నాలుగు గొప్ప చోళ దేవాలయాలు


మనదేశంలో విలసిల్లిన మూడు దేవాలయ శైలుల్లో నాగరపద్ధతిలో వింధ్య పర్వతాల నుంచి కృష్ణానది వరకు, ద్రావిడ పద్ధతిలో కృష్ణానది నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలు నిర్మించబడినాయి. క్రీ.శ.4-5 శతాబ్దాల్లో ప్రారంభమైన ఈ దేవాలయ నిర్మాణం తమిళ నాట క్రీ.శ.13-14 శతాబ్దాలకు పతాకస్థాయికి చేరుకొన్నాయి. ముందు ఇటుక, కొయ్యలతో ప్రారంభమై గుహాలయాలు, రాతి ఆలయాలుగా రూపు దిద్దుకొని, రానురాను ఆగమశాస్త్రాల్లో పేర్కొన్న పూజ, పునస్కారాల కోసం, ఆలయం కూడా గర్భాలయ, అర్థ, మహామండపాలకు తోడు అనేక కట్టడాలు చేరి, గోపురాలతో కూడి విశాల ఆలయ సముదాయానికి దారి తీసింది. ఇలా క్రమవికాసం పొందిన ద్రావిడ ఆలయాల్లో 4 గొప్ప చోళ దేవాయాలపై నా ప్రసంగం కొనసాగుతుంది.


ఆలయాల నిర్మాణాన్ని ప్రోత్సహించిన రాజులను తలచుకొంటామేగానీ, అద్భుత కళాన్కెపుణ్యంతో, దేవాలయ వాస్తు, శిల్పాన్ని మన కందించిన శిల్పుల గురించి పట్టించుకోం. ముందుగా నేను, దాక్షిణాత్య దేవాలయాలను నిర్మించిన శిల్పులకు నమస్కరిస్తున్నాను. శిల్పులు, వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం, నాట్యశాస్త్రం, సంగీతం, ప్రతిమా లక్షణం, ప్రతిమామాన శాస్త్రం, గణితం, జ్యామెట్రీ, చిత్రకళ, పురాణాలు, ఆగమాలు తెలిసి ఉండాలి. గురుపరంపర ద్వారా ఇన్ని విద్యలూ నేర్చుకొన్న శిల్పులకు మరోసారి నమస్కరిస్తున్నాను.


పోషకులకు కావలసిన రీతిలో నిర్మించేపుడు, శిల్పులు – స్థపతులు తమ శక్తి యుక్తులు, సౌందర్యాన్ని జోడించి అత్యంత అందంగా ఆలయాలను నిర్మించటంవలన ఒక్కో దేవాలయం, ఒక్కోరకంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.
ఆలయ నిర్మాణాన్ని గురించి చెప్పుకొనేప్పుడు విమానం, గోపురాల మధ్య తేడాతో పాటు గర్భాలయం, అర్థమండపం, మహామండపం, ముఖమండపం, నృత్యమండపం, కళ్యాణ మండపం, సోపాన మండపాల గురించి తెలుసుకోవాలి. గర్భాలయం మీద నిర్మించేదాన్ని విమానమని, ప్రాకారంలో ప్రవేశద్వారం పైన నిర్మించే దాన్ని గోపురమని, ఆలయం ముందు వివిధ కార్యక్రమాల కోసం స్థంభాలతో నిర్మించేదాన్ని మండపం అంటారు.


ఆలయ భాగాలు:
మనిషి పాదాలపై నిలబడిన రూపంలోనే ఆలయాన్ని కూడ, అధిష్ఠానంపైన పాదవర్గం, ప్రస్తరం, కంఠం, శిఖరం, శిఖ (కలశం)లతో నిర్మించటాన్ని ‘దేహోదేవాలయం ప్రోక్తః’ అన్నఉపనిషద్వా క్యానికి నిరూపణ గా చెప్పాలి.


తమిళనాట ఆలయ వాస్తు వికాసం :
సంగమకాలం (క్రీ.శ.5వ శతాబ్ది)లో ప్రారంభమైన ఆలయ నిర్మాణం, పల్లవుల తరువాత తమిళ నాడును పాలించిన చోళుల కాలంలో మునుపెన్నడూ లేనంతగా ఊపందుకొని, సర్వాంగ సహితంగా విశాల ఆవరణ, ప్రాకార, గోపురాలతో విలసిల్లింది.
చోళులకాలం (క్రీ.శ.800-1200)లో నిర్మించిన ఆలయాలు, గ్రాన్కెటు రాతితో, అధిష్ఠానం నుంచి శిఖరం వరకూ, గర్భాలయం నుంచి గోపురం వరకూ ఒక ప్రత్యేక పద్ధతిలో నిర్మించబడినాయి. అధిష్ఠానం, పాదవర్గం, ద్వారాలు, కవులు, మండప స్థంభాలు, విమాన శిఖరాల నిర్మాణంలో అనేక ప్రయోగాలు చేసి అత్యంత రూప లావణ్యాన్ని ఇనుమిడించి నిర్మించబడిన అనేక చోళ దేవాలయాల్లో, నాలుగు దేవాలయాలు మణిమకుటాలుగా వెలుగొందుతూ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి.
రాజరాజేశ్వరం (బృహదీశ్వరా లయం), తంజావూరు, ఐరావతేశ్వరాలయం, దారాసురం, చోళీశ్వరం, గంగైకొండ చోళపురం అనే మూడు చోళదేవాలయాలు, ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకొన్నాయి. ఇవి కాక, త్రిభువనంలోని కంపహరేశ్వరాలయం కూడా చోళదేవాలయ వాస్తు పతాక స్థాయికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వివరాలు:

1. రాజరాజేశ్వరం, తంజావూరు:
అతిపెద్ద శివలింగంతో, అత్యంత ఎత్త్కెన విమానంతో, అత్యంత విశాలంగా, అన్ని హంగులతో నిర్మించటాన ఈ ఆలయాన్ని రాజరాజేశ్వరమని పిలిచినా, తరువాత తంజావూరును పాలించిన మహారాష్ట్రులు ఈ ఆలయాన్ని బృహదీశ్వరాలయమని పిలవటం సబబే. 216 అడుగుల ఎత్తున్న 13 అంతస్తుల ఆలయం, భారతదేశంలోనే ఎత్తైన ఆలయంగా గుర్తించబడిరది.
ద్వారపాలకులు, మహామండపం, నందమండపం, ఒకటేమిటి, ఈ ఆలయంలో అన్నీ పెద్ద పరిమాణంలో తీర్చిదిద్దినవే. అలిందం (లోపల తిరగటానికి వీలుగా) తో కూడిన గర్భాలయం, అటూ ఇటూ ప్రవేశద్వారాలు, మధ్యలో అంతరాళం, మహామండపం, నిత్య మండపం, సోపాన మండపం, నందమండపం, సుబ్రహ్మణ్య, దేవీ ఆలయాలు, కరువారూరు ఆలయం, రెండు ప్రాకారాలు, గోపురాలు, ప్రాకార మండపాలతో, రాజరాజ చోళుని ఆలోచనలకు అద్దం పడుతుంది రాజరాజేశ్వరం. ధ్వజస్థంభ, బలిపీఠాలు కూడ ఆలయ పరిమాణానికి తగ్గట్టుగానే నిర్మించబడినాయి. గర్భాలయం చుట్టూ ప్రదక్షిణా పథం వల్ల ఈ ఆలయాన్ని సాంధార ఆలయ మంటారు. ఇదో ప్రత్యేకత. ఆలయ మొదటి అంతస్థులో, చుట్టూ గల గోడలపై వర్ణచిత్రాలు, 81 నాట్య కరణాలు, ఆనాటి ఆలయ సంప్రదాయ న•త్యమైన భరతనాట్యానికి అద్దం పడుతున్నాయి. రాజరాజ చోలుని రాజ గురువైన కరువారూరు వర్ణచిత్రం కూడా ఇక్కడ లభించింది.
ప్రధానాలయాన్ని రాజరాజ చోళుడు క్రీ.శ.985-1015 మధ్య నిర్మించగా, ఆలయ సముదాయంలోని అమ్మవారి ఆలయాన్ని పాండ్యులు, నంది మండపం, సుబ్రహ్మణ్యాలయాలను నాయక రాజులు, న•త్య మండపం, గణపతి ఆలయాలను మరాఠా రాజులు నిర్మించారు.

2. చోళీశ్వరం, గంగైకొండ చోళపురం
రాజరాజచోళుని కుమారుడ్కెన మొదటి రాజేంద్రచోళుడు, తాను ఉత్తర కోస్తాలో బెంగాల్‍లోని గంగాతీరం వరకు జయించి, గంగనుంచి నీటిని తీసుకు వచ్చి, అందుకు గుర్తుగా ఒక పట్టణాన్ని నిర్మించి దానికి గంగైకొండ చోళపురమని పేరు పెట్టి, తన రాజధానిని తంజావూరు నుంచి అక్కడికి తరలించి, తండ్రిలాగే, తాను కూడా అదే తీరులో ఒక ఆలయాన్ని నిర్మించి, చోళేశ్వరమని పిలిచాడు. ముమ్మూర్తులా, తంజావూరు రాజరాజేశ్వరాలయాన్ని పోలినట్లే, ఈ ఆలయాన్ని రాజేంద్రచోళుడు నిర్మించాడు. రెండు ప్రాకారాలతో ఉన్న ఈ ఆలయంలో, ప్రవేశగోపురం, బలిపీఠం, నంది, మహా మండపం, అర్థ, ముఖ మండపాలు, గర్భాలయం, తెన్‍ కైలాసం, గణపతి, వడ కైలాసం, చండీశ, దుర్గ, సింహ కిన్నెర ఆలయాలతో విలక్షణ వాస్తుకు ఉదాహరణగా గంగై కొండ చోళపురం ఆలయాన్ని చెప్పుకోవచ్చు.

3. ఐరావతేశ్వరం, దారాసురం
రెండోరాజరాజు, తన రాజధానిని దారాసురానికి మార్చి, ప్రాకారం, ప్రాకర మండపంలోపల, గర్భాలయ, అర్థమండప, అంతరాళ (సోపానమండపం) మహామండపం, సభామండపం, గోపురాలతో, ఇతర ఉపాలయాలతో, రధాకారంలో నిర్మించిన ఈ ఆలయం చోళ ఆలయ వాస్తులో ప్రత్యేకతను సంతరించుకొన్నది. చక్రాలతో అలరారుతున్న రథాకార మండపాన్ని రాజగంభీరమండపం అంటారు. చుట్టూ ప్రదక్షిణం చేసి, మండపం ద్వారంలోనికి ప్రవేశించిన వారికి చోళ ఆలయ వాస్తు, శిల్పకళల గొప్పదనం గోచరిస్తుంది. స్థంభాలు, ద్వారాలు, కవుల, అధిష్ఠానం, పాదవర్గంపైన గల శిల్పాలు, 63 నాయన్మార్ల శిల్పాలు, లక్ష్మి, గంగ, అగస్త్య, మురుగ, దక్షిణామూర్తి, భిక్షాటన మూర్తి, శరభేశ్వర శిల్పాలు కనువిందు చేస్తాయి.

4. కంపహరేశ్వరాలయం, త్రిభువనం
కుంభకోణానికి 15 కి.మీ.ల దూరంలో గల త్రిభువనంలో, మూడో కులోత్తుంగుడు నిర్మించిన కంపహరేశ్వరాలయం కూడ పై మూడు దేవాలయల సరసన నిలిచే ఆలయమే. చుట్టూ ఉన్న శిల్పాల్లో సోమసూత్రాన్ని మూడు దశల్లో చూపించటం అద్భుతమే. గర్భాలయం, అర్థమండపం, విశాలమైన మహామండపం, సోపానమండపం, నంది, గోపురం, ప్రాకారం, ఉపాలయాలు చూడముచ్చటగా నిర్మించ బడినాయి. పాండ్యులపై సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించిన ఈ ఆలయ కప్పులపై ఆ దృశ్యాలన్నీ ఉన్నాయి. గర్భాలయంపైన గల శిఖరాన్ని బంగారు మయం చేయటం మరో ప్రత్యేకత.
ఈ విధంగా, తంజావూరు, గంగైకొండ చోళపురం, దారాసురం త్రిభువనంలలో నిర్మించిన ఈ ఆలయాలు, చోళ ఆలయ వాస్తు శిల్ప పరాకాష్ట దశకు మచ్చుతునకలు. ఈ నాలుగు దేవాలయాల్ని చూస్తే చోళులు నిర్మించిన మొత్తం ఆలయాలను చూచినట్లే.

  • శివశంకరబాబు
    తమిళ హెరిటేజ్‍ట్రస్టు
    తెలుగు సేత: డా. ఈమని శివనాగిరెడ్డి, స్థపతి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *