బెండ ఏ సమయంలో వేసినా లాభాలే..


కూరగాయలకు మార్కెట్‍లో 365రోజులూ డిమాండ్‍ ఉంటుంది. అన్నిటి కంటే భిన్నంగా.. బెండకాయ మాత్రం అన్ని కాలాల్లోనూ సాగుకు అనుకూలమై, రైతులకు లాభాలను అందిస్తున్నది. ప్రస్తుత కాలంలో కూరగాయలు సాగుచేసే రైతులపాలిట వరంగా మారింది. రుతువు ఏదైనా విరగకాసే ఈ పంట.. తక్కువ నీటితో ఆరుతడిగా వేసేవాటిలో ముఖ్యమైనదిగా గుర్తింపు దక్కించుకొన్నది.


బెండకాయలకు మార్కెట్‍లో ఎప్పుడూ స్థిరమైన రేటు ఉంటుంది. దీంతో చాలామంది రైతులు బెండ సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. తగిన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు పాటిస్తే ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. బెండ సాగు వివరాలు, పాటించాల్సిన మెలకువలు, సస్యరక్షణ చర్యల గురించి ఇలా వివరిస్తున్నారు.


అనుకూలమైన నేలలు
ఉదజని సూచిక 6.0 నుంచి 6.8 వరకు ఉండే నేలలు బెండ సాగుకు అనుకూలంగా ఉంటాయి. సేంద్రియ పదార్థాలతో సమృద్ధిగా ఉన్న వదులైన, మెత్తని, బాగా ఆరిన ఇసుక నేలల్లోనూ బెండ విరగ కాస్తుంది. సారవంతమైన ఒండ్రు నేలలు, తేలికపాటి నల్లరేగడి నేలలు, గరుప నేలల్లోనూ అధిక దిగుబడి సాధించవచ్చు. అయితే, క్షార స్వభావం ఉన్న నేలలు, ఉప్పు నేలలు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని నేలల్లో బెండ సాగు మంచిదికాదు. పంట వేయడానికి ముందే భూసార పరీక్షలు, నీటి నాణ్యత పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం.


బెండ రకాలు
బెండలో అనేక రకాలున్నాయి. అయితే, తెలంగాణ వాతావరణానికి అనుకూలమైన రకాలను ఎంచుకోవడం వల్ల ఎక్కువ దిగుబడులు పొందవచ్చు.
సాధారణ రకాలు : పర్భని క్రాంతి, అర్క అనామిక, అర్క అభయ, పూసా సవాన, పూసా ముఖమలి, పంజాబ్‍, పి-7, పి-8.
హైబ్రిడ్‍ రకాలు : వర్ష, విజయ, విశాల్‍, నాథ్‍ శోభ, మహికో హైబ్రిడ్‍ నం. 6, 7, 8, 10, ప్రియ, సుప్రియ, ఐశ్వర్యం మిస్టిక్‍, తులసి.


విత్తనశుద్ధి
కిలో బెండ విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్‍, తర్వాత 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడితో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. నాటడానికి 24 గంటల ముందు ట్రైకోడెర్మా ఎస్పీపీ (4-10 గ్రా./ కేజీ విత్తనానికి), సూడోమోనాస్‍ ఎస్పీ (10 గ్రా./ కేజీ విత్తనానికి) సమపాళ్లలో కలుపుకొని, విత్తన శుద్ధి చేయాలి. వీటిని రాత్రంతా తడి ఆరనిచ్చి, మరుసటి రోజు విత్తుకోవాలి.


నేల తయారీ
హైబ్రిడ్‍ రకాలు ఎకరానికి ఒక కిలో చొప్పున, సాధారణ రకాలైతే ఎకరానికి రెండు నుంచి మూడు కిలోల చొప్పున అవసరం అవుతాయి. విత్తుకొనే ముందు భూమిని నాలుగైదుసార్లు కలియ దున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్నుల పశువుల ఎరువు, 30 కిలోల భాస్వరం, పొటాష్‍ చొప్పున వేసుకోవాలి. సాళ్ల మధ్య 60 సెం. మీ., మొక్కల మధ్య 30 సెం. మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీరు పెట్టి, నాలుగైదు రోజుల తర్వాత రెండో తడి ఇవ్వాలి. మొలకలు వచ్చిన తర్వాత పాదుకు ఒక మొక్కను ఉంచి, మిగతావి తీసేయాలి.


నీటి యాజమాన్య పద్ధతులు
బెండ సాగులో నీటి యాజమాన్య పద్ధతులను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. విత్తనాలు విత్తిన వెంటనే నీరు పెట్టాలి. ఆ తర్వాత నేల రకం, వాతావరణ పరిస్థితులను బట్టి నీటి తడులు ఇవ్వాలి. నల్లరేగడి నేలల్లో అయితే ప్రతి ఐదారు రోజులకు నీరు అందించాలి. పూత, కాయ దశల్లో మొక్కలను నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. లేకుంటే, కాయ పరిమాణం, దిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ నీరు తక్కువగా ఉన్నట్లయితే బిందు సేద్యం పద్ధతిని ఆశ్రయించడం మంచిది.


సస్యరక్షణ చర్యలు
బెండలో ఎక్కువగా మొవ్వు, కాయ తొలిచే పురుగు కనిపిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వును, పూతను, కోత దశలో కాయలను తొలిచి, తీవ్ర నష్టం కలిగిస్తుంది. పురుగు ఆశించిన కొమ్మలను, పురుగు ఆశించిన చోట నుంచి అంగుళం కిందికి తుంచేయాలి. ఈ పురుగుల నివారణకు కాయలు కోసిన తర్వాత లీటర్‍ నీటిలో 3 గ్రా. కార్బరిల్‍ లేదా 2 మి.లీ. క్వినాల్‍ఫాస్‍ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
తేమ తక్కువగా ఉండే పొడి వాతావరణంలో బూడిద తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల ఆకులు పచ్చబడి రాలిపోతాయి. నివారణకు లీటర్‍ నీటిలో 3 గ్రా. కరిగే గంధకపు పొడి లేదా 1 మి.లీ. డైనోకాప్‍ లేదా 2 మి.లీ. హెక్సాకొనజోల్‍ కలిపి పిచికారీ చేయాలి.


పల్లాకు తెగులు సోకితే అధిక నష్టం వాటిల్లుతుంది. ఈ తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారి, కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి. అర్క అనామిక, అర్క అభయ్‍ రకాలను విత్తుకొంటే, ఈ తెగులును నివారించవచ్చు. మొక్కల్లో పల్లాకు తెగులు కనిపిస్తే లీటర్‍ నీటిలో 2.5 గ్రా. క్లోరోథలానిల్‍ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్‍ లేదా 1 గ్రా. కార్బండజిమ్‍ కలిపి పిచికారీ చేయాలి.
ఎండు తెగులు నివారణ కోసం లీటర్‍ నీటిలో 3 గ్రా. కాపర్‍ ఆక్సిక్లోరైడ్‍ కలిపి, ద్రావణాన్ని మొక్కల మొదళ్ల వద్ద పోయాలి. దుక్కిలోనే ఎకరానికి 100 కిలోల వేపపిండిని కలుపుకున్నా, ఎండు తెగులును నివారించుకోవచ్చు. పేనుబంక, తామర పురుగులు కనిపిస్తే, లీటర్‍ నీటిలో 1 గ్రా. ఎసిఫేట్‍ లేదా 2 మి.లీ. డైక్లోరోఫాస్‍ కలుపుకొని పిచికారీ చేయాలి.


కోత, దిగుబడి
బెండ విత్తనాలు వేసిన 45 నుంచి 55 రోజులకు మొదటి కోత వస్తుంది. 130 రోజుల వరకు దిగుబడిని ఇస్తుంది. ప్రతి రెండు మూడు రోజులకోసారి తప్పకుండా కాయలను తెంపాలి. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే, ప్రతిరోజూ ఎకరానికి 100 కిలోల నుంచి 150 కిలోల వరకూ దిగుబడి వస్తుంది. మొత్తంగా ఎకరానికి 80 క్వింటాళ్ల నుంచి వంద క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు. మార్కెట్లో కనీస ధర కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకూ ఉన్నా, రూ.రెండు లక్షలకుపైగా ఆదాయం ఆర్జించవచ్చు.


కలుపు నివారణ
ఇది దీర్ఘకాలపు పంట. పంటకాలంలో సుమారు మూడు నుంచి నాలుగుసార్లు కలుపు తీయాల్సి ఉంటుంది. విత్తనాలు వేసిన రెండు వారాలకు కలుపు నియంత్రణ చర్యలు చేపట్టాలి. ఆ తర్వాత సమస్యను బట్టి కలుపును తొలగించుకోవాలి. తోట పూర్తిగా పెరిగే వరకూ, మొక్కల వద్ద మట్టిని పారతో పైకి ఎగదోయాలి. కలుపు సమస్య, కూలీల సమస్య ఎక్కువగా ఉన్నప్పుడే రసాయన మందులు వాడాలి. కలుపు సమస్య ఎక్కువగా ఉండే నేలలైతే ఎకరానికి 100 లీటర్ల నీటిలో 500 మి.లీ. పిండి మిథాలిన్‍ కలిపి, విత్తనం నాటిన మరుసటి రోజే నేలపై పిచికారీ చేయాలి.


స్థిరమైన ఆదాయం..

ఏడాది పొడవునా సాగయ్యే కూరగాయల పంట బెండ. నాలుగు నెలల కాలపరిమితి ఉండే ఈ పంటలో, హైబ్రిడ్‍ రకాలు అందుబాటులోకి వచ్చాక, రైతులు ఎకరానికి 100 క్వింటాళ్లకుపైగా దిగుబడి సాధిస్తున్నారు. మార్కెట్‍లో ఏడాది మొత్తం నిలకడైన ధర వల్ల మంచి ఆదాయం పొందుతున్నారు. పల్లాకు తెగులును తట్టుకునే రకాలు, హైబ్రిడ్‍ రకాలు అందుబాటులో ఉండటం వల్ల రైతులకు స్థిరమైన ఆదాయం వస్తున్నది. సకాలంలో పోషకాలు అందించి, తగిన మెళకువలు పాటిస్తే బెండలో మంచి దిగుబడి సాధించవచ్చు.


ఆనబోయిన స్వామి,
ఎ : 9963 87 2222

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *