మన చేనేతకు పునర్వైభవం! ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవం


‘రాట్నంపై నేసిన ప్రతి దారంలోనూ నేను భగవంతుణ్ని చూశాను’ – మహాత్మా గాంధీ
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన భారతీయ చేనేత రంగం నేడు ప్రాభవం కోల్పోయింది. చేనేత రంగానికి పునర్వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో ఏటా ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు ఘనమైన చరిత్రే ఉంది. అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రలోనూ వేలాది కుటుంబాలు చేనేతపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పోచంపల్లి, ఉప్పాడ, మంగళగిరి, ధర్మవరం చీరలకు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చక్కటి గుర్తింపు ఉంది. ఢిల్లీ, హైదరాబాద్‍, కోల్‍కత్తా, చెన్నై, బెంగుళూరు, ఇండోర్‍ ప్రాంతాలతోపాటు అమెరికా, జర్మనీ, సింగపూర్‍ తదితర దేశాలకు సైతం మన చేనేత కార్మికులు రూపొందించిన వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. దేశం మొత్తం మీద ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాల్లో దాదాపు 14 శాతం వాటా తెలంగాణాదే కావడం విశేషం.


ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ చేనేత దినోత్సవం గురించి ప్రస్తావిస్తూ… దుస్తుల అవసరాల్లో 5 శాతం ఖాదీ, చేనేత వస్త్రాలు వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చేనేత వస్త్ర పరిశ్రమకు సహాకారం అందిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రమే మారిపోతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
చిన్న చేపను పెద్ద చేప మింగినట్లుగా.. చేనేత మగ్గాలను మరమగ్గాలు (పవర్‍లూమ్స్) మింగేశాయి. వాటిని ఇప్పుడు ఆధునిక మగ్గాలు మింగేస్తున్నాయి. కాళ్లు, చేతులు ఆడిస్తూ బట్టను నేసే నేత కార్మికుల బతుకు దుర్భరంగా మారింది. అనేక కులవృత్తులు కాలగర్భంలో కలిసిపోతుంటే చేనేత రంగం కాలానికి ఎదురునిలిచింది. వస్త్రాన్ని అందించి, ప్రపంచానికి నాగరికత నేర్పిన నేతన్నల జీవితం కష్టాలు, కన్నీళ్ల కలబోతగా మిగిలింది. దేశంలో వ్యవసాయం తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించిన వస్త్రోత్పత్తి రంగంలో ఆధునికత సంతరించుకుంది. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు ఇది వేదికవుతోంది. చేనేత మగ్గంపై అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి, ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నేత కళాకారుల ఖిల్లా సిరిసిల్లలో వస్త్రోత్పత్తి రంగం ఆధునికత వైపు అడుగులు వేస్తుంది. కరోనా కష్టకాలంలో చేనేత రంగం ఆటుపోట్ల మధ్య ఉంది.


చేనేత దినోత్సవ నేపథ్యం..

స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం చేనేత రంగంతో మొదలైంది. కలకత్తా టౌన్‍ హాల్‍లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి, విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ వస్త్రాలు ధరించి దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. అప్పటి స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చేనేత రంగానికి గుర్తింపునిస్తూ ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. చేనేత రంగం విశిష్టతను తెలియజేస్తూ కార్మికుల గౌరవాన్ని ప్రతిబింబించేలా జాతీయ స్థాయిలో ఏటా చేనేత కార్మికులకు సంత్‍కబీర్‍ అవార్డులను అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చేనేత వస్త్రాల ఎగుమతిలో 90 శాతం భారతదేశం భాగస్వామ్యం ఉండటం విశేషం.
ప్రాచీన వారసత్వం..
చేనేత రంగం ప్రాచీన వారసత్వంగా వస్తోంది. భారతదేశ వస్త్ర సంప్రదాయం ప్రపంచానికే ఆదర్శం. చేనేత మగ్గం ఇప్పుడు మరమగ్గంగా మారి, ఆధునిక మగ్గాలుగా అవతరించి అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా 43 లక్షల నేత కుటుంబాలు ప్రత్యక్షంగా ఈ రంగంలో ఉపాధి పొందుతున్నాయి. వస్త్రోత్పత్తి కేంద్రాలుగా పలు పట్టణాలు ఖ్యాతిగాంచాయి. షోలాపూర్‍, భీవండి, ముంబయి, అహ్మదాబాద్‍, ఇంచన్‍కరంజ్‍, సూరత్‍, మాలేగావ్‍, సిరిసిల్ల, వెంకటగిరి, గద్వాల్‍, భూదాన్‍ పోచంపల్లి, ఈరోడ్‍, చీరాల వంటి ప్రాంతాలు వస్త్రోత్పత్తికి నిలయాలుగా మారాయి. చేనేత వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా మన దేశానికి విదేశీ మారక ద్రవ్యం సమకూరుతోంది.


సిరిసిల్లలోనే తొలి నేతన్న విగ్రహం

సిరిసిల్లలో దేశంలోనే తొలి చేనేత కార్మికుడి కాంస్య విగ్రహం నెలకొల్పారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 78 వేల మరమగ్గాలు ఉండగా, ఒక్క సిరిసిల్లలోనే 34 వేలు ఉన్నాయి. వీటిలో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్‍ వస్త్రం, 7 వేల మగ్గాలపై కాటన్‍ వస్త్రోత్పత్తి జరుగుతోంది. సిరిసిల్లలో 25 వేల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. నిత్యం 34 లక్షల మీటర్ల వస్త్రం తయారవుతుంది. రాష్ట్రంలోనే తొలి టెక్స్టైల్‍ పార్క్ సిరిసిల్లలో ఏర్పాటు చేశారు. ఇందులో 115 పరిశ్రమల్లో ఆధునిక మగ్గాలపై వస్త్రోత్పత్తి సాగుతోంది. ఇక్కడి వస్త్రాలు ముంబయి, భీవండి, సూరత్‍, ఢిల్లీ, షోలాపూర్‍ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి.
టెక్స్టైల్‍ పార్క్లో 3 వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా
ఉపాధి పొందుతున్నారు. సిరిసిల్లలో కాటన్‍ వస్త్రం అద్దకం యూనిట్లు 90 వరకు ఉన్నాయి. ఇక్కడి కాటన్‍ వస్త్రం దేశంలోని 6 రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. సిరిసిల్ల అద్దకంలో అగ్రస్థానంలో ఉంది. రెండో షోలాపూర్‍గా ఖ్యాతిగాంచిన సిరిసిల్లకు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు, కేసీఆర్‍ కిట్లు, ఆర్వీఎం వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇవ్వడంతో కార్మికులు మెరుగైన ఉపాధి పొందుతున్నారు. గత ఏడాది రూ.350 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్లు రావడంతో నేతన్నలకు చేతినిండా పని దొరుకుతోంది.
నేతన్న పనితీరు అద్భుతం, చేనేత దుస్తులు ధరిద్దాం
చేనేత కార్మికులకు మద్దతునివ్వడానికి ప్రతిఒక్కరూ చేనేత దుస్తులు ధరించాలని, వాటి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని గవర్నర్‍ తమిళిసై సౌందరరాజన్‍ రాష్ట్రపజలకు పిలుపునిచ్చారు. ప్రోత్సాహకాలకు నేత కార్మికులు అర్హులని, వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలని ఆకాంక్షించారు. 2015లో తమిళనాడులో ప్రధాని మోదీ ప్రారంభించిన తొలి జాతీయ చేనేత దినోత్సవంలో తాను పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నేత కార్మికులు తమ వృత్తిపై అసాధారణమైన అభిరుచిని ప్రదర్శిస్తున్నారని, అద్భుతమైన డిజైన్‍లతో ఉత్పత్తులు తీసుకొస్తున్నారన్నారు. నారాయణపేట, సిద్దిపేట, వరంగల్‍ చేనేత ఉత్పత్తుల ప్రత్యేకతలను తెలుపుతూ పోస్టల్‍ కవర్లను ప్రవేశపెట్టిన తెలంగాణ పోస్టల్‍ సర్కిల్‍ కృషిని గవర్నర్‍ ప్రశంసించారు.

  • దక్కన్‍న్యూస్‍, ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *