సోయి లేని రాతలు, విమర్శలు


కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నేపల్లి, అన్నారం పంప్‍ హౌజ్‍లు నీట మునిగిన తర్వాత చాలా మంది ప్రాజెక్టుపై అక్కసుతో కూడిన వ్యతిరేకతను ప్రదర్శిస్తూ వ్యాసాలు రాస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రతీ సాగునీటి కార్యక్రమాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నవీరు గతంలో మిషన్‍ కాకతీయపై కూడా ‘‘కమీషన్‍ కాకతీయ’’ అంటూ విషం గక్కిన అంశాన్ని తెలంగాణ ప్రజలు మరచిపోలేదు. ఇవ్వాళ్ళ మిషన్‍ కాకతీయ ఫలితాలు ఏ విధంగా
ఉన్నాయో తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి అనుభవంలోకి వచ్చింది. ఇప్పుడు గోదావరి పరీవాహక ప్రాంతంలో కురిసిన అసాధారణ వర్షపాతం వలన వచ్చిన వరదలకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, కన్నేపల్లి పంప్‍ హౌజ్‍ లు నీట మునిగిపోయినవి. కాళేశ్వరం ప్రాజెక్టులో అనేకమైన కాంపోనెంట్స్ లో ప్రమాదానికి గురి అయినవి ఈ రెండు మాత్రమే. ప్రాజెక్టు విమర్శకులు మాత్రం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే మునిగిపోయినట్టు ప్రచారం చేసి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనులు మొత్తం 7 లింకుల్లో, 28 ప్యాకేజీల్లో వివిధ జిల్లాల్లో పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులు తెలంగాణ రాష్ట్రంలో 13 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. 20 జిల్లాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజిలు, 16 జలాశయాలు, మేడిగడ్డ నుంచి కొండపోచమ్మసాగర్‍ దాకా 10 స్టేజిల ఎత్తిపోతలు, అన్ని లింకుల్లో కలిపి 21 పంప్‍ హౌజ్‍లు, 108 భారీ పంపులు(139, 126, 85, 40 మెగావాట్ల రేటింగ్‍ పంపులు), సర్జ్ ఫూల్స్, 98 కిమీ డెలివరీ పైపులు, డెలివరీ సిస్టెర్నస్, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాలువలు, భారీ విద్యుత్‍ సబ్‍ స్టేషన్లు (400, 220, 33 కెవి), వందల కిలోమీటర్ల విద్యుత్‍ లైన్లు.. ఇట్లా అనేక కాంపొనెంట్స్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాయి. వీటి ద్వారా 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకుబీ శ్రీరాంసాగర్‍, వరద కాలువ, నిజాంసాగర్‍, సింగూరు, వనదుర్గా ప్రాజెక్టులు, వేలాది చెరువులు, చెక్‍ డ్యాంల కింద ఉన్న 26.75 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో మొత్తం 45 లక్షల ఎకరాల ఆయకట్టును సాధించడం కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం. ఇప్పటికే శ్రీరాంసాగర్‍, నిజాంసాగర్‍ ప్రాజెక్టుల కింద ఆయకట్టు, వేలాది చెరువులు, చెక్‍ డ్యాంల కింద ఆయకట్టు స్థిరీకరణ చెందింది. ఎప్పుడు నీటి కొరత ఎప్పుడు ఏర్పడితే అప్పుడు ఆ ప్రాజెక్టుల ఆయకట్టుకు కాళేశ్వరం ద్వారా నీటిని అందించడానికి సిద్దంగా ఉన్నది. సింగూరు లింకు పూర్తి కావస్తున్నది. లింకు 4లో ఉన్న అన్నపూర్ణ, రంగనాయక సాగర్‍, మల్లన్నసాగర్‍, కొండపోచమ్మ సాగర్‍ ల కింద సిద్దిపేట, మెదక్‍, సిరిసిల్ల, కరీంనగర్‍ జిల్లాల్లో సుమారు 3 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందించనున్నది. ప్రాజెక్టులో కాలువల వ్యవస్థ నిర్మాణం అవుతున్నాకొద్దీ కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుంది. ఇది ఏ కొత్త ప్రాజెక్టులోనైనా సహజమైన పక్రియ. మిషన్‍ భగీరథ ద్వారా వేలాది గ్రామాలకు, గ్రేటర్‍ హైదరాబాద్‍ నగరానికి, గ్రేటర్‍ హైదరాబాద్‍లో ఉన్న పరిశ్రమలకు నీరు అందించడానికి ప్రాజెక్టులో వ్యవస్థలు సిద్దంగా ఉన్నాయి. శ్రీరాంసాగర్‍ రెండవ దశ ఆయకట్టుకు రెండు పంటలకు నికరంగా నీరు అందించింది. ఈ సంగతి సూర్యాపేట జిల్లాలో చిట్ట చివరి ఆయకట్టు రైతాంగాన్ని అడిగితే ఎవరికైనా తెలిసిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు అనూహ్యంగా పైకి లేచాయని భూగర్భ జల శాఖ నివేదికలు చెపుతున్నాయి. సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా 6 మీటర్లు, రాష్ట్రంలో సరాసరి 4 మీటర్లు పైకి లేచాయని భూగర్భ జల శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. విమర్శకులకు ఈ వాస్తవాలను అంగీకరించే హ•దయం లేదు. కాళేశ్వరం ఒక విఫల ప్రయోగమని ముందే నిర్దేశించుకున్న అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి ప్రాజెక్టు లక్ష్యాలలో ఏ ఒక్కదానినీ కాళేశ్వరం ప్రాజెక్టు నెరవేర్చలేదు, పైగా అనేక సమస్యలు, సవాళ్లకు కారణమవుతోంది అంటూ పాసింగ్‍ రేమార్కస్ చేస్తున్నారు. జూలై సంచికలో అచ్చు అయిన ‘‘గోదావరి వరదలు ప్రకృతి విపత్తె’’ అన్న నా వ్యాసంలో 1986 మరియు 2022 గోదావరి వరదలను పోల్చుతూ గతంలో కంటే రికార్డు స్థాయిలో వరద గోదావరిలో వచ్చింది కాబట్టే కన్నేపల్లి పంప్‍ హౌజ్‍ మినిగిపోయిందని వివరించి ఉన్నాను. ఇది మానవ తప్పిదం అనడానికి ఆస్కారమే లేదు. అన్నారం పంప్‍ హౌజ్‍ మునకకు కారణం కూడా చందనాపూర్‍ వాగులో మునుపెన్నడూ నమోదు కానీ afflux (సుమారు 2 మీటర్లు). ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో చందనాపూర్‍ వాగు కలువక పోవడంతో వాగు పైకి ఎగదన్నినందున, వాగులో ఏర్పడిన affliux కారణంగా అన్నారం పంప్‍ హౌజ్‍ రక్షణ కోసం నిర్మించిన ఫ్లడ్‍ బ్యాంక్స్ పై నుంచి నీరు ప్రవహించి పంప్‍ హౌజ్‍ ను ముంచేసినాయి. విమర్శకులు ఈ ప్రకృతి విపత్తును అంగీకరించడానికి సిద్దంగా లేరు. ఎందుకంటే ఇంతకు ముందు పేర్కొన్నట్టు కాళేశ్వరం ఒక విఫల ప్రాజెక్టు అని నిరూపించడానికి వారు కంకణం కట్టుకున్నారు.


కాళేశ్వరం ఎటువంటి అధ్యయనాలు చేయకుండానే నిర్మించారట !

గోదావరి లాంటి ఒక ప్రధాన నదిపై కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నప్పుడు ప్రస్తుత వరదలాంటి విపత్తులను ముందుగా ఊహించకలేక పోయారు,ప్రాజెక్టు రూప కల్పన సమయంలో ఎటువంటి అధ్యయనాలు జరగలేదన్నది అన్నది మరి కొందరి వాదన. ఎత్తిపోతల పథకాల రూప కల్పనలో తెలంగాణ ఇంజనీర్లు అపారమైన అనుభవాన్ని గడించి ఉన్నారు. ఈ రకమైన వ్యాఖ్యానాలు తెలంగాణ ఇంజనీర్ల విజ్ఞతను పరిహాసం చేయడమే. ఏదైనా ప్రాజెక్టు డిజైన్‍ చేసేటప్పుడు ఆ నదిలో గతంలో అత్యధిక వరద ఎంత వచ్చింది, 100, 500 frequency flood ఎంత అనేది లెక్క గట్టి ప్రాజెక్టును డిజైన్‍ చేస్తారు. ఈ కీలకమైన అంశాన్ని ఊహించలేదు అని వ్యాఖ్యానించడం సోయి లేని రాతల కిందనే పరిగణించాలి. పైగా ప్రాజెక్టుల నివేదికలు తయారు చేయడానికి కేంద్ర జల సంఘం జారీ చేసిన మార్గ దర్శకాలను (guidelines), డ్యాంలు, బ్యారేజీల డిజైన్ల కోసం బ్యూరో ఆఫ్‍ ఇండియన్‍ స్టాండర్డస్ వారి కోడ్స్ను పక్కన బెట్టి డిజైన్‍ చేయడం అనేది ఉండనే ఉండదు. వీరికితెలియవలసిన అంశం ఏమిటంటే.. కేంద్ర జల సంఘం వారు 30.10.2017 న కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు వారు అంచనా కట్టిన 500 years frequency flood పరిమాణం 81,576 క్యూమెక్కులు (28,80,829 క్యూసెక్కులు). కాళేశ్వరం బ్యారేజిని, కర కట్టలను, పంప్‍ హౌజ్‍ రెగ్యులేటర్‍ను ఈ వరదను తట్టుకునే విధంగానే డిజైన్‍ చేయడం జరిగింది. బ్యారేజి నిర్మాణం వలన వచ్చే affluxను కూడా పరిగణనలోకి తీసుకొని 85 గేట్లు అమర్చడం జరిగింది. ఇదే సూత్రం అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు కూడా అనుసరించారు. బ్యారేజిల 3డి నమూనాలపై హిమాయత్‍ సాగర్‍ లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్‍ రీసర్చ్ లాబొరేటరీస్‍ (TSERL)లో మోడల్‍ స్టడీస్‍ కూడా జరిపించి అందులో అనుభవంలోకి వచ్చిన అనేక అంశాలను కూడా బ్యారేజిల డిజైన్లలో, పంప్‍ హౌజ్‍ ల డిజైన్లలో పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇవి ప్రతీసారి తప్పనిసరిగా అనుసరించే పక్రియలు (Mandatory Procedures).


ఎత్తిపోతల నిర్వహణ కోసం ప్రభుత్వం తీసుకొన్న చర్యలు :
ప్రభుత్వం ఎత్తిపోతల నిర్వాహణ అనే కీలక అంశాన్ని చాలా సీరియస్‍ గానే తీసుకున్నది. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు అన్ని సోర్సెస్‍ ద్వారా సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అందులో సుమారు 75 లక్షల ఎకరాలు ఎత్తిపోతల పథకాల కింద ఉండబోతున్నది. వీటి ద్వారా సరఫరా చేసే నీరు ఖరీదైనదన్న విషయం ప్రభుత్వానికి తెలుసు. వీటి సమర్థ నిర్వాహణకు ఏమి చేయాలన్న అంశంపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సాగునీటి శాఖ ఇంజనీర్లు పలుమార్లు వర్క్ షాప్‍ లు నిర్వహించుకున్నారు. ప్రతీ ప్రాజెక్టుకు నిర్వాహణ మాన్యువల్స్ (Operational Manuals) తయారు చేశారు. సాగునీటి శాఖలో ఉన్న ఆస్తుల, ప్రాజెక్టుల వివరాల సూచిని (Inventory) తయారు చేసినారు. డ్యాంలు, బ్యారేజీలు, కాలువలు, గేట్లు, పంపులు, మోటార్లు తదితర సాగునీటి వ్యవస్థల నిర్వాహణకు సాగునీటి శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. 19 ప్రాదేశిక చీఫ్‍ ఇంజనీర్లను (Territorial Chief Engineers) నెలకొల్పింది. Operation & Maintenance కోసం ప్రత్యేకంగా ఒక ఇంజనీర్‍ ఇన్‍ చీఫ్‍ ను నియమించడం జరిగింది. తక్షణం మరమ్మతులు చేయడానికి DEE స్థాయి నుంచి ENC స్థాయి వరకు పరిమితులకు లోబడి ఇంజనీర్లకు ఆర్థిక అధికారాలు దఖలు పరచింది. ఈ అత్యవసర పనుల కోసం ప్రభుత్వం ఏటా 280 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించింది. ఈ మార్పులు సాగునీటి శాఖలో జరిగాయి కనుకనే వానాకాలం ప్రారంభానికి ముందే premonsoon మెయింటెనెన్స్ పనులు జరిగాయి. కనుకనేప్రాజెక్టుల నుంచి అతి భారీ వరదలను సురక్షితంగా, అతి తక్కువ నష్టంతో కిందకు పంపించడం సాధ్యం అయ్యింది.


సాగునీటి శాఖలో అత్యున్నత స్థాయి కమిటీలు ఇప్పటికే ఉన్నాయి. అయినా కూడా అవసరం అయినప్పుడు బయటి నుంచి కూడా నిపుణుల కమిటీలు ఏర్పాటు చేసి వారి నుంచి నివేదికలు స్వీకరిస్తున్నది. ఉదాహరణకు మల్లన్నసాగర్‍ లోకి ప్రయోగాత్మకంగా 10 టిఎంసిల నీటిని నింపినప్పుడు డ్యాం పనితీరును అధ్యయనం చేయడానికి బయటి నుంచి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జల సంఘం హైడ్రాలజీ డైరెక్టర్‍ ఎన్‍ ఎన్‍ రాయ్‍ నాయకత్వంలో Dam Saftey కమిటీ ఏర్పాటు అయ్యింది. కాబట్టి ప్రభుత్వానికి ప్రాజెక్టుల నిర్వాహణపై అవగాహన లేదని వ్యాఖ్యానించడం అసంగతం. ఇటువంటి వ్యాఖ్యానాలు చేసే ముందు కనీసం సాగునీటి శాఖలో ఏమి జరుగుతున్నదో తెలుసుకునే ప్రయత్నం చేయడం కనీస ధర్మం. కానీ వీరెవరూ ఆ ప్రమాణాలు పాటించకపోవడం శోచనీయం.


కాళేశ్వరం తెల్ల ఏనుగట ! :
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వ్యవసాభివృద్దికి ఎంత కీలకమైనదో, ఎంతటి ప్రయోజనాన్ని చేకూర్చేదో ఈ పాటికే ప్రజల అనుభవంలోని వచ్చింది. అయితే ఈ విజయాన్ని జీర్ణించుకోలేని దుష్ట శక్తులు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ పంపులు పనిచేయడం ప్రారంభించిన నెల లోపునే తమ అజీర్తిని వాంతి చేసుకోవడం మొదలు పెట్టినారు. కాళేశ్వరం మొదటి బిల్లుతో ప్రభుత్వానికి షాక్‍ అంటూ అసత్య వార్తలను ఆనాడు వండి వార్చినారు. తమ కల్పనా చాతుర్యంతో కరెంటు బిల్లులతో కాళేశ్వరం భవిష్యత్‍లో తెలంగాణా ప్రజలకు భారం కాబోతున్నది అంటూ వార్తలు, విశ్లేషణలు సోషల్‍ మీడియాలోకి పుంఖానుపుంఖంగా వదిలినారు. ప్రాజెక్టు దేశంలోనే అత్యంత ఖరీదైన నీటిని సరఫరా చేస్తుందని అన్యాయపు నిర్ధారణకు వచ్చినారు. ఇప్పుడూ అటువంటి విశ్లేషణలే చేస్తున్నారు. రాష్ట్రంలో రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందించాలంటే ఎత్తిపోతలు తప్ప మార్గం లేదని అందరూ అంగీకరిస్తున్నదే. అదే సమయంలో ఎత్తిపోతలకు కరెంటు ఖర్చు గురించి గగ్గోలు పెడతారు. అభూత కల్పనలతో ప్రజలను, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఎత్తిపోతలు లేకుండా రాష్ట్రరైతాంగానికి సాగు నీరు ఇవ్వలేము. పంపులు నడిస్తే కరెంటు కాలుతుంది. రాష్ట్రంలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, నాగార్జునసాగర్‍ దిగువ కాలువ(నల్లగొండ), కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‍ సాగర్‍, తుమ్మిళ్ళ (మహబూబ్‍ నగర్‍), భక్త రామదాసు(ఖమ్మం), అలీసాగర్‍, గుత్ప, చౌటుపల్లి హనుమంత రెడ్డి(నిజామాబాద్‍), గూడెం(మంచిర్యాల్‍), ఎల్లంపల్లి (కరీంనగర్‍) పథకాలు విజయవంతంగా రైతాంగానికి సేవలు అందిస్తున్నాయి. 2019 నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతున్నది. మరో రెండు మూడేండ్లలో పాలమూరు రంగారెడ్డి, సీతారామ, డిండీ, చిన్న కాళేశ్వరం, వార్ధా, చనాకా కొరాటా, సంగమేశ్వర, బసవేశ్వర, గట్టు, చెన్నూరు ఎత్తిపోతల పథకాలు సాగునీరు అందించడానికి సిద్దం అవుతాయి. వీటన్నింటికి సుమారు 9-10 వేల మెగావాట్ల కరెంటు అవసరం పడుతుందని ఇంజనీర్లు అంచనా వేసారు. వీటికి ప్రతీ ఏటా 10 నుంచి 15 వేల కోట్ల కరెంటు బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసి ఉంటుంది. భవిష్యత్తులో ఇది ఏ ప్రభుత్వానికైనా తప్పదు. ఈ ఖర్చు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అంశమే లేదు.
తెలంగాణలో ఎత్తిపోతలు లేకుండా రైతాంగానికి నీరు ఇవ్వలేము. ఈ సంగతి కాళేశ్వరం విమర్శకులకు కూడా తెలుసు. కరెంటు ఖర్చుల బూచి చూపి ప్రాజెక్టు విమర్శకులు ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ ప్రచారం జరిగింది. ఉమ్మడి ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల పథకానికి అయినా ఈ కరెంటు ఖర్చు ఉండేదే. తుమ్మిడిహట్టి కట్టి ఉంటే కరెంటు ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా నీళ్ళు ఎల్లంపల్లికి చేరి ఉండేవి అనే వారి వాదన తప్పు. అక్కడ కూడా 40 మీటర్ల లిఫ్ట్ ఉన్న సంగతిని మరుగున పెడుతున్నారు. ఎల్లంపల్లి నుంచి కొండ పోచమ్మ వరకు లిఫ్ట్ మార్గంలో మార్పు లేదు. తెలంగాణ సాగునీటి, తాగునీటి అవసరాలకు అనుగుణంగా జలాశయాల సామర్థ్యం మాత్రం పెంచడం జరిగింది.


ఇకపోతే ఈలాంటి వ్యాఖ్యానాలు చేసే మేధావులు గమనించవలసిన అంశం ఏమిటంటే.. దేశాలు, రాష్ట్రాలు తమ ప్రాంత ప్రత్యేక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగానే పథకాలను రూపకల్పన చేస్తాయి.గల్ఫ్ దేశాల్లో తాగునీటి కోసం సముద్రపు ఉప్పు నీటిని శుద్ది పరచడానికి బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. ఇజ్రాయిల్‍లో సగటు వార్షిక వర్షపాతం 100 మిల్లీ మీటర్లు. ఆ విలువైన నీటిని సమర్థవంతంగా వినియోగించడానికి ఇజ్రాయిల్‍ ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నది. అది వారి సామాజిక అవసరం. అవి తెల్ల ఏనుగులు అని తీసి పారేయడానికి వీలు లేదు. తెలంగాణ కూడా అంతే. 90-100 మీటర్ల తక్కువ ఎత్తులో నదులు ప్రవహిస్తున్నాయి. సాగు భూములు 200 – 675 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. వాటికి సాగునీరు, అక్కడి ప్రజలకు తాగునీరు అందించాలంటే ఎత్తిపోతల పథకాలు తప్ప వేరే మార్గం లేదు. అందుకు ఎంత ఖర్చు అయినా ప్రభుత్వాలు భరించక తప్పదు. అది తెలంగాణ సామాజిక అవసరం. Benefit Cost Ratio దృష్టి కోణంతో తెలంగాణ ఎత్తిపోతల పథకాలను విశ్లేషించి ఇవి తెల్ల ఏనుగులు అని తిరస్కరిస్తే తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో నీరు పల్లమెరుగు, మీరు ఎత్తుగడ్డ మీద ఉన్నారు కాబట్టి మీకు నీరు రాదు అని మభ్యపుచ్చి నీటిని దోచుకు పోయిన వారికి, ఇప్పుడు తెల్ల ఏనుగులు అని ఎత్తిపోతల ప్రాజెక్టులను తిరస్కరిస్తున్న వారికి తేడా లేదు.


అసలు తెల్ల ఏనుగులను ప్రశ్నించరు !
మిషన్‍ భగీరథ తాగునీటి పథకం కోసం ప్రభుత్వం సుమారు 33 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇది one time investment. ఈ వ్యవస్థ ద్వారా జలాశయాల నుంచి ఏటా 42 టిఎంసిల నీటిని రాష్ట్రంలో ప్రతీ ఇంటికి రక్షిత తాగు నీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నది. కోకాకోలా, పెప్సీ, బిస్లెరీ, టాటా తదితర కంపనీలు ఒక టిఎంసి (2831 కోట్ల లీటర్లు) భూగర్భ జలాలను సీసాల్లో నింపి ప్రజల నుంచి పిండుకుంటున్న సొమ్ము 56,620 కోట్లు (లీటర్‍ నీళ్ళ సీసా 20 రూపాయలు). తాగునీటి కోసం ఈ ప్రైవేటు తెల్ల ఏనుగులను ప్రజలు దశాబ్దాలుగా భరిస్తూనే ఉన్నారు. వీరు ఈ ప్రైవేటు తెల్ల ఏనుగులను ఏనాడూ ప్రశ్నించరు. సామాజిక బాధ్యతలో భాగంగా ఉచితంగా సాగునీరు, తాగునీరు ఇస్తున్న ప్రభుత్వ పథకాలను మాత్రం తెల్ల ఏనుగులని విమర్శిస్తారు.


సముద్రంలో కలిసే నీరు వృధానా ?
ఈ ఏడు ఇప్పటివరకు సుమారు 4 వేల టిఎంసిలకు పైగా నీరు సముద్రంలో కలిసిపోయింది. ఈ నీరు వృధాగా సముద్రంలోకి పోయాయని, ప్రభుత్వం ఎత్తిపోతల ద్వారా జలాశయాల్లో నింపకుండా వృధాగా సముద్రం పాలు చేసింది అనికొందరు ఇంజనీర్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. అతి భారీ వర్షాలకు రాష్ట్రంలో అన్ని మేజర్‍, మీడియం ప్రాజెక్టుల జలాశయాలు, చెరువులు, చెక్‍ డ్యాంలు నిండిపోతే ఎత్తిపోతల అవసరం ఎందుకు వస్తుంది? ఇంత పెద్ద మొత్తంలో వరద నీరు సముద్రంలోకి పోక ఎక్కడికి పోతాయి? అయితే సముద్రంలోకి పోయే నీరు వృధా అనుకోవడం మరొక పెద్ద తప్పు. ప్రముఖ పర్యావరణవేత్త డా. దుగ్గరాజు శ్రీనివాసరావు గారు సముద్రంలోకి పోయే నీరు ‘‘వృధా’’ అని వర్ణించడాన్ని “River Flow into Sea is not a Waste”అన్న వ్యాసంలో తీవ్రంగా ఆక్షేపించారు. సముద్రంలోకి పోయే నీరు భూమి మీద Hydrological Cycle ను సవ్యంగా ఉంచడమే కాకుండా సముద్ర తీర ప్రాంతాల జీవావరణాన్ని కాపాడడానికి అత్యవసరం అని వాదిస్తూ, సముద్రంలోకి నదుల నీరు వెళ్ళకపోతే తీర ప్రాంతాలు త్వరలోనే ఉప్పునీటి కయ్యలుగా మారిపోతాయని హెచ్చరించాడు. ఆ ప్రమాదం ఇప్పటికే కోస్తా ఆంధ్రా తీర ప్రాంతాల్లో అనుభవంలోకి వస్తున్నదని, Rivers have to carry fresh water into the sea for the health of the coast అని రాశారు. ఈ సంగతిని అందరూ సీరియస్‍ గా తీసుకోక తప్పదు.


కొత్త జలాశయాలను ఒకేసారి పూర్తి స్థాయికి నింపరు :

ఇకపోతే సముద్రంలోకి ఇంత గోదావరి నీరు సముద్రంలోకి పోయినా 50 టిఎంసిల మల్లన్న సాగర్‍ ను నింపలేకపోయింది ప్రభుత్వం అన్న విమర్శ కూడా ఇంజనీర్లే చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం పూర్తి అయిన 50 టిఎంసిల మల్లన్నసాగర్‍ లోకి తొలిసారిగా నీటిని 2021 లో ఎత్తిపోయడం జరిగింది. ఏదైనా కొత్త జలాశయంలో నీరు నింపేటప్పుడు దశల వారీగా నింపాలనిISCodes నిర్దేశిస్తున్నవి. అందుకే 2021లో 5 టిఎంసిలతో మొదలై 2022 లో 16 టిఎంసిల వరకు నీటి నిల్వ చేరుకున్నది. పూర్తి స్థాయిలో నీరు నింపే ముందు మట్టి కట్ట పని తీరును అధ్యయనం చేయడం జరుగుతుంది. అన్ని దశలలో ఈ అధ్యయనం కొనసాగుతుంది. ఇంతకు ముందు చెప్పినట్టు ఈ అధ్యయనం కోసం ఒక ప్రత్యేక నిపుణుల కమిటీ పని చేస్తున్నది. ఇందులో IIT హైదరాబాద్‍ ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు నిపుణుల కమిటీ అధ్యయనం ప్రకారం మల్లన్నసాగర్‍ మట్టి కట్ట అనుకున్న రీతిలోనే పని చేస్తున్నది. అదే విధంగా 15 టిఎంసిల కొండపోచమ్మ సాగర్‍ జలాశయంలోకి 10 టిఎంసిల నీటిని తరలించడం జరిగింది. ఈ రెండు జలాశయాలను దశల వారీగానే నింపడం జరుగుతుంది.

  • శ్రీధర్‍రావ్‍ దేశ్‍పాండే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *