ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో మనం ఎవరినైనా కలవాలంటే వాయిస్ కాల్, ఛాటింగ్ లేదా వీడియో కాల్ ద్వారా కలవడం జరుగుతుంది. అలా కాకుండా టెక్నాలజీ సహకారంతో మనం వారి ఎదురుగా ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో ఆలోచించండి! మన పని ఒత్తిళ్ళ కారణంగా కాసేపు మానసికఉత్సాహం కొరకు మొబైల్ తీసి సామాజిక మాధ్యమాలలోకి ప్రవేశించిన విధంగానే, ఒక వర్చువల్ హెడ్ సెట్‌ను మన కళ్ళకు ఎదురుగా అమర్చుకొని మనం కోరుకున్న ప్రదేశంలోకి వెళ్ళి కాసేపు వర్చువల్‌గా విహారానికి వెళ్లి వస్తే ఎలా ఉంటుంది. ఉద్యోగాల కొరకు కార్యా లయాలకు వెళ్ళకుండా మన ఇంట్లో నుండే వర్చువల్ విధానంలో విధులు నిర్వర్తించడం, మనకు కావాల్సిన వస్తువును కొనుక్కునేందుకు షాప్‌కు వెళ్ళాళ్సిన అవసరం లేకుండా ఇంట్లో నుండే వర్చువల్‌గా ఆ షాప్‌కు వెళ్ళి షాపింగ్ చేసి ఆ వస్తువులను మన ఇంటికి తెప్పించుకుంటే అద్భుతంగా ఉంటుంది కదూ! ఇదంతా ప్రస్తుతానికి కల్పనగా కనిపిస్తున్నప్పటికీ, ఈ కల్పన, వాస్తవరూపం దాల్చడానికి మరెంతో కాలం పట్టదనీ సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఫేస్బుక్ తన పేరును ‘మెటా’ అన్న సంకేతరూపంలోకి మార్చు కోవడాన్ని, ఇందుకు దృష్టాంతం చూపుతున్నారు. ఇలా మానవాళి ముంగిట మరో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘మెటావర్స్’’ అని వ్యవహరిస్తున్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ మానవాళికి సరికొత్తగా పరిచయ మవుతున్న మెటావర్స్ టెక్నాలజీ గురించి మనం కూడా తెలుసుకుందామా!!
అసలేమిటి మెటావర్స్…!!
మెటావర్స్ అనగా ఒక వర్చువల్ ప్రపంచమని చెప్పవచ్చు. ఇంకా ఆన్లైన్లో ఆడే గేమ్‌లలో విభిన్న పాత్రలతో మనం గేమ్‌లను ఎలా ఆడతామో, మెటావర్స్‌లో కూడా మనం వర్చువల్ ప్రపంచంలోని పాత్రలతో రకరకాలైన విధులు నిర్వర్తించవచ్చు. సాంకేతికంగా చెప్పుకున్నట్లయితే మెటావర్స్ అనేది అగ్మెంటెడ్, వర్చువల్ మరియు మిక్స్డ్ రియాలిటీ యొక్క సమ్మేళనమని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ క్యారెక్టర్లతో యూజర్స్ నిజమైన అనుభవాన్ని పొందగలిగే ఒక ఇంటరాక్టివ్ స్పేస్‌గా మెటావర్స్‌ను ఉపయోగించవచ్చు. మెటావర్స్ యొక్క వర్చువల్ లేదా మాయా ప్రపంచంలో జరిగే క్రియలన్నీ భౌతికంగా వాస్తవం కాదు, కానీ వర్చువల్ ప్రపంచంలో నిజమైన అనుభూతిని పొందగలిగేంత దగ్గర అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. ఉదా।। మనం భౌతిక ప్రపంచంలో స్నేహితుడి ఇంటికి వెళ్ళినట్టే, మెటావర్స్‌లో కూడా స్నేహితుని ఇంటిని సందర్శించవచ్చు. అయితే అలాంటి అనుభూతి కొరకు మనం వీఆర్ హెడ్సెట్ ఉపయోగించాల్సి ఉంటుంది.
మెటావర్స్ అన్న పదం ఎలా ఆవిర్భవించింది!
మెటావర్స్ అన్నపదం ‘‘మెటా’’ అన్న గ్రీకు పదం నుండి ఉద్భవించింది. మెటా అనగా ‘‘అంతకు మించి’’ లేదా ‘‘దాటి’’ అని అర్థం! యూనివర్స్ నుండి ‘‘వర్స్’’ అన్న పదాన్ని తీసుకొని మెటావర్స్ అన్న పదాన్ని సృష్టించారు.

మెటావర్స్ అన్న పదాన్ని తొలిసారి ఎవరు వాడారు!! నీల్ స్టీఫెన్సన్ అన్న అమెరికన్ రచయిత, తాను రచించిన ‘‘స్నో క్రాస్’’ అన్న సైన్స్ కాల్పనిక నవలలో తొలిసారిగా ‘‘మెటావర్స్’’ అన్న పదాన్ని ఉపయోగించారు. ఈ నవలలో మనుషులు ప్రత్యేకమైన అద్దాలు ధరించి, డిజిటల్ అవతారాలుగా హెచ్డీ వర్చువల్ వాతావరణంలోనే ఒకరినొకరు కలుసుకుంటారు.
ఇలాంటి భావనతోనే 2018లోనే ‘‘రెడీ ప్లేయర్ వన్’’ అనే సినిమా కూడా వచ్చింది. ఎర్నెస్ట్ క్లైవ్ రాసిన పుస్తకం ఆధారంగా తీసిన ఈ సినిమాలో ప్రజలు రోజులో ఎక్కువ భాగం వీఆర్ హెడ్సెట్లతోనే గడుపుతూ ఒయాసిస్ అనే విశాలమైన కాల్పనిక వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెడతారు. ఆ కల్పనే నేడు వాస్తవరూపం దాల్చబోతోంది. కాల్పనిక వాస్తవ ప్రపంచంలో వాస్తవంగా విహరించేలా చేయనుంది.
ప్రధానంగా మెటావర్స్ అనేది 3వ తరం (వెబ్-3.0) ఇంటర్నెట్ ఆధారంగా ఒక విస్తరించిన వాస్తవికత (Extended Reality)గా చెప్పవచ్చు. ఈ విస్తరించిన వాస్తవికత అనేది అగ్మెంటెడ్, వర్చువల్ మరియు మిక్స్డ్ రియాలిటీల సమ్మేళనంగా సాంకేతిక నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటితరం (వెబ్-1.0), రెండవ తరం (వెబ్-2.0), మూడవ తరం (వెబ్-3.0) ఇంటర్నెట్లు మరియు అగ్ మెంటెడ్, వర్చువల్, మరియు మిక్స్డ్ రియాలిటీల గురించి తెలుసుకుంటే మెటావర్స్‌పై మరింత సమగ్రమైన అవగాహన కలుగుతుంది.
మొదటితరం ఇంటర్నెట్ (వెబ్ 1.0)
మొదటితరం ఇంటర్నెట్ 1991 నుండి 2004 వరకు కొనసాగింది. ఇందులో వెబ్సైట్ డెవలపర్లే కంటెంట్ సృష్టికర్తలు. ఇవి చాలా వరకు కంటెంట్ అవసరమైన వారికే ఉపయోగ పడేవి. ఆయా సంస్థల సమాచారం, కంపెనీల ప్రకటనల వంటి వాటికే పరిమితమయ్యేవి. అన్నీ అక్షరాలు లేదా దృశ్య రూపంలో ఉండేవి. అంటే డేటాబేస్‌తో కాకుండా నిశ్చలఫైళ్ళ వ్యవస్థ నుండే కంటెంట్, డేటా అందుబాటులో ఉండేది. దీంతో వెబ్సైట్ చూడడానికి మాత్రమే వీలయ్యేది. బయటివాళ్ళు వీటిలో పాల్గొనేందుకు వీలుకాదు. అందువల్ల అప్పట్లో ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ప్రసారాలు లేవు.

రెండవ తరం ఇంటర్నట్ (వెబ్-2.0)
ఓరియల్లీ మీడియా ఉపాధ్యక్షుడు డేల్డవర్టీ ఈ దశకు వెబ్-2.0 అని పేరు పెట్టాడు. అనతి కాలంలోనే ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం మనం ఎక్కువగా వినియోగిస్తున్న అంతర్జాల రూపం ఇదేనని చెప్పవచ్చు. సమాచారాన్ని చదువుకోవడానికే కాదు, రాసుకోవడానికి అంటే పాలుపంచుకోవడానికి వెబ్-2.0 వీలు కల్పించింది. వినియోగదారులను ప్రేక్షకుల స్థాయి నుండి కంటెంట్‌ను సృష్టించి అప్లోడ్ చేయగల స్థితికి చేర్చింది. ఫేస్బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాలు, ఉబర్, ఓలా సేవలు, అమెజాన్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్లు, యాప్‌లన్నీ ఈ దశలోనే ఉద్భవించాయి. మనసులో ఏ ఆలోచన వచ్చినా, వెంటనే ప్రపంచంతో పంచు కుంటున్నామన్నా, వీడియో అప్లోడ్ చేస్తున్నామన్నా అంతా వెబ్-2.0 మహిమేననడం ఎంత మాత్రం సత్యదూరం కాదు. దీని ప్రధాన ఉద్దేశ్యం అంతర్జాలంలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం మరియు తేలికగా వాడుకోవడానికి వీలు కల్పించడమని చెప్పవచ్చు.
మూడవతరం ఇంటర్నెట్ (వెబ్-3.0)
ఎథెరమ్ కంపెనీ సహ వ్యవస్థాపకులు ‘‘గేవిన్ ఉడ్’’ 2014లో తొలిసారి వెబ్-3.0 గురించి ప్రస్తావించారు. వెబ్-3.0 అధునాతన దశ, ఇప్పడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. దీని పని తీరును ఇప్పటికే మనం చవిచూస్తున్నామని కూడా చెప్పవచ్చు. ఉదా।।కు మనం ఏదైనా ఒక ఇ-కామర్స్ సైటులో ఒక వస్తువును కొంటే వెంటనే వెబ్సైట్ అల్గారిథం రంగంలోకి దిగుతుంది. ఇంతకు ముందు ఆ వస్తువుతో పాటు ఫలానా మరొక వస్తువు కూడా కొన్నారని సిఫారసు చేయడం గమనించవచ్చు. అంటే వెబ్సైట్ తనకు తాను నేర్చుకుంటూ మరింత తెలివిని సముపార్జిస్తోందని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే వెబ్-3.0 వెనుక ఉన్న సిద్ధాంతం ఇదే. పెద్ద టెక్నాలజీ కంపెనీలు, క్రిప్టోకరెన్సీ ఔత్సాహికులు, భారీ పెట్టుబడి సంస్థల మూలంగా 2021లో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
వెబ్-3.0 బ్లాక్‌చైన్, కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో పనిచేస్తూ అంతర్జాల ప్రపంచాన్ని వికేంద్రీకరిస్తుందని, బడా సంస్థల ఆధిపత్యాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇందులో డెవలపర్లు ఒకే సర్వరు మీద ఆధారపడరు. అలాగే ఒకే డేటాబేస్‌లో తమ సమాచారాన్ని స్టోర్ చేయరు. వెబ్ 3.0కి సంబంధించిన యాప్స్ బ్లాక్‌చైన్ పరిజ్ఞానం, వ్యక్తిగత నోడ్స్‌కు (సర్వర్లు) సంబంధించిన వికేంద్రీకృత నెట్‌వర్క్‌ల మీద పనిచేస్తాయి. ఈ మూడో తరం యాప్స్‌ను డీయాప్స్ (డీసెంట్రలైజ్డ్ యాప్స్)గా పిలుచు కుంటున్నారు. వెబ్-3.0 అత్యంత నాణ్యమైన సేవలు అందించడంతో పాటు, వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచుతుంది. మెటావర్స్ సాంకేతికత వెబ్-3.0 ద్వారానే నిర్వహించడం జరుగుతుంది. మూడవతరం ఇంటర్నెట్ (వెబ్-3.0) అగ్ మెంటెట్, వర్చువల్ మరియు మిక్సిడ్ రియాలిటీల యొక్క సమ్మేళనమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వాటి గురించి కూడా తెలుసుకుందాం.
అగ్మెంటెడ్ రియాలిటీ!
దృశ్యరూపక సాంకేతిక ఉపకరణాలను ఉపయోగించడం ద్వారా, శరీరంలోని వివిధ అవయవాలు తగురీతిలో స్పదించడం తద్వారా వాస్తవ భౌతిక ప్రపంచపు(Real Physical World Experience) అనుభవాన్ని పొందేందుకు అగ్ మెంటెడ్ రియాలిటీ తోడ్పడుతుంది. వాస్తవ ప్రపంచ అనుభవాలను మరింత మెరుగైన రీతిలో అందించేందుకు వర్చువల్ సమాచారం (Virtual Information)తో పాటు వాస్తవ ప్రపంచ వాతావరణాన్ని(Real World Environment) కూడా అగ్ మెంటెడ్ రియాలిటీలో ఉపయోగిస్తారు.
స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిం చడం ద్వారా అగ్ మెంటెడ్ రియాలిటీని యాక్సెస్ చేయడంతో పాటు, వినియోగదారులు వాస్తవ ప్రపంచంలో తమ ఉనికిని నియంత్రించ వచ్చు.

వర్చువల్ రియాలిటీ
ఇది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా కాల్పనిక ప్రపంచ అనుభవాలను మెరుగుపరుస్తుంది. ఇది ఒక వర్చువల్ లేదా కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి అందులో వినియోగదారులను లీనమయ్యేలా చేస్తుంది. హెడ్‌సెట్‌ను ఉపయోగిం చడం ద్వారా దీనిని యాక్సెస్ చేయవచ్చు. మరియు వినియోగదారులు కంప్యూటర్ సిస్టమ్ ఆధారంగా నియంత్రించబడతారు.
మిక్స్డ్ రియాలిటీ
వాస్తవ ప్రపంచంలో డిజిటల్ ఉపకరణాలను ప్రవేశపెట్టడం ద్వారా వర్చువల్ ప్రపంచమైన అంతర్జాలంలోకి వాస్తవ ప్రపంచాన్ని విలీనం చేయడాన్ని మిక్స్డ్ రియాలిటీగా చెప్పవచ్చు.
వినియోగదారులు వీఆర్ హెడ్ సెట్స్, ఏఆర్ గ్లాసెస్ మరియు స్మార్ట్‌ఫోన్స్ ద్వారా సమావేశాల నిర్వహణ, పనుల కొరకు మరియు గేమింగ్ తదితర అంశాల కొరకు వర్చువల్‌గా కలుసు కోవచ్చు. అంతే కాకుండా సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్ తదితర అంశాలను మిళితం చేసుకొనే డిజిటల్ రియాలిటీగా మిక్స్డ్ రియాలిటీని చెప్పవచ్చు.
మెటావర్స్ – అనువర్తనాలు :
i) కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రత్యక్షంగా హాజరై విధులు నిర్వర్తించడం కన్నా, ఇంటి నుండి పని చేయడానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇంటి నుండి పనిచేసే సంస్కృతికి మెటా వర్స్ను ఒక చక్కటి సాధనంగా
ఉపయోగించవచ్చు.
ii) ఒక వ్యక్తి ఆడుకోవడానికి, పని చేసుకోవడానికి, ఇతరులతో వర్చువల్‌గా అనుసంధాన మయ్యేందుకు మెటావర్స్ తోడ్పడుతుంది.
iii) మెటావర్స్ ద్వారా వర్చువల్‌గా జరిగే వర్క్ ఈవెంట్లు, కాన్ఫరెన్స్‌లు, వర్చువల్ వెకేషన్ మరియు ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లకు హాజరు కావచ్చు.
iv) ఒక వ్యక్తి భౌతిక ఆస్తులను ఏ విధంగా కల్గి ఉన్నారో, అదేవిధంగా వర్చువల్‌గా మెటావర్స్ ద్వారా ఆస్తుల క్రయ, విక్రయాలు నిర్వహించవచ్చు.
v) క్రిప్టోకరెన్సీల వాణిజ్యానికి కూడా మెటావర్స్ తోడ్పడుతుంది.
vi) మెటావర్స్ ద్వారా వినియోగదారులు వర్చువల్ ప్రాపర్టీని కూడా సృష్టించ వచ్చు.
సవాళ్ళు :
i) మౌళిక సదుపాయాలు

- మెటావర్స్ కొరకు విస్తృత స్థాయిలో హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ మరియు కంటెంట్ వంటి వనరులు అవసరం. ఈ వనరులను సృష్టించడానికి భారీ స్థాయి పెట్టుబడులు కావాలి. ఇవన్నీ ఒకే కంపెనీతో నిర్మించబడడం అసాధ్యం.
- మెటావర్స్‌ను అమలులోకి తెచ్చేందుకు ప్రస్తుతమున్న మౌళిక సదుపాయాలు సరిపోవు. దీని కొరకు సాంప్రదాయ ఇంటర్నెట్ కన్నా విస్తృతమైన మరియు సంక్లిష్టమైన ప్రమాణాలు (Standards) కల్గిన ఇంటర్నెట్ అవసరం.
- గూగుల్, అమెజాన్ లాంటి బలమైన, పెద్ద కంపెనీలు ఏకతాటిపైకి వచ్చి పెట్టుబడులు పెడితే మెటావర్స్ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ii) నకిలీల సృష్టి :
- మెటావర్స్ దాదాపు వర్చువల్ ప్రపంచం కాబట్టి, దానిని వినియోగించే వారికి సంబంధించిన ముఖలక్షణాలు, వీడియోలు మరియు వాయిస్‌ల యొక్క ఫోర్జరీకి అధిక అవకాశాలుంటాయి.
- వర్చువల్ ప్రపంచంలో ఒక వ్యక్తి యొక్క వివరాలను ఫోర్జరీ చేసే వారిని గుర్తించడం కూడా చాలా కష్టం.
iii) సమాచార గోప్యత మరియు భద్రత :
- మెటావర్స్‌ను ఎవరైనా ఉపయోగిం చాలనుకుంటే వారి వ్యక్తిగత గుర్తింపు కొరకు, లేదా వాణిజ్య ప్రకటనల కొరకు, విభిన్న మార్గాలలో వ్యక్తులను ట్రాక్ చేయడానికి (ఉదా: ధరించగలిగే పరికరాలు, మైక్రోఫోన్లు, హృదయ మరియు శ్వాస కోశ వ్యవస్థల మానిటర్లు) విస్తృత స్థాయిలో సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిల్లో ఏదో ఒక దశలో భద్రతా ఉల్లంఘనలు జరిగితే, అది వినియోగదారుల యొక్క గోప్యతకు హాని కలిగించే ప్రమాదం ఉంది.
- మెటావర్స్ ద్వారా వర్చువల్ లావాదేవీల కేంద్రాలలో, ఆర్థిక లావాదేవీలను నిర్వహించే టపుడు, అలాంటి వాటికి భత్ర కల్పించడం చాలా సంక్లిష్టమైన విషయంగా సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- ఇలాంటి పరిస్థితుల్లో మెటావర్స్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం సురక్షితమేనన్న భరోసా వినియోగదారుల్లో కల్పించడం కొరకు భగీరథ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.
iv) నియంత్రణ మరియు చట్టపరమైన సమస్యలు :

- మెటావర్స్ ద్వారా విభిన్న రకాల డొమైన్ల నుండి విభిన్న రకాల స్థాయిల్లో వినియోగదారులు ప్రపంచ వ్యాప్తంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరందరినీ నియంత్రించడం కూడా తలకు మించిన భారంగా మారుతుంది.
- న్యాయ అధికార పరిధిని గుర్తించడం, చట్టాలను రూపొందించడం కూడా సంక్లిష్టమేనని ఆయా రంగాల నిపుణులు భావిస్తున్నారు.
- మెటావర్స్‌ను ఏ విధంగా నియంత్రించాలన్న అంశానికి సంబంధించిన అధికార పరిధి విషయంలో విభిన్న దేశాల మధ్య విభేదాలు పొడసూపే అవకాశాలను తోసిపుచ్చలేము.
v) యాజమాన్య మరియు ఆస్తిపరమైన హక్కులు :
- మెటావర్స్ ద్వారా వాస్తవ ప్రపంచ విలువను కలిగి ఉండే విభిన్న రకాల వర్చువల్ వస్తువులు, ఆస్తులు కొనుగోలు మరియు అమ్మకాలను నిర్వహించవచ్చు. ఉదా।। విభిన్న రకాల డిజిటల్ ఆస్తులు, టోకెన్లు.
- కళలు, సంగీతం, వీడియోలు వంటి వర్చువల్ ఆస్తులు, వాస్తవ ప్రపంచ విలువను కలిగి ఉంటాయి. ఇలాంటి వస్తువులపై యాజమాన్య హక్కులు లేదా ఆస్తులను మంజూరు చేయడం, ధృవీకరించడం మరియు నిరూపించడం కూడా పెద్ద సవాలని చెప్పవచ్చు.
vi) వాస్తవికతతో సంబంధాన్ని కోల్పోవడం :

- ముందే చెప్పుకున్నట్లు మెటావర్స్‌లో అగ్మెంటెడ్, వర్చువల్ మరియు మిక్స్డ్ రియాలిటీలు కీలక పాత్ర పోషిస్తాయి. వినియోగదారులు అందులో లీనమై ఉండాలి.
- ఈ విధంగా లీనం కావడం వల్ల వ్యక్తులు తాము ఉంటున్న ప్రదేశం మరియు సమయానికి సంబంధించిన అంశాలు కూడా వక్రీకరించ బడవచ్చు. అనగా తాము ఏ సమయంలో ఎక్కడ ఉన్నామో కూడా తెలుసుకోలేని పరిస్థితి లోకి వెళ్ళవచ్చు. తద్వారా వారు వాస్తవ ప్రపంచంతో సంబంధాన్ని కోల్పోవచ్చు.
vii) ఇతరాలు
మెటావర్స్‌లో నైతిక పరిశీలన(Censorship), కమ్యూనికేషన్ల నియంత్రణ, పన్నుల నివేదన(Tax Reporting), అంతర్జాల అరాచకత్వం (online Radicalization) నివారణ లాంటి ఎన్నో సమస్యలున్నాయి.
చివరిగా : మెటావర్స్ అనేది అనేక అవకాశాలు మరియు సవాళ్ళతో ప్రస్తుత మరియు రాబోవు తరాలను ఊరిస్తున్న ఒక సరికొత్త విప్లవమని చెప్పవచ్చు. ఒకవైపు మెటావర్స్ ఎలాంటి అవాంతరాలు మరియు అవరోధాలు లేని పరస్పర చర్యలను విభిన్న స్థాయిలలో సాకారమయ్యేట్లు చేస్తుండగా, మరోవైపు దీని ద్వారా జరిగే విభిన్న చర్యలు సురక్షితంగా జరిగేందుకు గానూ పలురకాల ధృవీకరణ వ్యవస్థల (verification systems)ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
ఈ సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకోవడంలో మనం ప్రారంభదశలో ఉన్నప్పటికీ, దీనిలో భాగస్వాములయ్యేందుకు వినియోగదారులు దీనిపట్ల స్పష్టమైన అవగాహన మరియు బాధ్యాయుతమైన ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మెటావర్స్ ద్వారా సురక్షితమైన మరియు మెరుగైన ప్రయోజనాలను పొందగలమనడంలో ఎలాంటి సందేహం లేదు.
-పుట్టా పెద్ద ఓబులేసు,
ఎ : 9550290047