మహారాజా కిషన్‍ పర్‍షాద్‍ దేవుడీ


‘‘షాద్‍’’ అన్న తఖల్లూస్‍తో (కలంపేరు) ఉర్దూ, అరబ్బీ, ఫార్సీ భాషలలో కవిత్వం రాసినది ఎవరో తెలుసా? ఆరవ నిజాంకు దివాన్‍గా పనిచేసిన మహరాజా కిషన్‍ పర్‍షాద్‍. ఆయన జాగీరు గ్రామం పేరే షాద్‍నగర్‍. నగరంలో కిషన్‍భాగ్‍ దేవాలయం ఆయన కట్టించినదే. ఆయన అధికార నివాసభవనం ‘‘దేవుడీ’’ షాలిబండాలో ఉంది. కరిగిపోయిన కమ్మని కలకు ప్రతిరూపమే ఆ దేవుడీ. ఆ దివాణం చుట్టూ అల్లుకున్న కమ్మని కథలు ఎన్నెన్నో!


వీరు ఖత్రీ కులానికి సంబంధించినవారు. వీరి మాతృభూమి పంజాబ్‍. వీరు ముస్లింల ఆస్థానాలలో ‘‘నఖల్‍నవీస్‍లుగా’’ (కాపీ రైటర్స్) పనిచేసేవారు. క్రమక్రమంగా పరిపాలనా రంగంలో నైపుణ్యం సంపాదించారు. మంత్రి పదవులను అలంకరించారు. మొదటి నిజాం ఢిల్లీ నుండి వచ్చినప్పుడు వీరు కూడా పరిపాలనా సిబ్బందిగా వచ్చి హైదరాబాద్‍లో స్థిరపడినారు.
1864లో ఆరవ నిజాం కన్నా రెండు సంవత్సరాల ముందే కిషన్‍ పర్షాద్‍గారు జన్మించారు. అక్బర్‍ పాదుషాగారి కాలంలో పేష్కార్‍గా (ఆర్థిక మంత్రిగా) పనిచేసిన తోడర్‍ మల్‍ వీరి పూర్వీకులు. మరొక పూర్వీకుడు రాయ్‍మూల్‍ చంద్‍ 1724లో మొదటి నిజాంతో కలిసి హైద్రాబాద్‍కు వచ్చి రాజ్యస్థాపన చేసారు. వీరి ముత్తాత మహారాజా చందూలాల్‍ మూడవ మరియు నాల్గవ నిజాంలకు పేష్కార్‍గ, దివాన్‍గ పనిచేసారు. చందూలాల్‍ బేలా, చందూలాల్‍ బారాదరి అను బస్తీలు ఈయన పేరుమీదనే వెలిసాయి. అల్వాల్‍లోని వెంకటేశ్వరస్వామి గుడి ఈయన నిర్మించిందే. ఇదీ మహారాజా కిషన్‍ పర్షాద్‍గారి నేపథ్యం. ఆయన రక్తనాళాల్లో తన పూర్వీకుల రక్తమే గాక వారి ఔన్నత్యం కూడా ప్రవహిస్తుండేది.


ఆధునిక విద్య అభ్యసించిన తర్వాత 19 సం।।ల వయస్సులో కిషన్‍ పర్షాద్‍గారు పేష్కార్‍ పదవిలో నియమించబడినాడు. ఇతను బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రాచీన అర్షభాషా సంస్కృతాన్ని, తరతరాల నుండి సంక్రమిస్తున్న పేష్కారు పదవీనైపుణ్యం కోసం జమాఖర్చులకు సంబంధించిన గణితాన్ని, తన ప్రవృత్తి సంతృప్తికోసం కవిత్వం, సంగీతం, చిత్రకళ, ఫొటోగ్రఫీ, కాలిగ్రఫీని అభ్యసించాడు. తోటి మానవులకు సేవచేసే ఉద్దేశ్యంతో వైద్యాన్ని, జోతిష్య శాస్త్రాన్ని నేర్చుకున్నాడు. తన తాత్విక దాహాన్ని తృప్తిపరచటం కోసం అన్ని మతాలను తులనాత్మకంగా అధ్యయనం చేశాడు. తన మధ్య వయసులో మట్టికుండలపై, కూజాలపై కళాకృతుల్ని ఆవిష్కరించే నైపుణ్యాన్ని సాధించాడు. అంతేకాదు అతను పాక కళాశాస్త్రంలో ప్రవీణుడు కూడా. ఒక కంది పప్పుతోనే యాభై రెండు రకాల వంటకాలను తయారుచేసేవాడు.


ఒకరోజు ఆరవ నిజాం కిషన్‍ పర్షాద్‍ దేవ్‍డీకి వెళ్లాడు. కుటుంబ సభ్యులందరూ విడివిడిగా నవాబుగారికి నజరానాలు సమర్పించుకునే ఆచారం అమలులో ఉన్నందున కిషన్‍ పర్‍షాద్‍గారి అక్కచెల్లెళ్లందరూ ‘‘నజర్‍’’లు చెల్లించుకున్నారు. ఒక సోదరి మాత్రం తన భర్త పరదేశంలో ఉన్నందున నవాబుగారి ముందు హాజరు కాలేనని అన్నగారిని ప్రార్థించింది. కాని ఆయన వొత్తిడి వలన చివరికి ఒప్పుకుంది. తల నిండా కొంగు కప్పుకుని నవాబు ముందు హాజరై నజర్‍ సమర్పిస్తుండగా నిజాం ‘‘మీ సోదరి విధవరాలా’’ అని దివాన్‍గారిని అడిగాడు. వైధవ్యం పొందిన హిందూ స్త్రీలు తలనిండా కొంగు కప్పుకోవటం ఆ రోజులలో ఆచారం. నవాబుగారు అలా పొరపాటు పడ్డారు. ఆ ప్రశ్నకు అందరూ ఉలికిపడి అసలు సంగతి చెప్పారు. తన పొరపాటుకు నిజాం కూడా చింతించాడు. మరునాడు ఆ వార్త నిజమే అయ్యింది. రాజుగారు ఆ ప్రశ్న అడిగిన సమయంలోనే ఆమె భర్త పరదేశంలో మరణించాడు.
ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ కుటుంబ స్త్రీలు ఎవరూ నిజాం ప్రభువు ముందు హాజరుకావటానికి సాహసించలేదు. కిషన్‍ పర్‍షాద్‍గారు లంకంత ఆ దేవుడీలో విలాసవంతంగా జీవించే వాడు. అనేకమంది భార్యలకు వారి పిల్లలకు వేరు వేరు గదులుండేవి. వారికోసం ప్రత్యేకంగా నౌకర్లు, చాకర్లు ఉండేవారు. వంటగదులు, భోజన శాలలు కూడా వారివారి అభిరుచుల మేరకు ప్రత్యేకంగా ఉండేవి. యాత్రలకు, వినోద విహారాలకు ఎక్కడికి వెళ్లినా వారందరితో కలిసి కదిలేవాడు. ఆయన జీవితం ఒక గొప్ప ఉత్సవ ఊరేగింపుగా నిత్యకల్యాణం పచ్చతోరణంగా కొనసాగింది.


ఆయన సిమ్లా రైలు ప్రయాణం ఒక గొప్ప చారిత్రక వినోద దృశ్యంగా కొనసాగింది. ఇప్పటికి వందేళ్ల క్రితం ఆయన సిమ్లా రైలు యాత్ర తన కుటుంబ సభ్యుల సమేతంగా చేశారు. అన్ని విలాసాలతో కూడిన ఒక ప్రత్యేక రైలును, ఏకంగా అద్దెకు తీసుకున్నారు. తనకు, తన పట్ట మహిషికి, పిల్లలకు ఒక బోగీ, దాని వెనక భాగంలో పనివాళ్లకు, వంటవాళ్లకు మరోబోగి, మిగతా బోగీలు ఇతర భార్యలకు వారి పిల్లలకు వారి సేవకులకు. ఇక వారి లగేజీలకు, సామానులకు అంతు లేదు. అతిపెద్ద సర్కస్‍ కంపెనీ కూడా వారి బృందం ముందు చిన్నగా కనబడు తుంది. రాత్రి కాగానే రైలు ఏదో ఒక అందమైన ప్రకృతి ఒడిలో విశ్రమించేది. వారి పెట్రోమాక్సు లైటు వెలుగులకు, జిలుగు వెలుగుల రంగుల డేరాలు, గుడారాలకు, రమణుల కాలి అందెల సవ్వడులకు చేతిగాజుల గలగలలకు, వంటవారి హడావుడికి, పిల్లల కేరింతలకు అడివంతా ఉలికిపడి మేల్కొనేది. గానాబజానా విందు భోజనాలతో రాత్రి రంజుగా రాణించేది. అద్దమరేతిరి దాటిం తర్వాత నెగళ్ల జ్వాలల వెచ్చదనంతో అడివితో సహా అందరూ తూలి, సోలిపోయి నిద్రలోకి జారుకునేవారు. తెల్లారగానే చిలకలు వాలిన చెట్టులా రైలు కిలకిలలాడేది. కళకళలాడేది. ఆ పడుచుదనాల రైలుబండి మందగమనంతో ముందుకు సాగేది. అట్లా సొక్కుతూ, సోలుతూ ఒయ్యారాలు పోతూ ఆరైలు బండి పది దినాలకు గాని సిమ్లాకు చేరుకోలేదు. వారి ప్రయాణం పుణ్యమా అని ‘‘బండీర పొగ బండీర, దొరలెక్కే రైలు బండీర’’ అన్న పాట నిజమే అయ్యింది.


షాలీబండాలోని ఆయన దేవుడీ భిన్నమతాలకు, భిన్న సంస్కృతులకు ఒక సంకేతంగా నిలిచిపోయింది. ఆయన భార్యలలో కొందరు ముస్లింలు, వారికి, వారి సంతానాలకు తమ స్వంత మతాన్ని అవలంబించే స్వేచ్ఛను ఇచ్చాడు. హిందూ ముస్లిం పిల్లలందరీ రెండు మతాలకు సంబంధించిన పేర్లను కలిపి పెట్టేవాడు. ఉదా।। ‘‘రాయ్‍ మహబూబ్‍ నారాయణ్‍’’ పేరు. దాంతో ఎవరు ఏ మతానికి సంబంధిం చిన వారో తెలియక పోయేది. వారు నివసించే భవనాల పేర్లు కూడా అలానే ఉండేవి. దీనివలన ఒక నూతన సంస్కృతి, మిశ్రమ సంస్కృతి నగరంలో ఆవిర్భవించింది. సాధువులు, సంతులతో పాటు ఫకీర్లను, సూఫీసాధువులను కూడా ఆదరించాడు.
ప్రతి పెళ్లి కూతురు నా కూతురే అని ఆయన భావన. ఒకరోజు రైల్లో ప్రయాణిస్తుంటే ఒక బీద ముస్లిం ముసలాయన కిటికీ వద్దకు వచ్చి కూతురు పెళ్లి చేయలేక పోతున్నానని ‘‘మెహర్‍’’ ఖర్చులను భరించలేక పోతున్నానని అంగలార్చాడు. దాంతో దివాన్‍గారు తన పాకెట్‍ డైరీలో అతని ఊరు, పేరు పెళ్లి ఖరారైన తేదీ వివరాలు నోట్‍ చేసుకుని నిశ్చితంగా వెళ్లి పెళ్లి పనులు చూసుకోమని భరోసా ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం పెళ్లిరోజున సరుకుల్ని, సామాగ్రిని తీసుకుని ఆ గ్రామానికి చేరుకున్నాడు. ఆ ముసలివాని ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. పెళ్లికళా, హడావుడి ఏమీ కనబడలేదు. ఇంట్లోంచి దిగులుగా ఇవతలికి వచ్చిన ముసలివాడిని సంగతి ఎంటని అడిగాడు. కట్నం డబ్బులు ముందే ఇవ్వలేదని పెళ్లి వాళ్లు రాలేదని అన్నాడు. పెళ్లికొడుకు ఊరు, పేరు తెలుసుకుని జవాన్లు కట్నం డబ్బులను, సంభరాలను తరలించి ఇది నాకూతురి పెళ్లి, ఇకనైనా రాలేదో నేనే స్వయంగా వచ్చి అసలు పెళ్లిచేసి తోలుతీస్తా అని సందేశం పంపగా పెళ్లి కొడుకు ఉరుకులు, పరుగులతో వచ్చి పెళ్లి పీటల మీద కూచున్నాడు.


ఆయన వినోద క్రీడ చాలా వింతగా ఉండేది. సుప్రభాతపు వేళ్లల్లో తన దేవ్‍డీపై భాగంలో నిల్చుని చిన్ని చిన్ని తాజా మాంసం ముక్కల్ని చాలా బలంగా పైకి ఆకాశంలోకి చాలా ఎత్తున విసిరేవాడు. గగనంలో విహరిస్తున్న గ్రద్దల గుంపు చాలా ఒడుపుగా పల్టీలు కొట్టి పోటీలు పడి ఆ మాంసం ముక్కల్ని అందుకునేవి. ఎవరైనా ‘‘ఇదేం సరదా! పావురాలకు గింజలు చల్లటం చూశాం కాని గద్దలకు మాంసం ముక్కలు విసరటం చూడలేదు’’ అంటే ‘‘గ్రద్దలు గరుత్మంతుడికి ప్రతిరూపాలు కదా’’ అని ఒక్క ముక్కలో వారికి సమాధానం చెప్పేవాడు. కుటుంబ సభ్యులలో ఎవరైనా తన మనసు నొప్పిస్తే వారిని పల్లెత్తుమాట అనకుండా అందమైన ముత్యాల సరాల దస్తూరితో (కాలిగ్రఫీ) వారికి సుదీర్ఘ లేఖలు సున్నితంగా రాసేవాడు. దాంతో వాళ్లు తమ తప్పు తెలుసుకుని అతనికి ‘‘ఫిదా’’ (వశం) అయిపోయే వారు.


ఇక దానగుణం గురించి చెప్పుకోవాలంటే ఒక బికారికి సహాయం అందించి తానే బికారిగా మారిన కథ ముందు చెప్పాలి. ఒకసారి ఢిల్లీ గల్లీలలో సంచరిస్తున్నప్పుడు ఒక బికారి తారసపడినాడు. కాసేపు ముచ్చటించాక తెలిసినదేమంటే ఆ బికారి చిట్టచివరి మొగల్‍ చక్రవర్తి బహుద్దూర్‍షా జఫర్‍ పుత్రరత్నమని. ఆంగ్లేయులు తన తండ్రిని బర్మాకు ప్రవాసం పంపగానే తాను తప్పించుకుని ఢిల్లీ గల్లీలలో ఇలా తెగిన పతంగంలా తిరుగు తున్నానని తన విషాద పతనాన్ని తెలియచేసాడు. దాంతో మహారాజ్‍గారి గుండె కరిగి కన్నీరయ్యింది. మనసు చెరువయ్యింది. హోటల్‍కు వచ్చి బ్యాగులో ఉన్నదంతా ఊడ్చి ఆ‘‘పేదరాజు’’ చేతుల్లో పెట్టి ‘‘జహాపనా ఇది తమరి కోసమే దాచి ఉంచాను దయచేసి స్వీకరించండి అని విన్నవించుకున్నాడు. క్షణంలో మళ్లీ రాజుగా మారిన ఆ బికారి వెళ్లిపోగానే ‘‘ఆహా భగవంతుడెంత దయామయడు. ఒకప్పటి ఢిల్లీ చక్రవర్తి కుమారుడికి సహాయం చేసే అపురూప అరుదైన అవకాశాన్ని నాకు ప్రసాదించాడు’’ అని సంబరపడ్డాడు.


మహారాజ్‍ వెంబడి ఢిల్లీ వచ్చిన అతని సహచరుడు, మిత్రుడు నవాబ్‍ మెహదీనవాజ్‍ జంగ్‍ (మెహదీపట్నం ఈయన స్థాపించినదే) ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా సర్వం ఊడ్చి దానం చేసిన సంగతి తెలుసుకుని, తిరుగు ప్రయాణానికి రైలు టిక్కట్లకు కూడా డబ్బులు లేవని గ్రహించి లబోదిబోమని నెత్తినోరు కొట్టుకున్నాడు. ఘనత వహించిన మహారాజులం, ఏం ముఖం పెట్టుకుని ఎవర్ని అప్పు అడుగుతాం’’ అని దిగాలుపడిపోయాడు. చివరికి వెతికి వెతికి ఒకపాత మిత్రుణ్ణి కలిసి అతడిని జమానతుగా పెట్టి అప్పు పుట్టించి రైలు టిక్కెట్లను మాత్రం కొనుక్కుని అనేక ఇక్కట్లతో హైద్రాబాద్‍ చేరారు ఆ ఇద్దరు బికారులు. ఆ రోజులలో హైద్రాబాద్‍ నగరంలో ఒక యాభై సంవత్సరాల పాటు నగర ప్రజలందరూ ‘‘మహారాజ్‍’’ అన్న పదం కేవలం ‘‘మహారాజా కిషన్‍ పర్షాద్‍’’ దివాన్‍ గారికే వర్తిస్తుందని బలంగా విశ్వసించేవారు. అట్లా వారి దృష్టిలో మరో మహారాజ్‍ గారు లేరు. ఉండబోరని వారి ప్రగాఢ నమ్మకం. నగర ప్రజల ప్రేమాభిమానాల్ని దండిగా మూటగట్టుకుని ఆకాశం అవతలి అంచులకు వెళ్లిపోయిన ‘‘ఆ మహారాజు నిజంగా మహారాజే’’.
ఇప్పుడు ఆ దేవుడీ ఏమైంది? ఎట్లుందని అడుగుతున్నారా? నిక్షేపంగా, సలక్షణంగా ఉంది. అందులో ఇపుడు ప్రభుత్వం వారి ‘‘మాతాశిశు ఆరోగ్యం సంక్షేమ దవాఖానా’’ నడుస్తుంది. ఎప్పుడైనా శాలీబండా వెళ్లి ఆ దేవ్‍డీని సందర్శించుకుని ఆ మహారాజ్‍కు మనసులోనే నివాళి అర్పించండి.
(షహర్‍ నామా (హైద్రాబాద్‍ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)


-పరవస్తు లోకేశ్వర్‍, ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *