కీ.శే. కేశనకుర్తి వీరభద్రాచారి అనగానే నిజామాబాద్‍లో అన్ని కళల కేంద్రబిందువు అని ప్రతి వారూ స్మరించాల్సిందే! ఆరడుగుల మనిషి – నల్లని కోటు టై-పొడుగాటి పాతకాలం హీరోలు గుర్తుకు వచ్చే ప్యాంటు నడిమ పాపిట, పొడుగాటి వెంట్రుకలు. చేతిలో ఐదారు పుస్తకాలు! టకటక బూట్లు చప్పుడు వరండాలో! అదిగో చారి సార్ వస్తున్నారు! కాలేజీ విద్యార్థులంతా ఆంగ్ల పాఠం కోసం ఎదురు చూస్తున్న క్షణానికి శుభ సూచకం ఆయన ఆగమనం. గిరిరాజ కాలేజీలో వృత్తిరీత్యా ఆంగ్లోపన్యాసకుడిగా ఉన్నా – ఆయన ప్రవృత్తి రీత్యా తెలుగునాట ప్రసిద్ధిపొందారు. ఎక్కడో భీమవరంలో నివసించి ఉద్యోగరీత్య ఇందూరుకు వచ్చి ఈ జిల్లాను సకళ కళామయంగా పూర్ణ చంద్రుడి వెన్నెల వేదికగా తీర్చిదిద్దారు చారి సార్!
ఉషశ్రీ – వీరభద్రాచారిగారు కలిసి రాసిన వేంకటేశ్వర కళ్యాణం అప్పటి కళాశాల విద్యార్థులకు తెలుగు ఉపవాచకమైంది. వేదికపై నాటకమైంది. ఇలాంటి సకళ కళల సమాహారమైన కేశవకుర్తి వీరభద్రాచారిసార్ 14-05-1927 శ్రీకాకుళం జిల్లా ‘కొర్ని’లో కేశనకుర్తి అప్పారావు, వరహాలమ్మ దంపతులకు జన్మించారు. మాతో అప్పుడప్పుడు చెప్పేవారు – 12వ యేటనే అనేక నాటికలు రాసి వేసేవాళ్ళమని! అవి రాతప్రతులే ఐనాయిగాని అచ్చు ప్రతులు కాలేదని చింతించేవారు. 1969 సంక్రాంతి 14న నిజామాబాద్‍లో గొప్ప కవుల వేదిక అవతరించింది. ఈ మకర సంక్రాంతి శుభవేళ ఇందూరులో సాహితీ వికాసం! సరికొత్త ఉదయం! దీనికి అంకురార్పణ వేసింది కేశనకుర్తి వీరభద్రాచారిగారే! ఈ సంస్థ పేరే ‘ఇందూరు భారతి రచయితల సమాఖ్య’.
వీరికి చేదోడు వాదోడుగా సైబ పరంధాములు, అపుకారి సూర్యప్రకాశ్, బద్దూరి మొదలగు యువకిశోరాలు చారిగారిని అనుసరించారు.
ఆయనకు ఆలోచన రావడం మేమందరం అమలుపరచడం జరిగిపోయేవి! ఇందూరు భారతి ఆవిర్భావం తరువాత అనేకులు కలం పట్టి కవులైనారు – కవయిత్రులైనారు! గొప్పవాళ్లను ఆహ్వానించి వారితో ప్రసంగాలు ఇప్పించి యువకులకు ప్రేరణ అందేలా చారి సార్ ప్రణాళిక రచించేవారు.
దాశరథి కృష్ణమాచార్య, బెజవాడ గోపాలరెడ్డి, దేవులపల్లి రామానుజారావు, జయ్య, నండూరి రామకృష్ణమాచార్య, నార్ల చిరంజీవి, వానమామలై వరదాచార్యులు, సి.నా.రె. ఇలాంటి పెద్దలను ఆహ్వానించి ఇందూరు భారతిని సుప్రసిద్ధం చేశారు.
కవిత్వమే కాకుండా గానం నాట్యం కోసం ‘‘సరస్వతీ గానసభ’’ను ప్రారంభించారు. అనేకమంది అమ్మాయిలు ఇంటింటా నాట్యసరస్వతులు, గానకోకిలలూ ఐనారు. సాయంత్రం బాలవిహార్ పిల్లలతో సందడి సందడిగా ఉండేది.
విడివిడిగా అనేక నాటిక సంస్థలు ఎవరికివారే అన్నట్లుగా
ఉండేవారు. వీరభద్రాచారి సలహాల మేరకు అన్ని నాటక సంస్థలు ఒకటై ‘నగరనట సమాఖ్య’గా ఒక్కటైనారు. ఈ సమాఖ్య నేపథ్యంలో చారి సార్ విశాల హృదయం ప్రగతి ఆలోచనలే కారణం.
ఈ సంస్థ ద్వారా అనేక నాటకాల పోటీలు నిర్వహింపజేసి – గొప్ప నటులను ఆహ్వానించి ఇందూరు పేరు తెలుగు నాట సుప్రసిద్ధం చేశారు.
గానసభ ద్వారా శోభానాయుడు, నరసింహాచారి, వసంత, ఈమని శంకరశాస్త్రి, చిట్టిబాబు పర్విన్ సుల్తానా వంటి సుప్రసిద్ధులను ఆహ్వానించి నిజామాబాద్‍ను రాయల యుగంగా మార్చారు.
సాహితీ కళా సంస్థలలోనే కాకుండా సేవాసంస్థలైన లయసైన్స్, లియో మొదలైన క్లబ్బుల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహింపజేసేవారు. యువకులందరికి ఆంగ్లం ఎలా మాట్లాడాలో శిక్షణ సైతం ఇచ్చేవారు.
వేదికపై వ్యాఖ్యానం ఎలా చేయాలో, కవిత్వం ఎలా చదవాలో, వేదిక మంగళాచరణ గీతం నుండి వందన సమర్పణ వరకు ఎట్టి మెలుకువలు ఉపయోగించాలో ఇవన్నీ యువతకు నేర్పించి గొప్ప కవులుగా, నటులుగా, గాయకులుగా తీర్చిదిద్దారు.
అప్పటి సాహిత్య అకాడమిలో దాదాపు తన జీవిత కాలము సభ్యుడిగా ఉండి నిజామాబాద్‍కు ఎనలేని సాహిత్య సాంస్క•తిక సేవలంనందించారు.
తాను ఎన్నో కవితలు పద్యాలు రాసినా అవి అచ్చుకు నోచుకోలేదని, అలాంటి స్థితి యువతకు ఉండకూడదని ఇందూరు భారతి ద్వారా వెలుగులోకి తెచ్చారు. ప్రతి సంవత్సర సావనీర్లను ప్రింటు చేయించారు.
24 గంటలలో దాదాపు అర్ధరాత్రి దాటేవరకు బిజీగా ఉండేవారు. మళ్లీ ఉదయమే ఇంగ్లీషు ట్యూషన్స్ చెప్పేవారు.
అప్పుడప్పుడు కవిత్వం సామాన్య జనానికి అందాలని రాత్రిపూట గ్రామాల్లో కవిసమ్మేళనం నిర్వహించేవారు. కంజర్ల బోర్గాం ముబారక్‍నగర్, మొదలైన గ్రామాల్లో అందరూ భోంచేసి వచ్చిన తరువాత కవిత్వం వేదిక ప్రారంభమయ్యేది. అందరు కవులు సామాన్య జనానికి అర్థమయ్యేలా ఉన్న కవిత్వాన్ని అందించేవారు. ఈ కవి సమ్మేళనం దాదాపు అర్థరాత్రి దాటిపోయేది. ఇలాంటి స్ఫూర్తి కలిగించింది చారి సారే.
ఇంతేగాక పున్నమి వెన్నెల రాత్రుల్లో ఊరి బయట చెరువుకట్ల మీద కవి సమ్మేళనం నిర్వహింపజేసేవారు. బొడ్డెమ, చెరువు – మంచిప్ప చెరువు, అలీసాగర్ మొదలైన చెరువుల వద్దకు పెట్రోమాక్స్లతో వెళ్లేవాళ్లం. దాదాపు 10 గంటల రాత్రి గడిచిపోయేది. కవితా విభావరులు ఇలా అనేకమంది యువకవుల్లో ప్రేరణగా నిల్చిపోయాయి.
చర్చలు, సమావేశాలు, గీహ సమా వేశాలు, కవుల సంకలనాలపై ఉపన్యాసాలు, క్లుప్త గోష్టులు, కవితాపోటీలు, అవార్డులు, పండుగ పూట కవిత్వం వేడుకలు. ఇలా భోజరాజు కాలంలో సాగినట్లే కేశనకుర్తి వీరభద్రాచారి గారి మార్గదర్శకత్వంలో ఇందూరు భారతి సాహితీ శిఖరంగా ఎదిగింది.
1985లో ఆంగ్లోపన్యాసకులుగా పదవీ విరమణ గావించినా ఏనాడు అలసిపోని కళాతపస్విగా తమ సేవలను అందిస్తూ వచ్చారు.
నిరంతర సేవలు అందించడం ఎప్పుడు విరామమెరుగని ట్యూషన్‍లు మొదలైన వాటివలన కేశనకుర్తి వీరభద్రాచారిగారికి శ్వాసకోశాల ఇబ్బంది తలెత్తింది. చికిత్స నిమిత్తం చెన్నైలోని విజయా హాస్పిటల్‍కు వెళుతున్నప్పుడు అందరం చారిగారికి ధైర్యం చెపుతూ పసిపిల్లాడిలా వీడ్కోలు చెప్పాం! కాని చారి సార్ అనారోగ్యం తీవ్రతై అక్కడే 04-06-1986 నాడు కళాకీర్తిశేషులైనారు.
నిజామాబాదులో వారు పరమపదించి ఉంటే కొన్ని కిలోమీటర్ల పర్యంతరం కళాభిమానులు చారి సార్‍కు వీడ్కోలు పలికేవారు. అంత్యక్రియలూ సన్మానప్రాయంగా జరిగేవి. కాని చెన్నైలో కాలధర్మం చెందటంతో వారిని ఇక్కడికి రప్పించే అవకాశం రాలేదు. మా అందరికీ కడచూపుకూడా కరువైంది.
నిజామాబాదును ఇలా సర్వతోకళావేదికగా తీర్చిదిద్దిన ఆ మహామనీషికి అశ్రు అంజలి మాత్రమే ఘటించగలిగారు కళాభిమానులు.
వారు వెళ్లిపోయాకా వారి కవితలు అచ్చుకాకుండా ఉండిపోయినై. మేమంతా వాటిని వారి కుటుంబ సభ్యుల సహకారంతో పెట్టెలు, పుస్తకాలు, ఫైల్లు పాత పత్రికలు అన్నీ అన్వేషించి వారి కవితలను పరిష్కరించి ‘కొత్తదారి’ పేరిట సంకలనాన్ని రూపొందించాం.
దీనికై ముందు మాట దాశరథి కృష్ణమాచార్యులవారు కంటతడిపెడుతూ రాశారు. దాశరథి వారికి చారిసార్‍కు ఉన్న అనుబంధం చాలా గొప్పది. నిజామాబాద్ అన్నా – చారిసార్ అన్నా, ఇందూరు భారతి కవులన్నా దాశరథిగారికి ఎనలేని ఆత్మీయ స్పర్శ.
సంకలనం చారిగారి ప్రెస్ ఐన ‘శ్రీ’ ప్రింటర్స్లోనే అచ్చైంది. ఈ ఆవిష్కరణ వేడుకకు కీ.శే. రావూరి భరద్వాజ విచ్చేసి అనేక గాద్గదిక మాటల మధ్య చారిసార్‍ను స్మరించుకునేలా చేశారు.
ఆవిష్కరణ సభకు కేశనకుర్తి వీరభద్రాచారిగారు స్థాపింపజేసిన అనేక కళానాటక నాట్యసంస్థలు విచ్చేసి వారి స్మృతిగా ‘కొత్తదారి’ వేసుకున్నారు.
ఈనాటికి గిరిరాజ కాలేజీ భవనాన్ని చూసినా, కొండెంగ హనుమాన్ వారున్న పాత ఇల్లు చూసినా, పెద్దబాజర్ రోడ్ చూసినా, మణిక్ భవన్ కళావేదిక చూసినా కేశనకుర్తి వీరభద్రచారిగారే జ్ఞాపకం వస్తారు.
ఈనాడు లబ్దప్రతిష్టులైన అనేక కవులు, నటులు, గాయకులు ప్రతిరోజు ఏదో సందర్భంగా వారి పేరును నాల్కపైకి తెచ్చుకొని స్మరించకుండా ఉండలేరు.
ఎక్కడో భీమవరంలో స్థిరమైనా ఇక్కడ ఇందూరుకు వచ్చి కళాక్షేత్రంగా రూపొందించిన కేశనకుర్తి వీరభద్రాచారిగారు శరీరంతో లేకున్నా – వారి సాహితీ కళా ఆత్మ మా ఎదురుగా ఉన్నట్లే భావిస్తుంటాం.
ఈ రోజు ఇందూరు భారతి ద్వారా మేము నిరంతర సేవలందిస్తున్నమంటే వారి స్ఫూర్తి మాకు కవితా జీవకళ.
నిజామాబాద్ సాహితీ కళాచరిత్రలో వారి పేరు అనేక గ్రంథాల్లో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది.
కళాకారుడికి మరణం నిజంగా లేదని ఇందరి అభిమానమే నేటికి ఋజువు చేసింది. ఇందూరు కళలకు వేసింది కమలాల పూలదారి. వీరు రాసింది సరికొత్త ‘కొత్తదారి’, మాలో నిలిచి ఉండే కారణజన్ములు కేశనకుర్తి వీరభద్రాచారి.
(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
-కందాళై రాఘవాచార్య