సామాజిక స్పృహను నేర్పిన సిటీ కళాశాలకు శత వసంతాలు

1912లో ఏడవ నిజాం అసఫ్‍ జాహీ మీర్‍ ఉస్మాన్‍ అలీఖాన్‍ అంకురార్పణ

ఒక కళాశాల వందేళ్ల పాటు నిరంతరాయంగా సేవలందించిం దంటే… దాని గొప్పదనం ఏమిటో అర్థమవుతుంది. మూసీ నది ఒడ్డున రాజసం ఒలకబోస్తూ ఠీవీగా, కళాత్మకంగా కనబడే ‘సిటీ కళాశాల’ శత వసంతాలను పూర్తి చేసుకుంది. దాని నీడలో విద్యను అభ్యసించి, దేశ విదేశాల్లో పేరు తెచ్చుకున్న ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు. కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా… అనేక సామాజిక ఉద్యమాలకు, పోరాటాలకు అండగా నిలిచి, జాతికి గొప్ప సామాజిక స్పృహను నేర్పిన వందేళ్ల ‘సిటీ కళాశాల’. విద్య అంటే ఉన్నత జీవితానికి దోహదపడేది మాత్రమే కాదు… అసలు విద్యయే జీవితం.
ఈ రకమైన పవిత్ర ధ్యేయంతో శత వసంతాలుగా దేశ పురోభివృద్ధికి విస్తృతమైన విజ్ఞాన వనరులను సమకూరుస్తున్న సమున్నత విద్యా సంస్థ ప్రభుత్వ సిటీ కళాశాల. నాటి నైజాం రాష్ట్రం నుండి నేటి తెలంగాణ రాష్ట్రం వరకు ఎన్నో ఆటుపోట్లను అధిగమించి, ఈ జ్ఞాన జీవనది పరవళ్లు తొక్కుతోంది. ఏడవ నిజాం అసఫ్‍ జాహీమీర్‍ ఉస్మాన్‍ ఆలీఖాన్‍ అసమాన సంకల్పంతో హైదరాబాద్‍ నగరంలో మూసీ తీరంలో వందేళ్ల క్రితం పురుడు పోసుకున్న సిటీ కళాశాల చరిత్ర పుటల్లోకి తొంగిచూస్తే అచంచలమైన విద్యాస్ఫూర్తి కలుగుతుంది.


మూసీ ఒడ్డున…
అత్యున్నతమైన బోధనా విలువలతో, నైతిక ప్రగతిదాయకమైన జీవనసూత్రాలతో, క్రీడా, సాహిత్య, సాంస్కృతిక ఎరుకతో విద్యార్థుల జీవితాలకు సిటీ కళాశాల బంగారు బాటలు వేస్తూనే వుంది. రామ్‍ లాల్‍, డా.వెలిచాల కొండలరావు, టి.వి.నారాయణ, పరిమళా సోమేశ్వర్‍ వంటి ఎందరో ప్రధానాచార్యులు సిటీ కళాశాల ప్రగతికి శక్తివంచన లేకుండా నిరంతరం కృషి చేశారు.
ఆ కాలంలో బొంబాయి, మద్రాస్‍ ప్రావిన్సులతో, మైసూరు, బరోడా సంస్థానాలతో పోల్చి చూసినపుడు హైదరాబాద్‍ రాజ్యంలో విద్యావంతులు తక్కువగాఉన్నారు. నూటికి ఒకరో ఇద్దరో అక్షరాస్యులు మాత్రమే కనిపించేవారు. సంపన్నులు అధికంగా ఉన్న నైజాం రాష్ట్రంలో ఒక ఆంధ్ర కళాశాల స్థాపించటం అవసరమని కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు కూడా అభిప్రాయపడ్డారు. సర్వ శ్రేయోదాయకమైన ఈ గొప్ప కార్యానికి ఏడవ నిజాం అసఫ్‍ జాహీ మీర్‍ ఉస్మాన్‍ అలీఖాన్‍ అంకురార్పణ చేశాడు. ప్రజలను విజ్ఞానవంతులను చేయాలనే మహత్తర సంకల్పంతో 1912లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాడు. అంతకు ముందే నిజాం కళాశాల ప్రారంభమైనప్పటికీ అది మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. ఈ క్రమంలోనే మీర్‍ ఉస్మాన్‍ అలీఖాన్‍ మూసీనది ఒడ్డున మరొక బృహత్తరమైన విద్యాభవనానికి అంకురార్పణ చేశాడు. 1919లో భవన నిర్మాణాన్ని ప్రారంభించి, 8 లక్షల రూపాయల వ్యయంతో 1921లో పూర్తి చేశారు. అంతకుపూర్వమే ఆరవ నిజాం మహబూబ్‍ అలీఖాన్‍ నిర్మించిన మదర్‍ సా సంస్థ దార్‍- ఉల్‍- ఉలూమ్‍ను సిటీ హైస్కూల్‍ గా మార్చి కొత్తగా నిర్మించిన ఈ భవనంలోకి తరలించారు. 1965లో ప్రభుత్వ గుర్తింపు పొందిన తరువాత ఈ విద్యాసంస్థ గవర్నమెంట్‍ సిటీ సైన్స్ కాలేజ్‍గా ఏర్పడింది. ఆ తరువాత గవర్నమెంట్‍ సిటీ కాలేజ్‍గా ప్రసిద్ధికెక్కింది.


లండన్‍ ఆర్కిటెక్ట్ రూపకల్పన…
మూసీనది ఒడ్డున పదహారు ఎకరాల సువిశాల ప్రాంగణంలో 64 గదులతో ‘ఇండో సార్శనిక్‍’ నిర్మాణ నైపుణ్యంతో లండన్‍కు చెందిన వాస్తుశిల్పి విన్సెంట్‍ హెచ్‍ సిటీ కళాశాల భవనానికి రూపకల్పన చేశాడు. మూసీనది వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా బహుళార్ధ సాధక కట్టడంగా అత్యంత పటిష్టంగా కళాశాల భవనాన్ని రూపొందించాడు. వరద ముంచెత్తినపుడు నీటి ప్రవాహం క్రింద నుండి వెలుపలకు పోయే విధంగా కళాశాల భవనం మొదటి అంతస్తును నిర్మించారు. ఎత్తయిన ప్రాకరాలతో, అందమైన మీనార్‍లతో ప్రాంగణమంతా గాలి వెలుతురు ప్రసరించటానికి అనువైన నిర్మాణ రీతితో, మూడంతస్తుల ముచ్చటైన స్వరూపంతో, అపూర్వమైన వాస్తుకళా సౌందర్య శోభితంగా, నేత్రపర్వంగా సిటీ కళాశాల భవనాన్ని నిర్మించారు.
సువిశాలమైన తరగతి గదులు, అధునాతనమైన సైన్స్ లాబ్స్, నాణ్యమైన కంప్యూటర్‍ లాబ్స్, డిజిటల్‍ క్లాస్‍ రూమ్స్తో కూడిన అద్భుతమైన విద్యావిషయక వాతావరణంతో అనునిత్యం కళాశాల కళకళ లాడుతూ ఉంటుంది. వివిధ సమావేశాలు, జాతీయ సదస్సులు నిర్వహించేందుకు వీలుగా నిర్మించిన ‘గ్రేట్‍ హాల్‍’ కళాశాలకు ఒక ప్రత్యేక ఆకర్షణ.


విలువైన విజ్ఞాన భాండాగారం…

సిటీకళాశాల గ్రంథాలయంలో 80 వేలకు పైగా అమూల్యమైన గ్రంథాలున్నాయి. తెలుగు, అరబిక్‍, ఉర్దూ, ఇంగ్లీష్‍, హిందీ, సంస్కృతం, కన్నడ, మరాఠీ భాషలలో ఎన్నో అరుదైన పుస్తకాలున్నాయి. ప్రాచీన తెలుగు సాహిత్యంతో పాటు ఆంగ్ల సాహిత్యంలో 17,18వ శతాబ్దాల నాటి పురాతన పుస్తకాలు కూడా గ్రంథాలయంలో లభ్యమవుతాయి. హైదరాబాద్‍ నగర చరిత్రను చాటిచెప్పే 1901 నాటి’Pictorial Hyderabad’ ప్రాచీనమైన ‘Indo persian dictionary’ వంటి విలువైన పుస్తకాలు, అరుదైన శాసనప్రతులు ఇక్కడ చూడొచ్చు. గ్రంథాలయంలో పుస్తకాలను ఒకచోట నుండి మరొక చోటుకు తరలించడానికి వీలుగా నాణ్యమైన చెక్కతో తయారుచేయబడిన ఆనాటి ఫర్నీచర్‍ ఇంకా చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ గ్రంథాలయం ఎలక్టాన్రిక్‍ సమాచారాన్ని అందిస్తోంది. కళాశాల విద్యార్థులతో, వివిధ విశ్వవిద్యాలయాల పరిశోధక విద్యార్థులతో, ఆచార్యులతో సమున్నతమైన అధ్యయన వేదికగా ప్రతినిత్యం ఈ విజ్ఞాన మందిరం విరాజిల్లుతుంటుంది.


విశిష్ట సాహిత్య, సాంస్కృతిక కళాకేంద్రం
కేవలం ఒక విద్యాసంస్థగానే కాకుండా విశిష్ట సాహిత్య, సాంస్కృతిక, కళా కేంద్రంగా కూడా సిటీ కళాశాల ఏళ్ల తరబడి సేవలందిస్తోంది. ఖండవల్లి లక్ష్మీ నిరంజనం, బిరుదురాజు రామరాజు, చెలమచెర్ల రంగాచార్యులు, జీవీ సుబ్రహ్మణ్యం, మగ్దూం మొహియుద్దీన్‍ వంటివారు ఈ కళాశాల ఆచార్యులుగా సాహిత్య విద్యను బోధించారు. 1948లోనే ఇక్కడ ‘తెలుగు సాహిత్య సమితి’ స్థాపించి ప్రతీ ఏడాది ఉత్సవాలు నిర్వహించేవారంటే ఎంతటి ఘనచరిత్రను సిటీ కళాశాల సొంతం చేసుకుందో అర్థమవుతుంది. ఈ సంస్థ నిర్వహించే పలు ఉత్సవాల్లో సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామక•ష్ణారావు, అయ్యదేవర కాళేశ్వరరావు వంటి మహానాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.


ఎందరో మహానుభావులు…
చారిత్రాత్మకమైన ఈ విద్యాసంస్థలో విద్యనభ్యసించిన ఎంతోమంది ఇంజనీర్లుగా, శాస్త్రవేత్తలుగా, న్యాయకోవిదులుగా. ఉపకులపతులుగా, వ్యాపారవేత్తలుగా, సాహితీవేత్తలుగా, కళాకారులుగా, అంతర్జాతీయ క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. యస్‍.బి.చవాన్‍, వీరేంద్ర పాటిల్‍, మర్రి చెన్నారెడ్డి, శివశంకర్‍ వంటి ముఖ్యమంత్రులు, గవర్నర్లు… శివరాజ్‍ పాటిల్‍ వంటి కేంద్రమంత్రులు… పి.ఇంద్రారెడ్డి, కరణం రామచంద్రరావు వంటి రాష్ట్ర మంత్రులు… ఇంద్రసేనారెడ్డి, గురవారెడ్డి వంటి నాయకులు… ప్రొఫెసర్‍ నాగేశ్వర్‍, ఎస్వీ సత్యనారాయణ, సినీరచయితలు పరుచూరి గోపాలకృష్ణ, జె.కె.భారవిలాంటి ఎంతోమంది సిటీ కళాశాల పూర్వ విద్యార్థులే. ఒకప్పుడు పాకిస్థాన్‍ సినిమాల్లో స్టార్‍గా చెప్పుకునే మహమ్మద్‍ అలీ కూడా 1936లో సిటీ కళాశాలలో చదువుకున్నాడని చాలామందికి తెలియదు. ఈ చారిత్రక కట్టడం ఎన్నో సినిమా షూటింగులకు వేదికయ్యింది. అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన కళాశాల భవనం ఇప్పుడు కొంత శిథిలావస్థకు చేరుకుంది. హెరిటేజ్‍ భవనంగా కూడా గుర్తింపు పొందిన ఈ అపురూప కట్టడాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ వందేళ్ల ఉత్సవాల వేళ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, పూర్వవిద్యార్థులు కలిసి బాధ్యతగా ఈ భవనాన్ని పునరుద్ధరించాలని విద్యావేత్తలు, ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు.


‘సిటీ కాలేజ్‍’ క్రేజ్‍ అది…
నేను కరీంనగర్‍ కళాశాల ప్రిన్సిపాల్‍గా పనిచేస్తున్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుగారు నన్ను రమ్మని కబురు పంపారు. ‘‘మీరు కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‍గా వెళతారా?’ అన్నారు. నేను ఒక్క నిముషం ఆలోచించి ‘‘లేదు సార్‍… నేను ప్రిన్సిపాల్‍గా చాలా సంతృప్తికరంగా ఉన్నాను’’ అని చెప్పాను. ముఖ్యమంత్రి గారు ‘‘మరి ఎక్కడికి వెళతావు?’’ అన్నారు. ‘‘సిటీ కాలేజ్‍కు అయితే వెళతాను సార్‍’’ అన్నాను. అప్పట్లో సిటీ కాలేజ్‍కి అంత పేరుండేది. నిజాం పీరియడ్‍లో ఉస్మానియా యూనివర్సిటీ తరువాత సిటీ కాలేజీకి అంత ప్రాముఖ్యత ఉండేది. ఆ రోజుల్లో ప్రతీ ప్రిన్సిపాల్‍కి సిటీ కాలేజ్‍లో పనిచేయాలనే కోరిక ఉండేది.

డాక్టర్‍ వెలిచాల కొండలరావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్‍, సిటీ కళాశాల
గొప్ప అనుభూతి…


రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చారిత్రాత్మకమైన విద్యాసంస్థ ప్రభుత్వ సిటీ కళాశాల. అత్యున్నత విద్యాప్రమాణాలతో పాటు క్రీడా, సాహిత్య, సాంస్కతిక అంశాలకు కూడా ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. కళాశాల గ్రంథాలయంలో అరుదైన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ జరిగే సెమినార్లు విద్యార్థుల్లో చైతన్యవంతమైన ఆలోచనలకు అంకురార్పణ చేస్తాయి. ఎంతో కీర్తి గడించిన సిటీ కళాశాలలో ప్రవేశం విద్యార్థులకే కాదు… అధ్యాపకులకు కూడా తెలియని అనుభూతినిస్తుంది.
-డా. పి. బాలభాస్కర్‍ – ప్రిన్సిపాల్‍, సిటీ కళాశాల

దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ,
ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *