‘వ్యర్థ’ వివేకంతో నిర్మల నదులు

‘డౌన్‍ టు ఎర్త్’ సంపాదకురాలు, ‘సెంటర్‍ ఫర్‍ సైన్స్ అండ్‍ ఎన్విరాన్‍మెంట్‍’ డైరెక్టర్‍ జనరల్‍ సునీతా నారాయణ్‍ అందించిన వ్యాసంమన నదులు అంతకంతకూ కాలుష్య కాసారాలు అవుతున్నాయి. వాటిని స్వచ్ఛ వాహినులుగా ఉంచేందుకు చాలా సంవత్సరాల క్రితమే అత్యంత శ్రద్ధాసక్తులతో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే అవి అంతగా ఫలించడం లేదు. కారణమేమిటి? మన పట్టణాలు, నగరాలలోని చెత్తా చెదారం, మురుగు జలాలను నదులలోకి యథేచ్ఛగా వదలడమే కాదూ? అసలే వాతావరణ మార్పు మన ధాత్రికి ఎనలేని ముప్పుగా పరిణమించిన సందర్భమిది. నదులను నిర్మలంగా ఉంచుకోవడమనేది మన ముందున్న పెద్ద సవాళ్లలో ఒకటి. వర్షపాతం తీరుతెన్నులను చూద్దామా అంటే వాటిలో స్థిరత్వం లేదు. పైగా అవి సదా అపసవ్యంగా
ఉంటున్నాయి. ఫలితంగా మనకు సమీప భవిష్యత్తులోనే నీటి కొరత తీవ్ర స్థాయిలో దాపురించనున్నది. ఇది ఖాయం. నదులు, సరస్సులు, చెరువులు మొదలైన జల వనరులలో వర్షజలాలను సంరక్షించుకోవడమే కాదు, ఒక్క వాన చినుకు కూడా కలుషితమై పోకుండా పటిష్ఠ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే నీటి ఎద్దడిని మనం అధిగమించగలం.


నదుల సంరక్షణకు సంబంధించిన మన ప్రస్తుత విధానాలు గతంలో మన వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా రూపొందడం ఒక శుభ విషయం. ‘ప్రతి కుటుంబానికి సొంత టాయ్‍ లెట్‍ (మలమూత్రాల విసర్జన శాల) ఉండి తీరాలి. ఉండడమేకాదు, అది మానవ విసర్జనాలను భద్రంగా వదుల్చుకునే సౌలభ్యాన్ని సమకూరుస్తున్న వ్యవస్థలతో అనుసంధానమయి ఉండాలి. ఇలా జరిగినప్పుడు మాత్రమే పరిసరాలు కాలుష్యమవ్వవు. ఆరోగ్య సమస్యలు తలెత్తవు’. ‘క్లీన్‍ గంగ’ జాతీయ కార్యక్రమం ప్రస్తావిత అనివార్యతలను గుర్తించడం ఎంతైనా ముదావహం. ఈ వాస్తవాల వెలుగులో మన ఎజెండా ఎలా ఉండాలి? కేవలం ప్రతి కుటుంబానికి సొంత టాయ్‍లెట్‍ సదుపాయం సమకూర్చడం మాత్రమే కాదు, నిరుపేదలు సైతం భరించగల పారిశుధ్య వ్యవస్థలను అభివవృద్ధి పరచాలి. అభివృద్ధి అనేది అందరికీ అందుబాటులో ఉండి, సమ్మిళితమైనది అయినప్పుడు మాత్రమే అది సుస్థిరంగా ఉండగలుగుతుంది. ఇటువంటి సుస్థిర అభివృద్ధిని సాధించడమే మన ముందున్న ఒక నిజమైన సవాల్‍.


సమస్యను భిన్న రీతుల్లో, మరింత ప్రభావశీలంగా పరిష్కరించు కునేందుకు ఒక అవకాశాన్ని ఈ సవాల్‍ మనకు కల్పిస్తున్నది. ఇప్పటి వరకు మనం అనుసరించిన పట్టణ పారిశుధ్య నమూనా చాలా వ్యయభరితమైనది వివిధ నగరాలలో మానవ విసర్జనాలు పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి తీవ్ర సమస్యలనుసృష్టిస్తున్నాయి. వాటిని సరైన విధంగా వదుల్చుకోవడం జరగడం లేదు. టాయ్‍లెట్‍ సదుపాయాలనే పారిశుధ్య వసతులుగా పొరపడడం వల్లే ఇది జరుగుతోంది. వాస్తవమేమిటంటే టాయ్‍లెట్స్ అనేవి విసర్జనాలను తీసుకునే పాత్రలు మాత్రమే. మనం నీటిని పోసినప్పుడు ఆ విసర్జనాలు మోరీ (మురుగుకాలువ)లోకి ప్రవహిస్తాయి. సీవేజ్‍ ట్రీట్‍మెంట్‍ ప్లాంట్‍ (ఎస్‍టిపి)తో అది అనుసంధానమై ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఆ ఎస్‍టిపి సైతం పనిచేస్తుండవచ్చు లేదా పనిచేయకపోవచ్చు. దీన్ని బట్టి మానవ విసర్జనాలు, గృహ కార్యకలాపాల సంబంధిత వ్యర్థ పదార్థాలను భద్రంగా వదిలివేయడం లేదని అర్థమవుతుంది. వాటిని అలానే సమీప నది లేదా సరస్సు లేదా చెరువులోకి వదిలివేయడం జరుగుతోంది. అవి కలుషితమవుతున్నాయి. పెరిగిన కాలుష్యంతో వ్యాధులు ముసురుతున్నాయి.


అయితే, నేను ఇప్పటికే చెప్పినట్టు ఈ సమస్య మనకొక అవకాశం. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ- ఇది చాలా వ్యయంతో కూడుకున్నది. మరింత స్పష్టంగా చెప్పాలంటే మన పురపాలక సంఘాల ఆర్థిక తాహతుకు మించినది- అభివృద్ధి పరచుకునేంతవరకు వేచి ఉండే బదులు ఆ విసర్జనాలను మరో మార్గంలో వదుల్చుకోవచ్చు. చాలా గృహాలలో సెప్టిక్‍ ట్యాంక్‍లు ఉన్నాయి. అవి నిండిన తరువాత మల పంకాన్ని శుద్ధి పక్రియకు పంపించవచ్చు. తద్వారా ఆ విసర్జన పదార్థాన్ని భద్రంగా పునః ఉపయోగించుకోవచ్చు. మానవ విసర్జనాలలో బలవర్థక పోషక పదార్థాలు ఉంటాయి. వాటిని మనం నిర్లక్ష్యంగా జల వనరులలోకి వదిలివేయడం వల్ల నత్రజని వలయం విచ్ఛిన్నమవుతోంది. మానవ విసర్జనాలను మనం మళ్లీ భూమి మీదకు తెచ్చి ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. తద్వారా నత్రజని వలయాన్ని యథాతథంగా కాపాడుకోవచ్చు. ఆ మల పంకాన్ని ఉపచారం చేసిన తరువాత సేంద్రియ ఎరువుగా ఉపయోగించుకోవచ్చు.


ప్రాచీన రోమ్‍, Edo (ఈ ప్రాచీన నగరంనుంచే ఆధునిక టోక్యో ఉద్భవించి, అభివృద్ధి చెందింది)ల నుంచి మనం నేర్చుకోవాలి. సుదూర ప్రాంతాల నుంచి తమ ఆవాస స్థలాలకు నీటిని తీసుకువచ్చేందుకు రోమన్లు భారీ యాక్వెడక్ట్ (ఒక నీటి కాలువపై నుండి నీటిని పారించటానికి కట్టబడిన కృత్రిమ కాలువ)లు నిర్మించారు. రోమన్లు చాలా పటిష్ఠమైన నీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి పరచుకున్నారని పలువురు ప్రశంసించడం కద్దు. అయితే ఆ యాక్వెడక్ట్లు రోమన్ల ప్రతిభా పాటవాలకు కాకుండా పర్యావరణ దుర్నినిర్వహణకు తార్కాణాలుగా చెప్పి తీరాలి. టైబర్‍ నదిపై రోమ్‍ నగరాన్ని నిర్మించారు. కనుక ఎటువంటి యాక్వెడక్ట్ అవసరం లేదు. రోమ్‍ నగర వ్యర్థ పదార్థాలు అన్నిటినీ టైబర్‍లోకి వదిలివేయడం జరిగేది. తత్కారణంగా నది కలుషితమైపోయి ఆ నదీ జలాలు తాగడానికి పనికి వచ్చేవికావు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి యాక్వెడక్ట్ల ద్వారా నీటిని తమ ఆవాసప్రాంతాలకు పారించుకునే వారు. ఫలితంగా నీటి నిర్గమన మార్గాలకు పెద్దగా ఆస్కారముండేది కాదు. రోమన్‍ సంపన్నులు బానిసల ద్వారా ఆ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకునేవారు. సంప్రదాయ జపనీస్‍ సమాజం ప్రాచీన రోమన్ల ఆనవాయితీకి పూర్తి భిన్నంగా వ్యవహరించేది. జపనీయులు ఎట్టి పరిస్థితులలోనూ వ్యర్థాలను నదులలోకి వదిలివేసే వారు కాదు. ఆ వ్యర్థాలను ఎరువులుగా చేసుకుని వ్యవసాయంలో ఉపయోగించుకు నేవారు. ప్రాచీన జపాన్‍లో ప్రజలందరికీ నీటి సరఫరా సమానస్థాయిలో జరిగేది. నీటికి, సంస్కృతికి సన్నిహిత సంబంధమున్నది. ఈ దృష్ట్యా నీటి కొరత అనేది కేవలం అనావృష్టి ఫలితం కాదు. అది సమాజ వైఫల్యమే. తమ నీటి వనరులను సంరక్షించుకుని, సరైన విధంగా ఉపయోగించుకోవడంలో వైఫల్యమే నీటి ఎద్దడికి కారణమవుతోంది. వ్యర్థాలకు సంబంధించి సువ్యవస్థిత నిర్వహణ పద్ధతిని రూపొందించుకోనంతవరకు మన నదులను కాలుష్యాల బారి నుంచి కాపాడుకోలేమన్నది మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయం. నీటి అవసరాల విషయంలో భద్రమైన భవిష్యత్తును నిర్మించుకోవడమనేది మన జల విజ్ఞత పైనే కాదు వ్యర్థాలను పునరుపయోగించుకునే వివేకంపైన కూడా ఆధారపడి ఉన్నది.

  • సునీతా నారాయణ్‍
    ‘డౌన్‍ టు ఎర్త్’ సంపాదకురాలు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *