సెలయేటి ఒడ్డున కూర్చుని పంట పొలాలకు ప్రవహించే నీటిని గమనించినట్లయితే పాతనీరు వెళుతుంటే, కొత్తనీరు వచ్చిచేరుతూ పంటపొలాలను సస్యశ్యామలం చేస్తూ ఉంటుంది. అదే విధంగా సాంకేతిక రంగంలో కూడా ఏదైనా ఒక కొత్త ఆవిష్కరణ వచ్చినపుడు దాని గురించి ఆలోచించేలోపే మరొక కొత్త ఆవిష్కరణ మనకు అందుబాటులోకి వస్తూ.. మానవాళికి మరింత సుఖాన్ని, సౌఖ్యాన్ని అందిస్తున్నాయనడం ఎంత మాత్రం సత్యదూరం కాదు. ఇక కంప్యూటర్ వచ్చాక మన సమాజం యొక్క తీరుతెన్నులే మారిపోయాయి. గంటలో చేసే పనిని, కంప్యూటర్ క్షణకాలంలో చేసేస్తుండడంతో సమాజం కంప్యూటర్ చుట్టూ పరిభ్రమిస్తోంది. అయితే ప్రతినాణేనికి బొమ్మా, బొరుసూ ఉన్నట్లుగానే ప్రతి కొత్త ఆవిష్కరణ వెనుక కూడా కొన్ని అనుకూలతలు, మరికొన్ని ప్రతికూలతలు ఉంటాయి. కంప్యూటర్ విషయానికే వస్తే కంప్యూటర్‍లో మనం దాచుకొన్న విలువైన సమాచారాన్ని హ్యాకింగ్ పేరుతో తస్కరించడం ఇటీవల పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో హ్యాకింగ్, వైరస్, స్పామ్ లాంటి చికాకుల నుండి కంప్యూటర్ ద్వారా జరిగే వివిధ పక్రియలను సురక్షితంగా నిర్వహించడానికి పరిశోధకులు సరికొత్తగా తీసుకువచ్చిన టెక్నాలజీయే బ్లాక్ చైన్ టెక్నాలజీగా చెప్పవచ్చు. బ్లాక్‍చైన్ టెక్నాలజీ వల్ల కలిగే బహుళ ప్రయోజనాలను మనం కూడా తెలుసుకుందామా
అసలు బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే
అంతర్జాలం ద్వారా కొన్ని సమూహా (బ్లాక్స్)లలో సమాచారాన్ని నమోదుచేసి, ఆ సమూహాలనన్నింటిని ఒక గొలుసుకట్టు (చైన్) విధానంలో కలుపుతూ మనం నమోదు చేసిన సమాచారాన్ని సురక్షితంగా భద్రపరిచేటటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటారు. 1997వ సం।।రంలో యాడం బ్యాక్ అనే సాంకేతిక నిపుణుడు హ్యాష్ క్యాష్ (Hash Cash) అనే ఒక అల్గారిథమ్ (కంప్యూటర్‍కు ఇచ్చే ఆదేశాల సముదాయం) ను గుర్తించాడు. అంతకు మునుపే SHA256 అనే మరో అల్గారిథమ్ ఉండేది. ఈ రెండింటిని కలిపి ‘‘సతోషినకమొటో’’ అనే నిపుణుడు 2008లో ‘‘కన్సెన్సస్’’ అనే మరో అల్గారిథమ్‍ను రూపొందించాడు. ఈ ‘కన్సెన్సస్’’ అనే అల్గారిథమ్ ఆధారంగా బిట్ కాయిన్ అనే సంస్థ క్రిష్టో కరెన్సీ (గుప్త ద్రవ్యం)ని వాడుకలోకి తీసుకు రావడంతో బ్లాక్ చైన్ టెక్నాలజీ విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రత్యేకతలు
బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రత్యేకతల్ని తెలుసుకునే ముందు మన నిజ జీవితంలో జరిగే కొన్ని రోజు వారీ వ్యవహారాలను పరిశీలిద్దాం. మనం మన బ్యాంక్ ఖాతా నుండి మన స్నేహితుడి బ్యాంకు ఖాతాకు డబ్బును పంపాల్సి వచ్చినపుడు మనం బ్యాంక్‍ను వెళ్ళి సంప్రదిస్తే బ్యాంక్ మన ఖాతా నుండి మన స్నేహితుడి ఖాతాకు డబ్బును పంపించి, ఆ లావాదేవీని మన ఖాతాలో మనం డబ్బును పంపినట్లుగా, మన స్నేహితుడు డబ్బును స్వీకరించినట్లుగా ఇరువురి ఖాతాలలో నమోదుచేస్తుంది. ఈ ఖాతాలను ఆయా వ్యక్తులకు సంబంధించిన ఖాతా పద్దు (Private Ledger) గా వ్యవహరిస్తారు. ఈ ఖాతాలలో జరిగే మార్పులు మనకు మాత్రమే తెలుస్తాయి. అయితే ఈ ఖాతాలలో మనకు తెలియకుండా వేరెవరైనా తమకు అనుకూలమైన మార్పులు కూడా చేయవచ్చు. దానివల్ల మనం నష్టపోయే అవకాశం ఉంది. అయితే బ్లాక్ చైన్ టెక్నాలజీ విధానంలో ఎలాంటి మార్పులు చేర్పులకు అవకాశం ఉండదు. మన సమాచారమంతా సురక్షితంగా ఉంటుంది. కంప్యూటర్ ఎక్సెల్ షీట్‍లోని కాలమ్స్ (నిలువు వరుసలు) రో (అడ్డు వరుసలు) లలో సమాచారమంతా నమోదు చేసి, ఆ సమాచారాన్ని వివిధ కంప్యూటర్లకు పంపిన విధంగానే, బ్లాక్ చైన్ టెక్నాలజీలో వివిధ బ్లాకులలో సమాచారాన్ని నమోదు చేసి వాటిని గొలుసుకట్టు విధానంలో కలిపి వాటిని కంప్యూటర్లకు అనుసంధానిస్తారు. ఒక బ్లాకులో నమోదు చేసిన సమాచారం మిగిలిన బ్లాకులలో కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ విధానంలో నమోదైన సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉండే ఖాతా పద్దు (Public Ledger)గా చెప్పవచ్చు. అందువల్ల ఒక బ్లాకులోని సమాచారాన్ని మార్చడానికి ప్రయత్నిస్తే, అది మిగిలిన బ్లాకులలోని వారందరికీ తెలిసిపోతుంది. కాబట్టి మొదట్లో పేర్కొన్నట్లుగా మన ఖాతా నుండి మరొకరికి డబ్బు పంపాలంటే బ్యాంకు మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. కానీ బ్లాక్ చైన్ విధానంలో ఎలాంటి మధ్యవర్తి ప్రమేయం ఉండదు. బ్యాంక్‍లో మన ఖాతా నుండి మరొకరి ఖాతాకు డబ్బు పంపడానికి కొద్ది సమయం నిరీక్షించాల్సి ఉంటుంది. బ్లాక్‍చైన్ విధానంలో ఎలాంటి నిరీక్షణా అవసరం లేదు. బ్యాంకులో మన ఖాతా నుండి మరొకరి ఖాతాకు డబ్బును పంపినందుకుగానూ బ్యాంకు మన నుండి కొంత నగదును రుసుముగా వసూలు చేస్తుంది. బ్లాక్ చైన్ విధానంలో ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయడం జరగదు. అదే విధంగా ఈ విధానంలో బ్యాంక్, ఫోన్ పే, గూగుల్ పే లలో లాగా ఎలాంటి కేంద్రీకృత నియంత్రణా ఉండదు. సమాచారమంతా వికేంద్రీకృత విధానంలో ఉంటుంది.
బ్లాక్ చైన్ టెక్నాలజీ పనిచేయు విధానం
బ్లాక్ టెక్నాలజీ విధానంలో మొదట బ్లాకులను రూపొందిస్తారు. వాటిలో మొదటి బ్లాకును జెనిసిస్ బ్లాక్ అంటారు. ఈ విధానంలో ప్రతి బ్లాకు, తరువాత బ్లాకు తో ఒక గొలుసుకట్టు విధానంలో కలపబడి ఉంటుంది. ప్రతి బ్లాకుకు ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య ఉంటుంది. దానినే హ్యాష్ కోడ్ అంటారు. దీనిని మన చేతి వేళ్ళకు ఉన్న వేలి ముద్రలతో పోల్చవచ్చు. మన చేతి వేలి ముద్రలు ఒకరితో మరొకరివి సరిపోల నట్టుగానే, బ్లాక్ చైన్ విధానంలో కూడా ప్రతి బ్లాకుకు వేర్వేరు హ్యాష్‍లు ఉంటాయి. ఆ విధంగా ప్రతి బ్లాకులోనూ
1.సమాచారం 2. హ్యాష్ కోడ్ 3. ముందు బ్లాకుకు సంబంధించిన హ్యాష్‍కోడ్ నిక్షిప్తమై ఉంటాయి. బ్లాక్ చైన్ విధానంలో అనుసంధానం చేయబడిన కంప్యూటర్లను ‘‘నోడ్‍లు’’ అని వ్యవహరిస్తారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ విధానంలో ఏదైనా ఒక లావాదేవి (Transaction) జరిగినపుడు ఆ లావాదేవి నిర్ధారణ కావాలంటే ఒకటికంటే ఎక్కువ నోడ్‍లు ధృవీకరించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ లావాదేవీ పూర్తిఅయినట్లుగా చెప్పవచ్చు. ఈ విధంగా బ్లాక్ చైన్ విధానంలో జరిగే ప్రతి లావాదేవీని ధృవీకరించే వారిని ‘‘మైనర్స్’’ అని వ్యవహరిస్తారు.
బ్లాక్ చైన్ విధానంలో కొత్త బ్లాకులలో సమాచారాన్ని నమోదు చేసి వాటిని ముందు బ్లాకులకు జతచేయవచ్చు, కానీ బ్లాకులలోని సమాచారాన్ని మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలుకాదు. ఒకవేళ మార్చాలని ప్రయత్నిస్తే ఏ బ్లాకులో ఉన్న సమాచారాన్ని మార్చాలని ప్రయత్నిస్తామో, ఆ బ్లాకు యొక్క హ్యాష్ కోడ్ వెంటనే మారిపోతుంది. ఎప్పుడైతే హ్యాష్ కోడ్ మారిపోతుందో, తరువాత బ్లాకులో ఇదివరకే పాత హ్యాష్ కోడ్ ఉంటుంది. అప్పుడు కొత్తగా వచ్చిన హ్యాష్ కోడ్, ముందున్న హ్యాష్ కోడ్‍తో సరిపోలదు. అప్పుడు ఏ బ్లాకులో సమాచారాన్ని మార్చాలని ప్రయత్నిస్తామో, అక్కడి నుండి దాని ముందున్న బ్లాకులకు సంబంధం పూర్తిగా తెగిపోతుంది. ఒకవేళ ప్రతిబ్లాకు కు హ్యాష్ కోడ్ తయారు చేసి, దాని ముందున్న బ్లాక్ హ్యాష్ కోడ్ మార్చి, ఆ బ్లాకులో డేటా నమోదు చేసి తద్వారా మిగిలిన బ్లాకుల్లోని డేటాని మార్చాలని ప్రయత్నించినా, ఒక బ్లాకుకు పై మూడు రకాల మార్పులను చేసేందుకు కనీసం 10ని।।ల సమయం పడుతుంది. దీనినే ‘‘ప్రూఫ్ ఆఫ్ వర్క్’’ అంటారు. కొన్ని సం।।రాల పాటు లావాదేవీలు జరిగినపుడు వేల సంఖ్యలో బ్లాకులు ఉంటాయి. వేల సంఖ్యలో నున్న బ్లాకులలోని సమాచారాన్ని మార్చడం అసంభవం అని చెప్పవచ్చు. అందులోనూ అందరికీ అనుసంధానమై ఉంటుంధి కాబట్టి ఏ మాత్రం మార్పు జరిగినా అది మిగిలిన వారికి తెలిసి పోతుంది.
బ్లాక్ చైన్ టెక్నాలజీ అనువర్తనాలు
బ్లాక్ చైన్ టెక్నాలజీకి తక్కువ సమయంలో పని పూర్తి చేయడం, విశ్వసనీయత, ఎలాంటి మార్పులు చేయుటకు వీలుకాని లావాదేవీలు, మోసపూరిత చర్యలను నిరోధించడం, పూర్తిస్థాయి భద్రత, పారదర్శకత మొ।।లగు అనేక విశిష్టతలున్నాయి. అందువల్ల బ్లాక్ చైన్ సాంకేతికతను మార్కెట్లలో బిల్లింగ్, మానిటరింగ్ డేటా బదిలీ చేయడానికి, ప్రభుత్వ సేవలకు సంబంధించి ఓటరు నమోదు పక్రియలో నకిలీ ఓట్లను నిరోధించడానికి, వివిధ రకాల పత్రాలను డిజిటలైజ్ చేయడానికి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) విధానంలో వ్యవసాయానికి సంబంధించిన డ్రోన్ సాంకేతికతను నిర్వహించడానికి, స్వయంచోదిత కార్లను నడపడంలోనూ, వ్యక్తిగత రోబోట్లను పని చేయించడానికి, ఆరోగ్య రంగంలో వ్యక్తుల సమాచార నిధిని భద్రపరచడానికి, డేటాను నిర్వహించడానికి, సైన్స్కు సంబంధించి సూపర్ కంప్యూటర్, క్లౌడ్ అనాలసిస్ చేయడానికి బ్లాక్ చైన్ సాంకేతికతను విరివిగా వినియోగిస్తారు. అంతే కాకుండా బ్లాక్ టెక్నాలజీ సహకారంతో బిట్ కాయిన్, ఎథీరియమ్, రిపుల్, వైట్ కాయిన్ వంటి క్రిస్టో కరెన్సీ (గుప్తధనం)లను ఎక్కువగా వాడుకలోకి తెస్తున్నారు. ముందే చెప్పుకున్నట్లు ఈ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించినట్లయితే కంప్యూటర్లను హ్యాకింగ్, వైరస్‍ను చొప్పించడం, స్పామ్ లాంటి సైబర్ దాడుల నుండి రక్షించవచ్చు. 2016 సం।।లో దుబాయ్ సిటీ బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను మరియు పెట్టుబడిదారులను అనుసంధానించి దుబాయ్ నగరంలో అనేక రకాలైన పరిశ్రమలను ప్రారంభించి, అభివృద్ధిని వేగవంతం చేయడం ద్వారా దుబాయ్ ని ‘‘ప్రపంచంలోనే అత్యంత సంతోష నగరంగా’’ తీర్చిదిద్దారు. అదే విధంగా జనవరి 2017లో ఐక్యరాజ్యసమితి (యు.ఎన్.ఓ) యొక్క ప్రపంచ ఆహార కార్యక్రమం వారు మానవతా సహాయ నిధిని (Humanitarian Aid) ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించి పాకిస్తాన్ సింధ్ ప్రాంతంలోని అత్యంత వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలను ప్రగతి పథంలోకి తీసుకొచ్చారు. బ్లాక్ చైన్ విధానంలో నమోదైన లబ్దిదారులు డబ్బు, ఆహార పదార్థాలతో పాటు ఇతర అన్ని రకాల లావాదేవీలను సురక్షిత విధానంలో పారదర్శకంగా నిర్వహించుకొని పేదరిక విషవలయం నుండి బయటపడ్డారని యు.ఎన్.ఓ. తెలిపింది.
పరిమితులు
బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల బహుళ ప్రయోజనాలతో పాటు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి.
బ్లాక్ చైన్ విధానంలో జరిగే లావాదేవీలను కంప్యూటర్లు ధృవీకరించడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల దాని విద్యుత్తు వినియోగం కూడా పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ అంతర్జాతీయంగా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు బ్లాక్ టెక్నాలజీకి అవసరమైన ఇంధనం సమకూర్చుకోవడం పెనుసవాలుగా మారనుంది.
ప్రతి లావాదేవీ వేగం కూడా ఇక్కడ సమస్యగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గొలుసుకట్టు విధానంలో ఉన్న బ్లాక్‍లన్నిటిలో వచ్చిన సమాచారం ధ్రువీకరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇందుకు సమయం ఎక్కువ తీసుకోవడం వల్ల లావాదేవీల యొక్క వేగం తగ్గే అవకాశం ఉంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ విధానంలో నగదు లావాదేవీలు నిర్వహించేటపుడు ప్రతి లావాదేవీకి ఒక రహస్య గుర్తింపు సంఖ్య జారీ చేయబడుతుంది. ఈ రహస్య గుర్తింపు సంఖ్యను జాగ్రత్తగా భద్రపరచాలి. ప్రమాదవశాత్తు జరిగే సంఘటనలవల్ల ఈ గుర్తింపు సంఖ్యను మనం కోల్పోయినట్లయితే దాని ద్వారా జరిగే నగదు లావాదేవీలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మరోవైపు డిమాండ్ – సప్లై సూత్రాన్ని అనుసరించి బ్లాక్ చైన్ టెక్నాలజీ విధానంలో లావాదేవీల సంఖ్య పెరిగే కొద్దీ కంప్యూటర్ల నిర్వహణకయ్యే ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉందని సంబంధిత నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
చివరిగా
చిన్న చిన్న లోపాలను సవరిస్తే, బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల నేటి సమాజానికి బహుళ ప్రయోజనాలు ఒనగూరే అవకాశం ఉంది. భద్రత, పారదర్శకతల సమ్మిళితమైన బ్లాక్ చైన్ టెక్నాలజీ విధానం ద్వారా మానవాళికి మహోపకారం జరగాలని, తద్వారా సమాజం ప్రగతి పథంలో కొత్త పుంతలు తొక్కాలని మనమూ ఆశిద్దాం.
- పుట్టా పెద్ద ఓబులేసు,
ఎ : 9550290047