ఆవుల పిచ్చయ్య


ఆగమై తప్పిపోయిన కుటుంబ వ్యక్తి పత్తా దొరికితే ఎంత సంబురమవుతదో, విస్తృతికి గురైన ఆవుల పిచ్చయ్య గురించిన సమాచారం దొరికినంతనే తెలంగాణ సమాజం అంత ఆనందపడ్డది. తెలంగాణా అస్తిత్వసోయితో ఇలా ఎందరినో కనుగొన్నాం. వారి సేవలను రికార్డు చేసుకుంటున్నాం. అలాంటి వారిలో ఆవుల పిచ్చయ్యకు సముచిత స్థానం ఉంది.
ఆవుల పిచ్చయ్య తెలంగాణ పోరాట కథలను తెలంగాణ రీసెర్చ్ అండ్‍ రెఫరాల్‍ సెంటర్‍ 2010లో పదిరూపాయల అతి స్వల్ప ధరకు 32 పేజీలతో ఒక పుస్తకాన్ని తెచ్చింది. ఈ పుస్తకానికి సంగిశెట్టి శ్రీనివాస్‍ సంపాదకత్వం వహించారు. ఆవుల పిచ్చయ్య ఏ విధంగా దొరికిండో, దేవులపల్లి కృష్ణమూర్తి అమూల్య జ్ఞాపకాలు రాసాడు. ముదిగంటి సుజాతారెడ్డి కథాల నేపథ్య సందర్భాలను, కథలను విశ్లేషించి చూపారు. కాసుల ప్రతాపరెడ్డి కథల సమయ, సందర్భ, సమకాలీనతలను పరిశీలించాడు.


ఆవుల పిచ్చయ్య గురించి తెలిసిన విషయాలు చాలా తక్కువ. ఆయన ఇరవయో శతాబ్ది తొలినాళ్లలో 1919 సంవత్సరంలో సూర్యాపేటలో జన్మించాడు. వారిది బీదరిక కుటుంబం. తాను యువకుడుగా ఉన్న దశ నుండే భూపోరాటంలో పాల్గొన్నాడు. ఆయన విద్యావకాశాలు లేని ఆ రోజులలో పెద్దగా చదువుకున్నవాడు కూడా కాదు. ఉర్దూ ఎక్కువగా చెలామణిలో ఉండడం వల్ల, బతుకు దెరువే ఒక భారమైనందున, మాతృభాషలో పాఠశాలలు లేనందున ఎందరో చదువుకు దూరమైనారు. ఆవుల పిచ్చయ్య అలాంటి వాతావరణంలో సమాజాన్ని, స్థానీయతను అధ్యయనం చేసిన జ్ఞాని. ఆయన నిజాంను వ్యతిరేకిస్తూ జరిగిన ఆంధ్రమహాసభలలో పాల్గొన్నాడు. ఆయన లోకజ్ఞానాన్ని, సమాజాన్ని అధ్యయనం చేస్తూ ఆంధ్రమహాసభల చైతన్యాన్ని, గ్రంథాలయోద్యమం, గ్రంథమాల స్ఫూర్తిని అందుకొని రాయడం, చదవడం నేర్చుకున్న అనివార్య పరిస్థితిని ముందుమాటలో తెల్పారు.


ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు దుర్భరమైనవి. ప్రజలకు స్వేచ్ఛ లేదు. విద్య అభ్యసించే సౌలభ్యాలు, హక్కులు లేవు. భూస్వామ్య విధానం, వెట్టి భయంకరంగా అమలయినాయి. వీటిని కాపాడుతూ పాలనాపరమైన నిర్బంధాలు మనిషి జీవితాన్ని అతలాకుతలం చేశాయి. ఆ సందర్భంలో ధిక్కార స్వరాన్ని వినిపించిన పిచ్చయ్య చివరకు ప్రాణత్యాగాలను కూడా లెక్కచేయలేదు. ఆలోచన, ఆవేశం జతకలసి ఎందరో ఉద్యమాన్ని, సాహిత్యాన్ని రెండూ రెండు ఆయుధాలుగా మలచుకున్నారు. అలాంటి తొలితరం కథాసాహిత్యంలో ఆవుల పిచ్చయ్య కథలు విశిష్టమైనవి. ఆయన కథలు ‘మీజాన్‍ పత్రిక (1946-47)లో అచ్చయినాయి. ఆవుల పిచ్చయ్య 1944 నుండి అతివాద పక్షంలో చేరాడు. దేశంలో పేదరికం రూపమాప బడాలన్నా, సమసమాజం ఏర్పడాలన్నా, అన్యాయాలు, దోపిడీలు, మనిషిని మనిషి హింసించే – వ్యవస్థ పోవాలన్నా ఆ ఆలోచనా విదానమే మార్గమని నమ్మాడు. ఆయన ఆనాటి గ్రామీణ జీవన చిత్రణలో భాగంగా కథలను కళ్లకు కట్టినట్టు రాసిన అరుదైన కథారచయిత. కథల్లో సూటిదనానికి పదునెక్కిన భాష తోడ్పడింది. కథలో అవసరం, డొంక తిరుగుడుతనం ఎక్కడా లేదు. అక్షరాలలో నిబద్ధత ఉంది. తెలంగాణలో కథ ఇతర ప్రాంతాల కన్నా ఎలా భిన్నమైందో అధ్యయనం చేయడానికి ఆవుల పిచ్చయ్య కథలు బాగా ఉపకరిస్తాయి. అరుదుగా రాయబడ్డ వెట్టి కథలలో ఆవుల పిచ్చయ్య కథలు ముందువరుసలో ఉంటాయని చెప్పడం అతిశయోక్తి కాదు. సంగిశెట్టి శ్రీనివాస్‍ తనకు లభించిన ఆవుల పిచ్చయ్య కథలను పుస్తకంగా వేయడంతో తెలంగాణ కథకు బలం చేకూరింది. ఇలా లభిస్తున్న ఐదు కథలలో వెట్టి చాకిరి, దిన చర్య, దౌరా, చపరాసి దినచర్య, ఊరేగింపులు, పూర్తి కథలు. ‘‘ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగిన జమీందారు’’ కథ అసంపూర్ణమైంది.


వెట్టి చాకిరి దినచర్య చిన్న కథనే అయినా ఆనాటి వెట్టి జీవితాన్ని కళ్లముందు నిల్పుతుంది. గిర్దావరు జనాబ్‍ గారు గ్రామంలోకి వస్తే ఎంత హడావుడి ఉంటుందో కథలో వర్ణితమైంది. మంచాలు తెమ్మంటే ఆలస్యమైందని జవాను చాకలిని కొడుతాడు. చాకలి భార్య చంటిపిల్ల తల్లి. రాత్రి పూటన్న మెతుకు తినకుంటే పిల్లకు పాలు ఎట్లాని దిగులుపడుతుంది. మధ్యాహ్నం పోయిన భర్త గిన్ని జొన్నగింజలన్న తెస్తాడని ఆశపడుతుంది. కాని, భర్తను జనాబ్‍ వెట్టి సేవలు చేయించుకుంటూ ఉండడం వలన ఆలస్యమవుతుంది. గడ్డం చేసే మంగలి వెంకడు కూడా వెట్టి పనులలో ఉంటాడు. అందువల్ల ‘‘చాకలి మంగలి పొత్తులు ఇంటికి రాని విత్తులు’’ అన్నట్టు రచయిత భార్యనోట సామెత పలికిస్తాడు. జనాబ్‍ను మంచంమీద కూర్చోబెట్టి ‘గరంపాని’తో స్నానం చేయించడం వీపు రుద్దడం. తుడ్చుకోవడానికి చాకలి తన భుజం మీద కండువా సిద్ధంగా ఉంచుకోవడం ఆనాటి పరిస్థితులకు అద్దంపడుతుంది. భర్తను వెతుక్కుంటూ భార్య వస్తుంది. చివరకు వారికి ఏమీ మిగలదు. ఇద్దరు కలిసి తెచ్చిన మంచాన్ని ఇంటికి మోసుకపోతారు. వర్షం పడుతుంది. గుడిసెలోకి నీళ్లు చేరుతాయి. చంటిపిల్లను పడుకోబెడుతామన్నా మంచం తడిసి ఉంటుంది. బీద ప్రజలను పీల్చిపిప్పి చేసే వీరి ఖానుసు ఒకటి చేసే అన్యాయమొకటని తడిసి మోపెడయిన కష్టానికి భార్యాభర్తలు చింతిస్తారు. ఈ కథలో కర్మసిద్ధాంతాన్ని వ్యతిరేకించడం అభ్యుదయం ‘‘దేవుడు మన కర్మను యింతే చేశాడా?’’ అని ప్రశ్నిస్తూనే ‘మానవుడు చేసిన కర్మం గాని దేవుడు చేసిందికాదని’ రచయిత స్పష్టం చేశాడు.


‘దౌరా’ కథలోనూ వెట్టి జీవితాల ప్రస్తావన ఉంది. ప్రభుత్వాధికార్ల నిర్లక్ష్యం. ప్రజల పట్ట బాధ్యతా రాహిత్యం, సామాన్యుని పాట్లు జమీందారు పరపతి, ఆయన లబ్దిపొందిన విధం చిత్రించబడ్డది. గ్రామంలోకి తహసిల్దారు దౌరాకు వస్తాడు. ఆయనకు సేవలు చేయడానికి గ్రామంలో ఉన్న త్రిమూర్తులు పోలీసు పటేలు, మాలిపటేలు, పట్వారి రహస్యంగా మాట్లాడుకొని కార్యక్రమాలు మొదలుపెడుతారు. హరిజనులను పిలిచి అధికారి తోవ తప్పకుండా 5 మైళ్ళ నుండి గ్రామం దాక సున్నం వేసిన రాళ్ళ గుర్తులు పెట్టమని ఆజ్ఞాపిస్తారు. కొందర్ని పొయిల కట్టెలకు పంపుతారు. కొందర్ని చావిడికి మందడి కట్టాలని రైతుల వద్ద నుంచి చొప్ప తెమ్మని వెళ్ళగొడ్తారు. చావడిలో పర్దాలకు దుప్పట్లు తెమ్మని పంపుతారు. మంగలి వారిని పిలిచి కత్తులు సానపెట్టుకొని క్షౌరాలకు సిద్ధంగా ఉండుమని, కుమ్మరి వారిని నీళ్ళ కుండలు తెమ్మని, మస్కూరిని గొర్రెపిల్ల, కోడిపిల్ల, పాలు పెరుగు ఇంతెజాం చేయిమని, కోమట్లను సామానుకోసం పురమాయిస్తారు.
దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు పంట పండక పాడైన ఎంతో కాలానికి ఆ దౌరా కొనసాగుతుంది. కంచుగంటల జమీందారు గారి బండిలో తహసిల్దారు వస్తాడు. బండికి ఇరువైపుల జవాన్లు వెనకా ముందు వెట్టి బ్యాగరీలు సకల సేవలతో వస్తూ ఉంటాడు. ఆయన మొకం చూసి పీటలు వేస్తాడు కాని న్యాయసమ్మతంగా ప్రవర్తించడు. వచ్చిన రోజు విశ్రాంతితో సరిపోతుంది. రెండో రజు జమీందారు ఇచ్చిన దావతు. మూడోరోజు ప్రయాణమై వెళ్ళిపోవడం సామాన్యుని బాధలు విననిచ్చేవారు కూడా లేకపోవడం దురదృష్టకరం.


తహసిల్దారు వెళ్ళిపోతున్న దారిలో తనిఖీ నామమాత్రంగా జరుగుతుంది. ఒక సామాన్య రైతు పొలం అంతా ఎండిపోయి మొదటి భాగంలో కాస్త పచ్చగా కనబడితే బాగుందని రిపోర్టు రాసుకుంటాడు. జమీందారు పొలం అంతా పచ్చగా ఉండి ఒక చిన్న భాగంలో ఎండుగడ్డి కనబడితే జమీందారు పంట పాడై పోయిందని రిపోర్టు రాస్తాడు.
సామాన్యుడు తన మొర చెప్పుకుందామని ప్రయత్నించినా వెంట ఉన్నవారు అంతా మేము చెపుతామని నివారిస్తారు. ఈ కథలో దారికి సున్నం వేసిన రాళ్ళగుర్తులు పెట్టడం, అదికారులకు పాలకులకు సామాన్యుని మాట చేరకపోవడం, నిర్లక్ష్యపు రిపోర్టులు, తప్పుడు రిపోర్టులు తర్వాతి కాలానికి కూడా ప్రాసంగికత కల్గిఉన్నాయి. ఆనాటి దుర్మార్గమైన వ్యవస్థను ‘‘దౌరా’’ ద్వారా చిత్రించడంలో ఆవుల పిచ్చయ్య కృతకృత్యుడైనాడు.
‘‘చపరాసి దినచర్య’ కథ విలక్షణమైంది. నిజాం ప్యూడల్‍ వ్యవస్థలో ఆఫీసుల్లో కిందిస్థాయి నుండి పై స్థాయి దాకా ఉన్న అవినీతిని కండ్లకు గట్టాడు. ఒక రైతు ఆఫీసులో ఉన్న అధికారికి దరఖాస్తు ఇవ్వడానికి వెళుతాడు. అక్కడ డ్యూటీలో ఉన్న చపరాసి మాకు తెల్వకుండా దరఖాస్తు ఇస్తే నీ పని నెరవేరదని అంటాడు. మామూలు చెల్లించుమని దాని అర్థం. మామూలు ఇచ్చిన తర్వాతనే ఆ దరఖాస్తు అధికారికి చేరుతుంది. అధికారి దర్శనార్థం ఎవరు వెళ్ళాలన్నా చపరాసికి మామూలు ఇవ్వవలసిందే. ఈ విషయం తెలిసి అధికారి చపరాసిని బర్తరఫ్‍ చేస్తాడు. ఉద్యోగులు ఇనాం, లంచం పేరిట ప్రజలను పీడించడాన్ని ఆవుల పిచ్చయ్య కండ్లముందుంచాడు.


ఆవుల పిచ్చయ్య కథలు వాస్తవ పరిస్థితులలోంచి ఉద్భవించనవే. ‘ఊరేగింపులు’ కథ నిలువెత్తు నిజాలకు దర్పణం వంటిది. నల్లగొండ జిల్లా కడివెండిలో దొడ్డి కొమరయ్య విసునూరుదొర గూండాల కాల్పులలో నేలకొరిగాడు. వేలాది జనంతో అంతిమ యాత్ర మొదలయింది. ఆవుల పిచ్చయ్య ఈ కథకు ‘‘ఊరేగింపులు’’ అని పేరు పెట్టారు.
ఊరేగింపు కథలో రచయిత ఆనాటి వాస్తవాలను ఆవిష్కరించాడు. పొలాల దగ్గర పనిచేసే రైతులు, కూలీలు తమ పనులు వదిలి ఊరేగింపులో కలిసారు. కారుమబ్బులు కమ్ముకున్నా లెక్కచేయలేదు. స్త్రీ పురుషులు, చిన్న పెద్దలు అందరూ కదిలి వచ్చారు. ఉడికే జొన్నన్నం పొయి మీదనే మాడుతున్నది.
దంచేవారు లేక సజ్జలు రోట్లోనే మిగిలిపోయాయి. చివరికి గ్రామాధికారి కూడా ఆ ఊర్లో ఉంటే రిపోర్టు రాయవలసి వస్తుందని అక్కడి నుండి జారుకున్నాడు. అందరి చేతిలో ఎర్రజెండాలు రెపరెపలాడుతున్నాయి. కులమత బేధాలు లేకుండా ప్రజలు ఊరేగింపుకు తరలివచ్చారు. కొమురయ్యకు జై అని కమ్యూనిస్టు పార్టీకి, స్వాతంత్ర భారత్‍కీ జై అని ప్రజలు ఉప్పెనలా విరుచుకుపడి ఊరేగింపులో భాగస్వాములయినారు. ఈ చారిత్రాత్మక ఘటనను ఆవుల పిచ్చయ్య కథగా రూపొందించాడు.


‘‘ఈతగింజలు యిచ్చి తాటిగింజలాగిన జమీందారు’’ కథకు ఈ పేరు పెట్టడంలోనే రచయిత ఔచిత్యం స్పష్టమవుతుంది. ఈ కథ గురించి మీజాన్‍ పత్రిక సంపాదకుడు అడవి బాపిరాజు రాసిన ఇంట్రో వాక్యాలు పేర్కొనదగినవి. ఆయన ‘‘గ్రామ జీవన నేపథ్యానికి బంగరు రంగులు సింగారించే సిద్దహస్తులు శ్రీ పిచ్చయ్య గారు. భాషలో పాండిత్యపటిమ, భావాల్లో వైవిధ్యం రచనలో చతురత పరిమితమైనా వారిని సిద్దహస్తులనక తప్పదు. హృదయంలో మెత్తని ప్రదేశాలను కలచివేసే ఆవేశమూ సుఖ స్వర్గసీమలకు రాజమార్గాలు తీర్చే ఆశయాలూ కాచినట్లల్లా కళలీనే భావాల ముడి బంగారు సానపెట్టినప్పుడల్లా తళతళ మెరిజా జాను తెనుగు రవ్వలూ వారి రచనలో నిండారినవి’’. అని రాశాడు.


ఆయన తెలంగాణ భాషలో కథ రాశాడు. ఆనాటి నిజ జీవన చిత్రణ చేశాడు. ఆయనది నాటకీయ సజీవ చిత్ర శిల్పం. దౌరా, దస్త్రం, చప్రాసి, చపరాసి, బిస్తరు, కజానా, గిర్దావరు, బేగారీ, జవాను వంటి అన్యదేశ పదాలతో తెలుగు భాషను సుసంపన్నం చేస్తూ కథ రాశాడు. చాకలి, మంగలి, కుమ్మరి వంటి సకల కుల వృత్తుల ప్రస్థావన గ్రామ పరిస్థితులు చిత్రంలో చూపాడు. ఇలా కుల వృత్తుల వారిని దేశబంధు పత్రిక నడిపిన వడ్డేపల్లి సోదరులు కూడా తమ కథలలో పేర్కొన్నారు. దీన్ని బట్టి ఆనాటి కుల వ్యవస్థ తీరుతెన్నులు సంపన్నుల ఆధిపత్యం, అధికారుల ఆగడాలు తెలియవస్తున్నాయి.
కార్యశీలిగా తన అనుభవంలోంచి రాసిన రచయిత ఆవుల పిచ్చయ్య తొలినాళ్ళ కథకులలో విశిష్టమైనవాడు. విశేషంగా చెప్పుకోదగ్గ ఇతివృత్తాలతో కథలు రాసాడు.
(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)

  • ఎం.ఎం. తాయారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *