927లో మెడిసిన్‍, 1929లో ఇంజనీరింగు కోర్సులనూ ప్రవేశ పెట్టారు. అయితే నగరంలో వివిధ ప్రాంతాలలో వున్న కళాశాలలను పరిపాలనా సౌలభ్యం కొరకు ఒకే ప్రాంతంలో వుంటే బాగుంటుందని సంకల్పించి, తార్నాక ప్రాంతంలో 2,400 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుత కాంపస్‍ను ఏర్పాటు చేసారు.


భవనాల నిర్మాణానికి ఆర్కిటెక్‍లుగా సయ్యద్‍ అలీ రజా నవాబ్‍, జయంత్‍ సింగ్‍ బహదూర్‍లను నిమమించారు. వారు అమెరికాలోని కాలిఫోర్నియా స్టాన్‍ఫోర్డ్, హార్వర్డ్, కొలంబియా, బ్రిటన్‍ లోని ఆక్స్ పర్డ్, కేంబ్రిడ్జ్ మొదలైన విశ్వవిద్యాలయాలను సందర్శించి వచ్చారు. బెల్జియానికి చెందిన ఇ.జస్సార్‍ను సలహాదారుగా నియమించి లా, ఇంజరీరింగ్‍, ఆర్టస్ కళాశాల లైబ్రరి, సెనేట్‍ హాలు వంటి భవనాలను నిర్మించారు. ఆర్ట్స్ కాలేజి భవనానికి 1923 జూలై 5న పునాదులు వేసి, 1939 డిసెంబరు నాల్గవ తేదీన పూర్తి చేసారు. అదే రోజున హైదరాబాదు నిజాము దీనిని ప్రారంబించాడు. నైజాంలో విద్యాశాఖ మంత్రిగా ఉండిన అక్బర్‍ హైదర్‍ చాన్సెలర్‍గా, నవాబ్‍ మెహదీయార్‍ జంగ్‍ బహదూర్‍ వైస్‍ ఛాన్సెలర్‍గా నియమితులయ్యారు.


1949లో హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అప్పటి వరకు ఉన్న ఉర్దూ మాధ్యమాన్ని రద్దు చేసి ఆంగ్లమాద్యమాన్ని ప్రవేశ పెట్టారు. ఇస్లాం యూనివర్సిటీగా నామకరణం చేయాలని మొదట్లో వచ్చిన ప్రతి పాదనను కాదని ఉస్మానియా యూనివర్సిటీగా పేరు పెట్టారు. ఇండియా టుడే పత్రిక మన దేశంలో వున్న 160 యూనివర్సిటీలపై సర్వే నిర్వహించగా 2010 వ సంవత్సరంలో 10వ స్థానం, 2011లో 7వ స్థానం, 2012 లో ఆరవ స్థానం లభించింది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలలో ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలిచింది.


ప్రతిష్ఠ, బోధించే విషయాలు
1,600 ఎకరాల (6 చ.కి.మీ.) సువిశాల ప్రాంగణంతో, అద్భుత నిర్మాణ శైలికి ఆలవాలమైన భవంతులతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే అతి పెద్ద ఉన్నత విద్యాసంస్థలకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడి భూగోళ శాస్త్ర విభాగం దక్షిణ భారతావనిలోనే పురాతనమైనది, పెద్దది. ఇది 1942లో స్థాపించబడింది.

  • కట్టా ప్రభాకర్‍, ఎ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *