తెలంగాణ ప్రభుత్వం – పర్యావరణ పరిరక్షణ చర్యలు


తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా దక్షిణాదిన దక్కన్‍ పీఠభూమిలో అర్ధశుష్క ప్రాంతంలో నెలకొని వుంది. శీతోష్ణస్థితి పరంగా ప్రధానంగా వేడిగా మరియు పొడి వాతావరణం ఉంటుంది. సాలీనా వర్షపాతం సగటు 905.3 మి.మీ. తెలంగాణకు ఉత్తరాన -మహారాష్ట్ర, ఛత్తీస్‍ఘర్‍, పశ్చిమాన – కర్ణాటక, తూర్పు మరియు దక్షిణాన ఆంధప్రదేశ్‍ రాష్ట్రాలు సరిహద్దులుగా వున్నాయి. ప్రధాన నదులైన గోదావరి మరియు కృష్ణాలు రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో 79 శాతం, కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో 68.5 శాతం ప్రాంతం తెలంగాణలోనే వుంది. పర్యావరణ పరిరక్షణకు కీలకమైన అడవులు – గాలి మరియు నీటి పరిమాణాన్ని, నాణ్యతను ప్రభావితం చేయడంతో పాటు భూసారాన్ని పెంపొందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వన్య ప్రాణుల సంరక్షణకు, భూతాపం నుంచి ఉపశమనం కలిగించ డంలోనూ దోహదం చేస్తున్నాయి. గ్రామీణ ప్రజల జీవనోపాధికి ఇతోధికంగా తోడ్పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1,14,865 చ.కి. మీటర్లు రాష్ట్రంలో సామాజిక అడవులతో కలిపి అటవీ విస్తీర్ణం 29,242 చ.కి.మీ. అంటే రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 21.02 శాతం కాగా దేశంలోని అటవీ విస్తీర్ణంలో 3.04 శాతం. ఇక ఖనిజ వనరుల పరంగా చూస్తే తెలంగాణలో ఖనిజ వనరులు పుష్కలంగా వున్నాయి. దేశంలోనున్న మొత్తం బొగ్గు నిక్షేపాల్లో 20 శాతం తెలంగాణలోనే ఉన్నాయి. సిమెంటు పరిశ్రమకు ప్రధాన ముడి పదార్థమైన సున్నపురాయి నిలువలు గణనీయంగా వున్నాయి. నిర్మాణరంగంలో, అలంకరణకు వాడే గ్రానైట్‍ నిలువలతో ఇనుప ఖనిజం నిక్షేపాలు పేర్కొనదగిన స్థాయిలో వుండి తెలంగాణ రాష్ట్రం ఖనిజాదాయ సాధనలో దక్షిణాదిలో అగ్రస్థానంలో వుంది.

తెలంగాణ రాష్ట్రం బల్క్డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, ఆగోప్రాసెసింగ్‍, ఇంజనీరింగ్‍, టెక్స్టైల్స్, రత్నాలు – ఆభరణాలు, రక్షణ, బయోటెక్నాలజీ మొదలైన రంగాలకు చెందిన అనేక భారీ తయారీ పరిశ్రమలకు నిలయంగా ఉంది. తెలంగాణను విదేశీ మరియు దేశీయ పెట్టుబడుదారులకు ఒక ఆకర్షణీయమైన కేంద్రంగా మలిచేందుకు అనువైన పారిశ్రామిక వాతావరణాన్ని కల్పించేందుకు ఆవశ్యకమైన, నాణ్యమైన మౌలిక వసతులను కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని (TS-IPASS) రూపొందించి అమలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం జలవనరుల విషయంలో సైతం ఏమాత్రం తీసిపోని స్థాయిలో వుంది. కురిసే ప్రతి వాన నీటి బొట్టును సద్వినియోగం చేసుకునే విధంగా రూపొందించిన అద్భుతమైన సాగునీటి సాంకేతిక పరిజ్ఞానం తెలంగాణలో కాకతీయుల కాలంలోనే అమలు చేయబడింది. రాష్ట్రంలో సుస్థిరమైన కరవు నివారణ చర్యల పునరుద్ధరణకు ఒక మంచి నమూనాగా దీన్ని పేర్కొనవచ్చు. జీవ వైవిధ్య పరిరక్షణా కేంద్రాలుగా కూడా ఇవి భాసిల్లు తున్నాయి. రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలో 455 టి.ఎం.సి.ల సామర్థ్యంతో 30.54 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే 27 భారీ మధ్య తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో 89.15 టి.ఎం.సి.ల సామర్థ్యంతో 21.494 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే 23 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవిగాక పాకాల, రామప్ప, లక్నవరం, ఘనపూర్‍ చెరువుల క్రింది 11,975 హెక్టార్ల ఆయకట్టు వుంది. ఇతర 5000 పెద్ద చెరువులున్నాయి. చిన్ననీటి పారుదల ప్రాజెక్టుల క్రింద 35,974 చెరువులున్నాయి. వీటి క్రింద 18.75 లక్షల హెక్టార్ల ఆయకట్టు వుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం ప్రకృతి ప్రసాదించిన అపారమైన సహజ వనరులతో తులతూగుతూ వుంది. అదే సమయంలో పారిశ్రామిక రంగంలోనూ పురోగతి దిశగా ముందుకెళుతుంది. అభివృద్ధి – పర్యావరణం అనేవి ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేసే అంశాలు కాబట్టి – పర్యావరణ పరిరక్షణతో కూడిన సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ‘‘బంగారు తెలంగాణ’’, ‘‘హరిత తెలంగాణ’’ సాధన దిశగా వడివడిగా పరుగులు తీస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం పలు క్రియాశీలక చర్యలను, పథకాలను అమలు చేస్తోంది. వాటిని వివరంగా పరిశీలిద్దాం.


మిషన్‍ కాకతీయ :
కొన్ని వందల ఏళ్ల నుంచి తెలంగాణలో సాగునీటికి ప్రధాన వనరులు చెరువులే. భౌగోళికంగా తెలంగాణ స్థలాకృతి చెరువుల నిర్మాణానికి అత్యంత అనుకూలంగా వుండటంతో ఈ ప్రాంతాన్ని పాలించిన కాకతీయులు, కుతుబ్‍షాహీలు, ఆసఫ్‍జాహీలు చెరువుల నిర్మాణానికి పెద్ద పీట వేశారు. చెరువుల స్థలాల్లో, దేవాలయాల్లో లభించిన అనేక శిలాశాసనాలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 46,531 చిన్న తరహా సాగు నీటి వనరులున్నాయి. వీటి ద్వారా 10.17 లక్షల ఎకరాలకు సాగు నీటి వసతి కల్పించబడుతోంది. అయితే చాలా కాలంగా రాష్ట్రంలో సరైన నిర్వహణ లేక పోవడం, పూడిక పేరుకు పోవడంతో అత్యధిక శాతం చెరువులు నిరుపయోగంగానే మారాయి. ఉపరితల జలవనరులైన చెరువులు – కుంచించుకుపోవడం, ఋతుపవనాల వైఫల్యంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో భూగర్భజలాలపై ఒత్తిడి నానాటికీ తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత తెలంగాణ ప్రభుత్వం కాకతీయ ప్రభువుల స్ఫూర్తితో చేపట్టిన చెరువుల పరిరక్షణ కార్యక్రమానికి ‘‘మిషన్‍ కాకతీయ’’ పేరుతో శ్రీకారం చుట్టింది. ఈ బృహత్తర కార్యక్రమంలో – పూడిక తీత, పూడికతీత మట్టిని సేంద్రియ ఎరువుల క్రింద వ్యవసాయ క్షేత్రాలకు తరలించడం, చెరువులకు ఫీడర్‍ ఛానళ్లను పునరుద్ధరించడం, చెరువు కట్టలు, తూములకు మరమ్తత్తులు చేయడం. అవసరమైన చోట, సాధ్యమైన చోట్లలో పూర్తిస్థాయి నీటి మట్టం పరిమాణాన్ని / సామర్థ్యాన్ని పెంచడం మొదలైన అంశాలు ఇమిడి ఉన్నాయి. 2014-15 సంవత్సరం నుంచి మొదలైన ఈ కార్యక్రమం లక్ష్యం ఏటా 9000 పై చిలుకు చెరువులను పునరుద్ధరించడం.


‘‘మిషన్‍ కాకతీయ’’ కార్యక్రమం మూలంగా సాగునీటి సదుపాయాలను విస్తరించడం ద్వారా అదనపు ఆయకట్టుకు సేద్యం కల్పించడం సాధ్యమవుతుంది. మత్స్యపరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. ఇతర జీవ సంపద పెంపొందించబడుతుంది. చెరువులపై ఆధారపడిన కుటుంబాలకు సాంఘిక భద్రత, ఆర్థిక పరిపుష్టి చేకూరుతుంది. భూగర్భజల మట్టాలు పెరుగుతాయి. ఫలితంగా బోరుబావుల క్రింద సాగయ్యే విస్తీర్ణం పెరగడమే గాక, జలమట్టాలు పైకి ఎగబాకడం వల్ల విద్యుత్తు ఆదాకూడా అవుతుంది. జీవవైవిధ్యం పరిరక్షించబడుతుంది. తద్వారా పర్యావరణ సమత్యులత మెరుగవుతుంది.


తెలంగాణ హరితహారం :
రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవుల విస్తీర్ణాన్ని ఇప్పుడున్న 25.16 శాతం నుంచి 33 శాతానికి పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘‘తెలంగాణకు హరితహారం’’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంతరించి పోతున్న అడవులను పునరుద్ధరించడం, స్మగ్లింగ్‍, ఆక్రమణలు, అగ్ని ప్రమాదాలు, పశువుల మేత బారి నుండి అడవులను రక్షించడం, వాటర్‍ షెడ్‍ విధానం ద్వారా అడవుల్లో, అడవులకు వెలుపల తేమశాతాన్ని పెంచడం అనే బహుముఖ విధానాల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలన్నదే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘‘తెలంగాణకు హరితహారాన్ని’’ చేపట్టింది. అంతేకాకుండా అటవీ ప్రాంతాలకు వెలుపల బహుళ లేన్ల రహదారుల వెంబడి, నదులు, కాలువ గట్టుల మీద, బీడువారిన కొండల మీద, చెరువు కట్టల మీద, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలలో, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో, జనావాసాల్లో, కమ్యూనిటీ భూములలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ప్రభుత్వం సామాజిక అడవుల పెంపకాన్ని ప్రోత్సహించింది. ప్రజలందరినీ భాగస్వాములను చేసింది. ‘‘హరితహారంలో’’ భాగంగా 2014-15, 2015-16, 2016-17 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం. కాగా వీటిలో 130 కోట్ల మొక్కలను నోటిఫైడ్‍ అటవీ ప్రాంతాలకు వెలుపల నాటాలన్నది లక్ష్యం. హైదరాబాద్‍ మహానగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (హెచ్‍.ఎమ్‍.డి.ఏ) పరిధిలో 10 కోట్ల మొక్కలు, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో 120 కోట్లు మొక్కలు నాటాలని నిర్ణయించి గత మూడేళ్లుగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఉద్యమస్థాయిలో నిర్వహిస్తున్నది. ‘వానలు కురవాలన్నా కోతులు వాపస్‍ పోవాలన్నా మొక్కలు నాటాలి’’ అనే నినాదంతో ప్రభుత్వం హరితహారం కార్యక్రమంపై ప్రజల్లో చైతన్యం పెంపొందించే దిశగా కృషి చేస్తోంది. హరితహారం కార్యక్రమం క్రింద నర్సరీలు, మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించేందుకు ప్రభుత్వం ‘‘మన ఊరు – మన ప్రణాళిక’’ కార్యక్రమాన్ని రూపొందించింది. అటవీ ప్రాంతం లోపల మరో 100 మొక్కలను కాపాడేందుకు, జీవజాతుల మనుగడను పెంపొందించేందుకు కృషి చేయడం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన ‘‘హరితహారం’’ దాదాపు 90 శాతం వరకు విజయవంతమైంది. నేటి మొక్కలే రేపటికి మహా వృక్షాలవుతాయన్నది వాస్తవం. ఈ కార్యక్రమం భూమిపై హరిత మండలాన్ని సృష్టించవచ్చు. జీవవైవిధ్యాన్ని సంరక్షించడానికి వీలవుతుంది. పర్యావరణ సమతాస్థితిని కాపాడవచ్చు. అడవులనే నమ్ముకుని జీవనం గడుపుతున్న వారికి సుస్థిర ఉపాధిని కల్పించవచ్చు. అడవులు, పచ్చదనం వుంటే వర్షాలు కూడా బాగా కురుస్తాయి. దాదాపు 10 మిలియన్‍ టన్నుల వరకు విడుదలయ్యే కర్బన ఉద్గారాలను నియంత్రించవచ్చు. ఇవన్నీ కూడా పర్యావరణ పరిరక్షణకు పాటుపడే చర్యలే.


వన్యప్రాణులు, జీవవైవిధ్య సంరక్షణ :
తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైన మొక్కలు, పక్షుల జాతులు, పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయి. రాష్ట్రంలో 2939 రకాల మొక్కల జాతులు, 365 పక్షుల జాతులు, 103 క్షీరదాల జాతులు, 28 రకాల సరీసృపాలు, భారీ సంఖ్యలో అకశేరుకాల జాతులు ఉన్నాయి. ఇటువంటి జీవవైవిధ్యాన్ని సంరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం 12 రక్షిత ప్రాంతాలను ప్రకటించింది. ఇందులో 9 వన్యప్రాణి సంరక్షణా ప్రాంతాలు కాగా 3 జాతీయ పార్కులు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం వీటి విస్తీర్ణం 5692.48 చదరపు కి.మీ. కాగా మొత్తం అడవీ విస్తీర్ణంలో ఇవి 19.73 శాతం మేర విస్తరించి ఉన్నాయి. రక్షిత ప్రాంతాల నెట్‍వర్క్లో అంతరించి పోయే జాతుల జాబితాలో వున్న బురద మొసళ్లు మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్నాయి. శివారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఒక ముఖ్యమైన చిత్తడి ప్రాంతం.


తెలంగాణ రాష్ట్రంలో రెండు పులుల సంరక్షణ ప్రాంతాలున్నాయి. ఒకటి మహబూబ్‍నగర్‍ – నల్గొండ జిల్లాల మధ్య విస్తరించి ఉన్న నల్లమల పర్వత శ్రేణుల్లో వున్న అమ్రాబాద్‍ టైగర్‍ రిజర్వ్ కాగా, రెండోది ఆదిలాబాద్‍ జిల్లాలో వున్న కవ్వాల్‍ టైగర్‍ రిజర్వు. మహారాష్ట్రలోని తాడోబా అంధేరి టైగర్‍ రిజర్వ్కు, ఛత్తీస్‍ఘడ్‍లోని ఇంద్రావతి టైగర్‍ రిజర్వ్లకు ఇది కొనసాగింపు. ఈ ప్రాంతమంతటా పులులు అటు మహారాష్ట్ర, ఛత్తీస్‍ఘడ్‍, కవ్వాల్‍లో సంచరిస్తూ ఉంటాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‍నగర్‍ డివిజన్‍ల ద్వారా ఈ మూడు టైగర్‍ రిజర్వులను అనుసంధానం చేయడం ద్వారా అంతరించి పోతున్న పులుల జాతులను సంరక్షించుకునే వీలుంది.
తెలంగాణ ప్రభుత్వం – రాష్ట్రంలోని జీవవైవిధ్యాన్ని సంరక్షించడం, సక్రమంగా వినియోగించుకోవడం, జీవవనరులను న్యాయబద్ధంగా విస్తరింపచేయడమే లక్ష్యంగా ‘‘తెలంగాణా జీవవైవిధ్య మండలి’’ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రతిసంవత్సరం మే 22న జీవవైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. జీవవైవిధ్యం, దాని ప్రభావాలను గూర్చి ప్రజల్లో అవగాహనను కల్పించేందుకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ ఒక బయోడైవర్సిటీ బోర్డును ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. మానవజాతి మనుగడకు జీవవైవిధ్యం ఎంతో అవసరం. దీని ద్వారా అమూల్యమైన సహజ వనరులు సమకూరుతాయి. సహజవనరులు మానవుల అవసరాలను తీర్చడమే కాకుండా మానవుని జీవన ప్రమాణాలను పెంపొందింపచేస్తాయి. జీవ వైవిధ్యం ప్రకృతిలోని సమతులస్థితిని కాపాడటంలో దోహదం చేస్తుంది. అనేక రకాలైన వృక్షజాతులు, జంతు జాతులు, సూక్ష్మజీవులు పరిసరాలను పరిశుభ్రం చేస్తాయి. ఆకుపచ్చని మొక్కలు వాతావరణంలోనిCo2ను గ్రహించి, ప్రాణవాయువును విడుదల చేస్తాయి. తద్వారా వాతావరణంలోని వాయువుల నిష్పత్తిని స్థిరంగా వుంచడానికి మొక్కలు సహాయం చేస్తాయి. సూక్ష్మ జీవులు వృక్ష, జంతు సంబంధిత దేహాలను, మల మూత్రాది విసర్జక పదార్థాలను విచ్ఛిన్నం కావించి పరిసరాలను శుభ్రపరుస్తాయి. అనేక రకాల ఫల, వృక్ష జాతులు, పక్షులు, జంతువులు ప్రకృతికి అందాలను అద్దుతాయి. జీవ వైవిధ్యం ప్రకృతి రమణీయతను రెట్టింపు చేస్తుంది. ప్రజల విజ్ఞాన, వినోద, విహారాలకు నేడు ఉదాన్యవనాలు, సరస్సులు, అభయారణ్యాలు, పర్వతాలు నెలవులైనాయి. ఈ విధంగా జీవ వైవిధ్యం మానవజాతికి చేసే మేలు ఘనతరమైనది కాబట్టి దాన్ని పరిరక్షించు కోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వాలదే కాదు, ప్రతి పౌరునిది కూడా.


పర్యావరణహితంగా పారిశ్రామికాభివృద్ధి
తెలంగాణలో పరిశ్రమల రంగం వృద్ధి శరవేగంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 14 రంగాలను కీలకరంగాలుగా గుర్తించింది. లైఫ్‍ సైన్సెస్‍, ఐటి-హార్డ్వేర్‍, ప్రెసిసన్‍ ఇంజనీరింగ్‍ (ఏవియేషన్‍, ఏరోస్పేస్‍, రక్షణ మొ।।వి), ఆహారశుద్ధి, పౌష్టికాహార ఉత్పత్తులు, ఆటోమొబైల్‍, రవాణా వాహనాలు, ఆటో కాంపోనెంట్స్, ట్రాక్టర్లు, వ్యవసాయం సామగ్రి, టెక్స్టైల్స్, అప్పారెల్స్, తోలు ఉత్పత్తులు, కృత్రిమ పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులు, ప్లాస్టిక్‍లు, పాలిమర్లు, కెమికల్స్, పెట్రో కెమికల్స్, గాజు మరియు పింగాణీ, ఎఫ్‍.ఎం.సి.జి, గృహోపకరణాలు, ఇంజనీరింగ్‍, క్యాపిటల్‍ గూడ్స్, రత్నాలు – ఆభరణాలు, వ్యర్థాల నిర్వహణ, గ్రీన్‍ టెక్నాలజీ, పునరుద్ధరణ ఇంధన వనరులు. సోలార్‍ పార్కులు, ఖనిజాధారిత మరియు కలప ఆధారిత పరిశ్రమలు, రవాణా / లాజిస్టిక్‍ హబ్‍ / ఇన్‍లాండ్‍ పోర్ట్ / కంటెయినర్‍ డిపో మొదలైన రంగాలు కీలకమైనవిగా గుర్తించిన ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనలో ప్రోత్సాహకాలను ప్రకటించింది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన పలు రకాల లైసెన్సులు, క్లియరెన్స్లు, సర్టిఫికెట్‍ల జారీకి అవసరమైన దరఖాస్తులను మరింత వేగంగా ప్రాసెస్‍ చేయడానికి ఉద్దేశించి TS-IPASSను ప్రవేశపెట్టడం జరిగింది.
ఒకవైపు పారిశ్రామిక రంగం విస్తరిస్తున్న కొద్దీ పర్యావరణ పరిరక్షణకు చర్యలు ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకతను అనుసరించి ప్రభుత్వం పలు పర్యావరణ పరిమితులను, నిబంధనలను పాటించే విధంగా పరిశ్రమలకు లైసెన్సుల జారీలో షరతులను విధించింది. పరిశ్రమలు చేపట్టాల్సిన పర్యావరణ పరిరక్షణ చర్యలను పర్యవేక్షించడానికి, అమలు జరిగేలా చూడటానికి రాష్ట్ర స్థాయిలో కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా స్థాయిల్లో కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. నీటి కాలుష్య నివారణ, నియంత్రణపై కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తోంది. పరిశ్రమలను తనిఖీ చేసి, పారిశ్రామిక విసర్జితాలను విశ్లేషించి నివేదికలు రూపొందిస్తుంది. పారిశ్రామిక విసర్జితాలను నిరపాయకారకంగా మార్చి, పునర్వినియోగానికి తీసుకు రావడంలో పరిశ్రమల యాజమాన్యాలకు తగిన సూచనలు ఇస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులు, సంస్థలు, పరిశ్రమలపై చట్టరీత్యా శిక్షలు జారీ చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ చర్యల క్రింద పరిశ్రమలు తమకు కేటాయించిన స్థలంలో నిర్ణీత విస్తీర్ణాన్ని ‘‘గ్రీన్‍ బెల్ట్’’ (హరితమండలం) అభివృద్ధికోసం వినియోగించాలి. విధిగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలి. హానికర రసాయనాలు, వ్యర్థాల విడుదలలో కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలు, నిబంధనలను పాటించాలి. నీటి, గాలి కాలుష్య నియంత్రణ కోసం నిర్దేశిత ప్రమాణాలను పాటించాలి. గనులు, కంకర మిల్లులు వాయుకాలుష్య నివారణ చర్యలను చేపట్టాలి. ఖనిజ రవాణా చేస్తున్న వాహనాలు నడిచే దారులపై దుమ్ము లేవకుండా జాగ్రత్తలు పాటించాలి. 5 హెక్టార్ల లోపు విస్తీర్ణం కలిగిన క్వారీ లీజులు కూడా విధిగా పర్యావరణ అనుమతులు పొంది తీరాలనే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం విధించింది. ఈ విధంగా పారిశ్రామికాభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా చర్యలు తీసుకుంటూ సుస్థిరాభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది.


పర్యావరణహిత గనుల త్రవ్వకం
తెలంగాణ రాష్ట్రం గనుల రంగంలో స్థిరమైన వృద్ధిరేటుతో దూసుకెళుతోంది. దేశంలోనే నేడు గనుల రంగం ప్రగతి ఛోదకంగా పరిగణింపబడుతోంది. తెలంగాణా రాష్ట్రంలో అపారమైన ఖనిజ వనరులున్నాయి. ఖనిజాధార పరిశ్రమలకు పుష్కలమైన అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 21 ప్రాస్పెక్టింగ్‍ లైసెన్సులు, భారీతరహా ఖనిజాలకు సంబంధించి 135 మైనింగ్‍ లీజులు, చిన్న తరహా ఖనిజాలకు సంబంధించి 3154 క్వారీ లీజులు ఉన్నాయి. మైనింగ్‍ లీజులు 18507.64 హెక్టార్ల విస్తీర్ణంలోనూ, క్వారీ లీజులు 77053.95 హెక్టార్ల విస్తీర్ణంలోనూ విస్తరించి వున్నాయి. ప్రాస్పెక్టింగ్‍ లైసెన్సులు 5045.69 హెక్టార్ల విస్తీర్ణంలో వున్నాయి. ఖనిజాధార పరిశ్రమ విషయానికి వస్తే ప్రభుత్వ, ప్రైవేటురంగంలో భారీ, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించబడ్డాయి. సిమెంటు, స్టీలు, స్పాంజ్‍ ఐరన్‍, ఫెర్రో అల్లాయ్స్, గాజు, సెరామిక్స్, రిఫ్రాక్టరీస్‍, రసాయనాలు, గ్రానైట్‍, నాపరాళ్ల కోత, పాలిషింగ్‍ యూనిట్‍లు, పలుగురాయి పల్వరైజింగ్‍ యూనిట్‍లు, క్రషర్స్, ఇటుకల తయారీ తదితర పరిశ్రమలు ఖనిజాధార పరిశ్రమలుగా ఉన్నాయి.


విస్తరిస్తున్న ఖనిజాధార పరిశ్రమల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ఖనిజాధార పరిశ్రమల స్థాపనకు పర్యావరణ అనుమతులు, సి.ఎఫ్‍.ఓ, మరియు సి.ఎఫ్‍.ఇ లను తప్పనిసరి చేసింది. ఖనిజాల త్రవ్వకాన్ని ప్రారంభించాలన్నా, మైనింగ్‍/క్వారీ లీజులు పొందాలన్నా దరఖాస్తు దారులు విధిగా రాష్ట్రస్థాయి / జిల్లాస్థాయిలోని పర్యావరణ ప్రభావ మదింపు అధారిటీలచే పర్యావరణ అనుమతులు పొందాలి. పర్యావరణ అనుమతి పొందాలంటే ముందుగా గనులు – భూగర్భశాఖ ఆమోదించిన మైనింగ్‍ ప్లాన్‍ తప్పనిసరి. దీనిలో పర్యావరణ పరిరక్షణకు లీజుదారు చేపట్టు చర్యలపై బేస్‍లైన్‍ సమాచారం వుంది. గాలి, నీటి కాలుష్య నియంత్రణలను చేపట్టాలి. బఫర్‍జోన్‍లో మొక్కలు నాటి గ్రీన్‍బెల్ట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. అదే విధంగా ఖనిజాన్ని త్రవ్వితీసిన తర్వాత క్వారీ/మైన్‍ గుంతలను ఊరికే వదిలేయకుండా పునర్వినియోగించుకోవడానికి ప్రతిపాదనలు సమర్పించాలి. పూడ్చివేసి తిరిగి మొక్కలు నాటడం, సేద్యానికి వినియోగించవచ్చు. జలాశయాలుగా, కొలనులు, నీటి గుంటలుగా వినియోగించవచ్చు. వ్యర్థ రహిత ఖనిజాల త్రవ్వకాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.


నూతన ఇసుక విధానం :
వాగులు, వంకలు, నదీ గర్భాల్లో విచక్షణారహితంగా ఇసుక త్రవ్వడాన్ని నియంత్రించడం, భూగర్భజలాలను పరిరక్షించడం, మధ్యదళారుల ప్రమేయం లేకుండా సరసమైన ధరలకే ప్రజలకు ఇసుకను సరఫరా చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలోని ఇసుక నిక్షేపాల వెలికితీతకు రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థయైన ఖనిజాభివృద్ధి సంస్థకు (టి.ఎస్‍.ఎం.డి.సి) బాధ్యతలను కట్టబెట్టింది. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను దృష్టిలో వుంచుకుని నదీ ఇసుకకు ప్రత్యామ్నాయంగా రాతి ఇసుక తయారీని ప్రోత్సమించడం కోసం క్రషర్‍యూనిట్‍ దారులకు రాయితీలు, లోన్‍ సదుపాయం, క్వారీలీజుల మంజూరులో ప్రాధాన్యం కల్పించడంతో పాటు క్రషర్‍లకు పరిశ్రమహోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తన ఇసుక విధానంలో ప్రకటించింది. అంతేగాకుండా ప్రభుత్వ సివిల్‍ పనుల్లో 50 శాతానికి అవసరమైన ఇసుకలో రాతి ఇసుకనే తప్పనిసరిగా వినియోగించాలని నిబంధనలను రూపొందించింది. ప్రస్తుతం రాజధాని హైదరాబాద్‍లోని నిర్మాణరంగానికి అవసరమైన ఇసుకలో 30 శాతం రాతి ఇసుకనే వినియోగిస్తున్నాయి. దీని ద్వారా నదీ / సాధారణ ఇసుక వినియోగింపై ఒత్తిడి తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసినట్లవుతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అనేక విధాలుగా చర్యలు తీసుకుంటూ ఉంది.


ఇతర చర్యలు :
రోజు రోజుకూ పెరిగిపోతున్న వాహనాలు, వాటి కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ప్రజారవాణాను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రజారవాణా – ఆర్‍.టి.సి, సబర్బన్‍ రైళ్లు, ఎమ్‍.ఎమ్‍.టి.ఎస్‍. వ్యవస్థలను మెరుగుపరిచి, ప్రజలను ప్రైవేటు వాహనాలను వినియోగించడానికి బదులుగా ప్రజారవాణావైపునకు మళ్లేలా అవగాహన కల్పించాల్సిన అవసరం వుంది. హైదరాబాద్‍లో మోటారు వాహనాల కర్బన ఉద్గారాల మూలంగా వాయుకాలుష్యం మితిమీరిపోతుంది. గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా, కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయి కాలుష్యం పెచ్చుమీరుతోంది. దీన్ని నివారించడానికే ప్రభుత్వం ‘‘హైదరాబాద్‍ మెట్రో రైల్‍’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా ప్రారంభించింది. పూర్తిస్థాయిలో హైదరాబాద్‍లో మెట్రోరైల్‍ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్‍ కష్టాలతో పాటు కాలుష్య ఉద్గారాలకు అడ్డుకట్టపడినట్లే. పర్యావరణం, పరిసరాల శుభ్రత కోసం ప్రభుత్వం చేపడుతున్న మరో కార్యక్రమం ‘స్వచ్ఛభారత్‍’, ‘స్వచ్ఛ తెలంగాణ’. అదేవిధంగా ప్రజలందరికీ సురక్షిత త్రాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘మిషన్‍ భగీరథ’ పనులను ముమ్మరం చేస్తోంది.


అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన పరంగా దేశంగా శరవేగంగా పురోగతి సాధిస్తున్న తరుణంలో ఏ జాతైనా, అభివృద్ధి చెందాలంటే పారిశ్రామిక పురోగతి అవసరమే. అదే సమయంలో పర్యావరణాన్ని పరిరక్షించుకోవడమూ అంతే అవసరం. అందుబాటులో వున్న సహజ ప్రకృతి వనరులను విచక్షణాయుతంగా వినియోగించుకుం టూ, పర్యావరణానుకూలమైన, సమగ్ర ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతో సుస్థిరాభివృద్ధికి బాటలు వేయాలి. అప్పుడే బంగారు తెలంగాణ, హరిత తెలంగాణ కల సాకారమవుతుంది. నూతన రాష్ట్రావతరణకు సార్థకత చేకూరుతుంది.


-డా. జి.వి.ఎల్‍. విజయ్‍కుమార్‍
(అసిస్టెంట్‍ జియాలజిస్ట్ – గనులు & భూగర్భశాఖ)
ఎ : 9849110279

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *