విస్తృత ప్రజాభిప్రాయాల వేదిక ‘దక్కన్‍ల్యాండ్‍’కు పది వసంతాలు


ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టే పిల్లర్‍గా పత్రికా రంగాన్ని గౌరవిస్తారు. కనిపించని ప్రతిపక్షం అని కూడా పిలుస్తారు. విద్య, వైద్యం, వ్యవసాయరంగం, తాగు, సాగునీటి కొరత, సెజ్‍లు, ధర్మల్‍ విద్యుత్‍ కేంద్రాలు, సహజ వనరులు, విచక్షణ, హక్కుల ఉల్లంఘణ వంటి అనేక సామాజిక అంశాలు ఉమ్మడి రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వేళ… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన విషయాలు చర్చించే వేదికగా… అభివృద్ధి మార్గదర్శకంగా, ప్రజాస్వామ్యవేదికగా నిలవాలన్న సంకల్పంతో 2012 సెప్టెంబర్‍లో ప్రారంభమైన పత్రిక ‘దక్కన్‍ల్యాండ్‍’.


పత్రిక పదేళ్లపాటు నిర్విఘ్నంగా పత్రికను నిర్వహించడం, విస్త్రత ప్రజాభిప్రాయవేదికగా దక్కన్‍ల్యాండ్‍ ప్రముఖుల, మేథావుల ప్రశంసలను, విశ్వాసాన్ని ఇప్పటికే సంపాదించుకున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలనూ, నిధుల వినియోగంలోనూ, ఉద్యోగ నియమాకాలలోనూ, సాగునీటి వనరుల వినియోగంలోనూ వున్న వివక్షలను అంశాల వారీగా, రంగాల వారీగా విశ్లేషణాత్మక వ్యాసాలను ప్రచురించింది. రాష్ట్రసాధనకోసం వివిధ ప్రజాసంఘాలు చేస్తున్న ఉద్యమాలకు, పోరాటాలకు, ధర్నాలకు, ధూమ్‍ధామ్‍ వంటి సాంస్కృతిక ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలబడింది. చరిత్రకు అందని తెలంగాణా ప్రాంత ఔన్నత్యాలను, సాహితీ, సాంస్కృతిక జీవన విధానాలను తెలంగాణ ప్రజలకు తెలియజేసింది. ఉద్యమకాలంలో వివిధ శ్రేణులు నిర్వహించిన చర్చలకు, వాదోపవాదాలకు వేదికగా నిలబడింది. ఉద్యమంలో అవసరమైన పరస్పర సహకారం, ఐక్యత అవసరాలకు పెద్దపీట వేసింది. ఉద్యమ నిర్వహణలో చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకుంటూ అందరినీ కూడగట్టింది.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సుస్థిర తెలంగాణ స్థాపనకు నూతన ప్రభుత్వం చేపడుతున్న మిషన్‍ భగీరధ, కాకతీయ మిషన్‍, కాళేశ్వరం ప్రాజెక్టు, సాగునీటి వనరుల ప్రత్యమ్నాయి వినియోగాలు, రైతుబంధు, దళిత బంధు, రవాణా వ్యవస్థ, పారిశ్రామిక, పట్టణ ప్రణాళికలు, డ్రైనేజీ, మూసీనది, హరితహారం వంటి ప్రణాళికలు, పథకాలను ప్రజలముందుంచుతుంది. తెలంగాణా సాంస్కృతిక విశేషాలు, వృత్తి కులాల జీవన వ్యధలను, ఛాయా చిత్రకారుల జీవనరేఖలు, జానపద కళారూపాల విశిష్టతను తెలిపే కథనాలు ప్రచురించింది. ప్రపంచ తెలుగు మహాసభల వంటి ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక సంచికలు వెలువరించింది.


మేధావులకు, విద్యావంతులకు, సామాజిక శాస్త్రవేత్తలకు, పర్యావణ, సాంకేతిక శాస్త్ర విశ్లేషకులకు, పురావస్తు , శాసనాల పరిశోధకులకు, పారిశ్రామిక, వ్యవసాయరంగ నిపుణులకు, జీవావరణ శాస్త్రజ్ఞులకు, సాహితీ సాంస్కృతిక కళాకారులకు, పరిశోధక విద్యార్థులకూ, ఒక్క మాటలో చెప్పాలంటే మానవ సంబంధిత ప్రతి అంశానికీ వేదికగా నిలిచింది. ఈ రంగాలలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకు రావడంలో దక్కన్‍ల్యాండ్‍ ఈ పది సంవత్సరాలలో తనవంతు కృషిని నిజాయితీగా కొనసాగిస్తున్నది.


మాకు సహకరించిన రచయితలకీ, పాఠకులకీ, పత్రిక శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు.


(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *