నలభై అడుగుల ఆలయపునర్నిర్మాణానికి నాలుగు దశాబ్దాలా? (జాకారం శివాలయం ఆవేదన)


మనదేశంలోనే ఎత్తైన, సువిశాలమైన తంజావూరులోని రాజరాజేశ్వరాలయ నిర్మాణానికి కేవలం 15 ఏళ్లు పట్టింది. కోణార్క్లోని ప్రపంచస్థాయి సూర్యాలయ నిర్మాణానికి కూడా 15 ఏళ్లే పట్టింది. ఇవి రెండూ ఎప్పుడో వెయ్యేళ్ల నాడు, 800 ఏళ్ల నాడు, ఆధునిక పరికరాలు ఏమీ లేనపుడు, నిర్మాణ స్థల ఎంపిక, రాతి గనుల ఎంపిక, శిల్పుల ఎంపిక, పథక రచన, ఆలయ విడిభాగాలు, వాటిపై రమణీయ శిల్పాలు, ద్వారాలు, స్థంభాలు, గోడలు, దూలాలు, కప్పు, పైన శిఖరం, ముందు మహామండపాలు, ఇలా అన్నీ కొత్తగా చెక్కి, అపురూప ఆలయాలుగా తీర్చి దిద్దటానికి కేవలం 15 ఏళ్లు మాత్రమే పట్టింది.


మరి, కేవలం 40 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తున్న, గర్భాలయం, అర్థమండపం, మహామండపం మాత్రమే ఉన్న మునుపటి వరంగల్‍, ఇప్పటి ములుగు జిల్లా, జాకారంలోని శివాలయ పునర్నిర్మాణానికి 40 ఏళ్లు పడుతుందా అన్నది చిక్కు ప్రశ్న. ఇక అసలు విషయానికొద్దాం. 1990లో నేను, మునుపటి మహబూబ్‍నగర్‍ జిల్లా కొల్లాపురం తాలూకా సోమశిల గ్రామంలో, శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం ముంపుకు గురైన చాళుక్య – విజయనగర మధ్య కాలాలకు చెందిన 15 దేవాలయాలను అదేవూళ్లో ఎగువ ప్రాంతానికి తరలించి పునర్నిర్మాణ కార్యక్రమంలో తలమునకలై ఉన్నాను. హైపవర్‍ కమిటీ పట్టించుకొని ఈ ఆలయాలను పరిరక్షించాలని అప్పటి పురావస్తు ప్రదర్శనశాల శాఖ, సంచాలకులు, డా.వి.వి.కృష్ణశాస్త్రిగారు నిర్ణయించి, ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఆ పని 1983లో ప్రారంభమైంది. 1989-90లో పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి.


వరంగల్‍ జిల్లా జాకారం వద్ద గల రాష్ట్ర పురావస్తు శాఖ రక్షిత కట్టడమైన కాకతీయ గణపతి దేవుని కాలానికి చెందిన ఒక చక్కటి శివాలయం శిథిలమైందనీ, దాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నించాలని, ఆ పనిని మీకే అప్పగించామనీ, వెంటనే అక్కడికి వెళ్లాలని ప్రధాన కార్యాలయం నుంచి పిలుపొచ్చింది. అది ఎండాకాలం. కొల్లాపూర్‍ తాలూకు, జటప్రోలు నుంచి శంకరరెడ్డి, వెంకటస్వామి బృందాన్ని తీసుకొని, వరంగల్‍ కార్యాలయంలోని ఎస్‍.ఎస్‍. రంగాచారి సహకారంతో జాకారం చేరుకున్నాం. ఆలయం, ఊరిబయట పొలాల్లో ఒంటరిగా ఉంది. రోడ్డు పక్కన పట్టు పరిశ్రమ వారి కాలని. ఆ ఇళ్లలో ఒక ప్రభుత్వ రెసిడెన్సియల్‍ పాఠశాల నడుస్తుంది. ఒక్క ఇళ్లు కూడ ఖాళీ లేదు. అబ్బాపురం పోయే దారిలో ఒక పెద్ద చింతచెట్టు ఉంది. దానికిందే సామానుతో సహా మా బస. దానికిందే వంటా వార్పూ, పడక.


జాకారం శివాలయం చూడముచ్చటగా ఉంటుంది. నక్షత్రాకారపు ఉపపీఠం (ఇదే ఎత్తైన ప్రదక్షిణాపథం), దానిమీద గుర్భాలయం, అర్థమండపం, మూడు వైపులా ప్రవేశద్వారాలతో రాతికిటికీలతో మూసిన గోడభాగం గల మహా(రంగ) మండపం, ముందు అటూఇటూ ఏనుగు శిల్పాలు, నడుమ ఎత్తైన మెట్ల వరుస. ఆలయం, అధిష్ఠానం పాదవర్గం, ప్రస్తరం (కప్పు) వరకు రాతి కట్టడం, ఆపైన ఇటుక, సున్నంతో నిర్మించిన విమానం పడిపోయి, ఆలయం చుట్టూ పడి ఉన్న ఇటుకలు, సున్నపుగార. గర్భాలయ, అర్థమండప, మహామండప ప్రవేశ ద్వారాలపై కాకతీయ కళకు అద్దం పడుతున్న శిల్పాలు, కప్పురాళ్లపై శిల్పం ఆలయం ముందు గల చింత చెట్టు కిందగల వినాయక శిల్పం, గర్భాలయంలో నామమాత్రంగా మిగిలిన శివలింగం, ఈ ఆలయం క్రీ.శ.13వ శతాబ్ది మధ్య కాలానికి చెందినదని చెప్పటానికి ఆధారాలు. ఇక్కడ ఒక్క శాసనం కూడా లేదు.


జాకారం శివాలయం పూజారిగా పందికుంటకు చెందిన ఒక మంచి మనిషి ఉండేవాడు. అతడు మాకు అన్ని విధాలా సహకరించాడు. అలా నెలరోజుల పాటు ఆరుబయటే పడుకొని, ఆలయ విడి భాగాలపై, నంబర్లు వేసి, ఊడదీసే పనిని 1990 జూన్‍లో కొంత వరకు పూర్తి చేశాం. 1999లో మరోసారి, మిగిలిన భాగాన్ని ఊడదీశాం. ఆ తరువాత దాదాపు 10 ఏళ్లు నిధులు లేక పనులు నిలిచిపోయాయి. 2004లో నేను డెపుటేషన్‍పై నేషనల్‍ ఇన్ట్సిట్యూట్‍ ఆఫ్‍ టూరిజం హాస్పిటాలిటీ సంస్థకు వెళ్లాను. ఆ తరువాత మిగిలిన పనులను పురావస్తుశాఖ చేపట్టింది. ఆధునిక పునాదులపై మళ్లీ నిర్మించే పని కప్పు వరకూ వచ్చి ఆగిపోయింది. గోడలు, దూలాలపై కప్పు పడితే జాకారం శివాలయానికి పూర్తి ఆకారం చేకూరి, వి.వి.కృష్ణ శాస్త్రిగారి ఆశయం సిద్ధించి, కాకతీయ వారసత్వ కట్టడాన్ని పరిరక్షించుకోగలిగామన్న తృప్తి మిగులుతుంది. మిగిలిన పని త్వరలోనే పూర్తౌతుందని ఆశిద్దాం. అంతకంటే ఏమీ చేయలేం!


-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *