ఉన్నదొకే ధరిత్రి – కాపాడుకుందాం!


2022 సంవత్సరం ప్రపంచ పర్యావరణదినోత్సవానికి స్వీడన్‍ ఆతిథ్యమిస్తున్నది. ఒకే ఒక్క ధరిత్రి (ఓన్లీ వన్‍ ఎర్త్) అనేది ప్రచార నినాదంగా ప్రకృతితో సామరస్య పూర్వకంగా సుస్థిరతతో జీవించటం మీద దృష్టి నిలపడం జరుగుతుంది. ఇక ఈ ఏడాది కార్యక్రమాలు అన్నీ సామరస్యం, సుస్థిర జీవనం మీదనే కొనసాగుతాయి.
పర్యావరణ సంక్షోభాలు, విధ్వంసాలు నానాటికీ అధికమవుతున్నాయి తప్ప తగ్గే సూచనలు సమీప దూరంలో కనిపించటం లేదు. మనుషులందరమూ ఈ భూమండలం మీద ఆధిపత్యంతో జీవించడానికే అలవాటు పడ్డట్లున్నాం. ముఖ్యంగా ప్రకృతి మీద మరింత ఆధిక్యతా భావంలో ఉన్నామని కూడా అనిపిస్తుంది.
ఒకే ఒక్క ధరిత్రి లేదా ధరణి అనే మాటను ఒకటికి రెండుసార్లు పైకి అనుకుంటే తప్ప ఆ నినాదంలో దాగిన సందేశ తీవ్రత అర్థం కాదు. మానవులు మనుగడ సాగించడానికి మరో భూమి లేదు.


ఉన్నదొకే భూమి. దీనిని మరుభూమిగా మార్చుకునేంత అవివేకులం కావద్దని ఆ నినాదంతో ఏదో ఒక హెచ్చరిక ధ్వనిస్తోంది నాకు. మరో భూమి అంటూ లేకపోవటం. ఉన్న భూమిని కాపాడుకోవటం, పరిరక్షించుకోవటం ప్రపంచ మానవులందరి కర్తవ్యం, లక్ష్యం కూడా కావాలి. ఎందుకంటే పర్యావరణ సమస్యలు, సంక్షోభాలు ఏ ఒక్క విడి ప్రాంతానికో, దేశానికో, ఖండానికో చెందినవి కావు. అవి మానవాళి ఉమ్మడిగా ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షోభాలు. ఇవి ఏ ఒక్కరో ఇద్దరో తేలికగా అధిగమించగలిగినవీ, పరిష్కరించగలిగినవీ కావు.
ఇందుకుగాను మానవులందరం ఉమ్మడిగా గుర్తించాల్సిన అంగీకరించాల్సిన అంశం ఏమంటే మనం ఈ భూమికి అతిథులమే తప్ప అధిపతులం కాదు. కానీ, అధిపతులుగా యజమానులుగా మారుతున్నాం. ఈ ధరణిని పలు విధాలుగా దుర్వినియోగం చేస్తున్నాం. ప్రకృతి, పర్యావరణం మానవుల కోసం కాకపోతే ఎందుకున్నట్లు అనే ఒక అమాయకపు ఆధిక్యతతోనో, నిర్లక్ష్య వైఖరులతోనో మనం ఉన్నాం. ప్రకృతికి సంబంధించి ఒక అప కథనాన్ని ఉమ్మడిగా రచించాం. ఈ చరిత్రను మార్చి చరితార్థులుగా మిగలవలసిన తరుణం కూడా ఇదే.


నిజానికి మానవులంతా ఉమ్మడిగా రాసుకున్న చరిత్ర చాలా సుదీర్ఘమైంది. వాస్తవంగా ఆలోచిస్తే చరిత్ర అనేది అనేక మార్పులతో కూడిన కథనం. ప్రజలుగానీ, ప్రపంచంగానీ ఏటికేడాది, తరం నుంచి తరానికి మార్పు ఏమీ లేకుండా ఉన్నట్లయినా, లేదా అదే అభివృద్ధి అనే వృత్తమే పదే పదే పునరావృతమైనా ఇక ఎంత మాత్రమూ ఈ వలయం నుంచి తప్పించుకునే దారి లేక అలాగే కొనసాగితే ఇక చరిత్ర మనం రాసుకోవటమనేది అంత విలువైన విషయమేమీ కాదు. మార్పులేని స్థితి అంతటా కొనసాగింపబడి దానినే మనం నమోదు చేస్తే దానిని చరిత్రగా చదవటం కూడా అంత ప్రయోజనం లేనిపని.
అదృష్టమో, దురదృష్టమో కాని అన్ని మానవ సమాజాలలోనూ మార్పు సహజం. మార్పు అనివార్యం. మార్పు నుంచి తప్పించుకోవటం ఏ మానవ సమాజానికి సాధ్యం కాదు. మారే స్వభావం గల సమాజాలకు, ప్రకృతికి ప్రపంచానికి కూడా ఇది వర్తిస్తుంది. ఈ రెంటి మధ్య సంబంధాలు కూడా వీటిని కలిపే
ఉంచుతాయి. ప్రకృతిలో సహజంగా వచ్చే మార్పులు ఒకరకమైతే మానవ ప్రమేయం ద్వారా వచ్చే మార్పులు రెండవ రకం. ప్రకృతి సహజంగా మారటం ద్వారా మానవ సమాజాలు అందుకనుగుణంగా మారవలసి వస్తుంది. మానవ సమాజాల వల్ల ప్రకృతి మారినట్లయితే ఆ మేరకు ప్రకృతి కూడా సమాజాలకు అనుకూలంగా మార్చబడుతుంది.


అన్ని మానవ సమాజాలకు సవాళ్లు సహజం. కొన్నిసార్లు ఇవి ఉప్పెనలు, తుఫాన్లు, భూకంపాలు, సునామీలు మొదలైన రూపంలో కనపడవచ్చు. అట్లాంటివి ప్రతికూలంగా మారి కొన్నిసార్లు మానవ సమూహాలను ప్రమాదంలోకి నెడతాయి. కొన్నిసార్లు ఈ సవాళ్లు సాంస్కృతికంగా, ఆర్థికంగా కూడా ముంచుకొస్తాయి. ఇట్లాంటివి సంభవించటానికి మానవులు తమ అభివృద్ధి కోసం చేసే పనులే కారణం. ఇవి సహజ వ్యవస్థల యొక్క ఉనికికి భంగకరంగా
ఉంటాయి. మానవ వ్యవస్థలు కొనసాగడానికి ఆవరణ వ్యవస్థలు ఏ విధంగా దోహదకారులుగా ఉంటాయో, పర్యావరణ వ్యవస్థలు నిలదొక్కుకోవడానికి మానవ వ్యవస్థలు కూడా దోహదకారులుగా నిలవ వలసి ఉంటుంది. ఇవ్వాళ మనం గుర్తించవలసిన విషయం ఇదే. ప్రకృతి, పర్యావరణం వ్యవస్థలను అవసరాలకు మించి బాధించాం. వత్తిడికి గురి చేశాం.
మనుషుల మనుగడకోసం ప్రకృతి, పర్యావరణాలు పలు విధాలుగా మార్పులకు గురయ్యాయి. మనిషి తనకోసం చేసుకున్న మార్పులకు కూడా పర్యావరణం అలవాటు పడవలసి ఉంది. అట్లాగే ప్రకృతి, పర్యావరణంలో వాటిల్లిన మార్పులు, పరిణామాలను బట్టి మానవ వ్యవస్థలు కూడా తగిన మార్పు, చేర్పులు చేసుకోవలసి ఉంది. ఇటువంటి అవగాహన, చైతన్యాలు ఉన్నప్పటికీ సరైన ఆచరణ లేకపోవటం వల్ల మానవాళి ఉనికి మరింత ప్రమాదంలో పడింది. ఈ రెండు వ్యవస్థలలోనూ పరస్పరం జరిగిన మార్పులు, పరిణామాలకు అనుగుణంగా తమని తాము మార్చుకోలేకపోయినా, పద్ధతులను, నమూనాలను రూపొందించుకోలేకపోయినా అవి క్షీణించనైనా క్షీణిస్తాయి లేదా అంతరిస్తాయి. అంతర్థానమవుతాయి. ఇట్లాంటివి ప్రతిచారిత్రక కాలంలో కూడా ఈ భూమండలం మీద ప్రతిచోటా జరిగాయని అధ్యయనాలు చెపుతున్నాయి. పర్యావరణ, మానవ వ్యవస్థలు పరస్పర ప్రభావాలు, ప్రమేయాల వల్ల ఏం జరిగిందో తెలుసుకోవటమే పర్యావరణ చరిత్ర ప్రమాదాలు, ముప్పులు, సంక్షోభాలతో తలపడుతూ కూడా వర్తమానంలో మానవులుగా మనం చేయాల్సిన పని వివేకవంతంగా ఎంపిక చేసుకోవటం. ఇది మానవాళి భవిష్యత్తు కోసం తెలిసిన అవగాహన గల గత పర్యావరణ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జరగాల్సి ఉంది.


అందుకే 5 జూన్‍ 2022న ప్రపంచపర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) భాగస్వామ్యంతో స్వీడన్‍ ఆతిథ్యం ఇస్తోంది. ‘ఒకే ఒక్క అవని / ధరిత్రి / ధరణి’ అనే నినాదం మానవులు మరింత సుస్థిర, హరిత జీవన శైలుల వైపు మరలేందుకు గల అవకాశాలను వెతకమని సూచిస్తున్నది. ఆ వైపు అడుగులు వేయమని సూచిస్తున్నది.
మానవులు ప్రకృతితో సుస్థిరత, సామరస్య జీవనం సాగించేందుకు గల అవకాశాలను పరిశీలించాలి. మన విధాన నిర్ణయాలు, విడివిడి వ్యక్తులుగా మనం ఎంపిక చేసుకునేవి హరితవాదం దిశగా సాగాల్సినవి. ఐక్యరాజ్య సమితి పర్యావరణంపై 1972 స్టాక్‍హోంలో జరిపిన మొదటి సదస్సు కూడా ‘ఓన్లీ వన్‍ ఎర్త్’ అనేదే ప్రధానాంశం. దీని ఉద్దేశం ఏమంటే మానవులకు నివాసయోగ్యమైన గూడు భూమి ఒక్కటే అని. కాబట్టి భూమిపై ఉండే సకల వనరులను మనం వివేకవంతంగా పరిరక్షిస్తేనే ఈ ధరిత్రి మనలను కాపాడుతుందని, మనలను కాపాడే భూమిని కాపాడుకోవటం కన్నా విలువైన పనేముంది?

  • డా।। ఆర్‍. సీతారామారావు
    ఎ : 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *