తెలంగాణకు దశ వసంతాలు దిశ చూపిన దక్కన్‍ ల్యాండ్‍


ఏపత్రికైనా ప్రజల అభిప్రాయాలకు కొంతైనా ప్రాతినిధ్యం వహిస్తుంది. రోజూ వార్తలు వింటాము, దిన పత్రికలు చదువుతాము. ఐనా కొన్ని విషయాలు, అంశాలు ప్రత్యేకంగా చర్చిస్తే తప్ప ప్రజల మనసుల్లో నిలిచిపోవు. అటువంటి అంశాలను ప్రజలచేత చర్చింప జేసే దక్కన్‍ల్యాండ్‍ మాస పత్రిక లక్ష్యం నెరవేరినట్లే.
దృశ్య మాధ్యమం అధికమైన ఈరోజులలో ఏ పత్రిక నడపడమైనా సులభంగా లేదు. దినపత్రికలు కూడా తమ సిబ్బందికి సరైన జీతాలు, సౌకర్యాలు ఇవ్వలేకపోతున్నయని తెలుస్తున్నది. ఇటువంటి గడ్డురోజులలో ఒక దశాబ్దకాలం అడ్డంకులన్నీ అధిగమించి దక్కన్‍ ల్యాండ్‍ మాస పత్రికను సకాలంలో ప్రచురించి పాఠకులకు అందజేయడం సామాన్య విషయం కాదు. మన తెలంగాణ ప్రజల్లో ప్రజలు ఉద్య మాలకు అందించినంతటి చేయూత పత్రికలకు అందించడంలో కనిపించదు. అందుకే ఒక పత్రిక నడపడం నీళ్ళమీద ఈదినట్టు ఉండదు, రాళ్ళమీద ఈదినట్టుంటది. ఇది నా అభిప్రాయం కాదు. 2004 వరకు నా తెలంగాణ వారపత్రిక కొరకు రకరకాలుగా నేను చేతనైనంతగా ఏమాత్రం ఎక్కడా ఏ విధమైన రెమ్యునరేషన్‍ తీసుకోకుండా టోటల్‍ ఫ్రీగా, నా ట్రాన్స్పోర్టేషన్‍తోనే పని చేసిన రోజుల్లో మా దేవరకొండలో ఒక మామూలు చదువరి ఆ పత్రిక బాగోగులు తెలుసుకున్న వ్యక్తి వెలిబుచ్చిన అభిప్రాయం అది. తెలంగాణ కొరకు దిన, వార, మాస, పక్ష పత్రికల వంటి ఏ పత్రికలేని రోజుల్లో నేను ఆపత్రిక కొరకు పనిచేసిన. అది 2004 ఏప్రిల్లో చివరిసారిగా ప్రచురించబడింది. అంతటితో ఆగిపోయింది. కనుక మరే పత్రికైనా వస్తే బాగుండు అనుకుంటున్న క్రమంలో దక్కన్‍ ల్యాండ్‍ మొదలయ్యింది. నాకైతే విపరీతమైన సంతోషం కలిగింది. తెలంగాణ గోసను వినిపించడానికి మరో వేదిక దొరికి నందుకు. అందుకే తెలంగాణ ఉద్యమానికి దక్కన్‍ ల్యాండ్‍ చీకటిలో చిరుదివ్వెలా కనిపించింది. అది వారపత్రికగా, దిన పత్రికగా వస్తే బాగుండునని టిఆర్‍సి వేదికల మీదనే నా అభిప్రాయం ప్రకటించిన. ఐతే ఆపని ఇప్పటికి కాకున్నా ముందు ముందు సాకారం ఔతుందనే ఆశతో ఉన్నాను. ఎన్నో పత్రికలు వచ్చి పలు కారణాలుగా మూతబడినయ్‍, అదృశ్యమైనయ్‍. అట్ల కాకుండా నిరాఘాటంగా దక్కన్‍ ల్యాండ్‍ కొనసాగడానికి సామాజిక సాహితీ ప్రియుడైన, కృషీవలుడైన వేద కుమార్‍ గారి వలన మాత్రమే సాధ్యమయ్యింది. ఈపత్రికను చదివిన తదుపరి నాకు దగ్గరలో ఉండే బార్బర్‍ షాపులో, నేను వెళుతుండే కమ్యూనిటీహాల్లో పాత కాపీలను ఉంచుతుంటాను. ఈ పత్రిక బయట న్యూస్‍ పేపర్‍ వెండర్ల దగ్గర దొరకదని, సరిగ్గా చదువుతాననే వాళ్ళకే ఇవ్వమని చెప్తూ వారికి పత్రిక విలువను గుర్తుపట్టేలా చేస్తుంటాను. పత్రిక చదువుతున్నప్పుడు, దాని గురించి మాట్లాడుతున్నప్పుడు టిఆర్‍సి మీటింగ్‍లు గుర్తుకొస్తయ్‍. టిఆర్సి మీటింగ్‍లకు వచ్చిన ప్రతి ఒక్కరికి వేదకుమార్‍గారి నిబద్ధత, క్రమశిక్షణ, సభలు సమావేశాలు నిర్వహించడంలో, దక్కన్‍ ల్యాండ్‍ను తేవడంలో ఆయన చేసే నిశ్చలమైన తపస్సు ఆరోజుల్లో ప్రత్యక్షంగా కనిపించేవి. వేదకుమార్‍ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒకవైపు ప్రింటింగ్‍ ప్రెస్‍ను నడుపుతూ, ఇంకోవైపు టిఆర్‍సి మీటింగులను, దక్కన్‍ ల్యాండ్‍లను నిర్వహించడం బహుదా ప్రశంసనీయులు. వారం వారం నిర్వహించే టిఆర్సీ మీటింగ్‍లలో సాయంత్రం పూట ఆహ్లాదకరమైన వాతావరణంలో మీటింగ్‍కు వచ్చిన ప్రతి ఒక్కరికి టీ, టిఫిన్‍, స్నాక్‍లను అందింపజేసి, జరిపిన చర్చలతో ఆలోచింపజేసి ఉద్యమోన్ము ఖులుగా అనేకులను మార్చిన ఘనత తెలంగాణ రిసోర్స్ సెంటర్‍ ది. దాన్ని నిర్వహించే వేదకుమార్‍ గారిది. వారు నడుపుతున్న డిఎల్‍ (దక్కన్‍ ల్యాండ్‍) ఒక వేదమే. హిమాయత్‍నగర్‍ చంద్రం బిల్డింగ్‍లో జరిపిన మీటింగ్‍లులో అన్నీ సామాజిక ప్రయోగశాలలే. నిత్యం అక్కడ ఏదో ఒక యజ్ఞం జరుగుతున్నట్లే ఉండేది. వచ్చిన జనాలనుబట్టి సభా స్థలం మారుతుండేది. 30 మంది వరకే ఉంటే ఒక హాలులో, వంద మంది వరకు ఉంటే ఓపెన్‍ ఎయిర్‍ థియేటర్లో, అంతకు మించి వస్తే మరో ఆవరణలో వేదిక మైక్‍ సెట్టింగ్‍ అన్ని హంగులతో మారుతుండేది. ఎంత ప్లానింగ్‍రా బాబు అనిపించేది. ఇదంతా ఆ విద్యా సంస్థను నడుపడం వల్ల వచ్చిన అనుభవంతో సాధ్యమై ఉంటుందని నా అభిప్రాయం. అటువంటి ప్రాంగణం ఉద్యమ కేంద్రంగా దొరకడం మన తెలంగాణ అదృష్టం.


ఇప్పుడు దక్కన్‍ ల్యాండ్‍ విశిష్టత గురించివ కొంతైనా ముచ్చటించుకుందాం. పత్రిక మొదటి పేజీనుండి గమనిస్తే మెయిల్‍ బాక్స్ నుండీ కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. పాఠకుల లేఖలు, స్పందనలు, అభిప్రాయాలు ఏ పత్రికకైనా ప్రతిబింబించే దర్పణాలే. పెద్ద పెద్ద దినపత్రికలలో కూడా పాఠకుల అభిప్రాయాలు మొక్కుబడిగా ప్రచురిస్తున్న ఈరోజులో అతి తక్కువ పేజీలు కలిగిన దక్కన్‍ ల్యాండ్‍ లో గత సంచికలలో వచ్చిన ఆయా రచనల మీద 5,6 లేఖలకు చోటివ్వడం ఎడిటర్‍ గారు పాఠకులకిచ్చే విలువగా భావిస్తాను.


2014లో తెలగాణ రాష్ట్రం ఏర్పాటైన పిదప కూడా దక్కన్‍ ల్యాండ్‍ తన అవసరాన్ని పరి పరి విధాలుగా చాటిచెప్పింది. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచింది దక్కన్‍ ల్యాండ్‍. పాలకులకు పాఠకులకు నడుమ, పాలకులకు రచయితలకు నడుమ కూడా అనుసంధాన కర్తగా నిలిచింది దక్కన్‍ ల్యాండ్‍. అందుకే గత సంచికలో అంబటి వెంకన్న అన్నట్టు దక్కన్‍ ల్యాండ్‍ను తెలంగాణ బ్రాండ్‍ అనడం సమంజసం. బ్రాండ్‍గా తెలంగాణకు మెచ్చదగిన సేవలందించింది. దిశను కూడా చూపించిందని నాకు కూడా అనిపించింది. ఔను అంబటి అన్నట్లు ప్రభుత్వం చేసిన దాన్ని, కళ్ళముందు కనిపిస్తున్న దాన్ని మెచ్చుకోవడం, మంచిని మంచిగా ప్రచారం చేయడం తప్పు కాకపోగా మన బాధ్యతగా భావించాల్సి ఉంది. కాళేశ్వరం వంటి ప్రపంచ స్థాయి జల వనరులపై సందేహాలు కలిగించిన విమర్శలకు శ్రీధర్‍ దేశ్‍పాండే వంటి ప్రభుత్వాధికారుల చేత సరైన రీతిలో సాగునీటి ప్రాజెక్టులమీద వ్యాసాల రూపంలో ఇచ్చిన ఇప్పించిన సమాధానాల సమాహారం ఎందరిలోనో చైతన్యం తీసుకొచ్చిందనడంలో ఆశ్చర్యం లేదు. ఐతే ప్రభుత్వంపై దక్కన్‍ల్యాండ్‍ విమర్శలు అందరిలా కాకుండా సుతిమెత్తని చురకలతో ఉండడం కూడా ఔచిత్యమే.
మన దక్కన్‍ ల్యాండ్‍ మాస పత్రికలో రచయితలు, వారి రచనలూ విశిష్టమైనవే. పత్రిక పోస్ట్ మ్యాన్‍ తెచ్చిన రోజే పనులన్నీ పక్కకుబెట్టి, చివరికి తినేదున్నా పక్కనబెట్టి ఓపెన్‍ చేస్తే ముందుగా నా కళ్ళు వెతికేది పరవస్తు లోకేశ్వర్‍ గారి అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట, పార్ధివాడ పిట్టలోళ్ళ గోస, షహర్నామాలు పుస్తకంలోని గాధలు వంటివి వెంటనే చదివేస్తుంటాను. తదుపరి నా కళ్ళు వెతికేది సంగిశెట్టి శ్రీనివాస్‍ గారి మనం మరిచిన మహిళా సంస్థానాలు, చరిత్రకెక్కని బహుజన స్పూర్తి మూర్తుల వంటివి. ఆ తరువాత జింబో గారి నిషేధాలు-భావప్రకటన స్వేచ్చ, న్యాయం జరిగినట్లు అనిపించాలె వంటి రచనలు చదువుతుంటాను. గత సంచికలలోని విభిన్న, విశిష్ట రచనలు తెలుసుకోవడానికి పాఠకుల లేఖలు చదువుత. అందులో కొన్ని లేఖలు పాత సంచికలను వెతికి చదివేలా చేస్తుంటాయి. ఆ తరువాత వేద్‍ గారి భావితరాల కొరకు నేటి విద్యా విధానం, మల్లన్న సాగర్‍ రిజర్వాయర్‍, ఓన్లీ ఒన్‍ ఎర్త్ వంటి సంపాదకీయాలు చదువుతుంటాను.
తెలంగాణ తేజోమూర్తుల నుండి సేకరించి రాసిన ఎవరి రచనైనా సుమారు అన్ని రచనలు చదువుతుంటాను. శ్రీరామోజు హరగోపాల్‍, ఈమని శివనాగిరెడ్డి, బిన్నూరి మనోహరి, ద్యావనపెల్లి సత్యనారాయణ వంటి పరిశోధకుల, చరిత్ర కారులు పురావస్తు తవ్వకాలు, అందులో బయటపడిన శాసనాలు, వారి ఆవిష్కరణలు చదువుతుంటాను, పాఠకులందరినీ చదువమంటాను. వాటిని చదవడమే కాక సివిల్స్లో ఆంత్రొ పాలజి తీసుకున్నవాళ్ళను, పోటీపరీక్షలు రాసేవాళ్ళను వెతికిపట్టి ఇవి చదవమని సలహా ఇస్తుంటాను. భూగోళంపైన, ధృవాలపైన, వాతావరణంపైన గాండ్ల లచ్చయ్యగారి వ్యాసాలు చదువుతుంటే నేను చదువుకునేరోజుల్లో ఇటువంటి రచనలు మాకు దొరకకపోయెనే అని వెనక్కు వెళ్ళి చింతిస్తుంటాను.


ఇందులో వచ్చే విభిన్న అంశాలపై ఆయా రచయితల, వ్యాసాల పరంపర సమాజానికెంతో ఉపయోగకరమైనవి. కొత్తగా వెలువడిన కొన్ని పుస్తకాలు కూడా అప్పుడప్పడు వేస్తుండడం పాఠకులు గమనించ దగినవి.

చందా రాములు, రిటైర్డ్ ప్రొఫెసర్‍
ఎ : 6281562496

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *