‘‘ఉత్తములు ఎప్పుడు ఎదుటివారిలో మంచితనాన్నే చూస్తారు’’ – గౌతమబుద్ధుడు
మనిషి విషపూరిత ఆలోచనలతో సంచరిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రాచీన జానపద కళలను గురించి పట్టించుకునే వాళ్ళెవరు. వాటిని గురించి మాట్లాడే వాళ్ళెవరు, రాసేవాళ్ళెవరు? పురాతన కట్టడాల ప్రాముఖ్యతను గురించి చెప్పే వాళ్ళెవరు. వాటి సంరక్షణ కోసం అహర్నిశలు పాటుపడే వాళ్ళెవరు? ప్రకృతిని గురించి, పర్యావరణ సంరక్షణ గురించి నేటి సమాజానికి కనీస అవగాహన కలిగించేవాళ్ళెవరు? ఇట్లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే దక్కన్ ల్యాండ్ మాస పత్రిక. తెలంగాణ ఉద్యమకారుడు. పర్యావరణ ప్రేమికుడు అయిన యం. వేదకుమార్ సంపాదకత్వంలో 2012 సెప్టెంబర్ నుంచి వెలువడుతున్న ‘దక్కన్ ల్యాండ్’ పత్రిక దశాబ్దకాలాన్ని పూర్తిచేసుకొని నేటికీ విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ సందర్భంగా పత్రికకు సంబంధించిన ఓ నాలుగు మాటలు మీతో పంచుకునే అవకాశం కలిగినందుకు ఆనందపడు తున్నాను.
ప్రతి వ్యాపారమయమై, ప్రకృతి కలుషితమైతున్న సమయంలో తన పత్రిక ద్వార, ప్రవర్తన ద్వార మానవ విలువల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న మహర్షి వేదకుమార్. నిజానికి ఒకరిని సంతోష పెట్టడానికి మించిన గొప్ప వ్యక్తిత్వం ఏముంటది. జీవితం శాశ్వతం కానప్పుడు జీవించినంత కాలం మంచిని గడించే మార్గంలో పయణించడమేగా అసలైన జీవితం. ఎప్పుడైనా ఎక్కడైనా మనం చేసే పనిని ప్రేమించడానికి మించిన విజయం ఏముంటది. సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవడానికి మించిన సంతోషం ఏముంటది. అందుకే ఆయనెప్పుడు నిత్యకృషీవలుడై కనిపిస్తడు. నిండైన ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తడు. ఒక మనిషి స్వరూపము, స్వభావమూ రెండూ గొప్పవే అయినప్పుడు వాళ్ళు చేపట్టిన ప్రతిది కళాత్మకంగాను, ఆ ఇల్లు కళాకారుల నిలయంగాను శోభిల్లుతుందనడానికి నిదర్శనమే వేదకుమార్ సార్ జీవితం అనిపిస్తది. దక్కన్ ల్యాండ్ తెలంగాణ ఉద్యమం కీలకదశకు చేరుకున్న సమయంలో మొదలైన పత్రిక. ఉద్యమానికి ఊతమిచ్చిన పత్రిక. ప్రత్యేక తెలంగాణకు ప్రాణమైన పత్రిక. పాటను పతాకస్థాయిలో నిలబెట్టిన పత్రిక. పాట ప్రత్యేకతను చాటిచెప్పిన పత్రిక. విద్యార్థి ఉద్యమాన్ని గుర్తించిన పత్రిక. అమరుల త్యాగాలను ఆకాశానికెత్తిన పత్రిక. ప్రకృతిని పరిరక్షించుకోవాలన్న తపనతో అక్షరయుద్ధం చేస్తున్న అసలు సిసలైన పత్రిక దక్కన్ ల్యాండ్.
తెలంగాణ పోరాటంలో ఎన్నో పత్రికలు పెద్దఎత్తున పని చేసినయి. రాష్ట్ర ఆకాంక్షలకోసం స్థాపించబడిన పత్రికలు రాష్ట్ర ఆవిర్భావంతో అంతర్థానమైనయి. నేను కూడా ఉద్యమసమయంలో ‘వర్జి’ అనే పేరుతో వెలుపరించిన త్రైమాసపత్రిక ఆగిపోయింది. ఇట్ల ఎన్నో పత్రికలు కొంతకాలానికి కనుమరుగై పోయినయి.
ఒకప్పుడు సమాజం పట్ల ఎంతో బాధ్యతాయుతంగా పనిచేసిన పత్రికల్లో ఇప్పుడది కొరపడింది. మనిషి విపరీత ధోరణివల్ల అక్షరం గతి తప్పుతున్నది. అయితే నైతికత కలిగిన వ్యక్తులు ఏ రంగంలో పనిచేస్తున్నా వాళ్ళు తమ బాధ్యతను విస్మరించరని, వృత్తిద్రోహాన్ని తలపెట్టరనే నమ్మకం కొంత ఆత్మ స్థైర్యాన్ని కలిగిస్తది.
మంచి స్వభావం, ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వేదకుమార్ సార్తో సాన్నిహిత్యం కూడా మనలో కొంతమార్పును తీసుకొస్తది. అప్పటిదాక మనం చూసింది, మనకు తెలిసిందే గొప్పదనే బ్రమల్లో బతికే మనకు ఓ కొత్త ప్రపంచం కనిపిస్తది. వేదకుమార్తో ఒకసారి పరిచయం ఏర్పడినవాళ్ళు ఆ జర్నీని అట్లా కొనసాగిస్తూనే ఉంటరు. ఆ కోవకు చెందిన సార్ అభిమానుల్లో నేను ఒకన్ని. ఒకరోజు వేదకుమార్ సార్ హైద్రాబాద్‍లో ఏర్పాటు చేసిన సభ కోసం వచ్చినపుడు ఒక చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. నిజానికి రాస్తే అది ఓ మంచి కథ అయితది. కాని ఆ విషయాన్ని ఎందుకో ఇక్కడ చెప్పాలని అనిపిస్తుంది. ఆ రోజు సాయంకాలం సభానంతరం సడన్‍గా సార్ ఎందుకో నా చెప్పుల వైపే చూస్తున్నట్టు అనిపించింది. అటు ఇటు తిరుగుతూ మళ్ళీ నా చెప్పులనే గమనిస్తున్నడు. ‘సార్ నేను వెళ్తాను’ అని చెప్పే లోపల ‘అంబటి కార్లో కూర్చో’ అన్నడు. సప్పుడుజేయకుండ పోయి కార్లో కూర్చున్న. అంతే కార్ సేలింగ్ క్లబ్ ముందు ఆగింది. అక్కడ ఇంకా చాలా పెద్దవాళ్ళు, జర్నలిస్టులు, వివిధ సంస్థల చైర్మన్లు, కవులు చాలామందే ఉన్నారు. అందరు లోపలికి వెళ్ళిపోయిండ్రు, నేను తప్ప. కారణం నా చెప్పులే. నేను వేసుకున్న ఆ స్లిప్పర్ మోడల్ చెప్పులతో ఆ హోటల్లోకి పర్మిషన్ లేదట. నాకు అప్పుడు అర్థమైంది. సార్ ఎందుకు పదేపదే నా చెప్పుల వైపు చూసిండో. అంతలోనే వేదకుమార్ సార్ వచ్చి వాళ్ళకు ఏదో సర్ది చెప్పి లోపలికి తీసుకుపోయిండు. తర్వాత కొంత అదనపు బిల్ కూడా పే చేయవలసి వచ్చింది. నాకైతే సార్తో ఇట్లాంటి అనుభవాలు అనేకం. సరే ఆ సంగతి ఎట్లున్నా మొదట దక్కన్ ల్యాండ్ పత్రిక ఉద్యమ లక్ష్యాలను పతాక శీర్షికలుగా మార్చింది. తెలంగాణలో గతపాలకులు జరిపిన విధ్వంసాన్ని, దోపిడిని ఎండగట్టడం మొదలు పెట్టింది. తెలంగాణ ఎట్ల తెచ్చుకోవాల్నో, వనరుల్ని ఎట్ల రక్షించుకోవాలో ఇక్కడి సంస్కృతిని ఎట్ల కాపాడుకోవాల్నో విషయనిపుణలతో చర్చలు జరపడం, ఇంటర్వ్యూలను ప్రచురించడం ద్వారా ఉద్యమకారులకు మరింత అవగాహన కల్పించినట్లయింది.
తెలంగాణ పాటలతో ‘ఒక్కొక్కపాటేసి’ సంకలనాన్ని తీసుకురావడం, టి.ఆర్.సి. చర్చ ఆధ్వర్యంలో పాట మీద చర్చ: కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఒకదశలో ఉద్యమానికి పాటే నాయకత్వం వహించిందని తేల్చిచెప్పిన పత్రిక దక్కన్ల్యాండ్. ఈ పత్రికలో 2016 మే, నుంచి అలుగెల్లినపాట శీర్షికన తెలంగాణ కవి గాయకుల జీవిత విశేషాలను పరిచయం చేసే అవకాశం నాకు కల్పించిన దక్కన్ ల్యాండ్ సంపాదకులు వేదకుమార్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ శీర్శిక ద్వారా వెలువడిన ఆ వ్యాసాలన్నింటిని నేను 2020లో అదే ‘అలుగెల్లినపాట’ పేరుతో పుస్తకంగా ప్రచురించినాను.
రాష్ట్ర ఆకాంక్షలతో మొదలైన పత్రిక 2014లో తెలంగాణ ఆవిర్భావం అనంతరం కూడా ‘దక్కన్‍ల్యాండ్’ మాన పత్రిక తన బాధ్యతను విస్మరించలేదు. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల గురించి ప్రజలకు అందించడంలో ముందున్నది. ఆసర పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, రైతుబంధు, దళితబంధు వంటి ఎన్నో పథకాలతో సకలజనులకు న్యాయం జరిగేవిధంగా, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రతి ఫలాలు అందేటట్లు కొనసాగుతున్న పాలన గురించి ఎవరైనా ఓ నాలుగు మంచి మాటలు మాట్లాడితే తప్పేమున్నది? పత్రికలైనా, పార్టీలైనా, ప్రజాసంఘాలైనా, కవులు, రచయితలెవరైనా మంచిని మంచని ప్రచారం చేస్తే ఎవరికి ప్రమాదమో, ఎవరి ఆశలు భగ్నమైతయో అర్థంకాదు.
అయ్యాల రాసుకున్న పాటలను ఇయ్యాల మారిన పరిస్థితులకు అన్వయించుకోవాల్సిన అవసరం లేదా? ఆనాడు చెర్లల్ల నీళ్ళు లేవు, బావులల్ల నీళ్ళు లేవు. వాగు ఎండిపోయిందని గోసపడ్డం. గొంతెత్తి రాగాలు తీసినం. ఎడతెగని సోకాలు బెట్టినం. భవిష్యత్ కరువును ఊహించి ఇయ్యాల కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణం చేసుకొని, కాలడ్డమేస్తే నీళ్ళు నిలబడేటట్టు చేసుకున్నం. ఇవన్ని నిజం కాదా? మనకండ్లముందు ఇన్ని జరిగినా కవులెప్పుడు ప్రతిపక్షంలోనే ఉండాలె. పత్రికలెప్పుడు ప్రజలపక్షమే ఉండాలె. నిజమే అయితే కావచ్చు, కాని ప్రభుత్వమే ప్రజలపక్షమై సకల వృత్తిదారులకు చేయూతనిస్తున్నపుడు, చేనేత వంటి ఇతర కళారంగాలకు ఊపిరై నిలబడ్డప్పుడు, వ్యవసాయాన్ని పండుగ చేసి, రైతుకు భరోసా ఇస్తునప్పుడు, విద్యావసతులు పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నపుడు, అన్ని స్థాయిల ఉద్యోగులకు ఎక్కడా లేని విధంగ జీతాలు పెంచి జీవితాలలో వెలుగు నింపుతున్నపుడు, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా బతికే ప్రణాళికలు రచిస్తున్నపుడు కవులు, పత్రికలు ఎటువైపుండాలన్నది ప్రశ్నే కాదేమో?
మంచిని పెంచకపోతే, మార్పును గ్రహించకపోతే మనం మనుషులం ఎట్లయితం. ఉత్తగనే బట్టగాల్చి మీదేసినట్టు ఏవేవో పత్రికలు, ఛానళ్ళను అడ్డంపెట్టుకొని ఏదంటే దానికి సై అనాల్నా? గుడ్డెద్దు చేలబడ్డట్టు ఎటుబడితే అటు పోవాల్నా, ఆలోచనాపరులు సైతం డూడూ బసవన్నలై జనాన్ని అయోమయానికి గురిచేస్తుంటే అసలు వాస్తవం ఏందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పత్రికలకు లేదా? అంటే ఖచ్చితంగా ఉన్నది. అట్లాంటి పని చేసిన, చేస్తున్న పత్రికే దక్కన్‍ల్యాండ్, పత్రికలైనా, ప్రసారమాధ్యమాలైనా, పార్టీలైనా, వ్యక్తులైనా గాడితప్పుతున్న దేన్నయినా ఎప్పటికప్పుడు సున్నితంగా విషయాన్ని అవగాహన కలిగించే పత్రిక దక్కన్ ల్యాండ్, అప్పుడప్పుడు ఆయా సందర్భాన్ని బట్టి సుతిమెత్తగా చురకలు అంటించి ఒక ప్రత్యేకశైలితో సాగిపోతున్న పత్రిక దక్కన్‍ల్యాండ్.
స్త్రీలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, కవులు, కళా కారులు, రచయితలు, మేథావులు, సంస్కృతి, సాహిత్యం, రాజకీయం అంశం ఏదైనా నిపుణుల అభిప్రాయాలతో ప్రత్యేక కథనాలు ప్రచురించి ఆదర్శవంతమైన సమాజం కోసం ఆరాటపడుతున్న పత్రిక దక్కన్ ల్యాండ్. కొండలు, గుట్టల సంరక్షణ, పర్యాటక కేంద్రాలు, పుణక్షేత్రాలు విశిష్టతలు, అడవులు, ఆదివాసీలు, పురాతన గుళ్ళు, గోపురాలు, శాసనాల సమాచారాన్ని, పురాతత్వ లోలోతుల్ని ప్రజలకు అందించడంలో దక్కన్ ల్యాండ్ కృషి ఎనలేనిది. వివిధ రంగాల్లోని ప్రముఖుల పరిచయాలు, దక్కన్ సినిమా చరిత్ర వంటి ఆహ్లాదకరమైన ఎన్నో అంశాలను కథనాలుగా అందించిన ఘనత దక్కన్‍ల్యాండ్. ఎన్నికల సమయంలో పత్రికలు ఎట్లుండాలి. ప్రజలు ఎట్లుండాలి. ఓటు చైతన్యాన్ని పెంచడానికి ఎవరేంచేయాలి? వంటి ఎన్నో అంశాలతో దక్కన్‍ల్యాండ్ పత్రిక సమగ్రంగ రూపుదిద్దు కున్నది. నిరంతరం తెలంగాణ సంస్కృతిని ఇక్కడి జీవనవిధానాన్ని కండ్ల ముందుంచుతూ, వాటి సంరక్షణ కోసం పరితపించే విధానాన్ని గనుక మనం గమనించినట్లయితే దక్కన్ ల్యాండ్ తెలంగాణ బ్రాండ్ అనిపిస్తది.
అయితే ఈ కథనాలు, అంశాలు ఇతర పత్రికల్లో ఉండవని కాదు, కాని దక్కన్ ల్యాండ్లో వచ్చే ప్రతిది దాచుకోదగినవిగా ఉంటాయి. హైద్రాబాద్ మహానగర విశేషాలు, సందర్శనస్థలాలు, మూసీనది విశిష్టతలను గురించి కేపలం పత్రికలో రాసి వదిలేయకుండా వాటిని గురించి ప్రజలకు అవగాహన కలిగేవిధంగ సభలు, సమావేశాలు నిర్వహించిన ఘనత వేదకుమార్ సారి. చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం వంటి ఇతర చారిత్రక కట్టడాలను సందర్శించడం, ఆ గొప్పతనాన్ని, చారిత్రక వాస్తవాన్ని నలుగురితో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పంచుకోవడం ఆయనకు మహదానందం. చారిత్రక విశేషాలు, అవశేషాలను గురించి ఎవరు చెప్పినా, ఎక్కడ మాట్లాడిన వేదకుమార్ అమితమైన సంతోషాన్ని అనుభవిస్తడు. ఆలోచిస్తడు. ప్రక•తిని ఆస్వాదించడంలో, పర్యావరణాన్ని పరిరక్షించడంలో ఉన్న ఆనందం ఆస్తులు కూడబెట్టడంలో ఉండదన్న సత్యాన్ని గ్రహించినవాడు. గనుక ఏ విధమైన సంచలనాలకు తావీయకుండ పత్రికను పదికాలాల పాటు పదిలపరుచుకోదగిన అంశాలకే ప్రాధాన్యత కల్పిస్తడు. పత్రిక వెలువడిన నాటి నుంచి వాటిని ఇయర్వైజ్ బుక్స్గా బైండింగ్ చేయించి అందించడ మంటే వాటిలో ఎంత విలువైన సమాచారం నిక్షిప్తం చేసి ఉంటాడో మనం అర్ధం చేసుకోవచ్చు.
ఈ రోజుల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే పత్రికలు ఓ వైపు, వెబ్ మ్యాగ్జిన్స్, యూట్యూబ్ చానల్స్ మరోవైపు. పత్రికల నిండా చెత్తాచెదారం పేరుకుపోతున్న ప్రస్తుత సందర్భంలో మంచిని, మానవ సమాజానికి పనికొచ్చే పత్రికను వెతికి పట్టుకోవడం కొంచెం కష్టమే. స్వేచ్ఛకొద్ది ఎవరు ఏం రాస్తున్నరో, ఏం ప్రచారం చేస్తున్నారో అర్థంగాని పరిస్థితి. అక్షరం ఆయుధమే. కాదనలేం. దానికి ఆ విలువ ఎప్పటికీ ఉంటది. కాని ఆయుధాన్ని ఎవరికి వాళ్ళు వాడుకునే పద్దతి భిన్నమైనది. అక్షరజ్ఞానమైనా, ఆయుధవిద్యయినా అందరికీ ఒక్కతీరుగా అబ్బదు. చెడు తొందరగా వ్యాపిస్తది. ఎక్కువమందిని ఆకర్శిస్తదనేది జగమెరిగిన సత్యం. బహుశ కొన్ని పత్రికలు, ఛానెళ్ళు ఈ సూత్రాన్నే అమలు చేస్తున్నాయేమో అనిపిస్తది. ఇట్లాంటి సందర్భంలో కూడా దక్కన్‍ల్యాండ్ పత్రిక తన లక్ష్యాన్ని వీడలేదు.
అక్షరాన్ని ఎప్పుడు వ్యాపారాత్మకం చేయలేదు.
పత్రికలు చదివేవాళ్ళ సంఖ్య తగ్గిపోయిందేమో కాని, సమాచారం తెలుసుకోవాలన్న మనిషి కుతూహాలంలో ఎలాంటి మార్పులేదు. కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న పత్రికలు, ఛానళ్ళ వల్ల ఏది చదవాలో, ఏమి చూడాలో తేల్చుకోలేని స్థితిలో పాఠకులు గందరగోళానికి గురైతున్నరు. అండ్లనే అరచేతిలో వైకుంఠం అన్నట్టు ఈ సెల్ఫోన్ ఒకటి. మానవ సమాజం కుసున్న కానించి లేవకుండ ఎటువైపు పరుగులు తీస్తుందో అర్థం కాదు. పత్రికలో, విషపుత్రికలో తెలుపదు గాని ఇట్లాంటి పరిస్థితులలో వాటన్నింటిని అధిగమించి సామాజిక చైతన్యం కోసం పాటుపడున్న పత్రికలు లేకపోలేదు. అట్లాంటి వాటిలో ప్రథమస్థానం దక్కన్ ల్యాండ్.
మంచి విషయం జనాలకు అంత తొందరగా చేరకపోవచ్చు కానీ, క్రమంగా దాని ప్రభావం సమాజంపై ఉంటుంది. పెరిగిన సాంకేతికత కారణంగా టీవీలు, ఇతర సామాజిక మాధ్యమాల వల్ల రేపటి దినపత్రికలో చూడవలసిన వార్తలన్ని ఈ రోజే చూస్తున్నము. అయినప్పటికీ దక్కన్‍ల్యాండ్ మాసపత్రికను అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత వేదకుమార్. ‘‘ఆంధ్రులు ఆరంభశూరులన్న సంగతేమోగాని, తెలంగాణ బిడ్డలు తెగువగల్ల వీరులు అనేది మాత్రం అనేకసార్లు రుజువైంది. దక్కన్‍ల్యాండ్ మాసపత్రిక స్థాపించిన నాటి నుంచి నిరాటంకంగా పదిసంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుతమైన విషయాలను పాఠకులకు అందించింది. ప్రజలను చైతన్యవంతులను చేసింది. పత్రికను చూడంగానే ముందుగా మనని ఆకర్శించేవి. ఆ అద్భుతమైన ముఖచిత్రాలు, అందమైన పేయింటింగ్స్, ఫోటోగ్రాఫ్స్, కార్టూన్స్. ఆ చిత్రాలు ఎప్పటికీ మనని వెంటాడుతూనే ఉంటయి. అవే కాకుండ మానవీయతను పెంపొందించే విధంగ, ప్రకృతిని పరిరక్షిం చుకునే విధంగ పాఠకులను ఉత్తేజపరిచే వేదకుమార్ సంపాదకీయాలు పత్రికకు ప్రత్యేక ఆకర్శణగా నిలిచినయని చెప్పుకోవచ్చు.
మనందరం ఎప్పటికీ మర్చిపోలేని విషయం ఏందంటే ఈ మానవప్రపంచాన్ని కఠిన ఓ కుదుపు కుదిపేయడం.కంటికి కనపడని అతిచిన్న వైరస్ అన్ని సంస్థలను, వ్యవస్థలను నిర్వీర్యం చేసి మొత్తం ప్రపంచాన్ని దాని గుప్పిట్లో బంధించిందంటే అతిశయోక్తి కాదు. ఈ కఠిన కష్టకాలంలో బంధువులు, స్నేహితులే కాదు, కన్నవాళ్లు, కడుపుల పుట్టినవాళ్ళు కూడా ఒకరినొకరు చూసుకోలేని దయనీయ స్థితి దాపురించింది. ఎటుచూసినా కుప్పలు తెప్పలుగా శవాలు. సామూహిక దహనాలు హృదయవిదారకమైన దృశ్యాలే. శవాలను గ్రామాలకు సైతం రానీయని సంఘటనలు కోకొల్లలు. ఒకటని కాదు కరోన బీభత్సం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇట్లాంటి సందర్భంలో దక్కన్ ల్యాండ్ పత్రిక ప్రజలకు అవగాహన కల్పించడంలో చేసిన కృషి అనిర్వచనీయమైనది.
వేదకుమార్ సార్ సామాజిక విలువల్ని పాదుగొలిపే ప్రయత్నంలో, పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో, గతస్మృతులను జ్ఞాపకం చేయడం కోసం, మానవీయ విలువల్ని పెంపొందించడం కోసం ఒక పత్రికను స్థాపించి పదిసంవత్సరాలపాటు నిరాటంకంగా కొనసాగించడం అనేది అంత చిన్న విషయమేమి కాదు. ఇట్లాంటి అరుదైన పత్రికను కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. దక్కన్‍ల్యాండ్ మాసపత్రిక ఈ పదిసంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి, దేనికీ తలొగ్గక తాను అనుకున్న విధంగా పత్రికను నడిపించడం సంపాదకులు వేదకుమార్‍కే సాధ్యమైంది. ఈ సంద్భంగా పత్రికా ప్రచురణలో భాగస్వాములైన సిబ్బందికి, వ్యాసకర్తలకు ప్రతిఒక్కరికి పేరుపేరునా అభినందనలు, శుభాకాంక్షలు.
-అంబటి వెంకన్న,
ఎ : 94927 55448