సంస్కృతీ వాహకులు గుర్రపు పటం కథ కళాకారులు


సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీరూపం తెలంగాణ రాష్ట్రం. ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను ఒక తరం నుంచి మరొక తరానికి అందించడంలో అనాది నుంచి తెలంగాణ ప్రజలు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు, చేర్పులతో, నూతన ధోరణులు అవలంభిస్తూ వస్తున్న జానపద విజ్ఞానంలో సంస్కృతీవాహకులుగా ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదే క్రమంలో మొదటి నుంచి తెలంగాణ జానపద కళారూపాలకు పెట్టింది పేరు. కళలను ప్రొత్సహించడంలోను, ఆదరించడంలోను తెలంగాణ ప్రజలకు ఉన్న నిబద్ధత మరెవ్వరికి ఉండదు. ఐతే మారుతున్న పరిస్థితుల ప్రభావమో, ప్రజల ఆదరణ లోపమో తెలవదు కాని, కొందరు సాంప్రదాయ లేదా వృత్తి కళాకారులు తమ కళా ప్రదర్శనలకు దూరమవుతున్నారు. దీంతో అతి ప్రాచీనమైన సంప్రదాయ, జానపద కళారూపాలు ఎన్నో అంతరించి పోయాయి. మరికొన్ని అంతరించి పోయే దశలో ఉన్నాయి. అలాంటి జానపద వృత్తి కళారూపాల్లో ‘గుర్రపు పటం కథ’ను ప్రధానంగా పేర్కొనవచ్చు.


గుర్రపు పటం కథను ప్రదర్శించే కళాకారులు గుర్రపువాళ్లు లేదా గుర్రపు మల్లన్నలు. వీరినే గుర్రపోల్లు అని, గుర్రపు మల్లయ్యలు అని కూడా అంటారు. మాలలకు (మన్నెపు) ఆశ్రితులు. మాల వారికి సంబంధించిన ‘మాల చెన్నయ’ పురాణాన్ని పటం ఆధారంగా ప్రదర్శిస్తారు. ఈ బృందాల కలాకారులే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి హక్కుగా వస్తున్న మిరాశి గ్రామాల్లో కథా ప్రదర్శనలు చేస్తూ తమ ధాతృ కులాన్ని సంతోష పరుస్తుంటారు తెలంగాణలోని పూర్వపు వరంగల్‍, కరీంనగర్‍, మెదక్‍ జిల్లాల్లో మాత్రమే గుర్రపువాళ్ల ఉనికి ఉంది. పూర్వపు రోజుల్లో వందల సంఖ్యలో ఉన్న వీరి జనాభా ఈ రోజు చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా పటం కథను ప్రదర్శించే కళాకారులు సైతం ఇతర వృత్తులను చేపడుతుండటంతో రోజురోజుకు కళాకారుల సంఖ్య తగ్గుతూ ఉంది. ఐతే ప్రస్తుతం ఈ గుర్రపు కళాకారుల సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టేంత మందే ఉండటం బాధాకరం. జిల్లాకు ఒకరిద్దరు కళాకారులు మాత్రమే ఉండటంతో కథా ప్రదర్శనలో ఇతర కళాకారుల సహకారం తీసుకుంటూ తమ కళామయ జీవితానికి గౌరవాన్ని ఆపాదిస్తున్నారు.


కట్టడి లేదా త్యాగం లేదా మిరాశి ఉన్న గ్రామాలలోని మాల కులస్థుల వద్దకు రెండు లేదా మూడు లేదా ఐదేండ్లకొకసారి వెళ్తారు. కులం మరియు కులపెద్ద నిర్ణయం మేరకు ప్రదర్శనలు ఇచ్చి త్యాగం మరియు ప్రదర్శనా ప్రతిఫలాన్ని వసూలు చేస్తారు. ఒకవేళ ప్రదర్శనలు లేకపోతే కేవలం త్యాగం మాత్రమే వసూలు చేసుకొని, ఇంకొక కట్టడి ఉన్న గ్రామానికి వెళ్తారు. కథా ప్రదర్శనలు లేకున్నా కూడా సంబంధిత కులంవారు త్యాగం ఇవ్వవలసిందే. ఒకవేళ కులపెద్ద నిర్ణయం మేరకు ప్రదర్శనలు ఉంటే త్యాగంతో పాటు అదనంగా కొంత మొత్తాన్ని (డబ్బు లేదా ధాన్యం) చెల్లించవలసి ఉంటుంది. పూర్వం ఒక్కొక్క ఊరిలో త్యాగం క్రింద బేడ, పావుల లేదా ముబ్బెడ (36పైసలు), సోలేడు (ధాన్యం) బత్తెం ఉండేది. ఆ తర్వాత రూపాయి లేదా రెండు రూపాయలు, సోలేడు తవ్వెడు బత్తెం ఇచ్చేది. ప్రస్తుతం ఆయా గ్రామాలలోని మాలవారి కుటుంబాల సంఖ్యను బట్టి పదివేలరూపాయల నుంచి ఇరువై, ముప్పై, నలభై వేల రూపాయల వరకు త్యాగంగా వసూలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రదర్శనలు లేదా త్యాగం వసూలు అయ్యే వరకు మాల కులస్థులే వీరికి భోజన సదుపాయం ఏర్పాటు చేయాలి. ఈ రోజుల్లో మాత్రం కళాకారుల కుటుంబాలకు సరిపోను వంటసామాగ్రి అందిస్తే వారే వండుకొని తింటున్నారు.


గుర్రపు వాళ్ల ఆవిర్భావ చరిత్ర :
గుర్రపువాళ్లు ప్రదర్శించే మాలచెన్నయ్య పురాణంలోనే మాలవారు, గుర్రుపువారి పుట్టుక లేదా ఆవిర్భావం గురించిన చరిత్ర ఉంటుంది. నిజానికి గుర్రపువాళ్లు, మాలవారు ఒకే తల్లిదండ్రులకు జన్మించారు. అనుకోని పరిస్థితుల్లో విడిపోయి గుర్రపువాళ్ళు మాలవారికి ఆశ్రితులుగా మారుతారు. మాల చెన్నయ పురాణం ప్రకారం శివకంఠమాల, శర్లమహాదేవి భార్యభర్తలు. వీరికి ఐదుగురు మగ సంతానం. వీరి పేర్లు చెన్నమల్లు, మాల, మాష్టి, పంబాల, యలమదొర. పెద్దకొడుకు చెన్నమల్లు, అందరు పెరిగి పెద్దవారవుతారు. నడిపివాడు పెండ్లి చేసుకుంటానంటాడు. పెండ్లికి గుర్రం అవసరం వస్తుంది. గుర్రాన్ని పెద్దవాడైన చెన్నమల్లు శ్రీరాములవారి వద్దకు వెళ్లి తీసుకువస్తాడు. గుర్రంపై పెండ్లి కొడుకును ఊరేగిస్తారు. అనంతరం చెన్నమల్లు గుర్రాన్ని తిరిగి అప్పగించేందుకు వెళ్తాడు. చెన్నమల్లు గుర్రం ఇచ్చిన శ్రీరాముని వద్దకు వెళ్ళగానే కొన్ని పనులు చేయమని పురమాయిస్తాడు. చెన్నమల్లుకి ఏలెతనం, తహసీలు (రకం/పన్ను/శిస్తు) వసూలు చేసే పని అప్పగిస్తాడు. తహసీలు వసూలు చేసే సరికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యంలో తమ్ముని పెండ్లి విందుకు సరియైన సమయంలో చెన్నమల్లు హాజరు కాలేకపోతాడు. భోజనాల సమయం కావడం, అందరికి ఆకలి కావడంతో, తట్టుకోలేక తల్లిదండ్రులు, అన్నదమ్ములు కలిసి పెద్దవాడు చెన్నమల్లు కోసం కొంత భోజనం వారకు (ప్రక్కకు) పెడతారు. కన్నమా ఇస్తారులో ఐదాకులు, ఐదుపోగులు, ఐదుపోలు ముంతలను అనుగుంజ దగ్గర పెట్టి వారకు పెట్టిన అన్నం కూడా అక్కడనే పెడతారు. అందరు భోజనం చేయగానే చెన్నమల్లు వస్తాడు. ఆదే సమయంలో ఒక తమ్ముడు పెద్దన్నను పిలిచి వారకు పెట్టిన అన్నం తినమని అంటాడు.
పెద్దవాడు సదరు పెట్టిన అన్నం తింటాను కాని, వారకు పెట్టిన అన్నం తినను అని జవాబిస్తాడు. నాకు వారకు అన్నం ఎందుకు పెట్టారు? నా తప్పు ఏంటిదో చెపితే కాని నేను తినను అని భీష్మించుక కూర్చుంటాడు. దానికి తల్లిదండ్రులు, తమ్ములు ఏ విధమైన సమాధానం చెప్పకుండా, మేము నీకు సమాధానం చెప్పలేం, దానికి దేవతలే సమాధానం చెబుతారని బదులు చెపుతారు. శివుడు, బ్రహ్మ, విష్ణు, వినాయకుడు, వీరభద్రుడు, మునీశ్వరుడు, దండివాహన, వాల్మీకి, వశిష్టుడు అందరూ సమావేశమైన మందిరం వద్దకు అన్నదమ్ములు, తల్లిదండ్రులు బంధువులు, వెళ్తారు. నేరుగా శంకరుని వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా చెపుతారు. అనంతరం తన తప్పు ఏమిటి? తనకు అన్నం వారకు ఎందుకు పెట్టినారో చెప్పమని శివుడిని చెన్నమల్లు అడుగుతాడు. నారదుడు కల్పించుకొని మీకు ‘అడితివాడు’ పుట్టిండా? అని అడుగుతాడు. నేను ముష్టి బిచ్చమెత్తుకొని నూరుమందికి పెడుతున్నాను కాని, వారకు పదార్ధం పెట్టినవాడు ఇంతవరకు పుట్టలేదని చెప్పినాడు. అందరితో సమానంగా అతనికి అన్నం పెట్టకుండా వారకు ఎప్పుడైతే పెట్టినావో అప్పుడే అతడు నీకు అడ్తివాడైనాడు. గుర్రం కోసం వెలివేయబడి అడ్తివాడు కావడం వల్ల నాటి నుండి చెన్నమల్లు ‘గుర్రపు మల్లన్నగా’ మారినాడు. అప్పటి నుండి గుర్రపు మల్లన్నగా మన్నెపువాళ్లను (మాల) ఆశ్రయించి బతుకుతున్నాడు. అతనికి మన్నెపోల్లు అన్నం పెట్టి తల్లిదండ్రులైనారు. తినేవాడు కొడుకైనాడు. ఎప్పుడైతే చెన్నమల్లునికి గుర్రపు మల్లన్న అని శివుడు నామకరణం చేశాడో ఆ రోజు నుంచి మాలవారికి అడితివాడుగా (ఆశ్రితుడు) జీవిస్తున్నాడు. ఈ విధంగా గుర్రపు మల్లన్న, గుర్రపువానిగా మారి మాలవారికి కథలు చెపుతూ ఆశ్రితుడుగా జీవిస్తున్నాడు.


ప్రదర్శనలు :
మాలవారికి ఆశ్రితులైన గుర్రపువాళ్లు ‘మాల చెన్నయ్య’ పురాణం ప్రర్శిస్తాడు. పూర్వం ఈ పురాణాన్ని పుక్కిటి పురాణంగా వివరించేది. ఆ తరువాత కథాగాన రూపంలో ప్రదర్శించారు. సమాజంలోను, ప్రేక్షకుల అభిరుచిలోను వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని కళాకారులు తమ ప్రదర్శనను పటం రూపంలో ప్రదర్శించడం ప్రారంభించారు. ప్రస్తుతం పటం ఆధారంగా ప్రదర్శిస్తున్నా, ప్రేక్షకుల్ని మరింత ఆకట్టుకునేందుకు కథకనుగుణంగా పాత్రలు ధరిస్తూ యక్షగానం మరియు పటం ఆధారిత కథాగాన శైలిలో ప్రదర్శిస్తున్నారు.
గుర్రపు వాళ్లు ప్రధానంగా మాలచెన్నయ్య కథ లేదా భస్మ యోగం కథను ప్రదర్శిస్తారు. భస్మయోగాన్నే ‘బసవపురాణం’ అంటారు. పటం ఆధారంగా యక్షగాన, కథాగాన శైలిలో నాలుగురోజులు కథ ప్రదర్శించి, ఐదవరోజు భేతాళపూజ మరియు బలి కార్యక్రమం నిర్వహిస్తారు. మాలచెన్నయ్య పురాణంలో 1. శక్తి విలాసం(శక్తి పురాణం), 2. భేతాళ పురాణం లేదా బసవయోగం, 3. విరాట పురాణం 4. చర్ల మహాదేవి పరిణయం, 5. భేతాళకథను ప్రదర్శిస్తారు. ఒక్కొక్కరోజు ఒక్కోకథ ప్రదర్శించి, చివరిరోజైన ఐదవరోజు భేతాళ కథ చెప్పి ఆ తరువాత యాటను కోసి బలి చల్లుతారు. కాగా ప్రస్తుతం ప్రదర్శనలను నాలుగు రోజులకు కుదించి మూడవరోజు చెప్చే విరాట పురాణంను రెండవరోజు భేతాళ కథతో పాటు ప్రదర్శించి నాలుగవ రోజే కథలు ముగిస్తున్నా.


మాల కుల పెద్ద ఇంటి ముందుగాని, వారి వాడలోని విశాలమైన ప్రదేశంలోగాని, నాలుగు వీధుల కూడలిలోగాని స్టేజి ఏర్పాటుచేసుకొని కథ ప్రదర్శిస్తారు. కథా ప్రారంభంలో పటంపై ఉన్న భేతాళుని బొమ్మ కనిపించేలా స్టేజికి వేలాడదీసి భేతాళ పూజ చేసి ప్రారంభిస్తారు. కథ చెప్పేందుకు ఐదు లేదా ఏడు మంది కథకులు ఉంటారు. ప్రధాన కథకుడు కథ చెపుతుంటే ఇద్దరు సహాయకులుగా ఉంటూ మద్దెల లేదా తబలా వాయిస్తూ ఉంటారు. ఐతే యక్షగాన శైలిలో ప్రదర్శిస్తున్నందున ప్రధాన కథకునితో పాటు ఇద్దరు సహాయకులు పాత్రోచితమైన వేషధారణతో ఉంటారు. మరొకరు జోకర్‍ లేదా బఫూన్‍ పాత్ర ధరించగా, హార్మోనియం, మద్దెల/తబలా, తాళాలు వాయించే వారు వేరుగా ఉంటారు. ఒక్కొక్కసారి కళాకారులు తక్కువ పడితే పాత్రధారులే వాయిస్తూ కథలో నిమగ్నమవుతారు.
ఆదిశక్తి, గణపతిదేవులను ప్రార్ధించి కథను ప్రారంభిస్తారు. ప్రదర్శనలో భాగంగా కథను ప్రారంభించే సందర్భంలో వీరభద్రుడు, భేతాళుడు జన్మించినపుడు, చర్లమహాదేవి పెళ్లి జరిగినపుడు కొబ్బరికాయ కొడతారు. శివపార్వతుల కళ్యాణం జరిగినపుడు నిజమైన కల్యాణం మాదిరిగా జరుపుతారు. కొత్తచీర, రవిక, ధోవతి తీసుకవస్తారు. వధూవరుల పేరిట కట్నాలు చదివిస్తారు, మంగళహారతి పాటలు పాడుతారు, అక్షింతలు చల్లుతారు. భేతాళుడు, కళ్యాణరాజుకు జరిగే యుద్ధ సమయంలో భేతాళరాజు మరణించినపుడు బలికత్తి వద్ద యాటను కోస్తారు. కథలో భాగంగా ముఖ్యమైన ఘట్టాలు వచ్చినపుడు మరియు చివరలో మంగళహారతి పట్టినప్పుడు కూడా ప్రేక్షకులు కట్నాలు చదివిస్తారు.


ఆదిశక్తిపూజ :
మాల కులస్థులు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షిస్తూ నాలుగవరోజు భేతాళుడు కథ కొంత• చెప్పి యాటను కోసి బలి చల్లుతారు. ఇది కేవలం మాలవాడలో, వారి ఇళ్ల మీదనే చల్లుతారు. బలి చల్లేరోజు మాలవారు తమ ఇళ్లను శుభ్రంగా అలికి, ముగ్గులు వేసుకుంటారు. పోచమ్మ పండుగ చేసినట్లుగానే చేస్తారు. పెద్దమాల భార్య నివాళి చేస్తే, మిగతా వారందరు నివాళి, కంకణాలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు వంటి పూజాసామానుతో ఊర పోచమ్మ వద్దకు డప్పు చప్పుళ్లతో వచ్చి పూజలు జరుపుతారు. గ్రామదేవతలు ఎవరు ఉంటే వారికి పూజలు నిర్వహిస్తారు.
గ్రామంలోని గౌడ కులపెద్ద ఇంటి నుంచి ఘటం కుండ తీసుకవస్తారు. మాలవారందరు బోనం వండుతారు. ఇంటినుంచి డప్పుచప్పుళ్లతో గుంపుగా బోనాలతో బయలుదేరి ప్రదర్శనా వేదిక వద్దకు వస్తారు. వేదికపైన భేతాళుడి బొమ్మ ఉన్న పటం ముందు ఘటం కుండను బోనాలకు ఒకదాని ప్రక్కన మారొకటి పెడతారు. ప్రతీబోనం నుంచి కొంత తీసి ఐదు పడులుగా నైవేద్యం పెడతారు. మాల కులపెద్ద ఘటం కుండలోని కల్లును భేతాళుని ముందు ఆరబోస్తాడు. ఆ తర్వాత కత్తికి మొక్కి యాటను కోస్తాడు. బలి గంపలో ఉన్న బియ్యం లేదా గటకలో వేపాకు, యాటకసరు, రక్తం, నిమ్మకాయలు వేసి కలుపుతారు. ఆదిశక్తి పూజ నిర్వహిస్తారు. బలి చల్లే గుర్రపు కళాకారుడు నోట యాట దొబ్బను పెట్టుకొని, మెడలో ప్రేగులు వేసుకొని బలిగంప/ చాటను నెత్తిన పెట్టుకొని గుంపుగా డప్పు చప్పుళ్లతో బయలుదేరుతారు. మాలవారి వాడలో ఇండ్లపైన పశువులకొట్టాలు, పశువులపైన బలి చల్లుతారు. ఆ తరువాత బలియాటను సమాన భాగాలుగా పంచుకొని వండుకొని తింటారు. ఈ విధంగా మాలల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ వారు సుఖసంతోషాల తోను, ఆష్ట్యెశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, వారి చరిత్రను కూలంకషంగా వివరించడమే కాకుండా, చరిత్రలో మాలల ఔన్యత్యాన్ని వివరించే ఈ గుర్రపు వాళ్లు సంస్కృతీ వాహకులుగా నిలుస్తున్నారు. ఇంతటి ప్రతిభా పాటవాలు ఉన్న గుర్రపు కళాకారుల సంఖ్య రోజురోజుకు కనుమరుగవుతుంది. జానపద గిరిజన విజ్ఞాన పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం, వరంగల్లు ఆధ్వర్యంలో ఈ కళాకారులందరిని ఒకే వేదిక మీదికి తీసుకవచ్చి డాక్యుమెంటేషన్‍ చేయడానికి దాదాపు ఇరువై యేండ్లు పట్టింది. ఇంతటి అరుదైన గుర్రపు పటం కథను, కళాకారులను గుర్తించి కాపాడు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతికశాఖతో పాటు విశ్వవిద్యాలయాలు, స్వచ్చందసంస్థల తొడ్పాటు ఎంతైన అవసరం ఉంది.

  • డా।। గడ్డం వెంకన్న
    ఎ : 9441305070

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *