పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్ లాంటి సమస్యలు ఉన్నా ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ’ ‘బాలచెలిమి’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. ఆ ‘పది జిల్లాల బడి పిల్లల కథలు’ దక్కన్‌ల్యాండ్ పాఠకులకు పరిచయం చేయడంలో భాగంగా ‘మహబూబ్‌నగర్ జిల్లా బడిపిల్లల కథలు’ గురించి బాల సాహితీవేత్త డా।। ఎం. రాములు గారి విశ్లేషణ.
కథల కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ బాలచెలిమి వారి ఆహ్వానం మేరకు మహబూబ్‌నగర్ జిల్లా ‘బడిపిల్లల కథలు’ ఎంపిక కోసం 90కథలు రాగా కథల కార్యశాలలో పాల్గొన్న నిష్ణాతులైన బాల సాహితీవేత్తలు 13కథలను ఎంపిక చేశారు. ఈ పుస్తకానికి తునికి భూపతి, వడ్డేపల్లి వెంకటేశ్‌లు చక్కటి బొమ్మలు వేశారు. ఈ బాధ్యతను నెరవేర్చే క్రమంలో ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ’ బాలచెలిమి నిష్ణాతులతో ఎన్నో సమావేశాలు, సదస్సులు, చర్చలు, బాల చెలిమి ముచ్చట్లు నిర్వహించింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సంస్థాన జిల్లాగా తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందింది. అనేక సాహితీ గ్రంథాలు సాహితీ లోకానికి తలమానికంగా నిలిచాయి.
సాహిత్యరంగంలో బాలసాహిత్యం పాత్ర అమోఘము, అద్భుతము. మొక్కైవంగనిది మానైవంగునా అన్న సామెత చిరకాలం గుర్తుంకోవాల్సిన అంశము. చిన్నప్పుడే పిల్లల్ని సన్మార్గంలో నడిపిస్తే వారు పెరిగి పెద్దయ్యాక అదే మార్గంలో పయనించి నీతివంతమైన సమాజాన్ని నిర్మిస్తారు. పిల్లల్ని నీతిమంతులుగా చేసే అంశాలలో పిల్లల కథల ‘‘పాత్ర వర్ణనాతీతము. మేము చదువుకునే రోజుల్లో ఒకటవ తరగతి నుండే కథలను పాఠ్యాంశాలుగ చేర్చేవారు. ప్రతిరోజు ఒక కథల పీరియడు ఉండేది.
నేటి పాఠ్యగ్రంథాలలో కథలకు చోటులేకుండా పోయింది. మన పూర్వీకులు పిల్లలకు రామాయణం, మహాభారతం, పంచతంత్ర కథల నీతిని బోధించి పిల్లలను ధర్మపరులుగా తీర్చిదిద్దేంకు కృషి చేసారు.
నేటి తరానికి పూర్వవైభవం తేవాల్సిన అవసరం ఉంది. అందుకే పిల్లల్లో నీతి కథల పాత్రను గొప్పతనాన్ని గుర్తింప చేయాలి. వారిచే చిన్న చిన్న కథలు రాయించాలి. అందుకు ఉపాధ్యాయుల ప్రోత్సాహం కావాలి.
అనేకమంది ఉపాధ్యాయులు పిల్లల్ని కథలు రాయించేందుకు ప్రోత్సహిస్తు న్నందులకు అందరికి ప్రత్యేక ధన్యవాదములు. పిల్లల కథలు అన్నీ చాలా బాగున్నాయి. ప్రతి కథ ఒక సందేశాత్మకంగా ఉంది. ఉదా: మనిషికి క్షమాపణముండాలి. మానవత్వం, నిజాయితి లాంటి కథలు అద్భుతంగా ఉన్నాయి.
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా పిల్లలను కథలు రాయించే దిశగా మరింత ప్రోత్సాహమివ్వాలని మరి మరి ప్రార్థిస్తున్నాను.
-డా।। ఎం. రాములు
బాల సాహితీవేత్త