దయా హృదయం


సోమయ్య, రంగయ్య కొబ్బరికాయల వ్యాపారం చేసేవారు. వారు ఆ గ్రామంలోని దేవాలయానికి వచ్చిన యాత్రికులకు పోటీపడి కొబ్బరికాయలను అమ్మేవారు. సోమయ్య అంటే రంగయ్యకు ఎక్కువ అసూయ, ద్వేషం ఏర్పడింది. సోమయ్య తన కన్నా ఎక్కువ కొబ్బరికాయలు అమ్ముతున్నాడని రంగయ్య సోమయ్య పై ద్వేషం పెంచుకున్నాడు.


ఇలా ఉండగా ఒకసారి ఏదో పనిమీద సోమయ్య లింగాపురానికి వెళ్ళాడు. అక్కడ దారిలో ఒక వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయి ఉన్నాడు. అతడు ఎవరో కాదు తమ గ్రామానికి చెందిన రంగయ్యనే. వెంటనే సోమయ్య కొన్ని చల్లని నీటిని తీసుకొనివచ్చి అతని ముఖంపై చల్లాడు. అతడు కళ్ళు తెరవగానే అతన్ని పైకి లేపి కొన్ని మంచి నీళ్లను త్రాగించాడు. తన సంచిలో నుండి అరటిపళ్ళను కూడా తీసి రంగయ్యకు తినిపించాడు. సోమయ్య రంగయ్యను ఊరడించి ‘‘రంగయ్యా! నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకిలా పడిపోయావు?’’ అని అడిగాడు. అప్పుడు రంగయ్య తనకు మూర్చరోగం ఉందని తన బంధువుల ఇంటికి వచ్చానని తెలిపాడు.
ఆ తర్వాత అతడు సోమయ్యకు క•తజ్ఞతలు తెలిపి ‘‘సోమయ్యా! నేను నీ పట్ల,నీ వ్యాపారం పట్ల అసూయను, ద్వేషాన్ని అనవసరంగా పెంచుకున్నాను. కానీ ఈరోజు నీవు నా ప్రాణాన్ని కాపాడావు. ఆ దేవుడే నీ రూపంలో వచ్చి నన్ను రక్షించాడు’’ అని అన్నాడు. అప్పుడు సోమయ్య నవ్వి ‘‘అవును రంగయ్యా! నీవు అనవసరంగా నా పైన, నా వ్యాపారం పట్ల అసూయను, ద్వేషాన్ని పెంచుకున్నావు. వాస్తవానికి ఎవరి వ్యాపారం వారిదే. ప్రజలు కొబ్బరికాయలను తమకు ఇష్టమైన వారి దగ్గర కొంటారు. అంతమాత్రాన నీవు అసూయను, ద్వేషాన్ని పెంచుకోవడం భావ్యం కాదు. మన మధ్య వ్యాపారంలో పోటీ ఉండాలే తప్ప వ్యక్తిగతంగా కక్ష ఉండకూడదు. అంతేకాదు. అది అసూయగా, ద్వేషంగా మారకూడదు. నేను ప్రతి సంవత్సరం ఈ ఊరిలోని కొంతమంది బీదసాదలకు దుస్తులు, నిత్యావసర సరుకులు పంచి పెడతాను. అందుకే ఈ లింగాపురానికి మధ్యమధ్యలో వస్తుంటాను’’ అని అన్నాడు. ‘‘మరి మన ఊరిలో పేదవారు లేరా! అక్కడే నీవు వీటిని పేదలకు ఇవ్వవచ్చుకదా!’’ అని ప్రశ్నించాడు రంగయ్య. అప్పుడు సోమయ్య ‘‘ఎందుకు లేరు? అక్కడ నా మిత్రుడు ఆ పని చేస్తున్నాడు. మేము ఇద్దరం ఒకే ఊరు ఎందుకని అనుకున్నాము. అందువల్లనే ఎక్కువ మంది పేదలున్న ఈ గ్రామాన్ని నేను ఎన్నుకున్నాను’’ అని అన్నాడు.


అది విన్న రంగయ్య ‘‘సోమయ్యా! నీవెంత మంచి వాడివి? అయినా నీకు వారికందరికీ పంచి పెట్టే డబ్బు ఎక్కడిది?’’ అని ప్రశ్నించాడు? అప్పుడు సోమయ్య ‘‘నాకు వ్యాపారంలో వచ్చిన లాభం లోనే కొంత భాగం తీసి నేను వీరికి ఇలా దానం చేస్తున్నానయ్యా! అలా చేయడం వల్ల నాకు మరింత లాభాలు వస్తున్నాయి!’’ అని అన్నాడు. అప్పుడు రంగయ్య ‘‘సోమయ్యా! నేను కూడా నీలాగే ఇతరులకు సాయ పడతాను’’ అని చెప్పాడు.
ఆనాటి నుండి రంగయ్య వ్యాపారం బాగా పుంజుకుంది. అతడు కూడా సోమయ్య వలెనే మిక్కిలి లాభాలను ఆర్జించసాగాడు. కానీ తన లాభాల్లో కొంత భాగం మరో ఊరిలోని పేదవారికి దుస్తులు మరియు నిత్యావసరుకులు పంపిణీ చేసి మంచివాడుగా పేరు తెచ్చుకున్నాడు. రంగయ్య సోమయ్య స్నేహం వీడకుండా అతని వల్ల వ్యాపార మెలకువలు కూడా తెలుసుకుని మంచి స్నేహితుడు అనిపించుకున్నాడు.

  • సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
    ఎ: 9908554535

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *