అద్వితీయం బుద్ధవనం!


బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు ప్రతి అంశాన్ని కళ్లకు కట్టేలా శిల్పాలు, అష్టాంగ మార్గానికి గుర్తుగా ఎనిమిది పార్కులు, ఆసియా ఖండంలోనే సిమెంట్‍తో నిర్మించిన అతి పెద్ద స్తూపం, శ్రీలంక వాసులు అందజేసిన 27 అడుగుల బుద్ధుడి ప్రతిమ.. ఇలా ఎన్నో విశేషాలతో రూపుదిద్దుకున్న బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభోత్స వానికి సర్వం సిద్ధమైంది. అలాంటి మహానుభావుడి జీవిత చరిత్రను కళ్లకు కడుతూ నిర్మించిన అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రం పర్యాట కులకు కనువిందు చేయనుంది.


అలనాడు బౌద్ధుల ఆరాధ్య ప్రాంతంగా విలసిల్లి…
ఆచార్య నాగార్జునుడి బోధనలతో పునీతమైన కృష్ణానదీ తీరప్రాంతం మళ్లీ నాటి ప్రాభవాన్ని అందుకోబోతోంది. ప్రపంచ ప్రసిద్ధ తక్షశిల, బుద్ధగయల మాదిరిగా నాగార్జునసాగర్‍ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధిచేయాలన్న లక్ష్యం ఇన్నాళ్లకి నెరవేరింది. బుద్ధుడి పుట్టుక నుంచి మహాపరినిర్యాణం వరకు సమస్త చరిత్రా ఒకేచోట ఉండేలా… ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ స్తూపాల నమూనాలన్నీ చూపేలా… 274 ఎకరాల సువిశాల క్షేత్రంలో అద్వితీయంగా రూపుదిద్దుకుంది… బుద్ధవనం!


బుద్ధుడు గతించిన రెండు శతాబ్దాల తర్వాత జరిగిందది…
అప్పటికే తథాగతుడు ప్రవచించిన బౌద్ధ సిద్ధాంతం చిలవలు పలవలైంది. బుద్ధుడి బోధనలని ఏ సంఘానికా సంఘం కొత్తగా నిర్వచించుకోవడం మొదలుపెట్టాయి. వాటిల్లో హీనయాన సిద్ధాంతానిదే ఆధిక్యం. ‘బుద్ధుడు మహిమలున్న దేవుడు కాదు… ఓ మామూలు మనిషే. హిందూమతంలా భక్తివద్దు… ఆయన సిద్ధాంతాలని మాత్రం పాటిస్తే చాలు’ అన్నది దాని సారాంశం. దానికి వ్యతిరేకంగా ‘ఆ సిద్ధాంతాలు మేధావులకి బావుండొచ్చు. మరి సామాన్యుల సంగతేమిటీ… వాళ్లకి దేవుడు కావాలి… వాళ్ల కష్టసుఖాలు వినే రూపం ఒకటి ఉండాలి!’ అని నినదించింది.
మహాయాన సిద్ధాంతం. దాన్ని తన ‘శూన్యవాదం’తో ప్రపంచానికి గట్టిగా చాటినవాడు ఆచార్య నాగార్జునుడు. గమ్మత్తుగా, బుద్ధుడు దేవుడేనన్న వాదనే ప్రపంచానికి నచ్చింది. నాగార్జునుడున్న నందికొండకి దక్షిణాసియా నలుమూలల నుంచి ఎంతో మంది శిష్యుల రాక మొదలైంది. ఇటు చైనా నుంచి అటు ఆఫ్ఘనిస్థాన్‍దాకా వాళ్లే బౌద్ధాన్ని తీసుకెళ్లారు. మనదేశంలో బౌద్ధం క్షీణించాక… ఒకప్పుడు నాగార్జునుడి ఆరామమైన నందికొండ తన ప్రాబల్యం కోల్పోయి మట్టిదిబ్బగా మిగిలింది.
నాగార్జునసాగర్‍ నిర్మాణంతో ఇందులోని చాలాభాగం నీట మునిగింది. మిగిలి ఉన్న వాటిని భద్రపరిచేందుకు నాగార్జునకొండలో ఓ మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు. దాంతోపాటూ కృష్ణానది ఎడమగట్టున ఇక్కడి నాగార్జునుడి గుర్తుల్ని శాశ్వతం చేసేలా ఓ ‘బుద్ధవనం’ నిర్మించాలన్న ఆలోచనకి 2004లో బీజం పడింది. నాటి ఉమ్మడి రాష్ట్రంలోని ఆంధప్రదేశ్‍ పర్యటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రభుత్వం ఇక్కడ 274 ఎకరాలు కేటాయించి దీనికి శంకుస్థాపన చేసింది. కానీ ప్రభుత్వాలు మారడంతో… ఈ ప్రాజెక్టు నత్తనడక నడిచింది. 2015లో తెలంగాణ ఆవిర్భావంతో కేసీఆర్‍ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి మళ్ళీ ఊపిరిపోసింది.


అడుగడుగునా శిల్పకళా సంపద..
ఈ ప్రాజెక్టు కోసం మయన్మార్‍, థాయ్‍లాండ్‍, శ్రీలంకల నుంచి బౌద్ధ శిల్పుల్ని రప్పించి అడుగడుగునా కళాకృతులతో తీర్చిదిద్దారు. బౌద్ధ భిక్షువులకు స్వాగతం పలకడానికి పదెకరాలలో ప్రవేశద్వారాన్ని నిర్మించారు. సుమారు 25 వేల గ్రానైట్‍ రాళ్లతో నడకదారిని నిర్మించారు. ద్వారపాలకులుగా ఏనుగుల విగ్రహాలనూ దమ్మచక్రాన్నీ రూపుదిద్దారు. బుద్ధుడు ప్రవచించిన అష్టాంగ మార్గాలకి గుర్తుగా ఇక్కడున్న 274 ఎకరాలని ఎనిమిది వనాలుగా తీర్చిదిద్దుతున్నారు. వాటిల్లో ఐదు వనాలు- స్తూపవనం, జాతకవనం, బుద్ధచరిత వనం, ధ్యానవనం, మహాస్తూపం పనులు 90 ఎకరాల్లో పూర్తయిపోయాయి. దిగువ కృష్ణలోయ ప్రాంతాల్లో ఉన్న బౌద్ధమత విశేషాలని చాటే వనం, తెలుగు రాష్ట్రాల్లోని బౌద్ధమత ప్రదేశాల నమూనాలను పూర్తి వివరాలతో చూపే ప్రత్యేక వనం, ఆచార్య నాగార్జున అంతర్జాతీయ ఉన్నత విద్యా పరిశోధనా కేంద్రాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు తప్పకుండా చూసి తీరాల్సిన బౌద్ధ క్షేత్రాల్లో ఒకటిగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.


మహా స్తూపం
ఆసియాలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపంగా దీన్ని రూపొందించారు. ఐదున్నర ఎకరాల్లో 21 మీటర్ల ఎత్తూ, 42 మీటర్ల వ్యాసంలో పెద్ద గుమ్మటాకారంలో నిర్మించారు. ఈ గుమ్మటం(డోమ్‍) కింద- అంటే స్తూపం మొదటి అంతస్తులో- ఏర్పాటుచేసిన ధ్యానకేంద్రం ఓ వాస్తు అద్భుతం. ఒకేసారి వెయ్యిమంది ధ్యానించేలా దీన్ని ఏర్పాటుచేశారు. పైన నీలాల నింగిని తలపించేలా తామరపువ్వు ఆకారాన్ని సృష్టించారు. ఈ ధ్యానమందిరానికి కేంద్రకంగా బంగారు రంగులో ఎనిమిది ముఖాలతో బుద్ధుణ్ణి ఏర్పాటుచేశారు. ఈ మహాస్తూపం కింది భాగాన పురావస్తు ప్రదర్శనశాల ఉంది. నాగార్జున సాగర్‍ నిర్మాణమప్పుడు మునిగిపోగా మిగిలిన శిధిలాల్లో కొన్ని నాగార్జునకొండ మ్యూజియానికి పోతే, మరికొన్నింటిని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇందులో రాతియుగం నాటి పనిముట్ల నుంచి బౌద్ధం దేదీప్యమానంగా వెలిగిన క్రీ.శ.5-12వ శతాబ్దాల దాకా ఉన్న వస్తువుల్ని ప్రదర్శనకు ఉంచారు. దీంతోపాటూ ఇక్కడ అతిపెద్ద కాన్ఫరెన్స్ హాలునీ ఏర్పాటుచేశారు. ఈ స్తూపం చుట్టూ ప్రముఖ శిల్పి హర్షవర్థన్‍ అద్భుతమైన శిల్పాకృతుల్ని రూపొందించారు.


విశ్వ స్తూపాల వనం
ఈ వనానికొస్తే ప్రపంచంలోని ప్రాచీన బౌద్ధకేంద్రాలకి చెందిన స్తూపాలన్నింటినీ చూసినట్టే. చైనా, మయన్మార్‍, థాయ్‍లాండ్‍, టిబెట్‍, నేపాల్‍, పాకిస్తాన్‍, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్‍ దేశాల్లో ఉన్న స్తూపాల నమూనాలు ఇక్కడుంటాయి. అవి కాకుండా మనదేశంలోని కార్లే, అజంతా, సాంచి, సారనాథ్‍, మాణిక్యంలోని స్తూపాలనూ చూడొచ్చు.
జాతక వనం
మహాయాన బౌద్ధంలో జాతక కథలదీ కీలకపాత్ర. బుద్ధుడు సిద్ధార్థుడిగా అవతరించకముందు వివిధ జన్మలెత్తి వాటి ద్వారా జ్ఞానాన్ని పొందాడని తెలిపే వాటినే జాతక కథలుగా చెబుతారు. బౌద్ధ సాహిత్యంలో ఆ సందర్భాలని చెప్పే 540 జాతక కథలున్నాయి. అందులోని 40 కథలని ఎంచుకుని భారతీయ కుడ్యచిత్రాల శైలిలో తీర్చిదిద్దారు. 11 ఎకరాల్లో అద్భుతంగా నిర్మించిన వనం ఇది.


బుద్ధచరిత వనం
దీన్ని 7.16 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో బుద్ధుడి పుట్టుక, దేశ సంచారం, జ్ఞానోదయం, తొలి సందేశం, నిర్యాణం వరకు తెలియజేసే కంచు విగ్రహాలను ఏర్పాటు చేశారు. శ్రీలంక కానుకగా ఇచ్చిన దమ్మగంట ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.
ధ్యాన వనం
బుద్ధవనం సందర్శనకు వచ్చే బౌద్ధ భిక్షువులు ధ్యానం చేసుకోవడానికి పదకొండు ఎకరాలలో దీనిని నిర్మించారు. ఇక్కడ 27 అడుగుల అవుకానా బుద్ధ విగ్రహం ఉంది. ఇది కూడా శ్రీలంక ప్రభుత్వం ద్వారా ఏర్పాటైంది. దీని నిర్మాణం కోసం ఆ దేశం నుంచి ప్రత్యేకంగా ఓ శిల్పి వచ్చి… ఏడాదిపాటు ఈ విగ్రహాన్ని రూపొందించి వెళ్లారు.
ఇంకా..
ఈ 274 ఎకరాల స్థలంలో అష్టవనాలే కాకుండా… ప్రపంచస్థాయి బౌద్ధ విశ్వ విద్యాలయం, బౌద్ధ భిక్షువుల శిక్షణా కేంద్రం, బౌద్ధ పాఠశాల, అంతర్జాతీయ సమావేశ మందిరం పనులకి ప్రతిపాదనలూ సిద్ధమయ్యాయి. వీటన్నింటికీ దాదాపు మూడువందల కోట్ల రూపాయల నిధులు అవసరమని అంచనా వేస్తున్నారు.

  • దక్కన్‍న్యూస్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *